అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

30 Nov 2011

వల




మనిషిని భూమి నమ్మక చాలాకాలమైంది

నిజానికి నేలపైన మాయవలలు తప్ప
గింజలే కన్పించని కాలంలో
పక్షులు గింజల కోసం భూమ్మీద వాల్తున్నాయి
పక్షుల  మీదా
గింజల మీదా
పెత్తనం కోసం
ఇప్పుడు కొత్తగా రుతువుల జాబితాలో
వలల రుతువు

వలల్ని ఎత్తుకుపోయిన
పక్షుల కథలు తప్ప
మరేమీ తెలీని రైతు
సరికొత్త బోయవానికి
రైతు కన్నా గింజలంటేనే అతి ప్రేమ!!

1.
రైతుకి మారుపేరు తాకట్టు

దూరమైన మాటలూ, విన్పించని విలుపులూ
అన్నీ పనిముట్లైన ఈ పూట
గుంటకలూ
జడ్డిగమూ
నాలుక మీంచి ఎగిరిపోతుంటే
తలపైని కప్పుబిత్తరపోతోంది!!
వంకర జాతకాలు
సంకర గింజలూ
సర్పయంత్రాలూ
వెరసి ఈ దేషానికి వెన్నెముకరాజు
చెదలు పట్టిన నిలువెత్తు వొంటరి దిక్కులేని చెక్కస్తంభం

మానవీయ సంబంధాలు
డాలర్ అలంకారాల్ని పులుముకొంటుంటే
రైతు ప్రకృతిలోంచి యంత్రంలోకి వొదిగిపోతున్నాడు.

మనిషినీ
భూమినీ
ప్రకృతినీ
దగాచేసే వలల్ని నమ్మక
ఇప్పుడు తన స్వేచ్చకోసం కాలమే నినదిస్తుంది
భూమికి ఇప్పుడు స్వేచ్చ కావాలి!!
***

28 Nov 2011

లౌకిక స్వప్నం గురించే మాట్లాడతాను




మానుతున్న గాయాన్ని మళ్లీ ఎవరో కెలికారు
ఎవరో స్వేచ్చను యాభై ఏళ్లలోపే పరీక్షకు నిలబెట్టారు
మేకప్పుల్తో సహా మనుషులందరూ
మళ్లీ  వెనక్కి రూపాంతరం చెందారు

రోడ్ల మీద నడుస్తున్నవాళ్లూ
కుడిఎడమలకు సర్దుకున్నారు
పేర్ల వెనక మతాల ఐడెంటిటీ గుర్తులు తగిలించుకుని
అందరూ అప్రమత్తులై పోయారు
మూడు గోపురాలు మూడు సింహాలు
మూడు రంగులు ప్రశ్నార్ధకాలుగా మారిపోయాయి.

అన్ని ప్రతీకలు మరోసారి వంచించబడ్డాయి.

మతనిర్ధారణ కోసం ప్రత్యేక నిర్ధారణ  కమిటీలు  నియమించబడ్డాయి
చరిత్ర పేజీల్లోంచి మనిషి ఆనవాళ్లు తప్ప
శిధిలాల్నే ప్రమాణాలుగా చూస్తున్నారు
మనిషే అన్ని శిధిలాల్లోంచీ ఆస్థిపంజరమై వెలికి వస్తున్నప్పుడు
మనిషి తప్ప మిగిలిన సమస్యలే ప్రధానమై పోతున్నప్పుడు
మత చదరంగంలో మనుషులే పావులవుతారు!

1.
రాజులు రాజ్యాలు అంత:పురాలు
కాలం పరీక్షించి వదిలేసిన  జ్ఞాపికలు
కాలం వెంబడించిన ప్రతి వస్తువు పరివర్తన చెందుతుంది
విలువలు మారతాయి. అవసరాలు మారతాయి
మనిషే మారతాడు

కాని ఇప్పుడు అవరోహణ క్రమంలో
మనిషి ప్రయాణించడం ఎంత చోద్యం
ప్రతి  మనిషిని శత్రువుగా చిత్రించి
ప్రతి గుండె మీద అపనమ్మకాల పరదాలు కప్పి
భయాన్ని నిత్యావసరంగా మార్చి
అన్ని మానవతా విలువల్ని కాలరాచి
ఏ రథాల మీదో రామబాణాల మీదో  రాతియుగందాకా
తిరుగు ప్రయాణం కట్టిన ఆదిమానవుల్ని చూస్తున్నానిప్పుడు
మనిషిని వెంటాడుతున్న ఉన్మాదాల సాక్షిగా
నిజానికి ముక్కలై పోతున్నాది మనిషే
మనిషి కథ నిజం కానప్పుడు
కల్పిత గాధలే భూగోళాన్ని చుట్టుకుంటాయి

2.
ఊపిరి పోసుకోక ముందే మనిషి మతాన్ని నిర్ణయించే భూమ్మీద
నన్ను కొత్తగా ఆవిష్కరించుకునే  ప్రయత్నం చేస్తున్నాను

నేనే ఒక కట్టడాన్ని నన్నెవరు కూల్చడానికి ప్రయత్నించినా
నేను మనిషిలా ప్రశ్నిస్తాను
ప్రతిసారీ నేను లౌకిక స్వప్నం గురించే మాట్లాడతాను.

18 Nov 2011

మాట్లాడని మాటలు



మనం కలిసినప్పుడల్లా
ఏమీ మాట్లాడకుండానే మిగిలిపోతాం

అన్నిసార్లు మిగిలిపోయేదే ఎక్కువ
నిజానికి మీరు నేనూ ఎన్నోవేలసార్లు కలుసుకున్నాం
మాట్లాడవలసిందేదీ మాట్లాడకుండానే విడిపోయాం
మీ ఇంటికబుర్లు, మా ఇంటికబుర్లు
నడుమ నడుమ నిశ్శబ్ధమే హరించిన ఎన్నో వందల నిముషాలు
వెరసి మనం మాట్లాడిందేదీ మనం మాట్లాడదలుచుకున్నది కాదు.

అప్పుడెప్పుడో మనిద్దరం ఒకరి కళ్ళలో ఒకరం
భవిష్యత్తును గీసుకుంటున్నప్పుడు
గొంతు దాటకుండా మనం మిగిల్చిన మాటలే ఇప్పటికీ వేధిస్తుంటాయి
మనిద్దరం మనవి కాని పంజరాల్ని నిర్మించుకున్నాం
అందర్నీ సంతోషపెట్టాం.
"మీరు బాగున్నారా! మీ పిల్లలూ .. కులాసేనా?"
ఇంతకు మించి మాటలు లేవు
ఈసారి కలుసుకున్నప్పుడైనా మనసు విప్పి మాట్లాడుకుందాం


అన్నట్లు మీ కళ్ళ క్రింద నల్లటి చారలు
ముఖంలో తారట్లాడే నల్లటి మబ్బులాంటి దిగులు
వాటి గురించైనా చెప్పరు మీరు
కలల్లోనూ బతకాల్సిన బతుకుని కలగనలేని మనం
ధైర్యంగా అర్ధాలు విడమర్చి చెప్పుకోలేం
అయినా లోపలి మాటలు నన్ను ఎప్పుడు బాధపెడుతుంటాయి
ఈసారి కలసినప్పుడైనా మనలోని మాటల్ని మాట్లాడగలమా?

14 Nov 2011

తొడగని ఉంగరం




ముడతలు పడిన స్వప్నం ముందు
ఒళ్ళు విరుచుకుంటుంది నిద్ర
ఆ లోపలి
సొరంగంలోంచి అజ్ఞాత మానవుడెవడో నడుచుకుంటూ
తీరిగ్గా నిద్రా ప్రేమగీతాలు రచిస్తుంటాడు.

అతడి చుట్టూ
అంగరక్షకుల్లాంటి ఊళ్లు
ఒదగని ప్రేమలు
ప్రేమ చేష్టలు తెలియని కోయపిల్ల


తోట గెట్టుమీది బంతి పూలన్నిటిని
తలలో దోపుకుంటుంది
ఎట్లా కనబరచాలో తెలియని ప్రేమకు మల్లే

కలవరమైన మదితో
జగజీత్ సింగ్ గజల్ చుట్టూ గిరికీలు కొడుతున్న
తుమ్మెదలా అతడు
కోయపిల్ల స్వప్నాంతర వాసి

తొడగని ఉంగరం
చేపకూడా మింగని మరుపులో దాగిన ఉంగరం
అతని ప్రేమ కథ

విఫలప్రేమలన్నీ తాత్వికతల చుట్టూ తిరుగుతుంటాయి కాబోలు
చేల మధ్య ఎత్తాటిమంచె విరహవేదిక

కోర్కెలు తీరని ఆత్మలన్నీ
ఆ మంచెమీదే సమావేశమవుతాయి.

మోహానికి వయోపరిమితి లేదు
ప్రేమలు కొత్త సందర్భాలు
నిద్రల్లోనే ప్రేమల పునర్మూల్యాంకనం
రహస్య ప్రేమల్లోనే దాగిన నిజమైన ప్రేమలు

ప్రేమలకు ముందూ వెనకా
వాడిన ఊళ్లలాంటి కలలు..

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...