అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

21 Apr 2016

'రొట్టమాకురేవు' ఇకముందు 'జీనుబాయి పిట్టగూడు'


ఒక ఊరు తనంతట తాను తాను అల్లుకోవడంలో ఒక్కరు చాలు. అలా ఇప్పుడా ఊరు ఒక 'జీనుబాయి పిట్ట' అయింది. అలాగే 'సంచిలో దీపం' అయింది. అట్లే 'ఇక్కడి చెట్ల గాలి' అయింది. ఇంకా చెప్పాలంటే, అదొక కేంద్రకం అయింది. 'జీరో డిగ్రీ' కూడా.
అవును. 'జీరో డిగ్రీ' అన్నది ఒక శీతల స్థితి కాదు, భయ విహ్వలతా కాదు. ఘనీభవించిన హృదయాలు తిరిగి కరిగి నదిలా ప్రవహించేందుకు తగ్గ కేంద్రబిందువు. ఆ ఊరూ అదే అయింది. మరెన్ని గ్రామాలకు స్ఫూర్తి నిచ్చే రేవు కానున్నది.






                              +++                                                         



నిజం. మొన్న ఆ ఊరు కవిత్వంతో, ప్రసంగాలతో వేడెక్కలేదు. ఆత్మీయ భాషణాలతో, హృదయ కరచాలనాలతో సుసంపన్నం అయింది. రొట్టమాకురేవు మనందరినీ తెలంగాణ పునర్నిర్మాణంలో గ్రామాలకు తరిలాల్సిన పాత్రను యాది చేసింది. ఆయా కార్యరంగాల్లో మనం రచనల్లో పేర్కొన్న స్థానికతను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ మనవైన సృజనాత్మక కార్యాచరణను విశ్వజనీనం చేసే రంగస్థలం అయింది. ఊరును పొందించిన బొడ్రాయి పండుగ అయింది.
నిజానికి స్మారక పురస్కారాలు, ఒక లైబ్రరీ ఏర్పాటు ప్రధానంగా ఇక్కడ కార్యక్రమం జరిగినప్పటికీ ఆ ఊరు అభివృద్దికి కూడా బీజాలు పడటం మరొక సానుకూల అంశం. అవశ్యమైన కల సాకారం కావడమే.
ఆ గ్రామాన్ని స్థానిక శాసన సభ్యులు మదన్ లాల్ గారు దత్తత తీసుకోవడానికి ముందుకు రావడం అభినందనీయం. ఈ వూరికి దగ్గరలోని చెక్ డాం నిర్మాణానికి దేశపతి శ్రీనివాస్ గారి చొరవతో నిధుల విడుదలకు మార్గం సుగమం కావడం మరో మంచి పరిణామం. కార్యక్రమానికి ఇవి అదనపు బలిమి నిచ్చాయి. ఇక ప్రారంబం అయిన లైబ్రరీకి పలువురు పుస్తకాలు ఇవ్వడమే కాదు, తోపుడు బండి సాధిక్ వంటి మిత్రులు కంప్యూటర్ వంటివి బహూకరించడం కూడా విశేషంగా పేర్కొనాలి. ఒక రకంగా కవిత్వం కూడా కార్యకర్త అయి అభివృద్దికి తగ్గ కార్యాచరణకు మార్గం చూపుతుందనడానికి రొట్టమాకురేవులో మొన్న జరిగిన కార్యక్రమం ఒక మంచి ఉదాహరణ.
+++
ఈ సభకు చాలామంది పెద్దలు వచ్చారు, పిల్లలు వచ్చారు. గ్రామీణులు వచ్చారు. నగర జీవులూ వచ్చారు. పాత్రికేయులూ, కవులూ, కళాకారులూ వచ్చారు. సాంసృతిక సారథి అయిన రసమయి బాలకిషన్ అన్న వచ్చి పాట పాడారు. ఒక్క మాటలో అధికారం పక్కన పెట్టి గ్రామ జ్యోతి వెలిగించడానికి తగ్గ బీజం వేయడంలో ఒక్కొక్కరు తమ పాత్ర వహించారు. అధికారం లేనివాళ్లూ అభిమానంతో చేయతగ్గ పని చేశారు. అందరు ఓన్ చేసుకున్న పని - ఈ సభ, సంగమం.
+++
మోహన్ రుషి 
ఇక్కడ కవి మోహన్ రుషి కె.ఎల్.నరసింహారావు స్మారక పురస్కారాన్ని పొందారు, తన 'జీరో డిగ్రీ' కవితా సంపుటికి. ఈ పుస్తకం గురించి సభకు అధ్యక్షత వహించిన ప్రసేన్ గారు మాట్లాడుతూ స్వల్పంగా మాట్లేడే కవి కొత్త భాషా సంవిధానంతో, ప్రయోగాలతో తనదైన శ్లేషతో కవిత్వం చెప్పి మనల్ని మన స్థితిని గుర్తు చేయడం గురించి వివరించారు. మోహన్ రుషి స్పందిస్తూ చిత్రంగా మళ్లీ మళ్లీ ఒకే కేంద్రకం వద్దకు వచ్చి మనుషులు పరిచిత జ్ఞాపక సంచయంతో ఎలా మింగిల్ అవుతారో చెప్పారు. ఏదీ కొత్తది కాదు, అంతా పాతదే. తిరిగి కలుసుకోవడం, ఆశ్చర్యాన్ని పంచుకోవడం గురించి ఎంతో బాగా చెప్పారు. చాలా ఏండ్ల కింద తనకు కలం ఇచ్చిన సిద్దారెడ్డి గారే మళ్లీ తనకు పురస్కారం ప్రధానం చేయడంలో ముందుండటం అటువంటిదే' అని గుర్తు చేశారు. మోహన్ రుషి చెబుతూ నవ్వగా , ఆ నవ్వు ఒక గమ్మత్తు.కావడంతో దాన్ని శ్రోతలు బాగా ఎంజాయ్ చేశారు.
హిమజ 
హిమజ గారు కవయిత్రి శిలాలోలిత (లక్ష్మి) గారి నాన్నగారి పేరిట ఏర్పాటు చేసిన పురిటిపాటి రామిరెడ్డి స్మారక పురస్కారాన్ని పొందారు, తాను వెలువరించిన 'సంచిలో దీపం' కవితా సంపుటికి. ఈ పుస్తకం పై చక్కటి విశ్లేషణ సత్య శ్రీనివాస్ గారు చేశారు. చేస్తూ, జీనుబాయి పిట్ట గురించి చెప్పి ఆశ్చర్యపరిచారు.
ఆ పిట్ట గిజుగాడు వలే చక్కటి గూడు కట్టాక వెళ్లి కాస్తంత బంకమట్టి తెచ్చుకుని, దానికి మిణుగురు పురుగును అతికిస్తుందట, బిడ్డలకు వెలుతురు కోసం. అటువంటిదే ఈ 'సంచిలో దీపం' అన్న పుస్తకం అంటూ, 'సంచిలో దీపం' అన్నది మనుషులను వెలిగించే పుస్తకంగా వివరిస్తూ, సంచివేసుకుని తిరిగిన వాళ్ళు సామాజిక మార్పుకు కృషి చేసిన చేసిన వారే కదా అని కూడా గుర్తు చేశారాయన.
కవయిత్రి హృద్యమైన కవిత్వం గురించి ప్రస్తావిస్తూనే ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంటిని, ఊరును కాపాడుకోవడం గురించిన ఆవశ్యకతను సత్య శ్రీనివాస్ గారు వివరించారు. తాను మాట్లాడుతుంటే కరెంటు పోయింది. కానీ ఆయన తన గొంతు పెంచి ఎంతో అభిమానంగా దీపం అంటే ఏమిటో చెబుతూ అది పుస్తకమే అని గుర్తు చేశారు. అలాగే, 'మనం ఇండ్లు కట్టుకుంటామని అనుకుంటాం. కానీ ఇండ్లను తాపీ మేస్త్రీలు, ఇంజనీర్లు కడతారు. మనం కట్టుకునేది జ్ఞాపకాలను' అని యాది చేశారు. 'మనం జ్ఞాపకాలతో ఇండ్లను సాకుతాం. తల్లిని సాకినట్టు ఇంటిని సాదుకోవాలి. అప్పుడే అది ఇల్లు అవుతుంది. లేకపోతే కేవలం గోడల మధ్య నివాసమే అవుతుంద'ని ఆయన హెచ్చరించారు.
+++
నందిని సిధారెడ్డి 
నందిని సిద్ధారెడ్డి గారు యాకూబన్న తండ్రి షేక్ మహ్మద్ మియా స్మారక పురస్కారాన్ని పొందారు, తన 'ఇక్కడి చెట్ల గాలి' కవితా సంపుటికి. ఈ పుస్తకంపై సీతారం గారు మాట్లాడుతూ స్థానికత, అస్తిత్వ సోయితో మన గాలి, మన నీరు, మన వనరుల మధ్య మన భవిత పునర్నిర్మాణపు అంశాన్ని ఎంతో చక్కగా విపులీకరించారు. ఈ పుస్తకంపై సీతారం మాట్లాడారో, వంశీకృష్ణ మాట్లాడారో సరిగ్గా గుర్తు రావడం లేదు. నేను ఫొటోలు తీస్తూ ఉన్న కారణంగా నా కాన్ సంట్రేషన్ సరిగ్గా పెట్టలేదుగానీ, యాకూబ్ మిత్రులైన అఫ్సర్, ప్రసేన్, సీతారాం, వంశీకృష్ణలు 'హమ్ పాంచ్' గా పేరొందిన టీంగా మళ్లీ జ్ఞపకాల్లోకి రావడం నాకు బాగా నచ్చింది. ఆ విషయాన్ని ప్రసేన్ గారు గుర్తు చేశారు. ఆది వింటుంటే, ఒక మాట చెప్పాలనిపించింది.
చిత్రమేమిటంటే, మలి తెలంగాణ దశ ఉద్యమం ప్రారంభానికి ముందే సంయుక్తంగా సాహిత్య రంగంలో జరిగిన కృషి ఒక రకంగా 'తెలంగాణ పునర్నిర్మాణ సంవిధాన'మే అనిపిస్తుంది. అదంతా ఏర్పడకుండానే జరిగిన నిర్మాణమూ అనిపిస్తుంది. ఒక సామూహిక గానం, అది కవిత్వంలో గానీ, నిన్నటి ధూంధాంలో గానీ ..అదంతా జరిగిన కృషికి వ్యక్తులు, బృందాలు, సమూహాలు, రాజకీయ పార్టీలు అన్నీ దోహదపడ్డాయినిపిస్తుంది. ఒక రకంగా జాయింట్ యాక్షన్ కమిటీకి మూలాలూ సాహిత్యంలో ముఖ్యంగా ఉన్నాయి. ఈ బృందం ....హమ్ పాంచ్...కూడా ఆ ఒరవడిలో ఒకటిగా పరిశీలించవలసే ఉందనిపిస్తుంది.
కాగా, కొన్ని మాసాల క్రితం శంకర్ పామర్తికి గ్రాండ్ ప్రీ పురస్కారం వచ్చినందున అంతర్జాతీయంగా పేరొందిన మన కేరికేచరిస్టుని ఘనంగా సత్కరించుకోవడం ఈ సభలో మరొక విశేషం.
శంకరన్న మాట్లాడుతూ, తెలంగాణ లో జన్మించడం ఒక మహత్తరమైన అంశం అని ఎంతో ఉద్వేగంగా ప్రసంగించడం వింటుంటే, మలి తెలంగాణ దశ - ఆ ఉద్యమంలో తన వంటి వారు చొదకంగా ఉండకపోయినా గని, వివిధ రంగాల్లో కృషి చేస్తూ వచ్చిన వాళ్లు మెల్లగా తెలంగాణ విశిష్టతను ఎలా గమనంలోకి తెచ్చుకుని ఉప్పొంగుతున్నారో తెలుస్తున్నది. ఇదొక అద్భుతమైన పరిణామం. ఒక రకంగా సాంస్కృతిక రంగాల్లో జరిగిన పని మళ్లీ పునర్నిర్మాణంలో మనుషులను బలంగా కనెక్ట్ చేస్తుందనిపించి సంతోషం వేసింది.
మొత్తంగా ఇది కవిత్వ సభేకానీ అన్నిరంగాలూ కలగలసి ఒక గ్రామీణ సంవిధానంలో ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలుగా కానవచ్చిన స్థితి ఆనందానికి కారణమైంది. కాసుల ప్రతాపరెడ్డి గారు అన్నట్లు, మూడు తరాల కవిత్వానికి, తెలంగాణ కవితా భూమికకు దక్కిన పురస్కారాలుగా ఈ సభను గుర్తు పెట్టుకోవాలి. ఈ పురస్కారాలతో ఆ గ్రామం, అక్కడి ప్రజల మధ్య కనీసం ఐదు వందల మందైనా వచ్చారనిపించింది, పెద్ద సంబురమే అయింది ఆ రోజు.
ఇక లైబ్రరీని కూడా ప్రారంభించారు. పుస్తకాలతో జరిగే విప్లవాన్ని గురించి తన జ్ఞాపకాల్లోంచి మా ఎడిటర్ , నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. తన కాలేజీ రోజుల్లో చదివిన 'చిరస్మరణ' అన్న పుస్తకం తనపై ఎంతటి ప్రభావం చూపిందో, ఆ పుస్తకం చదివాక తన యవ్వనోద్రేకపు జీవితం కేరీర్ వైపు కాకుండా సామాజికాంశాల్లోకి వెళ్ళేలా ఎలా ఉత్తేజితం చేసిందో, సామాన్యులు ఎలా అసాధ్యులుగా ఎదుగుతారో అర్థం చేయించి తన జీవితాన్ని వామపక్ష రాజకీయల వైపు మల్లిన్చిందో వివరించారు.
ఇలా ఆ ఊరు ఒక కొత్త కాంతిని లోవెలుపలా ప్రసరింపజేసింది. ఒక జీనుబాయి పిట్ట గూడు లా ఆకర్షించింది. ప్రతి ఒక్కరినీ తమ ఊరిని దర్శించాలనిపించేలా చేసింది. సొంత గూడు ఒకటి కట్టుకునేలా ప్రేరేపించింది.
+++
నేను ప్రధానంగా ఫొటోగ్రాఫర్ గా వెళ్లాను. కానీ రాయకుండా ఉండలేక ఈ నాలుగు మాటలు.
ఈ అవకాశాన్ని కలిగించిన యాకూబ్ భాయ్... మీకు కృతజ్నతలు అన్నా. . లక్ష్మి గారూ...మీ ఆదరణకు చాలా సంతోషం. యాకూబ్ అమ్మగారు హూరాంభీ గారికి హృదయపూర్వక శణార్థులు. యాకూబ్ బాయ్ ఏకైక చెల్లెలు జాన్ బీకి. సోదరులు బందే అలి, మొహమూద్, మహబూబ్ పాషా, రంజాన్ అన్నల పరిచయ భాగ్యానికి ఆనందాలు.
ఆ దూర ప్రయాణానికి కాసుల ప్రతాపరెడ్డి అన్న కారులో వెళ్లాం. ఆ ప్రయాణం పొడవునా మా కుటుంబం, సరస్వతక్కా, ప్రతాపన్నా ఎన్నో మాట్లాడుకున్నాం.
ఇలా రొట్టమాకురేవు కలిపింది అందర్నీ.ఒక మిణుగురు పురుగులా మెరిసే మంచి జ్ఞాపకాలను అద్దింది. పంచుకుంటుంటే మరింత ఆనందంగా ఉన్నది. Happy to share...
-
కందుకూరి రమేష్ బాబు
12. 10. 2015

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...