అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

23 Apr 2016

పొలంగట్టుపై పచ్చిగాలి వాసనలాంటి సిధారెడ్డి కవిత్వం!

నందిని సిధారెడ్డి 

                                                                         

కవి సిధారెడ్డి నాలుగు దశాబ్ధాలకు పైగా తెలంగాణా ప్రాంత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సందర్భాన్ని కవిత్వంగా మలిచినవాడు. భూమిస్వప్నం‘, మొదలుకుని ఇక్కడి చెట్లగాలివరకు తనదైన ప్రస్ఫుటమైన ముద్రను కనబరిచినవాడు. జీవితమే కవిత్వంగా, కవిత్వమే జీవితంగా, ఆచరణను  అణువణువున నింపుకున్న కవి. స్వీయస్పందనను సమిష్టి స్పందనగా పలుకుతూనే కవిత్వాన్ని సామాజిక శాస్త్ర పరికరంగా మార్చిన నైపుణ్యం అతని కవిత్వంలో కనిపిస్తుంది. కవిగా అన్ని చలనాలకు స్పందిస్తూ, కవిత్వరూపంగా మలుస్తూ దాదాపు నలభై సంవత్సరాలు ప్రయాణించడం అంత సులువేమీ కాదు.ఆయన కవిత్వంలోని కలలు,ఆలోచనలు ,కాలం ,పెనుగులాట, అలజడి ,ఆరాటం ,పోరాటస్ఫూర్తి -ఇలా అన్నీ మనసును తాకుతూ మనిషిని తట్టిలేపుతుంటాయి .ఆలోచించమంటాయి. కాలనాళికలాంటి కవిత్వం సిధారెడ్డి కవిత్వం .

"ఈ లోపల/కూలిపోతున్న ఊరి చెలిమెలో/కూరిమి తోడాలె/ఈలోపల/వలసపోయిన వసంత మేఘానికి/
ప్రేమలేఖ రాయాలె/ వట్టిపోతున్న తరానికి/ మనిషిని కానుక ఇవ్వాలె/ ఈలోపల/ కాలం కనురెప్పల మీద /
జీవితం రచించాలె/ గాలి రెక్కల మీద/ మనిషి చేరుకోవాలె/ఎవరికీ తలవంచని రేషం అద్ది/ పద్యం ఎగురవేయాలె" అంటూ పద్యాలను, పాటలను ఎగరేసిన కవి.తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నిత్యచలనశీలి.
నందిని సిధారెడ్డి 

1
 'ఒక నేలకు సంబంధించిన వేదననూదుఃఖాన్నీ కవిత్వం చేస్తున్నపుడుఆ నేలకు చెందిన భాషపదజాలం అనివార్యంగా ఆ కవిత్వంలోకి వొస్తుందిఅట్లా వొస్తేనే ఆ కవిత రక్త మాంసాలతో తొణికిసలాడుతుంది సార్వజనీన వస్తువుసార్వజనీన వేదన అంటూ వుండవు. ఉదాహరణకు భారత దేశం మొత్తాన్నీ రిప్రేసెంట్ చేసే రైతు ఉండడుఎందుకంటేకోస్తా రైతు దుఃఖంతెలంగాణ రైతు దుఃఖం ఒకటి కాదు తెలంగాణ నేల పైన నిలబడి రైతు దుఃఖం గురించి కవిత్వం చెబుతున్నావంటేఆ రైతు తెలంగాణ రైతే అయి వుండాలి ఆ కవిత స్థానికతకు ఎంత దగ్గరగా వుంటే అంతగా సార్వజనీనం అవుతుంద'ని తన అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించిన సిధారెడ్డి తెలంగాణా బతుకుచిత్రాన్ని గీసాడు. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని గానం చేసే ఆయన ’’నాగేటి సాలల్లో నా తెలంగాణ‘‘ పాటను తెలంగాణాలో ఎవ్వరూ మరిచిపోలేరు.

1997 ఆగష్టు నెలలో ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. అమరులను  స్మరిస్తూ రాసిన 'జోహార్లు జోహార్లు' పాట విన్నవారిని కంటనీరు పెట్టిస్తుంది. నిజానికి సిధారెడ్డి కవిత్వం రాస్తున్నప్పుడు మనిషి బందారం చెరువుకట్ట వద్దనే ఉంటాడనిపిస్తోంది. ఎందుకంటే ఆ పంక్తుల్లో అంత తేమ. ఊరి జ్ఙాపకాలు మదిలో కదిలితేనే కలం ముందుకు సాగుతుందంట. అందుకే ఆయన కవిత్వంలో తెలంగాణ పల్లె కన్నతల్లిలా కనిపిస్తుంది.


సిధారెడ్డి కవిత్వం చదివితే అ అక్షరాల్లో మట్టివాసన కళ్ళను, మనసును కట్టేస్తుంది. ప్రతి కవితలో ఒక అంతర్గత లయ, పల్లెజీవితంలోని స్వచ్ఛమైన పచ్చిగాలి వాసన. ఆయన కవిత్వంలో తెలంగాణ బతుకు  సౌందర్యం ఆహా అనిపిస్తుంది. ఈ విషయం గురించి ఆయనే మాట్లాడుతూ ’’నాకు నేను పుట్టి పెరిగిన నేల మీది భాష అన్నాఆ మాటలు అన్నా ఒక ప్రేమ.  వ్యామోహం అనడం సమంజసమేమో అందుకేఆ వేదనని కవిత్వం చేసినపుడు ఆ నేటివ్ మాటలు విరివిగా వాడడం వల్ల ఆయా కవితలకు ఒక గొప్ప శక్తి వొస్తుందని నమ్మి వ్రాసేవాడినిఅయితేఆ తరువాత అట్లా వాడడం పైన వొచ్చిన విమర్శల పైన కసితో ఆ మాటలని మరింత ఎక్కువగా ఉపయోగించాను.‘‘ అన్నారు. స్ధానికత, స్థానిక భాష కవిత్వాన్ని ప్రజల్లో చొచ్చుకుపోయేలా చేస్తుంది. ఒక జాతి, ఒక ప్రాంత పోరాటాన్ని కవిత్వంగా మలుస్తున్నప్పుడు ఆయా సందర్భాలకు తగిన భాష ఉపయోగించడం కవి ప్రతిభకు నిదర్శనం. సిధ్ధారెడ్డి కవిత్వంలో ఈ ప్రతిభ అక్షరమక్షరం కనిపిస్తుంది.

ఈ జాగల రేషమున్నది / కుటిలం లేదు /కువారం లేదు' అంటూ బల్లగుద్ది మీర చెప్పిన కవి సిధ్దారెడ్డి. ఆయన కవితల్లో' ఉద్రాక్ష పూలు పూసినంత  సహజంగా / మాటలు పూస్తుంటయి ' .'నదిపుట్టుబడి' కవితా సంపుటిలోని కవితలు తెలంగాణా జీవితాన్ని, పోరాటతత్వాన్ని మన కళ్ళముందు ఆవిష్కరిస్తాయి.'దాలిలో పాలు కాగబెట్టినవాండ్లం / అనుభవాలు కాగబెట్టి పోస్తం' వంటి పంక్తుల్లో అద్భుతమైన పల్లెపదాల వాడకంతో పల్లె జనంలోకి ఉద్యమాన్ని నడిపించినవాడు.
"చావుదలకు సుత లేసి ఉరుకుడే / గెలిసినా ఓడినా/ దిగిన తర్వాత కొట్లాడుడే/ దిగుట్లె దీపం ఆరిపోయినా / నమ్ముకం ఆరిపోదు.." అంటూ తెలంగాణా ఉడుకు రక్తం పోరాటపటిమను అక్షరీకరించాడు. తను పుట్టిన మట్టి మీద మమకారం, ఆ మట్టివాసనలోని రోషాన్ని, స్నేహాన్ని, కల్లకపటం ఎరుగని సూటిదనాన్నినిక్కచ్చిగా ప్రకటించిన కవిత్వం సిధారెడ్డిది. ప్రాణగానం కవితలో నిర్మొహమాటంగా ఈ మాటలే చెప్పాడు.
’’ఇక్కడి పిట్టలు
కచ్చితంగ ఇక్కడి పాటలే పాడుతయి
ఇక్కడి చెట్లగాలి
కచ్చితంగా ఇక్కడి కేరింతలే వినిపిస్తది‘‘ ఈ మాటలు చెప్పడంలోని ఆత్మవిశ్వాసం, తెలంగాణా మట్టి పట్ల ప్రేమ, ఇక్కడి గాలి పట్ల మమకారం మాత్రమే కాదు, ఉద్యమవీరులకు ఇక్కడి ప్రకృతి, ఇక్కడి అడవులే తల్లి ఒడి లాంటివన్న ధ్వని గమనించదగినవి. బతకు చితికినప్పుడు, ఆత్మ ఘోషించినప్పుడు, ఆకలికి కడుపులో పేగులు ఎండి కరకరలాడినప్పుడు.. బతుకు బతుకులా ఉండదు. అది మంటల్లో కాలుతున్న పచ్చిమట్టలా పొగబెడ్తుంది. కంటిలో ఆగని కన్నీరై ప్రవహిస్తుంది. అలా ప్రవహించిన అక్షరాలే సిధారెడ్డి కవిత్వం. తరతరాల బానిసత్వం, వెట్టిచాకిరి, వలసలు, దోఫిళ్ళు, కరువులు, తెలంగాణ ఉద్యమ వీరుల త్యాగాలు, రైతుల ఆత్మహత్యలను మోసుకుంటూ వచ్చిన తెలంగాణ ఉద్యమంలో కన్నీరు ఆవిరైన హృదయఘోష ఆ కవితల్లో ఉరుములురిమే ఆకాశంలా గర్జించింది.

సిధారెడ్డి కవిత్వంలో తెలంగాణా చిత్రాన్ని మనముందుంచడమే కాదు, మానవ సంబంధాల్లో, మానవవిలువల్లో అంతరించిపోతున్న మనిషితనాన్ని, మనిషికి మనిషికి మధ్య పెరుగుతున్న దూరాలను కూడా స్పర్శించాయి. ముఖ్యంగా గ్రామీణ, వ్యవసాయ జీవనం ఆయన కవితల కాన్వాసుపై ప్రముఖంగా కనిపిస్తుంది. వ్యవసాయ జీవనం, ప్రపంచీకరణ తెచ్చిన కష్టాలు, పోగొట్టుకోవడంలోని దు:ఖం, పరాయీకరణ, వలసలు కవిని కల్లోలానికి గురిచేస్తే, తెలంగాణా అస్తిత్వ పోరాటం కవిలోని అలజడిని అక్షరాలుగా కురిపించింది.
సిద్ధారెడ్డి కవిత్వంలో గ్రామీణ వ్యవసాయజీవనానికి సంబంధించిన పదచిత్రాలు ఎక్కువ. రైతుకుటుంబ నేపథ్యం అందుకు కారణం కావచ్చు. ఒక నోస్టాల్జిక్, మెలోంకలి ధ్వనిస్తుంది. ప్రపంచీకరణ తర్వాత పల్లెల్లోని ఇండ్లలోకి కూడా మార్కెట్ అడుగుపెట్టడం వల్ల ధ్వంసమవుతున్న పల్లె నేలను, ఎండిపోతున్న పల్లెకు కన్ను వంటి చెరువు గుండెను తడిమిన కవితలు ఎన్నో. అయితే ఉద్యమ నేపథ్యంతో రాసిన కవితలు కూడా చాలా ఎక్కువే. అనేక సామాజిక, ఆస్తిత్వ ఉద్యమాలతో సన్నిహిత సంబంధాలు, ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో భాగస్వామ్యం ఆయన కవితల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

సిధారెడ్డి కవిత్వం పాఠకుడిని చెయ్యి పట్టి పల్లెకు తీసుకెళ్తుంది. పొలంగట్లపై నడిపిస్తుంది. ఎండిన నెర్రెలను చూపిస్తుంది. గొంతెండిన చెరువులను చూపిస్తుంది. ఎండిన పొలంలా దిగాలుపడిన రైతు వెనుక నడిపిస్తుంది. గతాన్ని గుర్తు చేస్తుంది. ప్రపంచీకరణ గాలికి కొట్టుకుపోతున్న మానవవిలువలను చూపిస్తుంది. పచ్చిఆకులే చెట్టునుంచి రాలిపోతున్న సందర్భాలను పరిచయం చేస్తుంది. తడారిన కండ్లల్లో ఎండిన ఆశల బావులను చూపిస్తుంది. పాఠకుడి చెంపలపై రెండు తడి చారికలై మెరుస్తుంది.
’’చెరువు కట్టమీద /నిలుచున్నా /మునుపటి తృప్తి ఉండది / గాలిలో అసహత్వమేదో /కనబడని వేదనతో /గులుగుతంటది‘‘ అంటూ గుండెల్లో ముణకేసిన దిగులును ’’కట్టమీద‘‘ కవితలో ప్రకటించాడు.నేడు ప్రతి మనిషి మనిషిగా మిగల్లేదు. మార్కట్ మనిషిని వినియోగదారుడి స్థాయికి దిగజార్చింది. ప్రతి సంబంధం ఆర్థిక సంబంధంగా మారిపోయింది. ప్రపంచం ఒక కుగ్రామమైనా, పల్లె మిగల్లేదు. ఈ కుగ్రామంలో పూరిగుడిసెల మానవత్వం లేదు, సంతలో అమ్ముడయ్యే విలువలే అయ్యాయి. నిజానికి ఇది కుగ్రామం కాదు, ఒక సంతగా మారిపోయింది. నిన్నటి పైరగాలి లేదు, నిన్నటి ఏటిపాట లేదు. మిగిలింది దిగులు మాత్రమే.
పల్లెలు మాయమైపోయాయి. టౌన్ షిప్పులు వెలుస్తున్నాయి. ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు, పారిశ్రామిక వాడలు పుట్టుకొస్తున్నాయి. మనిషి ఎంత మారినా ప్రకృతి మాత్రం మారదు.
’’మనిషి ధర్మం మారినా/చెట్టు ధర్మం మారదు /చేను చెలకా నేలంతా /ఆకుపచ్చ పులకింత /ఇప్పుడు భూమి /అద్దిన రంగులుగా ధగధగమంటున్నది /కొత్త ఆహర్యంతో /ప్రకృతి ఉరుకులాడుతున్నది.
...
 ముసలితాత ఉత్తచేతుల వలె /రెండు మామిడి చెట్లు /మిగిలే ఉన్నయి /నేల కనుకొలకుల మీద జారి /ఆగిపోయిన కన్నీటి బొట్లవలె /రెండు మామిడి చెట్లు /నిస్తేజంగ /
నిలబడే ఉన్నయి ‘‘ (రెండు మామిండ్లు)
మారుతున్న పరిస్థితుల్లో మనిషి ఉనికిని ప్రశ్నార్థకమవుతుందా? మనిషి ఉనికే ప్రశ్నార్థకమైన చోట యంత్రంలా పరుగెత్తే ఈ బాదరబందీ ఎందుకు? ఇలాంటి  అనేక ప్రశ్నలు సిధారెడ్డి కవిత్వం చదివిన ప్రతి పాఠకుడి మనసులో తప్పక మెదులుతాయి.సిద్ధిపేట ప్రాంతంలో ఉన్న కోమటి చెరువుతో ఉన్ అనుబంధాన్ని సిధ్ధారెడ్డి అపురూపంగా తనలో ఇముడ్చుకున్నాడు. కట్టమీద, చెరువొడ్డు, ఒంటరి దిగులు కవితల్లో మనకు తెలంగాణా గ్రామాల్లోని చెరువు, ఊరు, చెలకల దృశ్యాలు చూపిస్తాడు.’’బురద చేతుల్తో /పొలంలో డైరీ రాస్తున్న రైతు /బట్టల మురికి వదిలించేతందుకు /బండమీద కరుగుతున్న యౌవనం /వెనుక కూర్చుని నేర్పుతూ ఆయన /కొత్త ప్లెజర్ నడుపుతూ/టెన్షన్కూ ప్లెజర్కూ నడుమ ఆవిడ
...
పరుగులు /పరవశాలు /దు:ఖాలు చూసిన ఒడ్డు /కాలాలు /కల్లోలాలు /కాఠిన్యాలు భరించిన ఒడ్డు /మునుగుతది, తేలుతది /నానుతది, ఎండుతది /ఆ ఒడ్డు /పొద్దున సందడి /రాత్రి ఒంటరి‘‘ చెరువొడ్డు కవితలో రాసిన ఈ పంక్తుల్లోని చివరి పంక్తులలోని రాత్రి అనే పదం బహుశా నేటి మార్కెట్ కాలానికి ప్రతీకగా ఉపయోగించాడా అనిపిస్తుంది. నేడు చెరువు ఒంటరయ్యింది. ’’ఒంటరి దిగులు‘‘ కవితలోని దృశ్యాలు నిజంగానే ఒక దిగులును దృశ్యీకరించాయి.’’తోటకు నీళ్ళుపెట్టి /నిలబెట్టిన రాయి ఒంటరిదే /చిటపటలాడినా /చిత్తడి జల్లులు పంచిన /రుతువే వెళ్ళిపోయిన తర్వాత /దిగులు దిగుతద
...
ఆ మబ్బును ఒంటరిగానే ఉండనీ‘‘ ఈ కవితల్లోని బతుకుచిత్రాలు పాఠకుడిని తమలోకి ఒంపుకునే శక్తి కలిగినవి. తెలంగాణా పల్లెలు ,జీవితం మనముందు నిలబడి మాట్లాడుతున్నట్టుగా,ముచ్చట చెబుతున్నట్టుగా  ఉంటుంది ఈ కవిత్వం .మనసును అల్లకల్లోలం చేస్తుంది. ఆలోచించేందుకు వివశం చేస్తుంది.అన్యాయాన్ని ప్రశ్నించమని పురికొల్పుతుంది .ఇంతకంటే ఏ కవైనా,కవిత్వమైనా ఆశించేదేముంది? సిధారెడ్డి కవిత్వం చేసిన పని అదే !
నందిని సిధారెడ్డి 


2

1955 జులై 12న మెదక్ జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో బాలసిధారెడ్డి, రత్నమాలలకు జన్మించిన పేదరికం కాలడ్డుతున్నా ధైర్యంగా కష్టాలను ఎదిరించి చదువు కొనసాగించి 1981లో ’’ఆధునిక తెలుగు కవిత్వంలోు సూర్యుడు‘‘ అనే అంశంపై ఎం,.ఫిల్, 1986లో ’’ఆధునిక తెలుగు కవిత్వంలో వాస్తవికత, అధివాస్తవికత‘‘ అనే అంశంపై పి.హెచ్.డీ పూర్తి చేశారు. పుస్తకాలు చదవడం కాదు, పుస్తకాలు రాయడం గొప్ప అని చెప్పిన తండ్రి మాటలే ఆదర్శంగా తెలంగాణా బతుకు చిత్రాలను తన కలం నుంచి మన కంటికి చూపించిన కవి సిధ్ధారెడ్డి.  సాహిత్య ప్రయాణాన్ని చూస్తే, 1973లో మిత్రుడు భగవంతరెడ్డి ప్రోత్సాహంతో సామాజిక కవిత్వం రాయడం ప్రారంభించిన సిధారెడ్డి రాసిన మిని కవితల సంపుటిని కందుకూరు శ్రీరాములు, కర్ణాల బాలరాజు కలిసి 1974లో అచ్చేయించారు. అప్పటి నుంచి 1991 వరకు ఆయన రాసిన పుస్తకం ఏదీ అచ్చవ్వలేదు. 1991లో సంభాషణ, 1995లో ప్రాణహిత, 1997లో భూమిస్వప్నం, 2001లో ఒక బాధకాదు, 2007లో నదిపుట్టుబడి, 2007లో ఇగురం, 2008లో తెలుగు కులవృత్తుల సాహిత్యం, 2011లో తెలంగాణా సాహిత్యంపై వ్యాసాలు రాశారు. 2012లో ఆయన రాసిన ’’నాగేటి సాలల్లో నా తెలంగాణ‘‘ పాటకు నంది బహుమతి లభించింది. ఇది ఆయన రాసిన మొదటి పాట.
నందిని సిధారెడ్డి 

1987లో భూమిస్వప్నం కవితా రచనకు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అందుకున్నారు, 1988లో దాశరథి అవార్డు, 2001లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది. కాని రైతు ఆత్మహత్యల పట్ల కలత చెందిన సిధారెడ్డి ఆ అవార్డును తిరస్కరించారు. 2009లో ఉత్తమ కావ్యస్నేహనిధి పురస్కారాన్ని అందుకున్నారు. నిజానికి పురస్కారాల పట్ల ఆయనెప్పుడు ఆసక్తి చూపించలేదు. కోడూరి విజయకుమార్ కు  ఇచ్చిన ఒక ఇంటర్వ్యులో మాట్లాడుతూ ’’ఒకట్రెండు సందర్భాలలో ఆయా పురస్కార ప్రదాతలతో నాకున్న ఆత్మీయ అనుబంధం వల్లనే ఒప్పుకున్నాను ఉదాహరణకు ఈ పురస్కారం[రొట్టమాకురేవు అవార్డు] ఇస్తోన్న యాకూబ్ వ్యక్తిగతంగా నాకు ఆత్మీయుడు ఆర్నెళ్ళ కిందటే అన్నా మీరు తప్పకుండా తీసుకోవాలే‘ అన్నడు ఎట్ల కాదనటం ?‘‘ అని చెప్పారు. 1984లో మెదక్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి కవిత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన ప్రయత్నాలు ఆ తర్వాత 1986లో ’’మంజీర రచయితల సంఘం‘‘ ఏర్పాటుకు కూడా దారితీశాయి. మంజీర రచయితల సంఘం తెలంగాణా కవులకు కొత్త వేదికనిచ్చింది. 2001లో తెలంగాణా రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షునిగా వ్యవహరించారు. మంజీర అనే ద్వైమాసిక పత్రికకు, సోయి అనే త్రైమాసిక పత్తికకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


 సిధారెడ్డి కవి, పాటల రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, బోధకుడు. అన్నింటికీ మించి తెలంగాణ సమాజానికి దార్శనికుడు.సామాజిక కార్యకర్త . అలాంటి కవికి రొట్టమాకురేవులో షేక్ మహమ్మద్ మియా స్మారకంగా ఇచ్చే 'రొట్టమాకురేవు అవార్డు'ను  ఇవ్వడం తెలంగాణా పల్లె ఇచ్చిన అవార్డుగా ఆయనకు ఇవ్వడం నా కన్నవూరు  అదృష్టంగా భావించాను. జయహో !
-కవి యాకూబ్
March,2016

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...