అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

Showing posts with label 'సరిహద్దు రేఖ'. Show all posts
Showing posts with label 'సరిహద్దు రేఖ'. Show all posts

12 Oct 2011

కుడికాలు


                                       

అలిసిపోతున్న నాకు మళ్ళీ ఇలా ఆశలా
ఎదురయ్యావు

కలలులేని రాత్రిలో
సేదతీర్చే కవితలా మారావు
రహస్యాలు లేని రోజులకు
నీవే రూపశిల్పివయ్యావు
కవియోధుని కాపాడే
ఊహవయ్యావు. భావుకతవయ్యావు
గాయపడిన దేహంపైన
వాలిన అమృతహస్తంలాంటి పక్షివయ్యావు
వసంతంలా భూమిని వరించిన
రంగురంగుల నవ్వువయ్యావు
సీతాకోకచిలుకలా మారిన
రూపాంతర జీవనపరిణామానివయ్యావు.

 ఊడుగుచెట్లు, పల్లేరు కాయలు, నల్లవాగులో నా రక్తం పీల్చిన జలగలు, మంచెల మీద నేనల్లిన పాటల గమకాలు, నోరూరించిన తుంగలు, తలలూపే జొన్నకంకులు,.. అన్నిటా తొంగి చూసిన అద్భుత, చిత్ర విచిత్ర భావాల మిశ్రమపు బతుకు పుప్పొడివయ్యావు.

సానబట్టిన ఉలిలాంటి
నాలోని కాంక్షవయ్యావు
నా నిద్రించిన రాత్రుల్లో దోగాడిన
పసి యవ్వనానివయ్యావు
చిగిర్చే చింతచిగురుమీద
ప్రకృతి గీసిన భవిష్యత్తు
ఆకుపచ్చదనానివయ్యావు

అద్దం ముందునిలబెట్టి
నన్ను నాకు చూపించిన ఆత్మవయ్యావు
మా అమ్మ ముఖం ముడతల్లో
తొంగిచూసే వాత్సల్యపు మెరుపువయ్యావు
చెవుల్లో గింగిర్లుపోయే మా నాన్న
గొంతులోని కూనిరాగం లా
నా హృదయాన్ని తాకే అద్భుత వాహికవయ్యావు

ఎంత కరుణ
ఎంత ప్రేమ
ఎంత వాత్సల్యం నీకు

నీ కుడికాలు నా జీవితపు వాకిలిలో
మోపినప్పుడే
నేను అపూర్వమైన ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడాను

నా మనసుకు తొడిగిన స్వప్నాలకు
నీవిచ్చిన అర్ధంతోనే
నేను కవినయ్యాను.

5.2.2001

10 Oct 2011

పిల్లాడు


                                      

నాలోపల దాగిఉన్న  పిల్లాడినే నమ్ముతాను

వాడి గుక్కపట్టిన
అల్లర్లూ చిలిపితనాలూ ఆటపాటలూ ఉద్వేగాల్తోనే
నేను పెనవేసుకున్నాను

పిలాడంటే
అతిసున్నితంగా, లేత నవ్వుల్తో
గాలికి సుతారంగా కదిలే పూవులాంటివాడు.

తన బుడిబుడి అడుగుల్తో పార్లాటల్తో
భూమిరుణం తీర్చుకునేందుకు తన్లాడే ఊరులాంటివాడు
మట్టిని అన్నంలా తినేవాడు. గంధంలా పూసుకునేవాడు.

ప్రతి చిన్న కదలికకి అనుభూతికి
కరిగిపోయేవాడు
మనుషుల్ని చూసి చిదానందంగా నవ్వుకునేవాడు
గమన భంగిమల్లో అపురూప కళాఖండంలా కన్పించేవాడు.

ఉగ్గుగిన్నెతో తాగిన అమృతం గురించి
చనుబాల సారంలోంచి అమ్మనేర్పిన ప్రేమ గురించి
లోకం పంచిపెట్టే దుఃఖం గురించి సుఖం గురించి
నాతోనేను మాట్లాడుకుంటున్నప్పుడు
నాలోపలి
ఈ పసివాడే
కవ్వం చేతపట్టుకుని నాలోపల కూచుంటాడు! 
*@*

2 Jul 2011

పూలచెట్టు

ఈ పూలచెట్టు
మా ఇంట్లోకి కొత్త ప్రపంచాన్ని మోసుకొచ్చింది 
అది పూలుపూయడం నేర్చుకున్న దగ్గరినుంచి 
అన్నీ చిత్రాలే !
దాని వెంట కిచకిచలాడుతూ పలకరించే 
చిన్ని చిన్ని పిట్టలు 
  
సద్దుచేసే 
పరిమళ భరితమైన గాలి ,
తలలూపే ఆకులు,తుమ్మెదల రొద

ఇల్లంతా పండుగ సంరంభం

పెరట్లోంచి ఇంట్లోకి రాయబారిలా 
ఈ పూలచెట్టు తొంగిచూస్తూ మమ్మల్ని మాకే 
సరికొత్తగా పరిచయం చేస్తుంది 

                                          


































ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...