అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

20 Sept 2012

ప్రేమ ఒక ఉనికి


పూలతోటలోంచి పువ్వు కళ్లు విప్పార్చి నవ్వుతున్నట్లు ఆమె నవ్వుతుంది.గలగల పారే సెలయేటి మధ్య సుడులు తిరుగుతున్న నీళ్ళలా ఆమె నవ్వుతుంది.
మిట్టమధ్యాహ్నం నీడల్లోకి ప్రయాణం కట్టిన తెల్లటిమేఘంలా ఆమె నవ్వుతుంది.నవ్వుకు నవ్వులనడకలు నేర్పుతూ అలిసినట్లు అపుడపుడూ కునుకుకూడా తీస్తుంది.
నిద్రపోతున్న ఆ కళ్ళవెనుక కదులుతున్న దృశ్యాల్లో బహుశా ఎవరో దాగిఉన్నారు
.
దాగిన దృశ్యాలకు,దాగని అర్ధాలకు నడుమ చేతనంగా కదులుతున్న భావాలేవో తచ్హాడుతుంటాయి.

పాటలగుంపులు ఆత్మమీదుగా బారులు తీరుతుంటాయి.
అందులోంచి తప్పుకుని కొంగలాంటి పాట. తెలతెల్లని సంతోషం లాంటి పాట. ప్రేమకు ప్రతిరూపం లాంటి పాట.
'కలవరమాయె మదిలో..నా మదిలో' ను హమ్మింగ్ చేస్తో పలవరిస్తూ ఆమెలా రూపుకడుతుంది.
కలలపైన కదిలే నావలా తేలియాడుతుంది.నావలో చరిస్తూ,సంచలిస్తూ ఆమె పాటను వెంటపెట్టుకుని ఎటో వెళ్ళిపోతుంది.

ప్రేమిస్తూనే ఉండిపోవాలి తెల్లటి మేఘాల్లాంటి ఊహల్ని ఆత్మపైన పయనింపచేస్తూ ఆమె గమనాన్ని,గమకాల్ని గమనిస్తూ..
ఆమెలోంచి నేనూ,నాలోంచి ఆమే
పయనిస్తూ అలిసిపోని ప్రయాణీకుల్లా సాగిపోతుంటాం.
మెలకువలోంచి , ఉనికిలోంచి
ఊపిరిలోంచి ,హృదయపుస్పందనలోంచి ఎదురుపడే
సుపరిచితమైన పాటవంటిదేనేమో ప్రేమ.

వింటున్నాను.
కలగంటున్నాను.
ప్రేమను ఒక ఉనికిగా అనువదించుకుంటున్నాను.

*20.9.2012

12 Sept 2012

ఒక జన్మే !


ఉన్నదొకటే జన్మ

నవ్వినా ఏడ్చినా
ఓడినా పోరాడినా
సుఖించినా దుఃఖించినా

=ఉన్నదొకటే జన్మ!

ఆ లోపలే చింతచిగురు కుప్పల్లా పిలిచే కోర్కెలు
కాగితాలకు చేరుకునే దారుల్లో పయనిస్తూ పదాలు
వేళ్లకొనలపై కునుకుతూ ,జోగుతూ
మెలుకువను కలకంటూ అక్షరాలు
నొప్పెట్టే పాదాల్తో
రాత్రుల్నిఈదే దేహాల తీరనితనం=

కొంత ఊరట,ఇంకొంత వగపు

కొన్ని సందర్భాలు,కొన్ని సంకల్పాలు
=కొడిగడుతూ,వెలుగుతూ గడియారపు ముళ్ళు
*
ఎవరైనా అడుగుతారా కుశలాన్నీ
ఏమైనా తెస్తారా

ఇంకేం ఇస్తారూ
ఇంకేం అడుగుతారు ఇంతకుమించి

అడిగి,లోపలంతా కడిగి
ఎవరైనా ఏమివ్వగలరు?!

*
ఒక జన్మే మరలి రాదు
తిరిగి, మరల రానే రాదు

--------------------------------
*పరివర్ధిత కవిత;26.8.2012

॥వృత్తాలు॥


రాత్రంతా ఒక్కడే చంద్రుడు
ఒంటరి ఆకాశపు అద్దంముందు నిల్చొని
మళ్ళీ మళ్ళీ ముంగురులు చెరుపుకుంటూ,తలదువ్వుకుంటూ

=అలిసిపోయాడేమో
నా తొడమీద తలపెట్టుకుని గాఢనిద్రలో ఉన్నాడు
ఇప్పుడిలా


ఉదయానికి
నా రోజువారి పనుల్లోకి వెళ్ళిపోవాలి
హాజరుపట్టీలో నన్ను నేను ఉన్నానని నిరూపించుకోవాలి.
ఎప్పటికప్పుడూ ఇలా ప్రతిరోజు
నిరూపించుకోవడం అలవాటైపోయింది
అలా అలవాటుచేస్తున్న ఉదయాలకు నమస్కారం!

=ఇక్కడేమో ఈ చంద్రుడు
ఎప్పటికీ మేల్కోడు, లేపి నిద్రను చెడగొట్టనూ లేను!
నిద్రకంటే అతనికి నేనివ్వగలిగిన కానుక మరింకేముంది?!
నిద్రిస్తున్నాడు ఎంతో నిశ్చింతగా;మళ్ళీ జీవిస్తున్నట్లు మళ్ళీ జన్మిస్తున్నట్లు

నా ఒక రోజుని కానుకగా ఇస్తాను-
నన్ను వెన్నెల్లో ఆడించినందుకు
నన్నొక కవిత్వాన్ని చేసి నాకే ఇచ్హినందుకు
నాలోపలి కాంతికి వెన్నెలను జోడించినందుకు
నాకిచ్హినదంతా తిరిగి ఇవ్వగలిగినంత ఇచ్హేస్తాను

=వృత్తాన్ని నేనూ,చంద్రుడూ
తన నిద్రతో,నా కృతజ్నతతో చుడుతూనేఉన్నాం
ఎప్పట్నుంచో

మళ్ళీ రాత్రి కోసం
ఆకాశాన్ని అద్దంగా మార్చడానికి
నేనొక వృత్తంగా మారి నాలోకి నేనే ప్రయాణించడానికి!

ష్..
సెలవిక

నిద్రలో ఏదో కలవరింత.
వినాలి వెన్నెలమర్మాలన్నీ చెవియొగ్గి......!!

*7.9.2012

కలవాలి !



నిన్న కొందరిని కలిశాను

కలవకుండానే,ఏ విషయాలు చెప్పకుండానే
వారం క్రితం వెళ్ళిపోయిన సహాధ్యాయి రాయలయ్య
సమాధిలోకి తొంగిచూసి
నిన్ననే='హాలియా'లో
కలిసొచ్హాను.


చదువుకునే రోజుల్లో
కొన్ని కప్పుల టీని,కొన్ని కబుర్లను ఒంపుకున్న
రవి ఆత్మహత్యాగ్రహాన్ని
ఇవాళ వార్తలుగా కలుస్తున్నాను.

కలుద్దామెప్పుడైనా అనుకున్నవాళ్లంతా ఇలా
కనుమరుగై పోతున్నారేమిటీ?!

(అబ్బా...!
కలవడం కూడా కష్టంగా మారిపోతున్నబతుకును
ఇలా మోస్తూ తిరగడం
సెలవేస్తున్న గాయాలను మోయడం
ఎవర్నీకలవగలగని జీవితాన్ని భరిస్తూ,మోస్తూ
చివరిచూపు దక్కని నేరస్తుడిలా మారిపోవడం!!)

కలవాలి,కలవాలి
సమయం లేదు,ప్రతిక్షణం ఎవరినో ఒకరిని కలవాలి
కలవాల్సిన సందర్భాల్ని,కలబోసుకునే కాలాల్ని,కన్నీళ్ల కలబోతల, కదిలింతల వేళల్నితక్షణమే డైరీల్లో రాసుకోవాలి.సమయం లేదు.

కలుద్దామెప్పుడైనా అనుకోవడం
రేపు జీవిద్దామనుకోవడమేమో?!
రేపటిని రేపే జీవిద్దాం ఉంటే గింటే,
ఇవాళను మాత్రం ఇప్పుడే జీవించాలి=

*10.9.2012

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...