అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

21 Apr 2016

ప్రయాణంలో పద నిశ్వాసలు


  • ఎడతెగని ప్రయాణం' కవితాసంపుటి - యాకూబ్‌ కవిత్వం


 : ఎడతెగని ప్రయాణం :
స్టేషన్లు వస్తాయి. ఆగిపోవడాలుంటాయి. ఎక్కడో ఏదో సిగ్నల్‌ పడదు. ఔటర్‌ దాకా వచ్చీ నిలిచిపోయే స్థితి వుంటుంది. పట్టా ఏదో తప్పిందనో, ఏదో కట్ట తెగి నీరు ట్రాక్‌ను ముంచెత్తిందనో, అవరోధాలతో నిలుపుదలలుంటాయి. అయినా ప్రయాణిస్తున్నట్లే! ప్రయాణం సాగుతూనే ఉంటుంది! నువ్వు రైల్లో అంటూ వుంటే-
బహుశా బ్రతుకురైలు సంగతీ అంతే! అది ఒక ఎడతెగని ప్రయాణం. భార్యాపిల్లలూ, బంధుమిత్రులూ అదే రైల్లో వున్న నీ ప్రయాణం నీదే! నీ సుఖదు:ఖాలు, కలవరింతలు, భయాందోళనలు, పరి పరి పరిచయాల కరచాలనాలు, చిరునవ్వుల పలకరింపులు, అసహ్యించుకోవడాలూ, రోతలూ, చిల్లర మల్లర అమ్మకాలు అన్నీ ప్రయాణగతాలే!

షేక్‌ హురాన్‌ బీ, షేక్‌ మహమ్మద్‌ యాకూబ్‌ను కన్నారు. యాకూబ్‌ శిలాలోలితను కరిగించుకుని -సందీప్‌, సాహిర్‌ భారతిలతో బాటు కవిత్వాన్ని కన్నాడు. ప్రవహించే జ్ఞాపకంగా హృదయాన్ని మలుచుకుని, సమాజ సరిహద్దురేఖలు ఎరిగీ -''రేషన్‌లో శాంతిని ఈ రాజ్యం ఎంత కేటాయిస్తే -అంతే సంచీలో తెచ్చుకోవాలి. అంతటితోనే సరిపుచ్చుకుంటూ గడపాలి'' అని గ్రహించీ, సరిహద్దుల మధ్య, సన్నాయినొక్కుల మధ్య, ప్రయాణాన్నే సదా విశ్వసంగీతంగా ఒక లయాత్మక యాత్ర చేస్తున్నాడు. ''రైలు లోపలి ప్రయాణం బయటి ప్రయాణాన్ని దాటి దూసుకెళ్తుంటుంది.''
అతనికి కరుణ గురించి తెలుసు, కాఠిన్యం గురించి తెలుసు. బయటి రియల్‌ ఎస్టేట్‌లు తెలుసు. హృదయంలోపలి మనిషికి కావలసిన రియల్‌ ఎస్టేట్‌ తెలుసు.''వెక్కి వెక్కి పడిన ఒంటరితనాల వనాల్లో నన్నో ప్రాణవంతపు పత్రహరితంగా మార్చిన కన్నీటి చుక్కలకు ప్రణామం'' అంటాడు. ''చిత్తంలో ప్రతిదెబ్బా -సుత్తిదెబ్బగా మలచిన -మానవ మూర్తిని మించిన -మహిత శిల్పమేమున్నది'' అంటారు బోయిభీమన్న. యాకూబ్‌ కవితాశిల్పంలో ఆ ఉలిపోటుల, ఉలికిపాటుల సాక్షాత్కారం వుంది. ''శుభ్రంగా పెళ్లి చేసుకో పెళ్లాం అనుకూలవతి అయిందా సుఖపడతావ్‌ -లేదూ వేదాంతివవుతావ్‌'' అన్నాట్ట సోక్రటీసు. సోక్రటీసు కాలం వేరు. శోకాన్నీ, టీజింగ్‌నూ కూడా కలుపుకున్న ఆధునికాన అనుకూలవతి మాత్రమే అసలైన వేదాంతిని చేయగలుగుతుంది. వేదాంతం అంటే ఆత్మను చావుకు దారితీయించడం అని కొందరి భ్రమ! ''ఆమె ఎవరు, ఎవరీ పిల్లలు, ఎవరు వీరంతా -అనుబంధాల కొనలకు తగిలించిన ఈ తెరల వెనుక మసగ్గా తిరుగాడుతున్న వీళ్లనెలా గుర్తుపట్టడం -నాలాగే దేహంలేని దేహాలతో కరెన్సీ ముఖాల నవ్వుల మధ్య సేద తీరుతున్న వీళ్లెవరో'' అని 'ఒకానొక నేను'ను 'సం'దేహం' తోటే ఆవిష్కరించుకునే యత్నం చేస్తున్న కవి అందుకే ఆమె ఎప్పుడూ అలకపాన్పుమీంచే మాట్లాడినా, నన్ను ప్రేమిస్తున్నావా అని నిత్యం విసిగించినా ''నేనో రూపాన్ని వెతుక్కుంటున్న వాయువుని -పిట్టలకు మల్లే రెక్కల్ని ధరించిన గమనాన్ని'' అని ప్రసరించిన లోచూపు కలవాడై 'సజీవంగా ఉంటూ హృదయాన్ని వినడం నిపుణులపని' అని ఆ నైపుణ్యంతో ప్రయాణిస్తూంటాడు. అతనికి తెలుసు 'ప్రతి పరిచయం ప్రేమ మాత్రమే కానక్కర్లేదు. మనల్ని మనకు సరికొత్తగా పరిచయం చేసే పురా జ్ఞాపకంకూడా'' నని.
''జీవితంలోకి ప్రేమగా ప్రయాణించినవాడే
తనను తాను సంపూర్ణ మానవునిగా నిర్మించుకుంటాడు''
అంటూ సహజ భాష నిర్భయ సంచార నిజమైన జీవిత ప్రయాణమేనని వచిస్తాడు. 'మనసువిప్పి మాట్లాడుకోవడం' సాధ్యంకాకపోవడమే అసలైన అవిద్య. ప్రతివాడూ ఎంతోకొంత ఆ రకంగా నిరక్షరాస్యుడైన అవిద్యావంతుడేనేమో!
మతంకన్నా మానవత్వం అసలు గమ్యం అనే యాకూబ్‌ ''ఈ లోకానికి ప్రేమ కావలసిన వనరు'' అని చాటేందుకు మసీదు, మందిరంలా కాక మనుషుల్లా ప్రయత్నిస్తూనే ఉందాం. శాంతి శాంతి శాంతి అని పచ్చజెండా ఊపుతూంటాడు. ''రణాలు ఈ భూమిని వ్రణంగా మార్చకముందే శాంతి నినాదం చేద్దాం'' అంటాడు. రాజకీయం మనిషిని ఎలా ప్రక్కదారులు పట్టించి సహజీవన ప్రయాణ అవరోధాలు కల్పించి పరిహసిస్తుందో తెలుసు కనుకనే ''నిన్నటి నాయకుడ్ని వదలి మరో నాయకుడిలోకి హాయిగా ప్రయాణిస్తాం. కానీ మన మనిషిలోకి మనం హాయిగా సాగిపోవడానికి సందేహిస్తాం'' అంటూ -''నిజంగానే నిజం, మనమే నిజం, మనమంతా నిజం, మిగతా అంతా ఒట్టి అబద్ధం'' అని 'ఒకే ధార'తో తేల్చి చెబుతాడు. ''కలవంటి, శిలవంటి, కాంతివంటి, కరుణవంటి, సుడులు తిరిగే ఊహవంటి, ఉరకలెత్తే ఉద్వేగం వంటి ప్రేమే కవిత్వం కవిత్వమే ప్రేమ'' అంటూ యాకూబ్‌ -''నిన్నూ సమూహాన్నీ కలిపే రహదారి కవిత్వం'' అంటూ ప్రకటించి, ప్రేమైకమయ సామూహిక ప్రయాణానికి జీవితపు బాటలు వేస్తున్నాడు. యాకూబ్‌ కవిత్వం చదివి అందుకే ఒక తాత్త్వికతను గ్రహించిన కె.శివారెడ్డి ''భక్తికవుల, సూఫీకవుల జీవనతత్వమేదో, నిజమయిన జీవన వేదాంత విధానమేదో -అది బతుకే. బతుకునుంచి జనించిందే బతుకును ఆనందమయం చేయడానికి, కాంతిమంతం చేయటానికి ఉపయోగపడేదే. భక్తికవులు, సూఫీకవులు ఎవ్వరూ బతుకును వదల్లేదు బతుకును బతుకుతూ జీవితం ఆమోదయోగ్యమయిన ఆనందమయమవటానికి దోహదం చేశారు'' అంటూ ఓ సూఫీకవిగా యాకూబ్‌ను సంభావన చేశాడు.
'ఏకో రస: కరుణ ఏవ' అని భవభూతి నిర్వచించినట్లే ''నా ఉద్వేగ గాద్గద్వాల ప్రాణవంతపు పరిచయ సంతకం ఈ కన్నీటి బొట్టే'' అంటున్న యాకుబ్‌ ఎడతెగని ప్రయాణ లక్ష్యాన్ని ఇలా సారభూతం చేశాడు -
''జీవన ప్రయాణంలో ప్రేమ ఒకటే దరిచేర్చే సాధనం
ప్రేమ పథంలో ప్రేయసి నాకు తోడు
ప్రేయసి కళ్లలోకి తొంగిచూస్తే జీవితమంతటి భరోసా
ఏడుపులు, కన్నీళ్ళు అతలాకుతలం చేస్తున్నా
ఆమెలోంచి నేను ఒంపుకునే ఆత్మవిశ్వాసం
ఎప్పుడూ ఓడిపోనీకుండా చేస్తుంది
ప్రేయసిని గుండెల నిండుగా ప్రేమించడం ఆమెలోని అంతరంగాన్ని దర్శించడం కోసం తపస్సు చేస్తుండటం ఇవన్నీ నేను తోటి మనిషిని ప్రేమించడం కోసం చేస్తున్న పరిశ్రమ. ఆ పరిశ్రమలోనే నాలోపలి స్వరం నాతో మాట్లాడుతుంది ''మనిషి నిజం. మనిషి మాత్రమే నిజం. మనిషిని ప్రేమించడం వినా అంతా అబద్ధం అని''. జీవితమే ప్రేయసి. ప్రేమే ఎడతెగని ప్రయాణం.

అందుకే వ్యష్టిని సమష్టి చేసే కవిత్వ ప్రయాణీకుడు
యాకూబ్‌కు
యా-ఖూబ్‌ 'సలామ్‌'లు.

 ~ సుధామ ,ఆంధ్రభూమి కాలమ్ 
Thu, 18 Feb 2010

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...