అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

15 Jul 2014

ఒక్కొక్కరోజూ


ఒక అనుభవం..
ఒక గాయమో, చిగిరిస్తున్నరాగమో
లేత పలకరింపులకు మోరలెత్తే ఆనందమో
కానైతే యేదో ఒక అనుభవం.
అప్పటివరకూ చిరునవ్వుగా సమీపించే కాలం
హటాత్తుగా ఉరుముతుంది,నిట్టనిలువుగా చీలుస్తుంది.
*
పొద్దున్నే పలకరించే
పెరటిమొక్క ముఖంలోకి తరచి చూస్తున్నాను.
ఏదో చెప్పేందుకు
నా చెవి దగ్గరికి జరుగుతోంది.
వినాలి.
విన్నాక మీతో చెపుతాను.
అప్పటివరకు సెలవు....!!

కలవాల్సినవి !


............................................
నిన్న కొందరిని కలిశాను
కలవకుండానే,ఏ విషయాలు చెప్పకుండానే
వారం క్రితం వెళ్ళిపోయిన సహాధ్యాయి రాయలయ్య
సమాధిలోకి తొంగిచూసి
నిన్ననే='హాలియా'లో
కలిసొచ్హాను.
చదువుకునే రోజుల్లో
కొన్ని కప్పుల టీని,కొన్ని కబుర్లను ఒంపుకున్న
రవి ఆత్మహత్యాగ్రహాన్ని
ఇవాళ వార్తలుగా కలుస్తున్నాను.
కలుద్దామెప్పుడైనా అనుకున్నవాళ్లంతా ఇలా
కనుమరుగై పోతున్నారేమిటీ?!
అబ్బా...!
కలవడం కూడా కష్టంగా మారిపోతున్నబతుకును
ఇలా మోస్తూ తిరగడం
సెలవేస్తున్న గాయాలను మోయడం
ఎవర్నీకలవగలగని జీవితాన్ని భరిస్తూ,మోస్తూ
చివరిచూపు దక్కని నేరస్తుడిలా మారిపోవడం!!
కలవాలి,కలవాలి
సమయం లేదు,ప్రతిక్షణం ఎవరినో ఒకరిని కలవాలి
కలవాల్సిన సందర్భాల్ని,కలబోసుకునే కాలాల్ని,కన్నీళ్ల కలబోతల, కదిలింతల వేళల్నితక్షణమే డైరీల్లో రాసుకోవాలి.సమయం లేదు.
కలుద్దామెప్పుడైనా అనుకోవడం
రేపు జీవిద్దామనుకోవడమేమో?!
రేపటిని రేపే జీవిద్దాం ఉంటే గింటే,
ఇవాళను మాత్రం ఇప్పుడే జీవించాలి=
*10.9.2012

అయితే ఇలా...


---------------
అపుడపుడూ
పువ్వులమధ్య,పరిమళం మధ్య నిద్రపోవాలి
చెంగుచెంగున ఎగిరే చేపపిల్లల్లా తుళ్ళాలి
అలజడిని హాయిగా
గుండెలకు హత్తుకునే మంత్రమేదో నేర్చుకోవాలి
ఒక క్షణమైనా ఒంటరితనాల వనాలపైన వానలా కురవాలి
ఒక నీటిచుక్కలానో,ఒక అల్లరల్లరి పాటలానో
అక్షరంలోకి ఒదగని
ఒకానొక ఏకాంతక్షణంలానో మెరవాలి
బలవంతంగా కాక
ఇష్టంగా బతకాలి...!

14.10.2012 

ఒక కవాతు


.........................................
రోడ్లపై కదిలిన ప్రతి అడుగూ ఒక ఆకాంక్ష
నెత్తురోడిన ప్రతి దేహం ఒక ఆకాంక్ష
జెండాలై రెపరెపలాడిన ప్రతి నినాదమూ ఒక ఆకాంక్ష !
ఖైరతాబాదు ఫ్లైఓవర్ దారిలో
ముళ్ళకంచెలమీద గీరుకుని ఒలికిన రక్తం
లిఖించిన ఆకాంక్ష 'తెలంగాణా' !
తలలుపగిలినా మునుముందుకే కదిలిన ప్రతి అడుగులో
చెదరని సంకల్పపు ఆకాంక్ష 'తెలంగాణా'!
వానలో తడిసి,వణికిన ప్రతి క్షణంలో
లోలోపల ఎగిసిన శబ్దమూ 'తెలంగాణా'!
ఉస్మానియా యూనివర్సిటీ గేటుముందు
కదిలి,కరిగి,ఉరకలెత్తిన రణన్నినాదమూ'తెలంగాణా'!
ఒంటిమీద పడి,కమిలిన ప్రతిదెబ్బా
తెలంగాణా పౌరసత్వపుగుర్తింపుచిహ్నం!
తెలంగాణా కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు
అది ఇప్పుడొక మార్పుకేతనం; ఒకానొక పునర్మూల్యాంకనం;భవిష్యత్తును కలగంటున్న పక్షిచూపు;రేపటి లేలేతస్వప్నాల్ని నినదిస్తున్నఉక్కుగొంతు !
ఇవాళ సాగరహారం
ఆకాంక్షను రూపంగా కళ్ళకు కట్టింది
సమూహమై ఉరకలెత్తింది
సంభాషణగా ముందుకు వచ్హింది
దయగా హక్కుల్ని అడిగింది,అలాయిబలాయి కోసం చేతులు చాచింది
'తెలంగాణ మా జన్మహక్కు'అంది, మా అన్నంముద్ద మాదే అంది
హక్కులవివక్షను ప్రశ్నించింది
ఆకాంక్షలను ఇంకా ఇంకా అవహేళన చేస్తారా?!
ఇకపై
గడిచే తాత్సారపు ప్రతి ఘడియ
ఆకాంక్ష- అగ్నిగా ఉబికి చిమ్మబోయే లావా!
*3.10.2012

ఒక ధిక్కార పద్యం


.......................................
జ్ఞాపకాల్ని తడిమి
చిరుగుల్ని కుట్టి 
జాగ్రత్తగా గుండీలు పెట్టుకుని
మళ్ళీ రోడ్లమీద వర్తమాన వ్రణాలపైకి కరిగిపోవడం
రోజువారీతనమైనప్పుడు
జ్ఞాపకాల గురించి
మాట్లాడటం
నేరమూ కాదు,ఘోరమూ కాదు
జ్ఞాపకమంటే బతుకు కథ !
మేలుకోలుపుతూ వెన్నంటి ఉండే ఆత్మ !
నీలోకి నువ్వే సాగుతూ ఆగుతూ
క్షణమైనా విశ్రమించే నీడ.
బాల్యాన్నీ,యవ్వనాన్నీ ,మొత్తం గడిపిన జీవితాన్నీ
భుజం మీద మోసుకుతిరిగే చద్దిమూట.
అసలు జీవితమే
జ్ఞాపకాల పెట్టె.
అవసరమైనప్పుడల్లా తెరుస్తాను,మూస్తాను.
*5.12.2012

11 Jul 2014

ఉనికి


.........................
ఎన్నోసంవత్సరాలనుండి ఆ కొండ అలాగే నిలబడివుంది
అలాగని కాలానికి కొలమానమూ కాదు ,తెలివితేటలకూ చిహ్నమూ కాదు.
కదలక మెదలక స్తబ్దంగా గడ్డకట్టిన దు:ఖపు బిందువులా దాని ఉనికి.
1
ఎందుకలా ఇన్ని యుగాలుగా నిరీక్షిస్తున్నాయో, తదేకంగా ఎటువైపు చూస్తున్నాయో ,అక్కడే ఎందుకలా ఉండిపోయాయో
2
అసలు రూపాలనేవి అంతరంగాల్ని ప్రతిబింబించే రూపాలేనా
ఆత్మను ఆవిష్కరించే రూపాలేనా
వినవు మాట్లాడవు కదలవు మెదలవు
జధంగా నిశ్చలంగా ఎంతకీ బోధపడని రూపాలు
3
ఏ అర్థమూలేని ఉనికి ,ఎంత ఉన్నతశిఖరమైనా దాని అస్తిత్వమూ ఎప్పుడూ ప్రశ్నే!
4
అలా మిగలకపోవడంకోసమే మనిషి ప్రయత్నమంతా !
అక్షరాల కోసం వెతుకులాట ,నిరంతర సంభాషణ ,కొండలాకాక నిత్యం కదులుతూ ఉండటం
వస్తుంటాం పోతుంటాం ఎంతో కొంత మిగలాలి
భుజాలకెత్తుకున్న బరువుల్లోంచి కొంచెమైన దించాలి
మోస్తున్న బరువుకంటే, వీస్తున్నబతుకు హాయినిచ్చేట్లు నడవాలి
5
జీవితం గడ్డకట్టిన కొండగా మిగలక పోవడమే నిజమైన ఉనికి
కొండకూ మనిషికి తేడా తెలియాలి కదా!
*30.12.2012

అర్ధంకాని పాఠం


...................................
మృత్యువును చూద్దామా మనచుట్టూ ఉన్న బొమ్మల్లోంచి !
ఉనికిని ఎలా కనిపెడతారు
దేహంతోనా , మాటలతోనా , ఊపిరితోనా , ఏదో ఒక రూపంతోనా -
కొట్టివేతల్లోంచి, సందేహాల్లోంచి
నిజమైన సందేశాలు ,ఆత్మ ఆవిష్కరించబడతాయేమో !
1
నిలబడని వాగ్దానాల్లా ఇంకా ఇంకా తిరుగాడే మనుషులు
దేహాల్ని దు:ఖాలకు ,మోహాలకు ,లాభాలకు , లోభాలకు
ఇచ్చేసి ఎక్కడా మిగలకుండా వెళ్ళిపోతారు
ఉన్న మిగతా మనుషులు
బొమ్మలతోనే మిగిలినదంతా పంచుకుంటూ
అలానే ఉండిపోతారు
2
అదృశ్యం అవడంలోని రహాస్యాన్ని
ఎక్కడనుండి రాబట్టాలి
ఒక పాఠంలోంచి మరో పాఠంలోకి పేజీలు తిప్పినట్లు
నేర్చుకోవాల్సింది ఎపుడూ అర్ధం కాని పాఠమే !?
3
దగ్గరవడం కోసమేనేమో ఇలా దూరం అవడం !
దూరమవడంలోనే
నిజమైన జీవితార్ధం ఇమిడిఉందా?
ఈ దూరమే మృత్యువు ప్రేమించే నిజమైన మిత్రుడేమో!!!
*31.12.2012

నీడ పక్కన


..............................
కొంచెం కొంచెంగా తరిగిపోతున్న రోజులో
ఒక పక్కన ఒద్దికగా నడుస్తూ,
చిట్టచివరికి ఇలా కొంత మిగుల్చుకున్నాను
రాత్రుల్లో కలవరపెట్టే కలల్లోంచి
మిగిలిన నావి అనే కలల్ని జేబులో వేసుకుని
నిద్రలేచాను.
కొన్ని నాణేలు మటుకు గుండెల్ని హత్తుకుని
కలల పక్కనే కూచుని కబుర్లు చెప్పుకుంటూ
ఎంతోకొంత జీవితాన్నిభరోసాగా ఉన్నాయి నాతోపాటే.
రోజంతా వాటి గుసగుసలు నావెంట.
పొద్దుటి మంచును దాటివచ్చాను.
మనసును కప్పిన దిగులును మాత్రం వెంట తెచ్చాను
జీవితం నీడతో పాటు
సాగడం,ఆగడం అలవాటైతే అయ్యింది.
కనీసం ఈ నీడపక్కన
మిగలడానికి ప్రయత్నిస్తూ సాగాలి.

అమ్మ అన్నంముద్ద


.....................................
అమ్మ అన్నం తినడం
చిన్నప్పట్నుంచే చూస్తూనే ఉన్నాను
నిన్నమాత్రం ఆమె తింటున్న పద్ధతిని పరీక్షగా చూసాను
ఆమె నా గమనింపును పసిగట్టకుండా
జాగ్రత్తపడుతూ కొత్తగా ,వింతగా చూస్తుండిపోయాను
అన్నం తినడం ఎలా ఉంటుందో ,అన్నం విలువేమిటో
ఆ పేద రైతుభార్య తినడంలోని ఆత్మీయమైన తీరులో గమనించాను
ఆ తినడం-
ఒకటీ అరా మెతుకుల్ని అలా అలా
పెదాలు కదలకుండా తినడంలా లేదు
సుతారంగా వేళ్ళకు
కలిపిన అన్నం అంటకుండా తినడంలా లేదు
దవడలు కదలకుండా ,పెదవులు విప్పకుండా
పళ్ళుకనపడకుండా తినే నాగరీకవిద్యలా లేదు
అన్నం అసలుస్వరూపమేమిటో ,నిర్వచన మేమిటో
బోధిస్తున్నట్లుగా ఉంది.
పిసికి,కలిపి పిడికిటినిండా పట్టి
నోటికి అందించే ముద్దకి ఆత్మగౌరవాన్నేదో ఆపాదిస్తున్నట్లుగా ఉంది
పచ్చడి కలుపుకున్నా ,పచ్చిపులుసు పోసుకున్నా
ఆమె చేతిలోని ముద్ద మాత్రం అచ్చం
అమ్మకళ్ళలోని వెలుగులా మెరుస్తుంది
ఆకలిని ఆమె గౌరవిస్తుంది
ఆకలికి,అన్నం ముద్దకున్న అనుబంధాన్ని ప్రేమిస్తుంది
అందుకేనేమో
ఆమె తింటున్నప్పుడు నిండుమనసుతో
పిల్లల్ని ఆశీర్వదిస్తున్నట్లు నిర్మలంగా ఉంది
చేతులు కడుక్కుని అలా వచ్చి అమాయకంగా
పక్కన కూచోగానే నన్ను నేను సంభాళించుకోలేక
అమ్మ చేతుల్ని ముద్దాడాను
26.2.2013

ఇవాళ్టినుంచి రేపటిలోకి ...


..............................................
నన్ను నువ్వూ, నిన్ను నేనూ
ఎప్పుడోకప్పుడు కోల్పోతాం
మూగవాని సైగలా మారిపోతాం, పుట్టుచెవుడు మాటలా మిగిలిపోతాం
నిన్నూ నన్నూ కొలిచే మైలురాళ్ళ వెనుకాముందూ
రాసిపెట్టిన ప్రయాణపు దూరాలూ ,చేరవలిసిన గమ్యాలూ
మనతోనే ప్రయాణిస్తున్నా పెద్దగా పట్టించుకోం
నిన్నో మాటంటాను,నువ్వొక మాటా అనేస్తావు
ఈ మాటల్లోనే మరణించాక
ఇంకొంచెం మిగిలిన బూడిదలా అపుడపుడు రాలుతుంటాం
నువ్వేమో కొలబద్దలా మారి
నాకో కొలబద్దరూపాన్ని తొడుగుదామనుకుంటావు
అక్కడే పేచీ !
నిన్ననే కదూ -నేనొక వాడిపోతున్న ఆకులతీగెను
నాలోంచి తెంపేసి కొత్తగా మొలకెత్తుతున్నది ,
చిట్టచివరిగా మబ్బు విదిల్చిన చినుకులోకి దూరి
ఇంకొంచెం తడిగా పలుకుతున్నది
కొంచెం తడి, కొంచెం చిగురింత
రేపటికి కనీసం మొలకలా అయినా కన్పిస్తాను
కోల్పోయాననే స్పృహ ఏమాత్రమూ నాలోకి
ప్రవిశించకుండా జాగ్రత్తగా రెమ్మలు,కొమ్మలుగా విస్తరిస్తాను
ఇవాళ్టినుంచి రేపటిలోకి ...
#24.7.2013

చినుకుభాష


ఇంకొంత సమయం పడుతుందేమో
ఈ ముసురు ఆగిపోవడానికి
మరీ చిని చిన్ని చినుకులు
వాటికో వ్యాకరణ సూత్రమేదో ఉన్నట్టు
వొకటివెంట ఒకటి కుదురుగా
నిన్నటి సాయంత్రం నుండి ఇవాల్టి ఉదయం లోపల
ఎన్ని పరిణామాలు జరిగిపోలేదూ
అవేమీ పట్టనట్లు ప్రవర్తిస్తుందీ ముసురు
ఎవర్నీ వో మాటా అనదు
అసలు నోరే విప్పదు
దానిది చినుకుభాష
వొక గొడుగునో, పైకప్పునో , లేకపోతే వొక రెయిన్ కోటునో
మనమీద కప్పుకుంటాం అడ్డంగా
ఈ ముసురు చేసే సంభాషణలో
ఒక్క ముక్కా అర్థం కాదు.
31.7.2013

ఏదో మిగిలే ఉంది !


.....................................
లోపల ఇంకా ఏదో మిగిలే ఉంది.స్థిరంగా ఉంది.తడిగా ఉంది.రక్తమంటి జిగట జిగటగా ఉంది.
చేతికి అంటిన అన్నంమెతుకుల ఎంగిలిలా ఉంది.కడిగిన చేతివేళ్ళ మధ్య దాగిన కారపుమరకలా ఉంది.
ఏదో మిగిలే ఉంది.
ఒంటరిగా వొంటరి ఒంటరివై వొంటరి
వొంటరితనంతో కసిగా రక్కేస్తున్న -ఒంటరి.
నిజమో కాదో తెలియక ,మిగిలిందే చివరిదని,చివరికి మిగిలిందేనని
నమ్ముతూ రోజుల్ని అమ్ముతూ పగళ్ళూ రాత్రుళ్ళూపొర్లుతూ దొర్లుతూ
ఎంతో మిగిలిపోతూ, మిగిలినదేదో తెలియని
ఏదో మిగిలే ఉంది.
లోపల దాచిన అసలు రహాస్యమే నువ్వు
బయటికి కన్పిస్తున్నది అసలు నువ్వేకాదు.
అసలు ఏం చెబుతావో
మాటలేవీ మాటలే కావు.
ముఖం దాచుకోవాల్సిరావడం
ముఖంపై నిజాల్ని తొడుక్కోలేకపోవడం ఇవాల్టి పదచిత్రం.
నిజమేనేమో- ఇలా తవ్విపోస్తున్నది ఈ మెట్రో రైలు గుంతలని కానేకాదు
నగరం నడిబొడ్డు మీద నిన్నే నిన్నే నిన్నే....!!
#15.8.2013

ఊపిరాడదు !


...............................
తెరలు తెరలుగా దగ్గు , ఊపిరాడనంత.
గుక్కెడు నీళ్ళలోని తడి గొంతులోని ఏ పొరను తాకిందో
ఉక్కిరిబిక్కిరి చేసే దగ్గు
తలపై ఆదుర్దా అమ్మ స్పర్శ
'ఎవరో నిన్ను గుర్తు
చేసుకుంటున్నారని' నా కళ్ళల్లోని కన్నీళ్లను తుడుస్తూ అంటుంది.
దగ్గుకూడా బావుంటుందనే ఆ అమ్మ స్పర్శ
నగరంలొ ఓ మూల- పైకప్పునీ నాలుగ్గోడలనీ పంచుకుంటూ భార్యాపిల్లలూ
రొటీన్ పరుగులూ, క్రమం తప్పని బిల్లులూ
అపుడపుడు, అక్షరస్పర్శకోసం వో సాహిత్య సమావేశం,
ఎప్పుడో నిర్వచనం మరిచిపోయిన జీవితస్పర్శ
- ఇంతకుమించి చెప్పుకోవడానికేమీ మిగలని తనంలో
ఎవరు గుర్తుచేసుకుంటారులే -
నేనేమన్నా కిచకిచమని పలకరించే బల్లి తప్ప!
**
నిన్ననే నేనొక కొత్త మనిషిని పలకరించాను .
ఓ కవిమిత్రుడి తడి ఆరని అక్షరాలని ఆప్యాయంగా
స్పృశించుకున్నాను మనసారా--
మెచ్చుకుంటూ వో రెండు మాటల్నీ రాశాను .
కవిమిత్రుని ఆర్తినీ, ఆవేదననీ అర్ధంచేసుకున్నానన్న
నా నాలుగు అక్షరాలనీ పంచుకున్నాను కూడా
ఆమధ్యే కొందరం కలిసి కూచుని
మరో సమావేశంలో నాలుగు అక్షరాల్ని తలచుకున్నాం.
***
తెరలు తెరలుగా దగ్గు , ఊపిరాడనంత.
గుండెల్ని పిండేసే దగ్గు..ఆత్మీయస్పర్శ కోసమడిగే దగ్గు
బహుశా--
ఇలా పలకరించుకోవడం,రాయడం,పంచుకోవడం,కలుసుకోవడం
నచ్చడం లేదేమో !
కలవకుండా, కలపకుండా ఉంచే పెట్టుబడిదారీ మనస్తత్వమేదో
ఎక్కడో ఓ చోట నన్ను గుర్తుచేసుకుంటూ
ఇలా ఊపిరాడనీయని దగ్గులా చుట్టేస్తుంది కాబోలు.
స్పర్శ మాత్రం మిగిలే ఉంటుందంటూ గోడపై బల్లి కిచకిచ...
#29.8.2013

ఒకప్పటి మాట


...............................
తునికొర్రెలో ఎలుగ్గొడ్డు దాక్కున్నట్టు
దేహంలో కోర్కె పడుకుంది
ఊరోళ్ళంతా కర్రలు పట్టుకుని
ఒర్రె వైపు పోతున్నారు ఎలుగ్గొడ్డును తరుముదామని
-మరి ఈ ఈ దేహం మాటేమిటి?
చుట్టూతా పన్నిన వలలే
వేసిన మాటులే
బెదరదు
కదలదు
తనను తానే పారదోలుతుంది , ఎదురు తిరుగుతుంది
తప్పించుకోవడం ఎప్పటికీ కుదరదు
పారిపోవడం
ఈ దేహంలోని కోర్కెకు అలవాటే
ఎదురు తిరగదు
ఎదురు తిరగడంకన్నా
ఇలా దేహం లోనే దాక్కోవడం
అలవాటైన మర్యాదలాంటి సులువు.
#30.8.2013

ఈ మధ్య !


...........................
నిన్నేవరైనా కలుసుకోవడానికి వచ్చారా ఈమధ్య !
కలుసుకోవాలని అన్పించడం గొప్ప పురస్కారం నిజానికి .ఎవరూ ఎవర్నీ కలవరు ఏదో ఒక పని ఉంటే తప్ప. ఏ పనీ, అవసరమూ,ఏ ఉబుసుపోకలు లేకుండానే కేవలం నిన్ను మాత్రమే కలిసి కలబోసుకోవడానికి వచ్చారా ,అయితే నువ్వో గొప్ప అదృష్టమంతుడివి.మనిషిగా మిగిలున్న మనిషివి.
ఏమీ ఆశించకుండా గాలి అలా అలా చెట్లమీంచి,నీటిమీంచి,ఇళ్ళమీంచి వీస్తూ వెళ్ళినట్లు అతను నీ దగ్గరకు వచ్చాడంటేనే
అతనూ నువ్వూ ఇంకా సహజంగా వీస్తున్నట్లు !.
పదే పదే కలవమని ఇచ్చే నీ సందేశాల తర్వాత కూడా అతనికి నిన్ను కలవాలని అన్పించలేదంటే నువ్వెక్కడో మనిషిగా వోడిపోయావని అర్థమేమో ?
నువ్వెన్నిసార్లు ఫోనుల్లో పలకరించి బతిమాలి భయపెట్టి పిలిచినా ఒక్క అడుగూ నీవైపుకి సారించలేదంటే నువ్వేమిటో అతనికి అర్థం అయ్యిందని అర్థమేమో?
కొన్ని మైళ్ళు,కొన్ని యోజనాలు,ఇంకొన్ని అడ్డంకులు ,మరికొన్ని దూరాలు దాటి ,ఎక్కడో వో మూలన ఉన్న నీకోసం వెతుక్కుంటూ నిన్ను చేరుకున్నాదంటేనే నీలోని మనిషి అతనిలో ప్రతిష్టించుకున్నాడని అర్థం.
మనుషులు కనుమరుగవుతున్న కాలంలో నువ్వో మనిషిగా మిగిలున్నావని అర్థం.
చెప్పు
నిన్నెవరైనా కలుసుకోవడానికి వచ్చారా ఈమధ్య !
#4.9.2013

చల్తే రహో !


...........................
ఇంకొన్నిసార్లు ఇలాగే నడవాలి
ఎప్పట్లాగే నడుస్తూ నడుస్తూ ఉండాలి దారెలాగో తెలుస్తుంది అదే
నిన్నే చూసి నువ్వే నేర్చుకోవాలి
నీ మీదే నీకు నమ్మకం ఉండాలి
ముసుగులెందుకు,మునగదీసుకుపోవడాలెందుకు
నీ ముఖం నీకే దివిటీలా కన్పించాలి
చూపుల్లో భాష చురుకుగా ఉండాలి
మాటల్లో బతుకు మెరుపులా మెరవాలి
నంగితనాలొద్దు,నజరానలొద్దు,మొహమాటాలూ వద్దు
వద్దంటే వద్దు,అసలే వొద్దు
పడిలేచిన కెరటంలా కసిగా ఉండాలి ,కసిదీరా జీవించే
కాంక్షలా ఉండాలి
నిద్రించే ఊహలమీద నెగడ్లు పెట్టు
నిన్ను నువ్వు డప్పులా ఎగిసే నిప్పుసెగలమీద కాచుకో
కణకణమని మోగాలి
నువ్వో అక్షరం,నేనో గుణింతంలా కాక
రెపరెపలాడే పుస్తకంలా ఉండాలి.
మాటో,మంత్రమో,చిచ్చుకొట్టే సందేశమో,అప్పటికప్పుడు రెడీమేడ్ గా
చిలకరించే ప్రేమో -అసలే పట్టించుకోకు,దేన్నీ ఖాతరు చేయకు!
నువ్వు నువ్వే
నువ్వే నువ్వు
చల్తే రహో, చలో చలే -

వదిలేసే ఆ సగం !


.....................................
ఒక్కరిమే పోరాడితే ,మారితే ఏదీ మారదా ? భయపడి ఒక్కళ్ళమని ఇలాగే రోజుల్ని దొర్లించుకుంటూ ఉండటంలోనే అన్ని భద్రతలూ అలాగే మిగిలిపోతాయా?
ఇంటిని కాదనుకుని ఒక గదిలోకి వొంటరి వొక్కడిలోకి ;ప్రశాంతత లోంచి మరింత ప్రశాంతతలోకి మెట్లు వేద్దామా?
ఇంకేమిటో కావాలి;ఇంకేమిటో తెలియకుండానే అవునింకేమిటో కావాలి
పదేళ్ళ కిందటి మాట నుంచి ఇప్పటివరకూ ;ఇప్పటినుంచి
ఇంకొంచెం ముందటివరకూ ఏమీ తెలియకుండానే గడుచుకుంటూ,గడుపుకుంటూ
దాన్నే పొడిగిస్తూ,తెగ్గొడుతూ
అతికిస్తూ
ఎక్కడికెళ్ళాలో తెలియకుండానే ఇంకెక్కడికో మాత్రం వెళ్ళాలి
చదువుకునేవాడు నిర్మించుకునే ఆత్మకథల,వాచకాల మిగతా సగాల్లో ;తనకు తాను
పూరించుకునే ,నింపుకునే కవిత్వంలో -నిజమే సగమే కదూ ఇన్నాళ్ళు ఎవరైనా రాసి
కాగితాలకెత్తిందీ !
పూర్తిగా రాసినవాడెవడూ ఇంకా మిగిలే లేడేమో?!
వదిలేసే సగం కోసమే ఆ కాగితాల్లోకి జొరబడి ,అడుగిడి
పుటలై,ఇటులై,అటులై
సగమే నిజమని,సంపూర్తి అబద్దమని తేల్చేస్తారు
*
ఇటుకేసి రా !
ఈ సంపూర్తులనుండి విసుగొచ్చి ఆ సగంలోంచి ఈ పిల్లాడు
ఇంకో గదిలోకి ,ఒంటరి వొంటరిలోకి అద్దెకు వెళ్తున్నాడు.
భద్రతల్ని చెరసాలలుగా భావించే జీవితంలోంచి
ఆ సగం ఏమిటో తెలుసుకునే ప్రయాణం ఇప్పుడే మొదలయ్యింది చూడు !!
26.9.2013

ఇంకా ఇంకా ఇంకా ...


........................................
కొంచెం కొంచెంగా తరిగిపోతున్న రోజులలో
ఒక పక్కన ఒద్దికగా నడుస్తూ, చివరికిలా
కొంత మిగుల్చుకున్నాను
కలవరపెట్టే రాత్రి కలలలోంచి
నావైన కలలలోని కలలని వేరు పరచుకుని
నిదుర లేచాను. ఇక ఈ రోజంతా వాటి రహస్య గుసగుసలు నావెంట-
పొద్దుటి మంచును,పొద్దుటి ఇంటిని దాటివచ్చాను.
మనసును వొత్తిన ఈ దిగులును మాత్రం
వెంట తెచ్చాను;నిన్నటి సాయంత్రం సరాసరి నాలోకే ఒరిగిన కన్నీళ్ళలో
జీవితాన్ని తోడాను.
అవునులే !
ఎవరూ వోర్వరు,న్నిజంగానే నువ్విలా ఇంకా బతికే ఉన్నావని
తొందరగా పోరాదూ
నువ్వున్నప్పటి కంటే పోయాకే ఎక్కువగా ప్రేమించేవారి కోసం
ఇక మిగిలేందుకు – నీతో, నాతో-
కొంత మిగిలి ఉండేందుకు కాలం ఉంది. కవిత్వం ఉంది. బోలెడు అక్షరాలున్నాయి
కొంత ఓరిమితో ప్రయత్నిస్తాను.
ఎవరన్నారు జీవితం
అయిపోయిందని-

నా ఊరు తెలంగాణ !


......................................
నలనల్లని బంగారపుఖని సింగరేణి నా చిరునామా
ఇల్లెందు బొగ్గుబావులు,కొత్తగూడెం మైనింగ్ షాఫ్తులు
ఉగ్గుపాలు రుచిచూసినప్పటి నా నెలవులు.చుట్టుముట్టూ పరుచుకున్న అడవులు నన్ను సేదతీర్చిన నీటి మడుగులు.
ఆదివారం బొగ్గుబావుల సంతల్లో నేనమ్మిన కోడిపెట్టలు,చింతచిగురు కుప్పలు,ఐస్ క్రేట్లు; కారేపల్లి కిరాణా దుఖానాల్లో గుమాస్తాగా నేనమ్మిన సరుకులు, ఇంటింటికి పంచుకుంటూ తిరిగిన పత్రికలూ -నా ఆకలి తీర్చిన అమ్మలు.
పుట్టింది,తిరిగింది ,పరుగులు పెట్టింది,గొంతు చించుకుని గోడలమీద రాతలై మెరిసింది,ఊరేగింపుల్లో నినాదాలై రెపరెపలాడింది ఈ నేలమీదే!
రాత్రుల్లో కోల్పోయిన నిద్రలు,
కలవరింతలై ఉలిక్కిపడి లేపిన కలలు
వొత్తిగిలి పడుకున్నా దొరకని హాస్టల్ గదుల చోటులు
కిక్కిరిసిన గదుల్లో తోటిపిల్లల నిద్రముఖాలపై మారే కలవరపు రంగులు
బతుకును అనుభవంగా అనువదించుకుంది ఇక్కడే,ఈ తెలంగాణా నేలమీదే !
సెలవుల్లో ఆటలాడుకునే ఆనందమూ లేక అడుగు అడుగుకీ వెంటాడి వేధించిన దారిద్ర్యం; రెక్కలు ఆడటమే డొక్కలు నిండటానికి ఒకే ఒక్క మార్గంగా ఎదుట నిలబడిన బాల్యం;
ఎర్రటి ఎండను రామగుండం,గోదావరిఖనిల మధ్య మోస్తున్నా
ఐస్ క్రీమ్ బండి దొబ్బుతూ కిలోమీటర్లు,కిలోమీటర్లు తిరగాల్సిన కనికరం చూపని దైన్యం
అన్నీ ఈ నేల మీదనే !
అవును నిజమే !
ఈ దుర్భరత్వమే హక్కులకన్నా ముందు
ఆకలిని పట్టించుకోమంది.
కడుపుగోసనే ముందు చూడమంది .
కడుపుగోస తెలియనివాడు ఎన్నైనా మాట్లాడుతాడు
కాలం తీరిగ్గా దొరికినవాడు ఎన్ని వేషాలైనా వేస్తాడు
తెలంగాణ - నాయకుల మాటల్లోని మర్మం మాత్రమే కాదు ;
కడుపులు నిండని ఆకలి ఘోష.
కడుపునింపే కాలంకోసమే ఇలా ఈ నేల నోరువిప్పింది.
నేను ఇన్నాళ్ళు ఈ నేలమీద కాలూనుకోవడానికి
చేసిన బతుకు యుద్ధాన్నే
ఇప్పుడు తెలంగాణా తన యుద్ధంగా ప్రకటించుకుంది.
*పాతవాచకం,12.2.2009
3.11.2013

చూపు


......................
నీడల్లోకి ఆకుల్ని పంపుతోంది
తన రూపం వెదుక్కుంటూ చెట్టు
మర్రిమాను తననుతాను
బెరడ్లుగా రాల్చుకుంటోంది తన గతంలోకి
పారుతున్న నీళ్ళు
ఎంతకీ తమనుతాము పట్టుకోలేక విలపిస్తున్నట్టుగా
ఆ వాగునీళ్ళ చప్పుడు

వొంటరిగా ఎటోచూస్తూ తనకూ ప్రపంచానికి మధ్య
సందేశాల్ని బట్వాడా చేస్తున్నట్టు
మధ్య మధ్యలో మట్టల్ని కదిలిస్తుంది తాటిచెట్టు

ఊరంతా నిశ్శబ్దం ఆవులు,మేకలు,బర్రెలు
ఆ డొంకను దాటిపోయాక ;
కీచురాళ్ళే నయం మాటల్ని కోల్పోయిన మనుషులకంటే

మిగిలింది ;మిగుల్చుకోవాల్సింది ;ఎదురుచూడాల్సింది
ఇంకేం కనిపించడం లేదేమిటీ
ఈ మాగిన మరిగిన కంటికి,ఆ చిన్నప్పటి లేలేత కళ్ళకు కనిపించినట్లు
30.11.2013

ఒక సెలవుదినం ముగిశాక ...


.................................................
నిన్న మొలిచిన అపురూపమైన రెక్కలేవో హటాత్తుగా మాయమైపోయాయి. తెల్లారగట్ల నిద్రసుఖం చటుక్కున ఎటో కన్పించకుండా వెళ్ళిపోయింది. భయపెట్టే రోజు బలంగా మారి పిడిగుద్దులు గుద్దటం మొదలయ్యింది.

రోడ్లమీద గుంతల్లోంచి ,ట్రాఫిక్ సిగ్నళ్ళ నిర్దేశనంలోంచి
మీద మీదకు పరుగెత్తుకొచ్చే మనుషుల్లోకి వచ్చాక
ఒక వారపు యంత్రంలా ప్రవర్తించడం అలవాటైంది.

ఆఫీసు కిటికీలో రెక్కతెగిన పావురం ఒక ప్రతీక.
కట్టేసినా బొట్లు బొట్లుగా కారుతున్న నల్లా నీళ్ళశబ్దం మరో ప్రతీక.

అరుపులో,పిలుపులో తెలియనంతగా మారిపోయిన మాటల్లో
రోజంతా తప్పిపోయి ,అలాగే గడిపేయడం ;
రాత్రంతా గడిపిన కలలోంచి మచ్చుకు ఒక్క ఘట్టం గుర్తుకుతెచ్చుకున్నా
ఎంతకీ మరుపులోంచి తోడుకోలేకపోవడం ;
బహుశా సెలవు ముగిసిపోయిందని తెలిపే కొన్ని సైగలు.

రెక్కలేవీ ,ఎగరగలిగే భావననైనా లోపలే మిగిల్చే
ఆ తీరిక సమయపు అంత:స్వరం ఏదీ ;లోపల్లోపలే కెరలే సుతిమెత్తని ఆ జిగీష
ఏదీ ; సెలవు రోజున సేదతీర్చిన ఆ బద్దకపు పరవశం ఏదీ

సెలవురోజు ముగిసింది
మళ్ళీ ఆరోజుకోసం ఎదురుచూస్తూ
ఇప్పుడిలా ఎగరలేక ,ఎదగలేక వారమంతా ఎప్పట్లాగే యంత్రంలా మారిపోవడమే!
27.12.2013

ఇప్పటి ప్రవాసం


.................................
ఇంకెప్పటికీ వినకుండా ,కనపడకుండా
తప్పిపోయిన మాటలోంచి, నిన్నటిలోంచి, నీలోంచి, చట్రాల్లోంచి 
కాస్తంత కనుమరుగుగా అటూ ఇటూ కదలాలి

నిజానికి- అపజయం ఎంతటి విజయం !
నువ్వలా మండటం ఆగిపోయాక
నిన్నో మబ్బు కొంతసేపు సేదతీరుస్తుంది.
మబ్బుల్లోకి దూరి ఆ కూసింతసేపు విశ్రమించడం ఎంతటి అపురూప అనుభవం !

తెల్లారాక
కళ్ళముందు పుసిలా రాలుతున్న చూపుల్ని కడిగినట్లు
కడగగలిగామా ఈ లోకాన్ని.
బండరాయిలా అడుగుల్ని అడ్డుకుంటున్న రోజుల్ని
చితికిన బొటనవేళ్ళ గాయాల రక్తంతో
దాహం తీరుస్తూనే మునుముందుకు సాగిపోతున్నాం కదూ !

అరిగిపోయిన మాటల్నేవింటూ, అవే ఆవేశాల్ని
రోజంతా తింటూ అంతా ఒక కొలిక్కివచ్చేదాక
నిన్నటి వ్యూహాల్నే పత్రికల్లోకి,మీడియా గొట్టాల్లోకి వొంపడం చూస్తూ
సర్లే ! ఏం ఫర్వాలేదు. ఇప్పటికిలా ఒక బంద్ నో, ఒక రాస్తారోకోనో ,ఒక ధర్నానో
ఇవాళ కూడా అందరిమీదకు వలలా విసిరేద్దాం .
చిక్కుకుపోయాక కదా తెలిసేది చిక్కుల అసలు రహస్యం !

ఒకప్పటి ఆత్మన్యూనతంతా ఇప్పటి అసలు స్వరూపంగా
వెలికివస్తుంటుంది పదే పదే!
అదే నిజం; ముమ్మాటికి నిజం అదే !
22.1.2014

వర్తమాన గతం


...............................
ఎవరైనా ఇంకేం చేయగలరు?
కొన్ని పొడి పొడి సుఖాల్లోకి,దు:ఖాల్లోకి వొంపుకుని 
పొట్లాలుగా కిరాణాకొట్లలోంచి తెచ్చుకునే వస్తువుల్లా
తమని తాము
ఇంటికి తెచ్చుకోవడం తప్ప.

కొన్నిచోట్ల నిన్ను నువ్వే కొంతమంది మధ్యలో చూసుకుని
ఆరోజుకి అలా తృప్తిపడిపోతుంటావు కానీ, చివరికిలా
మిగిలేది నీకు నువ్వే !
నిన్ను నువ్వే వెంటాడుతూ,వెంటవస్తున్న జ్ఞాపకాల్లోకి
వెళ్తూ వస్తూ
కొద్ది
కొద్దిగా ఆరోజునలా జీవిస్తూ ఉంటావు.

ఇంకొద్దిగా కల; ఇంకొన్ని జ్ఞాపకాలు

వాగులో ఊట మాత్రమే మిగిల్చిన తడి ;ఎండిపోయాక
ప్రవాహం కలవరించే నీళ్ళ చప్పుడు.
రాలిపోయాక కాళ్ళకింద గరగరలాడుతూ ఆకులు చేస్తున్న
చప్పుడులో పత్రహరితపు కన్నీళ్ళ చప్పుడు .

జీవించడమే వర్తమాన గతం
కొన్నేళ్ళుగా సాగిస్తున్న ప్రయాణపు కొలమానం జీవించడం

ఎవరైనా ఇంకేం చేయగలరు?
కొంత తడి, ఇంకొంత పత్రహరితం గురించి
మాట్లాడటం తప్ప.
27.1.2014

నువ్వు వచ్చివెళ్ళాక


....................................
నువ్వొచ్చావని చెప్పాక గానీ తెలియలేదు నేను లేనని ;
నువ్వున్న స్థలంలో 
నేను లేను , నేనున్న కాలంలో నువ్వు లేవు
నేనొక దారిలోకి ప్రయాణం మొదలుపెట్టి,
ఇంకా అక్కడికి చేరుకునేందుకు
మధ్యన ఆగుతూ సాగుతున్నాను
నువ్వేమో నేను లేని శూన్యంలోకి ప్రవేశించావ్
..
కొన్నేళ్ళ క్రితం నువ్విప్పుడు బతుకుతున్న నేల మీదే
నేనూ బతికాను, నువ్వోచ్చావంటే నా నేల వచ్చినంత సంబరం.
ఆ సంబరం నిన్ను కలుసుకోలేనందుకు కోల్పోయానని
లోపల్లోపల అదనపు బెంగ.

అన్నీ బెంగలే
దూరంగా బతకడం బెంగ ; ఇన్నేళ్ళ తరవాత కూడా ఇక్కడే అని చెప్పుకోలేని బెంగ ; ఎంచక్కా ఆకాశం కింద ఆరబోసుకున్నట్లు జీవించలేకబోతున్నందుకు బెంగ ; జేబుల్లోనే కుదించుకుపోయిన బతుకు బెంగ ; ఇవాల్టిని రేపటిలోకి పొడిగించే బెంగ; మాటల్ని బిగబట్టుకుని ,లోపలే కుక్కుకుని వొళ్ళంతా ఒక యంత్రంలా మారిపోయిన బెంగ; దినదిన గండంలాంటి మనసులోని బెంగ

నేను లేను ,నువ్వు మాత్రం వచ్చి వెళ్ళిపోయావు కూడా !
అపుడపుడూ నాలోకి వొంపిపోయే ఊరిని
ఈసారి నీతోనే వెంటపెట్టుకు తిరిగెళ్ళిపోయావ్
మళ్ళీ ఎప్పటికో
నాలో ఆ సంబరం !
31.1.2014

అదెట్లున్నా...!?


.................................
నేన్నిన్ను ఇలా చూడలేనమ్మా
నువ్వెవరో తెలియని వీధుల్లోకి పంపి ; పలకరింపు ఒక్కటైనా లేని దారుల్లోకి తోలి
కొన్ని గదుల్ని, కొన్ని ఫ్యాన్లని ,ఆన్ చేసిన వో టి.వి.ని నీకప్పగించి
అన్నీ అమర్చాను కదా అని సంతృప్తి పడిపోతూ
మా పనుల్లోకి మేం
జారుకుంటూ
'నేనేమిట్రా' అన్నట్లు చూసే నీ చూపుల్ని తప్పించుకుంటూ
తిరుగుతూ విరుగుతూ
నేన్నిన్ను ఇలా చూడలేనమ్మా

ఊళ్ళో నీ అరుపులు , బండెడు చాకిరీ ,తన్నులుగుద్దులు . నిజంగా నువ్వు బతికిందీ , ఇంకా బతుకుతున్నదీ అక్కడే .
కష్టాల్లోనే జీవితముంది- అదెట్లున్నా ?!
సుఖమా - అదొట్టి ఖాళీ తిత్తి .
అక్కడేం లేదు.ప్చ్.డొల్ల .

ఊసుకున్నా ఉమ్ముకున్నా నీ ఇంట్లో ఇదేందని అడిగినోల్లు లేరు. లేచినా పండుకున్నా ఆరాంగా, హాయిగా . లోకమంతా నీడైనట్లు,నీదైనట్లు ; నీవే లోకమైనట్లు బతికినవ్ చూడు ; అదే జీవితం.
ఇదేంది : ఇక్కడ అన్నీ బోల్టులు ,నట్లూ బిగించిన గిర్రలాగా . నోటికడ్డంబెట్టి ఆపుకునే తుమ్ములాగా . అదుముకుని ఆపుకుని కొంచెం కొంచెం కొసరి కొసరి బతకడం.
దీనబ్బా ! ఇట్లుంటదా జీవితమంటే.

అమ్మా : నువ్వే కరెక్టు.
" ఎంత దుప్పటి ఉందో అంతే కాళ్ళు జాపాలి "
ఈ బతుకుల్నేమో దుప్పటి, కాళ్ళూ అసలు సమజతైనే లేదు.
26.2.2014

అదంతా జీవితమేనా ?


........................................
మనమెలా పెరిగాం .నలభై ఏళ్ళ కిందటి మాట అది ! కాలికి చెప్పుల్లేని,చేతికి వాచిల్లేని, కనీసం సైకిల్లేని బాల్యం అది . అవసరాలకు పైసల్లేని కాలం అది .అయినా మనమెలా పెరిగాం.
పెరిగామా .నిజంగానే చదివామా .అదంతా జీవితమేనా?
తలదిండు లగ్జరీగా నిలదీసిన రోజుల్లో
మన నిద్రలన్నీ నిజమైన నిద్రలేనా?
కనీసం ఒక్క ప్రేమైనా లేని యవ్వనకాలమంతా
వృధాపద్దుగానే జీవితం పుటలో రాసేద్దామా ?
రోజుల్ని తపనలతో నింపి,ఎదగడం,అందరిముందు ఒదగడం
మెట్టుమెట్టుకీ ఒద్దికగా నిలిచిన ఆ బాల్యమంతా వొట్టి శూన్యమేనా?
అయినా
మనమెలా పెరిగాం.
పంతుళ్ళని 'ఐదు వరహాల'తో ,పిల్లవాళ్ళని 'పప్పుబెల్లాల'తో
సంతృప్తి పరిచిన రోజుల్లో చదివిన చదువులు నిజంగానే ఏమీకానీ చదువులేనా?
దండించి చెప్పే చదువుల్లో నేర్చిన విద్యలు
జీవితాన్ని దండనగానే మిగిల్చిందా?
నడిచి నడిచి కాళ్ళ సత్తువకొద్దీ పరుగెత్తి పరుగెత్తీ
స్కూల్ బెల్లుకుముందే చేరుకున్న రోజుల్లో
హాస్టల్ పురుగుల అన్నంతో ఆకలిని జయించిన కాలాల్లో
ఏ విద్యాసక్తి మనసును నింపిందో !
చదువులతీరూ, పెంపకాలజోరూ కలిసికట్టుగా ఇన్నేళ్ళలో ఇచ్చిన తీర్పేమిటో !
తరగతి గదుల్లో తారుమారవుతున్న ఆసక్తులు
చివరికి ఆత్మహత్యల్లానో, అసహనపు వ్యక్తిత్వాలుగానో మారి
మర్యాదలు మన్ననలులేని మసకమసక రేపటిలా
ఉదయించడం లేదా?!
27.3.2014

అంత వీజీ కాదు !?


....................................
పైకి కన్పించకుండా బిగబట్టుకున్న కోపంతో కూడిన ఇష్టంతో
చాలా జాగ్రత్తగా గడిపెస్తుంటాను రోజుని.
ఏం ఫర్వాలేదు
నీ స్నేహాన్ని వాళ్ళు వంచించారు ;వంచనను
స్నేహానికి మరోముఖమని వాళ్ళు తేల్చేసారు .
ముఖంపైకి ఒకానొక అనుమానపురాత్రిని విసిరారు.
తుడుచుకుంటావో, లోపలికే తీసుకుంటావో నీ ఇష్టం.
కలిసి ఉండటం కష్టమే అయినా
కలిసే ఉండాలి,తప్పదు.
విడిపోవడం ఇష్టమే అయినా
ఇష్టాలన్నీ తీరుతాయా అంత వీజీగా !
అంత 'వీజీ'కాదు/అనుకున్నట్లు అన్నీ అలా అయిపోవడం.
కన్నీళ్లు ఉంటాయి ,దు:ఖాలుంటాయి ,మెరమెరలాడే సత్యాలుంటాయి
అన్నిటినీ వడగట్టి కొంచెంకొంచెంగానే
బతుకుని గ్లాసుల్లోకి వొంపుకుంటాం.
ఇది కూడా అంతే !
*
ఎవరో తలుపులదగ్గర
తచ్చట్లాడుతుంటారు సందేహంలో,సందిగ్ధంలో .
లోపలికి తోసుకువస్తారో లేదో తెలియదు.
కనుక్కోవాలి,అనుసంధానం జరగాలి,సంవాదం జరగాలి,
తుప్పుపట్టిన లోపలిని
మళ్ళీ సరికొత్తదిగా మార్చాలి.
విరిగి,పగిలి,చిరిగి,మిగిలినట్లు మిగిలి
చివరికి
కొన్నిమాటలుగా మీ ముందుంటాను.
విచిత్రం-
" ఆకాశంలో పాములు పాకుతున్నాయి.
భూమ్మీద చుక్కలు దాక్కున్నాయి"
[ ఒక ఇంగ్లీష్ సినిమా చూసాక ]
*9.4.2014

నా బతుకు కథ | యాకూబ్ - వల్ద్ - మొహమ్మద్ మియా

Memoirs


కవిత్వం ~ నన్ను వెంటాడుతున్న నా నీడ !*

[నా రెండవ కవితా సంకలనం 'సరిహద్దు రేఖ'కు రాసుకున్న నా మాటలు]

"... In my poems I could not shut the door to the street, just as I could not shut the door to love, joy, or sadness in my young poet's heart” -Pablo Neruda 'Memoirs'

గడ్డి కోసి రెండు కట్లమోపు మూడుకట్ల మోపు వేయడం తెలుసా? దుగాలమీద కాలు జారకుండా మోపు మోయడం తెలుసా? అరక దున్నడం తెలుసా? గొడ్లు కాయడం తెలుసా? పరిగేరడం తెలుసా? మంచెకావిలి తెలుసా? సందకావిలి తెలుసా? మొరం మోయడం తెలుసా? కూలిచేయడం తెలుసా? అరబస్తా వడ్లు ఆరు కిలోమీటర్లు దించకుండా మోయడం తెలుసా? ఊడుగుమండలు కొట్టడం తెలుసా? ఆ మోపు మోయడం

తెలుసా?

జొన్న కోయడం తెలుసా? మొట్లకెల్లి ఆవులురికితే తిప్పకరావడం తెలుసా? నీళ్లు పెట్టడం తెలుసా? చేపలు పునకడం తెలుసా? జొన్నన్నం తిని అరిగించుకోవడం తెలుసా? గటక తెలుసా? గంజి తెలుసా? ఎర్రకారం తెలుసా? రేగ్గాయలు ముళ్లకంపలోంచి కోయడం తెలుసా? జొన్న ఊసలు తెలుసా? దుగం చెక్కడం తెలుసా? నారు వేయడం తెలుసా? వాగులో దూకి కట్టెలు ఒడ్డు చేర్చడం తెలుసా? కాలివేళ్ళ పొట్టలు పగిలితే ఒంటేలు పోసి తగ్గించుకోవడమంటే తెలుసా? గజ్జికి వేపాకు, బర్రెరొచ్చు రాసుకోవడం తెలుసా? బి.సి. హాస్టల్లో పురుగులన్నం తెలుసా? బువ్వంటే తెలుసా? అరటిపండు తొక్క ఎనక పళ్లతో గీకి ఆకలి తీర్చుకోవడం

తెలుసా?

సారాకొట్టు ఉమ్ములమధ్య బతకడం, కిరాణాకొట్లో గుమాస్తాగిరి, సేటుకొట్టే చెంపదెబ్బలు, ఇళ్లు ఊడ్చి అన్నం అడగడం తెలుసా? సిన్నప్పుడు భుజమ్మీద ఐస్‌క్రేట్ డబ్బా మోస్తూ ఎర్రటెండలో ఐదు రూపాయలు సంపాయించిన వాడి గురించి, ప్రేమనెట్టా తెలియబర్చాలో తెలియని అమ్మానాన్నల కరుకుమాటలు, తిట్లూ, బూతుల మధ్య ప్రేమను ఎతుక్కోవడం, బతికున్నడో లేదోనన్నంత.. కాళ్ళతో, రాళ్ళతో, తాళ్ళతో, ముంతపొగల్తో దండించే వారి కసిలోని అజ్ఞానం గురించి తెలుసా? అరల్లో పేర్చుకున్న పుస్తకాల్ని చూసి అమ్మి డబ్బులివ్వమని అడిగే అమాయకపు అమ్మల గురించి తెలుసా? కోళ్ళగంపతోనో, చింతచిగురుతోనో, బుడంకాయలతోనో అమ్మ సంతకెలుతుంటే ఎనక తట్టలు మోస్తూ సంతంతా అదిరిపోయేట్లు అరిచే పిల్లాడి 'చవుక చవుక’ అరుపులు

తెలుసా?

ఏ కులమో, ఏ మతమో తెలియని అమాయకత్వపు పెంపకం గురించి తెలుసా? ఈద్గాల దగ్గర తప్పిపోయి కౌడుపడ్డ గరీబు కుర్రాడి చిల్లర పైసల శోధన గురించి తెలుసా? సదువు కోసం పదిహేనేళ్లకే ఇల్లువిడిచి పల్లెవిడిచిన వాడి గురించి తెలుసా? పేపర్‌బాయ్‌గా ఇంటింటికి తిరుగుతూ 'ఎవరైనా పిలిచి ఇంత చాయ్ పొయ్యరా?' అని ఆశగా చూసే పిల్లాడి గురించి

తెలుసా?

ఫీజులు తగ్గించమని అర్ధరాత్రులు గోడలకు పోస్టర్లంటించిన వాడి గురించి తెలుసా? పోలీసుల దెబ్బలు తెలుసా? హాస్టల్ సీటు కోసం కాళ్ళా వేళ్ళా పడ్డవాడి గురించి తెలుసా? విద్యార్థి ఉద్యమాల గొడవల మధ్య రక్తమోడడం తెలుసా? ఫీజుల డబ్బుల కోసం గోదావరిఖని రామగుండం రోడ్లమీద మండే ఎండల్లో చల్లని 'తాజ్ ఐస్‌క్రీం'లు అమ్ముతున్న పిల్లాడు

తెలుసా?

‘ఒరే ఫ్రెండూ ! అప్పివ్వమని, ఓ స్నేహితుడా! ఒక చొక్కా యివ్వమని' అడుక్కుంటూ తిరిగినవాడి గురించి తెలుసా? పాటలవరసలతో కంజీర దరువులతో గొంతెత్తిన ఉద్యమగాయకుడి గురించి తెలుసా? సింగరేణీ యూనియన్ ఆఫీసులో అర్ధరాత్రులు ఒంటరిగా భయం భయంగా గడిపిన ఆఫీసుబాయ్ గురించి తెలుసా? ఆదరించి డిగ్రీలు చదివించిన అమృతమూర్తుల ఆదరం గురించి తెలుసా? పాటలు విని అన్నంపెట్టి కడుపు నింపిన అమ్మల గురించి

తెలుసా?

ఉద్యోగంలో కుదురుకోవడానికి ముప్ఫై ఆరేళ్ళు పైగా పట్టిన ఒక అనామకుడి గురించి చిన్న ఆధారాన్నైనా వదలుకుండా సైబరుకాలంలో గిద్దె, అరసోలెడు, సోలెడు, తవ్వెడు, మానిక, కుంచం అని ఇంకా వేళ్ళూ లెక్కపెట్టుకుంటున్న వాడి ఊరిదనం గురించి తెలుసా? కళ్ళిప్పగానే పేడరొచ్చు, బీదవాసన కంటపడినవాడి గురించిఒళ్ళొంచి పని చేస్తూ బాధ్యతలు మోస్తున్నవాడి గురించి

తెలుసా?


తీరిక లేనిదంతా జీవితమేమిగిలిన ప్రతిసగం కోర్కెలోఅసలైన జీవితం మనలో తెలియకుండానే లోపలే మిగిలి ఉంటుందేమోఆ సగమే సెగకవిత్వం ఆ సెగలోంచే శిరసెత్తిమాట్లాడుతూ ఉంటుందేమో!!

తెలుసా?

** * 

Memoirs :నా బతుకు కథ : 'యాకూబ్ /వల్ద్ మొహమ్మద్ మియా ' 

నేను అనే వాడిని ఏ తారీఖున పుట్టానో ఖచ్చితంగా చెప్పలేను .నేను చదువుకున్న చిన్నబడి దోస్తులేమో 64 లోనో,63 లోనో పుట్టమంటారు.నేను మాత్రం 62లో పుట్టానని మావూరి బడి రికార్డు. నేను పుట్టిందెప్పుడో తనకు తానే ఊహించుకుని ,అనామతుగా రాసేశాడు మా కోటయ్య సార్ !పుట్టింది రొట్టమాకురేవు. డోర్నకల్ నుంచి కొత్తగూడెం వైపు వెళ్ళే రైలుకట్టకు దగ్గరిలో కారేపల్లి కి వెళ్ళే దారిలో ఉంది. పట్టుమని యాభై ఇళ్ళు కూడా వుండవు.మా ఊరంతా కోయవాళ్ళే! కోయోళ్ళు,అని దొరసొట్టపోళ్ళు అనే చిన్నప్పట్నుంచి వింటున్నది.ఆ వూరికి నేను పుట్టడానికి ఐదేళ్ళ ముందు అమ్మానాన్న ,వాళ్ళు మోయగలిగినంత సామాన్లతో వచ్చారంట-మా అన్నను చంకనెత్తుకుని. ఆ తర్వాత ఖాజా అని నాకంటే ముందు పుట్టి,కొన్ని రోజులకు చనిపోయిండు.ఆ వూరు నాన్నవాళ్ళు రావడానికి బొర్ర రామక్క కారణమంట.!ఆవూరు వాళ్ళు కూలీనాలీ చేసుకోవడానికి చుట్టుపక్కల ఊళ్లు -కారేపల్లి [ఇంకో పేరు సింగరేణి -రెవెన్యూ రికార్డుల్లో ఇదే ఉంది],పేరేపల్లి,గేట్ కారేపల్లి,ఇంకాస్త దూరంగా పదిహేడు కిలో మీటర్ల దూరంలో ఇల్లందు [సింగరేణి కాలరీస్/బొగ్గుట్ట]వెళ్తుండేవాళ్ళు.అలా కూలికి వెళ్ళిన బొర్రరామక్క మా నాయినను ఆ రోజుల్లో చేస్తున్న తాపీ పని దగ్గర చూసి, 'ఓ సాయిబూ ! ఓ తమ్ముడా ! ఇన్ని కష్టాలు ఏడబడతావుకానీ ,మావూళ్ళ చిల్లర కొట్టు పెట్టుకొమ్మని'సలహా చెప్పిందట.ఆ విధంగా మకాం రొట్టమాకురేవుకు మారింది.ఉండటమెట్లా? కుంజ రామయ్య గొడ్లకొట్టం లోని ఒక పంచన మాబీర పొరకతోటి దడి కట్టుకుని ఉండమన్నాడు.

*మా నాన్న [మేం 'అబ్బా' అని పిలుస్తాం] పుట్టింది మానుకోట దగ్గర చినగూడూరు,వరంగల్ జిల్లా. ఐదుగురు అన్నదమ్ములు,ఒక అక్క -అందర్లో చిన్నోడు. అక్క బిడ్డతోనే మొదట పెళ్లి విడాకులు గూడ అయినయి. మా నాన్న చిన్నప్పట్నుంచి జీతం చేసేటోడు. ఆయన మాటల్లో విన్నది ఎక్కువగా జీతం చేసింది మడికొండ వెంకయ్య దగ్గర అని. కొంత వయసొచ్చినంక చింతపండు,మిరపకాయలు నెత్తినబెట్టుకుని ఊరూరా తిరిగి అమ్మడం ,అలా కారేపల్లి ఒకసారి రావడం మా తాత కరీం సాబ్ ను కలవడం, అలా మా అమ్మతో పెళ్లి [ఆమెకు కూడా మొదట పెళ్లై, ఆతర్వాత విడిపోవడం అయిపొయింది]జరగడం ,మళ్ళీ కొత్తగా జీవితం మొదలు పెట్టడం అదో పెద్ద కత.*రోట్టమాకురేవుల దుకణం. ఎట్లా మొదలెట్టాలే అని కారేపల్లిల ఎర్ర పుల్లయ్య కిరాణా దుకా ణానికి వెళ్లి అప్పుపెట్టమని అడిగిండంట-ఆయనేమో ఒప్పుకోలేదు ముందుగాల -మా అమ్మ తరుపోళ్ళు కూడా జమానతు ఉండమంటే ఉండలేదంట. అప్పుడు తన వెండి దండకడియం ఆయన దగ్గరే కుదువ బెట్టి -బీడీ కట్టలు,బెల్లం,మసాలాలు,పుట్నాలు,బొంగుపేలాలు ,పువ్వాకు -ఇట్లా చెడ్దరమడ్డర సామాన్లు కొనుక్కొచ్చి ,దాన్లో కొంత మా అమ్మ దగ్గర అమ్మడానికి బాధ్యతపెట్టి, మిగిలినవి గంపల వేసుకుని ఆ వూరు చుట్టుమట్ల ఉన్న -చీమలోరి గూడెం,అనంతారం,రేగుల గూడెం,పూసంవోళ్ళ గుంపు ,ముత్రాసి గూడెం-రోజులో ముప్పై కిలోమీటర్లు తిరిగి అమ్ముకొచ్చేటోడు.మధ్య మధ్యలో నాట్లకు, జొన్న చేలు,కందిచేలు కోతలకు వెళ్ళేటోడు.మా అమ్మా వెళ్ళేది.కొన్నాళ్ళకు నెత్తిమీది గంప కిందికి దించి ,కావిడి భుజానికి ఎత్తుకున్నాడు.రోజురోజుకి యాపారం పెంచిండు.కావిడికి ఒకవైపు కిరాణా సరుకులు,మరో వైపు తినేటివి- మిర్చి బజ్జీలు,అరిసెలు, కారపుసుట్లు,పకోడీ,-నింపుకుని పొద్దున్న చీకట్లో వెళ్లినోడు,రాత్రి చీకటిపడ్డంక వచ్చేటోడు.ఆ రోజుల్లోనే నేను పుట్టాను.

[ఇంకా ఉంది]* 

Memoirs - 2

తొలి జ్ఞాపకం ~

మా అమ్మ కాన్పు చేసిన మంత్రసాని ఇరుప[బొడ్రాయి] అచ్చయ్య భార్య -ఈమె కుంజ రామయ్య అక్క- రాత్రంతా నెప్పుల్తో మా అమ్మ ఏడుస్తుంటే ,"ఏం వదినో! మొగుడితో ......కున్నప్పుడు ఆలోచించుకోవాలె,ఇప్పుడేడిస్తే ఏ లాభం'' అని మోటుసరసం ఆడుకుంటా ,మంచం పక్కనే చుట్ట కాల్చుకుంటూ ,బొడ్డుకోసే లిక్కిని పదును పెట్టుకుంటూ ఉందంట.తెల్లారగట్ల ఎప్పుడో పుట్టానంట.అన్ని నొప్పులు బరించిన మా అమ్మ -ఇప్పటికీ సందు దొరికినప్పుడల్లా దెప్పుతుంది-'నిన్ను కనడానికి సచ్చి బతికానని'.కనడం పూర్తయ్యాక అమ్మకు మా వూళ్ళో కాసే ఇప్పసారా కొద్దిగా పట్టించి , స్నానం వావిలాకు వేసి కాచిన నీళ్ళతో చేయించి మా ఊళ్ళో వాళ్లకి నన్ను చూపించిన్రంట.వాడే వీడు !'యాకూబ్ /వల్ద్ మొహమ్మద్ మియా ' వల్ద్ అంటే s/o అని అర్థం.

కళ్లిప్పగానే నేను చూసిన మొదటి దృశ్యం ,బహుశా కుంజ రామయ్య గొడ్లకొట్టంలోని పేడరొచ్చు, బొంయ్ మనే ఈగల గుంపు,చుట్టుముట్టే దోమలు,చుట్టూతా కట్టిన తడికె అయ్యుండొచ్చు.లేదా కిరసనాయిలు సీసాలో పోసి ,గుడ్డ వొత్తితో వెలిగించిన గాలికి రెపరెపలాడే బుడ్డి దీపపు తిర్రు కావొచ్చు.తడికకు తగిలించిన పాత గొనె సంచి అయినా అయ్యుండొచ్చు.

విన్న మొదటి శబ్దం - దోమలవల్ల గొడ్లు విసురుకుంటున్న తోకల చప్పుడో, చింతచెట్ల మీది పిట్టల కూతలో, దూరంగా రైలుపట్టాల మీది గూడ్స్బండి చప్పుడో, పక్కనున్న గుడిసెల్లో మొగుడూ పెళ్ళాల తగువుల్లో గుభిక్ గుభిక్ మనే తన్నులాటల,తిట్ల పురాణమో అయి ఉండవచ్చు.లేదా మా అమ్మానాన్నల భీకరమైన తగువులాట తర్వాత పొంతపొయ్యి దగ్గర అమ్మ ఎడతెగని సుదీర్ఘ ఏడుపు అయినా అయ్యుంటుంది.

చాలామందికి మల్లే,శుభ్రంగా అమర్చిన పుస్తకాల అలమరాలో,నిత్యం వచ్చిపోయే సాహితీమిత్రుల సందడో,ముచ్చటించే తల్లిదండ్రుల సాహిత్య సందోహమో ;లేదా అమ్మమ్మ తాతయ్యల,నానమ్మ తాతయ్యల ఒళ్లో కూచుని వినే గాధల కోలాహాలమో-కంసేకం..వేలుపట్టుకుని నడిపించే ఒక్కటైనా ఆసరా చేయికూడా లేని వాతావరణం.

బురద.బురద..కాలు తీసి కాలు వేస్తే అంటుకునే బురద.గాబు దగ్గర నీళ్ళు చేరి వాకిలంతా బురద. గొడ్లకొట్టం రొచ్చు బురద.బురదలో జననం.నామీద నేనే జోక్ వేసుకునే మాట - ఎక్కడ పుట్టావు అంటే 'బురద'లో అని.'పంకజాన్ని' అని.

*ఊహ తెలుస్తున్నకొద్దీ అమ్మానాన్నల రెక్కలు ముక్కలు అవుతుండటం అర్థమవుతూనే ఉంది. వాళ్ళుపడే కష్టంలోంచి ఎగదన్నుకొచ్చే అసహనం వల్ల నిరంతరం ఇద్దరిమధ్య గొడవలు. తన్నులాటలు,గుద్దులాటలు,తిట్లు,బూతులు,చిరాకులు,చీకాకులు,ఏడ్పులు,పెడబొబ్బలు,ఉరుకులు,గుంజులాటలు,గింజుకోవడాలు -ప్రతిరోజూ రమారమిగా ఇలానే ఉండేది.అయినా వాళ్ళిద్దరిని కలిపిఉంచిన ఏకసూత్రత ఏమిటో ఇప్పటికీ చెప్పడం కష్టమే !

24.9.2013[ఇంకా ఉంది]* 

Memoirs - 3 

మా ఊరిపక్కనే బుగ్గవాగు పారుతుంది. దాని గురించి కొంత చెప్పాలి.ఇల్లందు వైపునుంచి ,అటువైపు ఉన్న అడవుల్లోంచి వస్తుందది. ఎండాకాలం మాత్రం పారదు. మడుగులు మడుగులుగా అక్కడక్కడా నిలిచి ఉంటుంది. దాన్ని చూడాలంటే వర్షాకాలమే చూడాలి. బుగ్గొచ్చిందంటే ఒకటే సందడి. కట్టెలు కొట్టుకొస్తుంటాయి. వాటిని తీయడానికి ఊళ్ళోని చిన్నోళ్ళు,పెద్దోళ్ళు వాగులోకి దూకడం-మొద్దులు,దూలాలు,పొయ్యిల కట్టెలు -ఒడ్డుకి లాక్కురావడం ,ఒక దగ్గర అద్దలు పెట్టడం.ఇదే పని.! అపుడపుడూ గొడ్లు,బర్రెలు,మేకలు చచ్చిపోయినవి కూడా కొట్టుకుపోతూ కన్పించేవి.

చాయ్ లాగా ముదురు ఎరుపులో ఉండేవి నీళ్ళు.అక్కడక్కడ సుడ్లు తిరుగుతూ ఒడ్లను వొరుసుకుంటూ పారేది బుగ్గవాగు. చూస్త చూస్తనే పెరిగేది. ఊళ్లదాక వచ్చేవి నీళ్ళు.నీళ్ళలో కొట్టుకుపోతున్న పాముల ముట్టెలు పైకి కన్పించేవి. వాగులోకి బయటినుంచి ఉన్న ఒర్రెలు,వాగు నిండిన రోజుల్లో నీళ్ళు ఒర్రెలవైపుకు ఎదురు తన్నేవి. ఈ రోజుల్లోనే కొత్త నీళ్ళకు చేపలు ఎదురెక్కేవి. వాగు గుంజినాక ,తరవాత వాగును చూస్తే అక్కడక్కడా కట్టెలు చెట్ల పొదలకు చిక్కుకుని ఉండేవి. ఊళ్ళో జనమంతా బుగ్గ వాగు వెంబడే తిరుక్కుంట ,కట్టెపుల్లల్ని ఏరుకుంటూ తిరుగుతుండే వాళ్ళు. ఎన్ని కట్టెలు దొరికితే ఆ సంవత్సరానికి పొయ్యిలకట్టెలు అన్ని జమ అయినట్లు.ఇంకొందరేమో ,ఒర్రెలల్ల 'మావులు' పెట్టేటోళ్ళు. మా ఊరిల 'మావు'లు ఆరెం ముత్తయ్య, ఊడుగు పగిడయ్య దగ్గర ఉండేవి. మిగతా వాళ్ళేమో పంచెలు,చీరెలనే రెండు చేతులతో చెరో వైపు పట్టుకుని నీళ్ళలో దొన్నెలాగా వేసి, పట్టుకునే వాళ్ళు. పైనుంచి ఒక మనిషి నీళ్ళలో దిగి చప్పుడు చేసుకుంట,నీళ్ళను కల్లి కొంటుకుంటూ ఈ దొన్నేలవైపు చేపల్ని మళ్ళించేటోడు. అలా ఒక్కసారే ఆ దొన్నెను పైకెత్తితే ,అందులో అప్పుడు చూడాలి- ఎగురుకుంటూ కొర్ర మట్టలు,చందమామ చేపలు,ఉల్లేసులు,బుడ్డ పరకలు,పాము చేపలు,బొమ్మిడీలు,రొయ్యలు,ఎండ్రకాయలు-ఇలా ఒకటేమిటి! చేపల ప్రపంచం అంతా అక్కడే కన్పించేది. ఎప్పుడో గాని పెద్ద పెద్ద చేపలు పడేవి కావు . అన్నీ ఒక మోస్తరు చేపలే !

ఆ రోజంతా పొద్దు దిగేదాకా వాగులో,ఒర్రెల్లో తిరిగి చేపలు పట్టుకుని ఇళ్ళకు చేరుకున్నాక,కొందరేమో తెచ్చిన చేపల్ని బండలమీద తోమి,ఎండేసుకునేవాళ్ళు. కొందరేమో ఆ రోజుకే చేపల పులుసు పొయ్యిల మీద ఎక్కించుకునేటోళ్ళు. ఆరోజు మా చిల్లరకొట్టు దగ్గర చింతపండు కోసం,మంచినూనె కోసం,ధనియాల కోసం సందడిగా ఉండేది. చేపల ముచ్చట్లే ఆ రోజంతా.! ఊరంతా పుల్ల పుల్లని ఆవిర్లతో చేపల పులుసు కమ్మని వాసన.చేపల పులుసు, జొన్నన్నం లేదా జొన్న గటక, + ఇప్పసారా ;ఇదీ మావూరి ఫేవరేట్ వంట.విందు.

వాగు వచ్చిందంటే ,కేవలం రావడం,పోవడం మాత్రమే కాదు. అది ఊళ్లోకి చేపల పండుగను తెచ్చేది.మా అమ్మ రాత్రి చాలా పొద్దు పోయ్యేదాక పొయ్యిమీదినుంచి చేపల కూర దించేది కాదు,పిల్లలం చూసి చూసి నిద్రపోయేటోల్లం. మేల్కొని ఉన్నోళ్ళు ఆ రాత్రికి తిన్నా ,పొద్దున్నే జొన్నన్నంలో ఇంత పులుసు, రెండో మూడో చిన్ని చేపలు వేసి పెట్టేది అమ్మ. రాత్రి వొండిన చేపల కూర పోద్దుటికే బాగుంటుందని మా అమ్మ థియరీ. నిజమే ,పొద్దున్న చేపల కూర అంత బాగుండేది.ఆ బుగ్గవాగు, చేపల వేట,కట్టెల కోసం వెతుకులాట- అదొక పదచిత్రంగా ఎప్పుడూ మనసులో మెదులుతూ ఉంటుంది.

25.9.2013[ఇంకా ఉంది ]* 

Memoirs - 4

మా ఊరు ,బుగ్గవాగు ఈ రెండూ ఒకదానినొకటి పెనవేసుకుపోయాయి. రెంటినీ విడదీసి చూడలేం. వాగులోంచే కావిడ్లతో ,మట్టి కుండలతో ఇంటి వాడకానికి నీళ్ళు రోజూ తెచ్చుకునేది. ఇసుకల చెలిమలు తీసి ,కుండల మూతికి గుడ్డకట్టి కొబ్బరి చిప్పలతో నీళ్ళు చేది ,బుంగలు నింపుకుని తెచ్చుకునేటోళ్ళం. బట్టలు ఉతకడం,తానాలు చెయ్యడం-అన్నీ వాగులోనే !

వాగులో ఇసుకమేటలు,వాగులో గంతులేసే కప్పలు,చేపలు,వాగుతొర్రల్లో కాళ్ళు బయటపెట్టే ఎండ్రకాయలు[ఎండ్రకిచ్చలు],మధ్యమధ్యలో బండలు ,ముళ్ళ చెట్లు,తుంగ గుబురులు -ఒడ్డుమీదనుంచి వాగులోకి వొంగిన చెట్లు,చెట్లకు అల్లుకునే తీగెలు,వేలాడే పిట్టలగూళ్ళు,అక్కడక్కడా పుట్టలు,అటు ఇటు తిరిగే పాములు,తేళ్ళు,ముంగిసలు,ఉడుములు,ఎగిరే పిట్టలు-పుల్ల కోళ్ళు,కోయిలలు,గువ్వలు,పురేడు పిట్టలు,కంజులు,గుంపులుగా ఊరపిచుకలు,తెల్ల కొంగలు - వాగులో ఈతలు,పెద్దబండ మడుగులో బండమీంచి నీళ్ళలోకి దూకడం ;ఎండాకాలం మడుగుల్లోకి దూకి కింద ఉన్న చల్లటి మట్టిబురదలోకి దూరడం, నీళ్ళలో మునిగి ఊపిరినిలిచినంతసేపు ఉండటం - జ్ఞాపకంలోని నలగని నెమలీక.

ఎండాకాలంలో పగళ్ళు ఇసుక ,నీళ్ళు కాలుతూ ఉండేవి.ఒకవైపున బర్రెలు,మరోవైపు పిల్లలు ,పెద్దలు చెట్ల నీడపడుతున్న మడుగులదగ్గర ఉండేవాళ్ళం. రాత్రయ్యాక వాగు దగ్గర అదేమిటో కమ్మని నెయ్యివాసనలా వచ్చేది.అలా ఎందుకో ఇప్పటికీ అంతుపట్టదు. రాత్రి వాగుమీద నుంచి చల్లనిగాలి. ఊళ్ళో వాకిట్ల పడుకుంటే ,చలికాలం చలిలా ఉండేది.పైన ఏదో ఒకటి కప్పుకునేదాకా ఆ చలిగాలి ఊరుకునేది కాదు.

ఒకసారి వాగు వచ్చినప్పుడు ,నేను గూడ నా దోస్తు ఇరప రాములుతో కలిసి వాగుల కట్టెలు తీయడానికి పోయిన.ఊళ్ళో వాళ్ళు అక్కడక్కడ ఉన్నరు. కట్టెలకోసం దుమికి ఒడ్డుకు తెస్తున్నరు.అద్దలు పెడుతున్నరు. రాములు ,నేను దూరంగా కొట్టుకొస్తున్న పెద్ద దూలాన్ని చూసినం. మేమిద్దరం దాన్ని ఎట్లైనా తీయాలని వాగు ఎగువకు ఉరికి,దూకినం.మాకప్పుడు 12 ఏండ్లే ! తోలెమోళ్ళ మామిడి చెట్ల దగ్గర దూకినంక ,దూలాన్ని పట్టుకున్నం. నీళ్ళ తాకిడి ఎక్కువగ ఉంది.పెద్దబండ దగ్గర రాములు కట్టె వదిలిపెట్టి,నీళ్ళు మింగిండు. ఎట్లనో ఒడ్డుకు చేరిండు. నేనేమో చినచిన్నగ దాన్ని ఒడ్డువైపుకు తోస్తున్న. నీళ్ళ ఒత్తిడికి అలిమికాలె. అసలు ఒడ్డు చేరాల్సింది పెద్దబండ దగ్గర్నే. అది దాటింది. ఇంకొంచెం ముందుకు పోయిన.అక్కడ ఒడ్డుకు చేరడం కష్టం.అది కూడా దాటింది.

ఒడ్డునున్న వాళ్ళు చూడనే చూసిన్రు. ఒకటే అరుపులు'యాకూబ్ కొట్టుకుపోతున్నడని. ఆ సందడికి ఊళ్ళో వాళ్ళంతా వాగు ఒడ్డుకి జమైండ్రు. వొడ్డుమీద ఉరుకులు.అరుపులు.మా అమ్మ ఏడుపు.నేనేమో నీళ్ళలో ముందుకే పోతున్నా. నల్లవాగు మడుగు దాటిన. రైలు కట్ట బ్రిడ్జి మడుగు దాటిపోయిన. ఇరప వెంకటి, ఆరెం రాగోలు ఆడ వాగుల దున్కిన్రు. ఆడ తర్వాత వాగు వొంపు తిరుగుద్ది. ఆ వొంపుకాడ వొడ్డుకు చేరడానికి అలిమి ఆయ్యిద్ది. నీళ్ళల్ల ఎంత బలమున్నోడు కాని, కొద్దిసేపయినంక ఒంట్ల సత్తువ కరిగిపోద్ది. ఎట్లనో ఆ వొంపుల వొడ్డుకు దూలాన్ని చేర్చిన. చెట్టు వేరును ఒక చేత్తోపట్టుకున్న, దూలాన్ని కాళ్ళ మధ్యన ఒడిసిపట్టుకున్న. ఇంతల ఇరప వెంకటి, ఆరెం రాగోలు అందుకున్నరు. ముగ్గురం కలిసి వొడ్డుకు చేర్చినం.వాగు తగ్గినంక ఆ దూలాన్ని ఇంటికి తేవడానికి ఎడ్లబండి అవసరమొచ్చింది. దానిమీదికి ఎక్కించడానికి ఎనిమిదిమంది అవసరమైన్రు. అంత పెద్ద దూలం మరి !

వొడ్డుకు చేరినంక మా అమ్మ ఒకటే ఏడుపు, శోకాలు. మా ఊరోల్లంత ఒకవైపు తిట్టుకుంటనే,మరోపక్క మెచ్చుకునుడు. 'ఎట్ల తీసినవ్ రా యాకూబ్ 'అని. కట్టెలు తీయడం సరదా అట్లా తీరింది. ఇప్పటికీ మా సోపతిగాల్లు ఆ ముచ్చట అపుడపుడు గుర్తుచేస్తరు.ఆ తర్వాత మా అబ్బా ఆ దూలాన్ని వడ్లోల్ల దగ్గరికి రేగులగూడెం తీసుక పోయి, ఒక మంచం,ద్వారబంధం చేయించిండు. ఇప్పటికీ ఊళ్ళో అయి ఉన్నయి నాకు ఆనాటి రోజును గుర్తుచేసుకుంట.!

27.9.2013* 

నా బతుకు కథ : Memoirs -5


మా ఇంట్ల ఒక చిన్న అర్రల కొట్టు/దుకనం. రాత్రంతా మా అమ్మ జాగారం చేసి ,పొయ్యి కాడకూచుని తయారుచేసిన కారపుచుట్లు,మిర్చీలు,బొంగుండలు,పకోడీలు,అరిశెలు-అన్నీ తినేటివి కావిడి తట్టలో ఒకవైపు, మరోవైపు తట్టల చిల్లర సామాను వేసుకుని -అటు ఇటు కలిపి 70,80 కిలోలైనా బరువు ఉండేది- బేరానికి పోయేటోడు. అమ్మ చేసే ఆ పిండివంటల్లో విరిగిపోయిన అరిసెలు, మిగిలిపోయిన చూర తినడం కోసం మా పిల్లలవి. !


ఇంకా ఏమన్నా ఎక్కువ సామాను ఉంటే మా అన్నో,నేనో,లేకపోతే ఇంట్ల చిన్నపిల్లల్ని ఎత్తుకోవడానికని మా అమ్మ పిలిపించుకుంటే వచ్చే మా పేరేపల్లి అమీనా పెద్దమ్మ కూతురు మా చాంద్ బీ అక్కో ఆయనెంబడి తలమీద ఎత్తుకుని పోయేటోళ్ళం. మా అబ్బా నడక జింకలాంటి నడక. ఆయనెనక ఎవుడైనా ఉరుక్కుంట నడవాల్సిందే. పొలాల దుగాల మీద, కందిచేన్ల గట్ల మధ్యన ,జొన్నచేల చీరుకుపోయే కొమ్మల మధ్య రాసుకుంటూ, చిన్న దారెంబడి కాళ్ళకు గుచ్చుకునే రేగుముళ్ళు,గడ్డిముళ్ళు,పల్లేరుగాయలు -కాళ్ళు చేతులూ నెత్తుర్లు కారాల్సిందే !


చలికాలం సూసుకో నా సామిరంగా ! చలి.గడ్డకట్టించే చలి. చేలు దాటేలోపు మంచుకు ముద్దముద్దయి పోవాల్సిందే ! అట్టా మా అబ్బా ఎంబడి మేం అనంతారం దాటి,రేగుల గూడెం ఊళ్లకు పోయేదనక ఎవళ్ళు కూడా లేవకపోదురు. లేసుడేంది, అపుడే కోళ్ళు కూస్తుండేవి. అక్కడక్కడ 'ఇగ లేవరాదురా- సాయిబు రానే వచ్చిండు' అని విన్పిస్తుండేది. ఊళ్లల్ల తలో రకంగా పిలిసేటోళ్ళు. తురక సాయిబు అని, కావిడి సాయిబు అని, తురకాయన అని, ఒకరిద్దరు మాత్రం 'మొమ్మదో' అని పిలిసేటిది.


రేగులగూడెం పోయినంక కావిడి దింపుకునేది చుంచ ఈశ్వరమ్మ ఇంట్ల. ఆమె మొగుడేమో మావూరు చుంచ ముత్తయ్య కొడుకు.చుంచ లక్ష్మయ్య . ఇల్లరికం పోయి అత్తింట్లనే ఉన్నడు. ఆడికిపోయినంక కట్టెల పొయ్యి రాజేసుకుని, రాతెండి గిన్నెల బెల్లం,చాయ్ పత్తా[ఆ రోజుల్ల చిన్న పొట్లం ల ఉండేది] ఏసి, మరగనిచ్చి,మరగనిచ్చి ముత్రాసోల్ల ఇంట్ల వాడిక పట్టిన మేకపాలు పోసి చాయ్ కాగింతర్వాతనే బేరం షురూ.ఊళ్లల్ల డబ్బులేమో తక్కువ. జొన్నలు,వడ్లు, కందులు,పెసలు, అలిసెందలు, సజ్జలు,వేరు సెనక్కాయలు,నువ్వులు బుట్టల్ల తీస్కొచ్చి గిద్దెడు,అరసోలెడు ,సోలెడు,తవ్వెడు,మానెడు - కొలతకు సొల,తవ్వ,మానిక,[రేకుతో చేసినవి పాత్రలు] ఉండెడివి - ఏం వస్తువులు కావాలనో దానికి సరిపడ గింజలు కొలిచి ఇచ్చి తీసుకునేటోళ్ళు. తునికాకు సీజన్లో పైసలు ఉండెడివి ఊళ్లల్ల. అవి గూడ కొత్త కొత్త పైసలు.మెరుస్తుండేవి.అప్పటిదంక చేతులల్ల మురికిగానివన్నమాట !


అట్ల, పొద్దెక్కేసరికి ఐదూర్లు తిరిగొచ్చేవాళ్ళం.వేరు వేరు సంచుల్లో ఒక్కో రకం గింజలు. చిన్న చిన్న మూటలల్ల కట్టి, తట్లల్ల సర్ది,మిగిలితే మా నెత్తిమీద మోసి తెచ్చి,చుంచ ఈశ్వరమ్మ ఇంట్ల గదిల వేసేటోళ్ళం. పదిరోజులయ్యాక గింజల్నిబస్తాల్లో నింపి ,ఎడ్లబండిల కారేపల్లి ఎర్ర పుల్లయ్య కొట్టుకి ఏసుకుపోయి, మళ్ళీ సామాన్లు కొనుక్కొచ్చుకోవడం .అది మా అబ్బ బేపారం ముచ్చట.



7.10.2013[ఇంకా ఉంది.]

ఎవరు ఓదార్పులై కూర్చునేరు..?!




దుఃఖితుడా
నీ శోకాల నెవరు అడిగేరు?  నీ లోకాల నెవరు తడిమేరు?
నీ లోలో ఎవరు ఓదార్పులై కూర్చునేరు?

ఎచటికి పోతావీ రేయి
నీ లోపలి కలుగుల్ని ఎలా తడుముకుంటావు
అజంతావజీరహ్మ 'మో' బైరాగంలో
శ్రీశ్రీ ఇస్మయి లాపనల్లో
బైరాగివై బంధీవై శివసాగరుడవై
ఎచటినుండి ఎటకెగుతావు
'అన్నిటికీ కారకుడు మనిషి కనుక
ప్రతిమనిషిలో నన్ను చూసుకోవడం నాకెంతో యిష్టమని'
ఏ వెన్నులోని తూటాతో పెనవేసుకుని నిద్రపోతావు
'తుఫాను తుమ్మెద'ల పాటదండుల, రేలారేలాల
గద్దరు, రాజ్యమూ, మేమూ'ల సమిష్టి ప్రతీకల్లోంచి
చిరిగిన ఎర్రటి వస్త్రాన్ని తిరిగి తెచ్చుకోగలవా?

నల్లటి మొహరం విషాద ప్రతీకల
జనన విషాదం చేతపట్టుకుని
ఇక అణచబడ్డ స్వప్నాల అంతరార్ధాల గురించి మాట్లాడాలి.

స్వాప్నికుడా!
సమీపాలు - నీ విసర్జించిన సుఖం
సమీపించిన దు:ఖమే నిజమైన కవిత్వం

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...