అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

20 Apr 2016

బాల్యం ఒక దివ్యగ్రంధం

బతుకు కతలు 


*రఘు మందాటి 'జ్ఞాపకాల గొలుసు' 



రఘు మందాటి చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, మంచి చదువరి, వ్రాయసగాడు. తను పుట్టి పెరిగిన ఊరునుంచి వారసత్వంగా తెచ్చుకున్న స్వచ్చమైన మనసును ఇంకా చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ బతుకుతున్నవాడు. గతాన్ని, వర్తమానాన్ని బేరీజు వేసుకొని, ఏం సాదిస్తున్నాడో, ఏం కోల్పోతున్నాడో ఎప్పటికప్పుడు తన అవగాహనను "అప్ డేట్" చేసుకుంటున్నవాడు - ఇవన్ని "జ్ఞాపకాల గొలుసు" చదువుతున్నప్పుడు ముందుగా నాకు అనిపించిన విషయాలు. "దేహం వర్తమానంలో ఇరుక్కొని, మనసు మాత్రం నా బాల్యం లోకి ఎప్పుడు తొంగి చూస్తూనే ఉంది" అనే ఎరుకను కలిగి ఉన్నవాడవడం చేతనే తన గతంలోని విషయాలను చెప్పేటప్పుడు తాదాత్మ్యంతో కూడిన వివశత్వం కనిపిస్తున్న ఎక్కడ "ఫాంటసైజ్" చేయకుండా ఒక నిర్మలమైన మనసుతో పూసగుచ్చినట్లు చెబుతాడు.
కష్టాలున్నాయి, కన్నీళ్లున్నాయి, ఆనందాలున్నాయి, ఆత్మీయతలున్నాయి, గెలుపు ఓటములున్నాయి, దారిద్ర్యం ఉంది, ఓడిపోవడాన్ని గమనిస్తూనే గెలుపు వైపే మొగ్గు చూపే గుండె నిబ్బరము ఉంది - ఇన్ని కలగలిసిన జీవితాన్ని తన బాల్యంలోనే నేర్చుకొన్న ఓర్పు సహజంగానే ఇతనికి అబ్బింది. ఆ ఓర్పు గుణమే ఇతని జ్ఞాపకాల నిండా పరుచుకుంది. ఒద్దికగా, ఒబ్బిడిగా ఒక సంవత్సరం నుండి మరో సంవత్సరంలోకి ప్రయాణిస్తూ పోయాడు. తన బాల్యాన్ని, దానిలోని అనేకానేక విషయాలని ప్రోది చేసుకొని ఒక తీర్మానం చేశాడు. "ప్రతి ఒకరి బాల్యం ఓ దివ్య గ్రంధం" అని, నిజమే! అది ఎటువంటిదైన, ఎన్ని అగాధాలు ఉన్న అది దివ్య గ్రంధమే! అమ్మ నాన్నలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు - ప్రపంచం అంత తమ పక్కకే ఉందనే ఓ ధీమా, ఓ స్వాంతన చేకూర్చే ఒక నమ్మకం; ఆ నమ్మకమే "ఓ దివ్య గ్రంధంగా" బాల్యాన్ని చెప్పుకునేట్లు చేస్తుంది.
ప్రపంచం విస్త్రుతమవుతూ పోతున్నపుడు ఈ అనుబంధాలన్నీ చెల్లా చెదురుగా తలో వైపుకు విసిరేయబడుతున్నపుడు, జీవితం ఒక పరీక్షగా సవాలు విసురుతున్నపుడు ఈ "దివ్యగ్రంధం" కాస్త, ఎవరికి వారు తమకు తాము స్వాంతన పరుచుకోవడానికి జ్ఞాపకాలుగా ముందుకు పదే పదే వచ్చి వాలుతాయి. వాటిని గొలుసుగా అల్లుకుంటూ, పలవరిస్తూ సేదతీరడమే మనమందరము చేస్తుంటాం. ఆ పనినే రఘు మందాటి ఎంతో వినయంగా, ఇష్టంగా చేస్తున్నాడు.
పాతికేళ్ళ జీవితం అతనికి గిర్నిలో పిండి పిండి అయిన మొక్కజొన్న గింజల్లా అనిపిస్తుంది. అటువంటి జీవన ప్రయాణం అతనిది. అందుకే అక్కర్లేని ముసుగులు వదులుకున్నాడు. తన ప్రమేయం లేని జీవితాన్ని ఇకపై బ్రతకకూడదనే తన కిష్టమైన "ఫోటోగ్రఫి" ని చేపట్టాడు. ఇష్టమైన ఫోటోగ్రఫిని ఎంత నిష్టగా ఎంచుకున్నాడో, అంత ఇష్టంగా ప్రతి చిన్ని చిన్ని జీవితంలోని అంశాన్ని ఎంతో డిటైల్ గా ఒక ఫోటోలాగా కళ్ళకు కట్టినట్టు తన "జ్ఞాపకాల గొలుసు" లో భద్రపరిచాడు. అందుకే చదువుతుంటే ప్రతిధృశ్యం ఫోటో ఫ్రేంలా మన ముందు కదులుతుంటుంది.
ఇతని వెన్నంటి అమ్మ, అమ్మ ప్రేమ, అమ్మ లాలన ఉన్నాయి. ఆ అమ్మ ఎంతో ఓపికస్తురాలు, మార్గదర్శనం చేసే గురువులాంటిది. రఘు రమారమి తన ప్రయాణంలో అమ్మ ప్రస్తావనను పరోక్షంగానైన, ప్రత్యక్షంగానైనా ఆమె గురించి రాసినవి చాలానే ఉన్నాయి. "పుట్నాలమ్మ" పై చూపిన ఆమె దయ గురించి ప్రస్తావిస్తూ అమ్మ గురించి చెప్పిన మాటలు వినండి. "మా అమ్మ మాకు తెలియకుండానే మా మనసులో ఎన్నో విషయాలు నింపింది. అందుకేనేమో నాలో చదువుని, మనుషుల్ని నమ్మక కేవలం మనసుల్ని నమ్మాలనే భావన నాటుకుంది. ఆ భావనే ఇప్పటికి నను ముందుకు నడిపిస్తుంటుంది". రఘు మునుముందుకు నడుస్తూనే ఉంటాడు. అతని వెంట అమ్మ చూపిన జీవన తాత్వికాంశ ఉంది. అందువల్ల రఘుకు ఎక్కడ దారి వెతుక్కోవాల్సిన అవసరమే రాలేదు.
"ఆశే లేకపోతే నిరాశే ఉండదు" - అని చెప్పే ఉద్గ్రందాలెన్నో చదవకుండానే రఘు తన జీవనానుభావంతో తానే తెలుసుకున్నాడు. తెల్లబూట్ల కోసం పడిన తపన తర్వాత అతను ప్రోదిచేసుకున్న అనుభవాన్ని చూస్తే - "ఆశలు పెంచుకోకపోవడం, ఒకరు ఇస్తారు అని ఎదురు చూడకుండా కష్టపడి సంపాదించుకోవడం, ఏదైనా ఉచితంగా దొరికితే, అంతే విలువైనదేదో నా నుండి దూరమైనదనో లేక దూరం కాబోతున్నదనో అని నిర్ణయించేసుకోవడం, కోరుకున్న ప్రతీది తప్పక తీరుతుందనే ధైర్యం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే నేర్చుకున్న" రఘుకు తాను ఏం తెలుకున్నాడో ఇంకెవరైనా విడమరిచి చెప్పాల్సిన అవసరంలేదు. అతను నేర్చుకున్న దాని విలువ ముందు ముందు తనకే అనుభుతమవుతుంది.
నగరం మనుషుల్ని రోబోట్లుగా తయారు చేసిన విధానం, తనది కాని జీవితం, తనది కాని శరీరం, తను అనుకోని జీవనం, కాలాన్ని డబ్బు ముక్కలకి కుదవ పెట్టడం, అరక్షణం కూడా తనకోసం తాను మిగుల్చుకోలేని ఆశక్తతల్ని గమనించిన రఘుకి, తన చిన్నప్పటి వనబోజనాలని మళ్లీ వెళ్ళాలనే తీవ్రమైన ఆకాంక్ష వుంది. "ఒకసారి ఆఫీసుకు డుమ్మ ( ఈ పదాన్ని స్కూల్ డేస్ లో వాడతాం. అది అతనికెంత అపురూపమైన పదమో, పసి మనసుతో మళ్లీ వాడడానిపించింది.) ఈ రణగొణ ధ్వనులకు, కంప్యూటర్, ఫేస్ బుక్, ఫ్లిక్కర్, వర్డ్ ప్రెస్, ఆర్కుట్, బ్లాగ్స్, గ్రూప్స్, ఐపాడ్ చివరాకరికి మొబైల్ వీటన్నింటిని వొదిలి, కెమరాని మెడలో వేసుకొని ఒక్క రోజంతా గడపాలనుంది. ఎప్పుడు వీలవుతుందో...?" వీలవుతుంది. రఘు కి వీలవుతుంది. ఎందుకు తప్పిపోదామనుకుంటున్నాడో స్పష్టత ఉంది. జీవన కాంక్ష అమితంగా ఉన్నవాడు కనుక అలా పలువరించగలుగుతున్నాడు.
ఆరిఫుతొ తన గాఢ స్నేహాన్ని, రంజాన్ పండగ జ్ఞాపకాల్ని మనముందు పరుస్తూనే ఒక గొప్ప మాటన్నాడు. "గుడికి, మసీదుకి కలిసి వెళ్ళిన మేము. మా ఇరువురి మతాలు వేరనే భావన ఎవరు మాకు నూరిపోయనందుకు చాల సంతోషంగా ఉంది. ఇప్పటికిను." అది రఘు చేసుకున్న అద్రుష్టం. కాని ఈ కాలమిప్పుడు అలా లేదు. మతం మర్రి చెట్టు కాదిప్పుడు. అతడు పెరిగిన వాతావరణంలో వున్న సంస్కారం వల్ల ఆ ఛాయలేవి అతనిపై పడలేదు.
ఆరుద్ర పురుగుల గురించి నాస్టాల్జియా, ఊళ్ళతో ఉన్న తన బాల్యపు అనుబంధం - ఇప్పటి పరిస్థితులు రఘుని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఒకప్పుడైతే ఊరిప్రయాణంలో బస్సు కిటికీ నుంచి చూస్తున్నపుడు ప్రకృతి అతనికి "వందమంది చిత్రకారుల వర్ణ చిత్రాలతో ఏర్పాటుచేసిన అతిపెద్ద సహజ గ్యాలరీలా అనిపించేది. ఇప్పుడేమో గ్రామాల్లోకి అభివృద్ధి పేరుతో ప్రవేశించిన మార్పులు తన సహజ గ్యాలరీ రూపురేఖల్ని మార్చివేశాయి. అసలు మనం మనుషులమేనా అనే నైరాశ్యం చుట్టుకుంది. చాలమందిని నిరాశకు గురిచేస్తున్న సమస్యే రఘుని కూడా మథనానికి గురిచేసింది. అభివృద్ధి పేరుతో మనషుల మధ్యన దూరం పెంచడానికే, ప్రకృతినింత దూరంగా విసిరేయడానికే అయితే ఇటువంటి అభివృద్ధి మనకు అవసరమా? - ఇతని ఆవేదననుండి ప్రతిఒక్కరు తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న.
మొక్కజొన్న గడక రఘుకి యిష్టం. జొన్నగడక చేదు ఇష్టం లేదు పాపం. గడక ఎందుకు తినాల్సి వచ్చిందో రఘుకి ఇంతకి అర్ధం కాదు. అతనికి మాత్రం ఎదురైన అనుభవాలు తల వంచుకోనేట్లు చేశాయి. ఎం చేస్తాడు ఆ చిన్ని మనసుకు జవాబు ఇంతకి దొరకలేదు. మళ్ళీ అమ్మనే జవాబు కోసం ఆశ్రయించాడు. అమ్మచెప్పిన జవాబుతో అతని మనసు నిండిపోయింది. ఇంకెవరికి తాను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదనే స్థితిని సాధించాడు. దటీజ్ అమ్మ!
నాన్న తాగుబోతు, అమ్మతో తగాదాలు, స్థిరమైన జీవితాన్ని కుటుంబానికి అందించలేని ఆయన ప్రవర్తన, ఇవ్వన్ని రఘుని చిన్నప్పట్నుండి వెంటాడుతూనే వున్నాయి. అయినా "మా నాన్న మంచోడే" అనే పెద్ద సర్టిఫికేట్ కొడుకుగా రఘు, వాళ్ళ నాన్నకు యిచ్చేస్తున్నాడు. ఎందుకో మీరే ఆ ఖండిక చదవండి చాలు.
చాలు, ఇంకా ఏం రాసినా నన్ను నేను రిపీట్ చేసుకొని "జ్ఞాపకాల గొలుసులో" ని మొత్తం వాక్యాలను మళ్ళీ ఇక్కడ రాయాల్సి వస్తుంది. రఘు అంతగా నన్ను తన బాల్యంతో కట్టిపడేసాడు. అలా కట్టిపడేయడానికి కారణం బహుశా రఘు జీవితంలాంటి జీవితం రమారమిగా నాది కూడా అవడం అయ్యిండొచ్చు.
ఇల్లిల్లు తిరిగి చదువుకున్న అబ్బాయి, ఐసు ఫ్రూట్ లు ఎండల్లో తిరుక్కుంటూ అమ్ముకునే అబ్బాయి, పేపర్లు పంచుకుంటూ నాలుగు చిల్లెర పైసలు సంపాదించుకున్న పిల్లాడు, కూలిపనికి పోయి బోలెడు చెంపదెబ్బలు తిట్లు సాధించుకున్న కుర్రాడు, సరియైన బట్టలు, కావాల్సిన బొక్కులు, వేసుకొనే చెప్పులు లేక తపించిన వాడు, - అవడం చేత రఘుని ప్రతి అక్షరంలోనూ చూసి,చదివి, నన్ను నేను సంభాళించుకోలేక, ఈ కొన్ని విషయాలు రాయగలనేమో! రఘుతో కరచాలనం ఇలా చేయగలుగుతున్ననేమో!!!!
రఘు మునుముందుకు సాగుతూపో, మీ అమ్మ స్కూల్కి వెళ్ళకుండానే ఎలా నేర్చుకుందో అని నువ్వు ఆశ్చర్యపోయిన ఆ మానవత్వ విలువలని, ప్రేమానురాగాలని, మంచి బుద్దులని, అన్నింటికీ మించిన తెలివిడిని నువ్వు కూడా వదులుకోకు!!!
అవే రక్షణ కవచాలు - జయహో!!!
~యాకూబ్ 
29 April 2012

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...