అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

Showing posts with label కొత్త కవిత. Show all posts
Showing posts with label కొత్త కవిత. Show all posts

3 Jun 2016

ఊరు డైరీ


*
ఊరి నుదుటిమీద
రాత్రి రాల్చిన చెట్ల ఆకుల బొట్టు.
పారకుండా ఆగిన ప్రవాహం ఙ్ఞాపకాలతో
మడుగులు కట్టిన బుగ్గ వాగు.
దారుల్లో నిన్నటి జీవితపు గుర్తుగా
పేడకళ్ళను వేస్తూ సాగిన గొడ్లు.
తడికలు లేక
బార్లా తెరుచుకున్న లోగిళ్ళు.
రేగడి మట్టిలో
లోపల ఎక్కడో దాహం తీరక శోషిస్తూ
గడ్డిపరక.
~
నిద్రాభంగమై చెమటను తుడుచుకుంటూ
వేడి తాళలేక చెట్ల కదలికల కోసం
వెతుక్కుంటూ ఊరు.

అంతే !


~*~
బతకడం ఏమీ కొత్తకాదు
అదేదో బొత్తిగా తెలియనిదేమీ కాదు
కానీ,
కొన్ని సందర్భాల్లో అంతా కొత్తగా వుంటుంది
అదేదో అంతుబట్టని రహస్యంలా వుంటుంది.
బతుకుతున్నది బతుకేనా అనే సందేహమూ,
అటుతిప్పి ఇటుదిప్పి చివరికేదో సమాధానం దొరికి
అప్పటికి సంతృప్తి పడిపోతాం.
*
అసలు బతకడమంటే ఏమిటి?
ఊహ అపుడపుడే తెలుస్తున్నప్పుడు ఏదో అర్ధమవుతున్నట్లు, అంతా తెలిసి పోయినట్లు, నిర్వచనమేదో కనిపెట్టినట్లు
నింపాదిగా బతికేస్తుంటాం.
కొన్నాళ్లు పోయాక
బతికేయడమనే ఊహను బతికేస్తుంటాం.
సర్దబాట్లు, సంజాయిషీలు, ఆత్మనివేదనలు, సంతృప్తుల అసంతృప్తులు,
రోజులు భారంగా మారడం గమనించినా
గమనించడాన్ని కూడా అంగీకరించకుండా సాగుతుంటాం.
*
ఆపైన బాధ్యతల్ని నెరవేర్చడమే
జీవించడమనే నిర్వచనమేదో వచ్చి చేరుతుంది.
రోజులు ఉదయించి చాలా మామూలుగా అస్తమిస్తాయి.
ఇంకొన్ని రోజులు ఇలాగే గడిచాక
బతకడం ఏమీ కొత్తగా అన్పించదు .
అలాగని,
అదేదో బొత్తిగా తెలిసినట్లుగానూ వుండదు.
8.12.2015

ఫ్ల ఫ్ల ఫ్ల


-:::-
ఏదీ స్పష్టంగా మొదలుకాదు
ఎక్కడా ఏ దరీ దొరకదు
అతలాకుతమై పోతున్న ఈతగాడిలా కాలం.
విత్తనాలు విత్తినట్లు మరణాల్ని విత్తి, విధ్వంసాల్ని సేద్యం చేస్తున్న భూమి.
ఇప్పుడీ ధరిత్రి పీడకలలతో బాధపడుతుంది. ప్రతిరోజూ సూర్యుడు ముఖం చాటేసి చీకట్లోనే దాక్కుంటున్నాడు. అన్ని పుస్తకాల పుటల్లోనూ మనిషి సొమ్మసిల్లి నిద్రిస్తున్న అనుభవం.
కొత్త సారాంశమేదీ లేదు.
బతకడమే ఒక అపురూపమైన అంశమైపోయి మృత్యువే పరమసత్యమైన సందర్భం. ప్రయాణం ఎటువైపో తెలియదు. భూమిని నడిపిస్తున్న అంతస్సూత్రమేదో అంతుబట్టదు.
ప్రతి అక్షరం ఇపుడొక వీలునామా
సాలెగూళ్లలాంటి ఇళ్లమధ్య, జైలు గోడలలాంటి మనసులమధ్య, తారురోడ్డుల మీద ఎగబాకుతున్న జీవితం మధ్య రాక్షసబల్లిలా నోరు తెరిచింది వర్తమానం .
ఎక్కడా, చల్లని బతుకు జల్లులు కురుస్తున్న జాడల్లేవు .
ఎక్కడా తెలతెల్లని నవ్వులు పూసే తోటల్లేవు.
ఎక్కడా మనిషి ముద్రతో మనిషి కన్పించడం లేదు.
అన్నిసార్లూ గొంతు విషాదమై రూపుకట్టడం,
రక్తమాంసాల ముద్దలు అస్తిత్వం కోసం కదులుతుండటం,
బిగిసిన మాటల వెనుక సజీవమైన జీవితం పెనుగులాడుతుండటం ఇప్పటి విషాదం.
::
ప్రతి ముఖంలోనూ నేరం చూస్తున్న తొట్రుపాటు.
ప్రతి మాటలోనూ, నవ్వులోనూ సందేహపు వెతుకులాట.
రాక్షసుడు ఎవరో, మనిషి ఎవరో అంతుచిక్కదు.
యుద్ధం చేేసేవాడెవడో, రణరంగం విడిచి జారిపోయే వాడెవడో విభజనరేఖపై ఇమడడు.
అంతా
అంతా
అంతా అస్పష్టమైన స్పష్టం !

కొత్త భాష


~*~
వానకొమ్మల మీంచి నడుస్తూ జారిపోయే నీటిచుక్కల బుగ్గలమీద సంతకం చేయాలని వుంది.
కరుగుతున్న మేఘాల చిట్టచివరి అంచుమీద
కాళ్ళూని కాలంపై గెంతాలనివుంది.
1
అక్కడక్కడా తడిచిన తడిపిట్టలు,
అక్కడక్కడా నిద్రిస్తున్న నదులు.,వాగువంకలు.
అటువైపునుంచి ఎటొ పరుగెత్తుతున్న చెట్లు ,
ఇంకెవరూ ఇటుగా చూడని దారులు, డొంకలు. నోళ్ళుతెరిచి కూచున్న చెరువులు.
రాత్రిని రాత్రే చంపుకుంటున్న చెదురుమదురు ఘటనలు, లేత లేతగా నవ్వుతూ ఉరిమినట్లు మాట్లాడే మాటలు, కళ్ళు కర్పూరంలా మండుతూ ఏవేవో పొగల్ని కక్కుతూ దృష్టిని కోల్పోయిన చూపులు.
ఇంతేకాక మరింకేమీ లేని వానకురవని ,అసలే లేని అనేక రోజుల తర్వాతి ఈరోజు !
2
అసలింకేం జరగాల్సివుంది !
నువ్వొకమారు మారి చెప్పు.
ఎండిన కళేబరంలా మాట్లాడు . నీరింకిన నదిలా పలుకు. పగిలి బీటలువారిన మబ్బులా గొంతు విప్పు.
నీకు నోటీసులు పంపుతున్నా / చల్. . మాట్లాడు !
*
13.8.2015

4 May 2016

నిదురలో నిదురించాలి !


లైట్లన్నీ ఆర్పేసిన చీకటిగదిలా మనసు .
భూమ్మీద చివరిసారిగా నృత్యంచేస్తున్న మనిషిలా
వీస్తున్న గాలి.
రంగుల్ని తుడిపేశాక, రూపాల్ని తుడిచేసాక
మిగిలిన గోడలా గతం.
సమాంతరంగా గడిపే భ్రమల క్షణాల్లో
రూపుకట్టని జీవితం.
నిజమైన ప్రపంచం లోపలెక్కడో ఉంది.
లోపలికి ప్రయాణించే దిగుడుబావి మెట్లు
కానరావు ఎంతకీ .
*
*
ఎక్కడివో కలలు :
ఎవరివైనా కానీ, కలలు నిదురలోకి ప్రవేశించాలి అసలు.
లోపలి లోయలోకి నువ్వైనా నేనైనా కొన్ని ఆకులతో ,కొన్ని పూలతో
ప్రవేశించాలి.
నక్షత్రాలమై ఆకాశం నిండా పరుచుకోవాలి మిణుకు మిణుకుమంటూ.
*
ఆ అద్దం ముందునుంచి చూపులు తిప్పి
అసలు దేహరహస్యమేదో కనిపెట్టాలి .
రహదారుల్లో మిగిలిన నలిగిన అడుగుల్లోకి
మనమిక అడుగుల్లా దూరాలి .
చివరిక్షణాల ఒంటరితనంలో
ఒకింత మనుషులమై , అల్పులమై ఆదమరచాలి.
విశ్రమించాలి , నిద్దురలో నిదురించాలి. నిదురించాలి.
*
11.2.2015

ఆ తర్వాత


March 11, 2015 at 8:47am
కొన్నాళ్లు గడిచాక 
రూపం కోల్పోయి గాలిలో కలిసాక
చిన్నప్పుడు ఆటలలో గెలుచుకున్న గోళీకాయలేవో
జేబులో శబ్దం చేస్తుంటాయి.

తుమ్మచెట్టు బెరడునుంచి కారి, మెరిసే బంక 
నాలిక మీద వింత రుచిని గుర్తుచేస్తుంటుంది.

కొంగలు వాలిన చింతచెట్ల అర్ధరాత్రి శబ్దాలేవో 
వింత వింత స్మృతులై తెల్లటి ఈకల్లా ఎగురుతుంటాయి.

బుడబుడ శబ్దాల వాగు 
దేహపు బండరాళ్ళ మీద తలమొాదుకుంటున్నట్లు
అదేపనిగా అరుస్తూనే వుంటుంది.

రైలుపట్టాల కింది కంకరరాళ్ళు 
బాల్యాన్ని పాదాలుపాదాలుగా మార్చుకుని
తమ మీద దుప్పటిగా కప్పుకుంటాయి.

ఆ పిదప తీగలచింత 
నిన్నో ఙ్ఞాపకంగా తనకొమ్మల మీద కూచోబెట్టుకుని
గాలితో ఆడిస్తుంది.

10.3.2015* Posted in Kavisangamam

యూ టర్న్

నేనే అని చెప్పుకుంటావు,
కానీ నీకోసం నీవేమీ కాలేవు...
పాతసామానుల పెట్టెలాంటి
దేహం లోపలెక్కడో కొంత మిగిలిపోవడం తప్ప!
గెలవడం కోసం కాక
గెలిపించడం కోసం ఏళ్ల పయనం తర్వాత,
జమా లెక్కల కొసన కన్పించీ కన్పించని ఒక గీతలా
అలా ఉండిపోతావేమో!
ఇరుకిరుకు సందుల్లోంచి మొదలై,
నడిచి నడిచీ మళ్ళీ అక్కడికే చేరుకున్నట్లు
అక్కడే సంచరిస్తుంటావు సదా!
ఏ దోవ ఎటు పోతుందో తెలియక,
వెతుకులాటల్లో వెదుక్కోవడమే జీవితమయ్యాక,
అడుగుల కింది ధూళి అనుభవంగా మారాక,
కంటి రెప్పలలోనే కన్నీళ్ళన్నీ మలిగాక -
నేనే అని చెప్పుకుంటావు...
కానీ, నీకోసం నీవేమీ కాలేవు!
--- 

అదేమిటో !?

సంవత్సరాల తరబడి యేర్చి కూర్చినవన్నీ
ఒక్క క్షణంలో కూలిపోతాయి, కనుమరుగైపోతాయి!
లోపల తాళంవేసి దాచుకున్న అపురూపమైనవన్నీ
మళ్ళీ ఒకసారి తిరిగి చూసుకుందామనుకునేసరికి మాయమైపోతాయి!
మాట్లాడే మాటలకు ఎవరికి వారు
వేరే అర్ధాలను పేర్చుకుంటుంటారు!
అప్పటివరకూ వెంట నడిచిన నీడ
ఎంత వెతికినా దరిదాపుల్లో కనిపించదు!
వేళ్ళ సందుల్లో దాచుకున్న అక్షరాలు
తెల్లటి కాగితమ్మీద కూచోడానికి సుతారమూ ఇష్టపడవు!
పొద్దున్నే లేవగానే నా ముఖం నన్నేకోల్పోయి,
మరో కొత్త ముఖంగా,
అద్దం ముందు నన్ను నాకే పరిచయం చేస్తుంటుంది!
అదేమిటో, అదేమిటో...!!
---  // 

15 Jul 2014

ఒక్కొక్కరోజూ


ఒక అనుభవం..
ఒక గాయమో, చిగిరిస్తున్నరాగమో
లేత పలకరింపులకు మోరలెత్తే ఆనందమో
కానైతే యేదో ఒక అనుభవం.
అప్పటివరకూ చిరునవ్వుగా సమీపించే కాలం
హటాత్తుగా ఉరుముతుంది,నిట్టనిలువుగా చీలుస్తుంది.
*
పొద్దున్నే పలకరించే
పెరటిమొక్క ముఖంలోకి తరచి చూస్తున్నాను.
ఏదో చెప్పేందుకు
నా చెవి దగ్గరికి జరుగుతోంది.
వినాలి.
విన్నాక మీతో చెపుతాను.
అప్పటివరకు సెలవు....!!

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...