అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

27 Nov 2013

కవిత్వంతో మాటా ముచ్చట !

 
................................................

నిన్ను కలిసాకే
నా మనో ఉద్యానవనంలో పూలు పూచాయి
అక్షరాల కలువలు విప్పారాయి
దారినిండా పసుపుపూల ప్రేమ గీతాల దొంతర

నీ జ్ఞాపకాల తెమ్మెర తాకగానే
దేహం జీవనకాంక్షలా మారి
కొత్తకాంతుల్ని వెదజల్లుతుంది

ఏ జన్మల అనుబంధమో
నీ సమక్షంలో తల్లిని చేరిన బిడ్డలా
ఉప్పొంగుతాను
నీ నిమిరే చేతుల మధ్య
ఆత్మవిశ్వాసంలా ఇమిడిపోతాను

నా నుంచి నువ్వు దృష్టి మరల్చినప్పుడల్లా
అలిగి భూమిమీద ఏడుపు గొంతుతో పొర్లాడుతాను
నా అలసటల్లో సేదతీర్చే నీ ఊహ
అమృతబిందువుకన్నా శ్రేష్టం!
సతతం నాలోని చెట్టు చిగురింతకు
పత్రహరితాన్ని అద్దే ప్రకృతి నువ్వు-
’నీ కోసం నేనున్నాను’ అనే మాటల్ని
పదే పదే వల్లెవేసుకుంటూ
ఊరటపడుతుంటాను
1
"ఏదైనా మాట్లాడు"
"మాట్లాడుతోనే ఉన్నాను, వినిపించడం లేదా?
నాలోంచి నిరంతరంగా నీలోకి ప్రవహించే సారాన్ని ఒడిసి పట్టుకో"
"ఇంకాస్త మాట్లాడు"
"ఎన్ని ప్రతీకల్ని, ఎన్ని సంకేతాల్ని, ఎన్ని దృశ్యాల్ని
నీకోసం పంపుతున్నానో"
"అందడంలేదు"
'ఒడిసిపట్టుకో-జీవించు, అన్నీ అందుతాయి
మనసునంతా తెరిచి ఉంచు"
2
మధనపడుతున్నాను, మనోనేత్రం తెరిచివుంచాను
అందుకుంటున్నాను, చేజార్చుకుంటున్నాను
తెగిపోతూ మళ్లీ అతుక్కుంటున్నాను; ఎక్కడో జారిపోతున్నాను
చిగురిస్తున్నాను, మళ్లీ ఎండిపోతున్నాను
మళ్లీ జన్మిస్తాను సరికొత్తగా-
కొత్తగా నీలోకి నన్ను ఒంపుకోవడానికి అక్షరం లా పుడతాను
3
"నావైపు చూడు"
"ఇప్పుడే కళ్ళు తెరిచాను నిన్నెలా గుర్తుపట్టడం"
"అలా పరిగెత్తుతున్న మబ్బు; కిక్కిరిసిన రోడ్లు, విరిగిపోతున్న కాలం;
కాలుతున్న ఎడారులు; రాలుతున్న పూలు; కూలుతున్న మనిషి;
ఉరితీతకు ఎదురుచూస్తూ ఇనుపచువ్వల వెనుక
మార్మోగుతున్న పాట; నినదిస్తున్న గొంతు; నిద్రిస్తున్న, నటిస్తున్న రాజ్యం; ఓట్లలోకి బట్వాడా అవుతున్న ఖనిజం; లేచి పడుతున్న,
పడిలేస్తున్న ఉద్యమం; రూపమ్ మార్చుకుంటున్న మిత్ర శత్రువు;
మిణుకుమిణుకు మంటున్న ఆశ; దగ్ధమవుతున్న భవిష్యత్తు-
చూస్తూనే వుండు"

"ఇన్నిసంక్షోభాల మధ్య
నన్ను నేను సంభాఌంచుకుని, సమీకరించుకునే
గొంతు సవరింపువి నువ్వే!
నువ్వే నా మాటవి, వ్యక్తీకరణవి, మనుగడవి
అక్కున చేర్చుకునే మనిషివి!"

--'పాలపిట్ట' జనవరి 2012
At RaedLeaf Poetry Festival,Hyderabad alongwith Saptadeep,Hemant Divate and Linda Ashok.

అసలు ఏ ముఖం ?!

 
......................................

ఉన్నావా సరిగ్గా ఆ చిన్నప్పటి ముఖంతో 

రాత్రుళ్ళలో రెప్పలవెనుక దాచుకున్న కళ్ళలోకి 
వొంపుకున్నావా నిజంగా నిన్ను 
నిజమైన కలలాగా 

ఆ ముఖంగానే వున్నావా 

ముఖం వెనుక మరో ముఖంగా ; మరిన్ని ముఖాలుగా
తచ్చాడుతూ తచ్చాడుతూ
ఆ చిన్నప్పటి ముఖంలోంచి తప్పిపోయి అసలు ఏ ముఖమో తెలియనంతగా
నిన్ను నువ్వే గుర్తుపట్టలేనంతగా
మిగిలిపోయావా

చీకటి కరుస్తుంది ; వెలుగూ కరుస్తుంది
జీవితం సరేసరి
కరుస్తూనే వుంటుంది

రోజుల్లోంచి నెలల్లోకి నెలల్లోంచి
సంవత్సరాల్లోకి తప్పిపోతూ పోతూ చివరికెక్కడో
వో వొడ్డున నిలబడి

ఆ వొడ్డులోంచి కొన్ని సందేహాలతోనో,కొన్ని సంకేతాలతోనో
విస్తరిస్తూ వుంటాం అలా అందర్లోకి

కొందరు పసిగడతారు; గుర్తుపడతారు
ఆ చిన్నప్పటి ముఖాన్ని -వారే ,వాళ్ళే
కొన్ని కన్నీటిచుక్కల్తో ఆత్మీయంగా పలకరిస్తారు,హత్తుకుంటారు

మిగతా అందరూ ఆ పై పై ముఖాలదగ్గరే ఆగిపోయి
ఉండిపోతారు

*
లెక్కలేసుకోవాలి ఎప్పుడో ఒకప్పుడు అసలు ముఖంతో !
ఆయా ముఖాల దగ్గర
ఎందరు నిలబడివున్నారోనని ; ఎందరు నిష్క్రమించారో అని
 

18.11.2013

30 Oct 2013

సాక్షి లో ఇంటర్వ్యూ | 14.10.2013

కవిసంగమం  గురించి సాక్షిలో ..


7 Oct 2013

అక్కడే మిగిలాను.!



నిన్నటిలోంచి ఇవాళ్టిలోకి 
వొంపుకున్నాక ఇంకొంచెం అక్కడే మిగిలాను.

వర్షంలో తడిసి అరచేతిలో అంటుకుపోయి
నాతోనే ప్రయాణిస్తున్న గునుగుపూల నూగు.

*

చారెడు నేలలో బతుకుని కలగన్న స్వాప్నికుడు మహమ్మద్ మియా
కారేపల్లి సమాధుల తోటలో నిద్రిస్తున్నా
ఇవాళ్టి బతుకుచెట్టుకి
అప్పుడే విత్తనం నాటిపోయాడు.

ఇంటిపంచలో చోటిచ్చి ,ఆమె చేతి గటకముద్దలలో ఆకలి తీర్చి
బతకడానికి ఒక దోవ చూపించిన బొర్ర రామక్కకు
చీరె పెట్టి, కాళ్ళకు దణ్ణం పెట్టి కళ్ళల్లో నీళ్ళు కుక్కుకుంటూ ఎక్కెక్కి ఏడుస్తున్నప్పుడు
ఆమె ఋణం తీర్చుకుంటున్న నాన్న కన్పించాడు.

మేస్త్రీ పనుల్లో తాపీ పట్టి ఇళ్ళను కడ్తున్నప్పుడు
తన కళ్ళల్లో మెదిలిన గూడును
తాటిదూలాల ఒంటి గుడిసెగా సాకారం చేసుకోవడంలో కన్పించింది.

అక్షరం ముక్క తెలియక అప్పుకాగితం మీద
అంగుష్ఠం వేస్తున్నప్పుడు ఆయన బొటనవేలి మీద మిగిలిన సిరాలో
తన కొడుకుల చేతుల్లో కదలాల్సిన పలకా బలపాలు
ఊపిరిపోసుకోవడం కన్పించింది.

కావిడితట్టల్లో పేర్చుకుని ఊరూరా అమ్మడానికి తీసికెళ్ళే
అరిసెలు,మురుకులు,మసాలా దినుసులు,బెల్లం,ఉప్పు,పప్పుల్ల
తన పిల్లల ఆకలి తీర్చే అన్నం ముద్దలు కన్పించాయి.

*

నువ్వెవరివో నీకన్నా ఇంకెవరికీ తెలియదేమో ,నీ దారులేవో నువ్వు మాత్రమే గుర్తుపట్టగలవేమో, నీ వగపోతలూ,ఎగపోతలూ,ఎక్కే మెట్లూ దిగే మెట్లూ, చీత్కారాలూ,
నాన్నలోంచి ఇవాల్టిదాక కురుస్తున్న కుండపోత వర్షం.

చెట్ల కొమ్మలమీంచి
ఊరి పూరిగుడిసెల చూరుల లోంచి
సమాధుల తోట జ్ఞాపకాల్లోంచి
నిన్నటిలోంచి ఇవాళ్టిలోకి
వొంపుకున్నాక
ఇంకొంచెం అక్కడే మిగిలాను.

#17.7.2013

లోపలి పరుగు



ఏం మర్చిపోయాను ఇంట్లో 

తాళం వేశానా ,లేదా ?, గీజర్ స్విచ్ కట్టేశానా, పాలగిన్నె ఫ్రిజ్ లో పెట్టానా ,ఆ మూడు పిల్లులూ ఏం చేస్తాయో ఏమో 
టామీ రానీయకుండా మొరుగుతుందిలే,గేటు దాకా తరిమేస్తుందిలే 
అదేమిటో దానిదీ మొద్దునిద్రే !

అవునూ- ల్యాప్టాప్ లో logout అయ్యానో లేదో 
facebook అలానే ఉంచేసానా

ఈ ట్రాఫిక్ లో ఇలా చిక్కుకున్నాను,ఇలా రోజూ ఉన్నదే కానీ మళ్ళీ అలానే అనుకోవాలి.అనుకోకపోతే అదో వెలితి.ఇంకో 12 నిమిషాలే మిగిలింది, ఆలోపు ఆఫీసుకు వెళ్ళగలనా ,సంతకం పెట్టగలనా intime లో ,ట్రాఫిక్ సిగ్నల్స్ మీద ఎన్నాళ్ళిలా నన్ను నేనే
ఇలా కోపగించుకోవడం .

*
కవిసమయం మారింది.
కకావికలమైన జీవితం నిండా లోపలి పరుగుల గాయాల గుర్తులు. రాత్రంతా కురుస్తున్న వర్షం కోసిన రోడ్లమీద పారుతున్నవరదలో ఎక్కడో నావి కొన్ని రక్తపుచారికలు. బిగుసుకున్న రోజుల్లో కీల్లనోప్పుల్లాంటి బాధ.
మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్.మాటలన్నీ జమాఖర్చు లెక్కల చిట్టాలే. ఒకటవతేదీ నుండి ముప్పై ఒకటి వరకు మాత్రమే ఊహించగలిగిన జీవితం. బిల్లులు,చిల్లులూ ,వెరసి తరుగుదల ఖాతా లాంటి బతుకువాణిజ్య శాస్త్రం.
కొన్ని పుస్తకాలూ,కొందరు మనుషులూ మనసుకు తగిలించుకున్న పెయింటింగ్స్ లా అపుడపుడూ మనసుకు రంగులు పూస్తారు .

వారంనిండా ఆదివారం కల.
ట్రాఫిక్ లేని, తాళం కప్పలేని,పరుగులేని మరుపులాంటి ఒక కల.

*
22.7.2013

ఈ మధ్య !



నిన్నెవరైనా కలుసుకోవడానికి వచ్చారా ఈమధ్య !

కలుసుకోవాలని అన్పించడం గొప్ప బహుమానం నిజానికి .
ఎవరూ ఎవర్నీ కలవరు ఏదో ఒక పని ఉంటే తప్ప. ఏ పనీ, అవసరమూ,ఏ ఉబుసుపోకలు లేకుండానే కేవలం నిన్ను మాత్రమే కలిసి కలబోసుకోవడానికి వచ్చారా ,అయితే నువ్వో గొప్ప అదృష్టమంతుడివి.
మనిషిగా మిగిలున్న మనిషివి.

ఏమీ ఆశించకుండా గాలి అలా అలా చెట్లమీంచి,నీటిమీంచి,ఇళ్ళమీంచి వీస్తూ వెళ్ళినట్లు అతను నీ దగ్గరకు వచ్చాడంటేనే
అతనూ నువ్వూ ఇంకా సహజంగా వీస్తున్నట్లు !.

పదే పదే కలవమని ఇచ్చే నీ సందేశాల తర్వాత కూడా అతనికి నిన్ను కలవాలని అన్పించలేదంటే నువ్వెక్కడో మనిషిగా వోడిపోయావని అర్థమేమో ?
నువ్వెన్నిసార్లు ఫోనుల్లో పలకరించి బతిమాలి భయపెట్టి పిలిచినా ఒక్క అడుగూ నీవైపుకి సారించలేదంటే నువ్వేమిటో అతనికి అర్థం అయ్యిందని అర్థమేమో?

కొన్ని మైళ్ళు,కొన్ని యోజనాలు,ఇంకొన్ని అడ్డంకులు ,మరికొన్ని దూరాలు దాటి ,ఎక్కడో వో మూలన ఉన్న నీకోసం వెతుక్కుంటూ నిన్ను చేరుకున్నాడంటేనే నీలోని మనిషి అతనిలో ప్రతిష్టించుకున్నాడని అర్థం.
మనుషులు కనుమరుగవుతున్న కాలంలో నువ్వో మనిషిగా మిగిలున్నావని అర్థం.

చెప్పు
నిన్నెవరైనా కలుసుకోవడానికి వచ్చారా ఈమధ్య !

#4.9.2013

వదిలేసే ఆ సగం !



ఒక్కరిమే పోరాడితే ,మారితే ఏదీ మారదా ? భయపడి ఒక్కళ్ళమని ఇలాగే రోజుల్ని దొర్లించుకుంటూ ఉండటంలోనే అన్ని భద్రతలూ అలాగే మిగిలిపోతాయా?

ఇంటిని కాదనుకుని ఒక గదిలోకి వొంటరి వొక్కడిలోకి ;ప్రశాంతత లోంచి మరింత ప్రశాంతతలోకి మెట్లు వేద్దామా?

ఇంకేమిటో కావాలి;ఇంకేమిటో తెలియకుండానే అవునింకేమిటో కావాలి
పదేళ్ళ కిందటి మాట నుంచి ఇప్పటివరకూ ;ఇప్పటినుంచి
ఇంకొంచెం ముందటివరకూ ఏమీ తెలియకుండానే గడుచుకుంటూ,గడుపుకుంటూ
దాన్నే పొడిగిస్తూ,తెగ్గొడుతూ
అతికిస్తూ
ఎక్కడికెళ్ళాలో తెలియకుండానే ఇంకెక్కడికో మాత్రం వెళ్ళాలి

చదువుకునేవాడు నిర్మించుకునే ఆత్మకథల,వాచకాల మిగతా సగాల్లో ;తనకు తాను
పూరించుకునే ,నింపుకునే కవిత్వంలో -నిజమే సగమే కదూ ఇన్నాళ్ళు ఎవరైనా రాసి
కాగితాలకెత్తిందీ !
పూర్తిగా రాసినవాడెవడూ ఇంకా మిగిలే లేడేమో?!

వదిలేసే సగం కోసమే ఆ కాగితాల్లోకి జొరబడి ,అడుగిడి
పుటలై,ఇటులై,అటులై
సగమే నిజమని,సంపూర్తి అబద్దమని తేల్చేస్తారు

*

ఇటుకేసి రా !
ఈ సంపూర్తులనుండి విసుగొచ్చి ఆ సగంలోంచి ఈ పిల్లాడు
ఇంకో గదిలోకి ,ఒంటరి వొంటరిలోకి అద్దెకు వెళ్తున్నాడు.
భద్రతల్ని చెరసాలలుగా భావించే జీవితంలోంచి
ఆ సగం ఏమిటో తెలుసుకునే ప్రయాణం ఇప్పుడే మొదలయ్యింది చూడు !!

26.9.2013

నవ్వుతున్నది ఇప్పుడు ప్రేక్షకులు.!



ఇంకొంచెం సేపు ఆగుదాం.ఎండ ఎలాగూ పెరుగుతుంది.ఆ పైపూతల వెనుక దాక్కున్న అసలు ముఖమేదో దానంతటదే బయటికి వస్తుంది.

విదూషకుడు కవ్విస్తాడు.నవ్విస్తాడు.కత్తిదూసి మీది మీదికి ఇక ఆ క్షణమే ఇక నీ చివరి క్షణమన్నట్లు నటిస్తాడు.
కాకపొతే ,ఇతడేమో జీవించేస్తాడు నిజమే అన్నట్లు.

నిజమే ! ఇక్కడ కొంచెం ప్రేమను పంచడం నేరమే !
ఆత్మీయంగా అక్కున చేర్చుకోవడం పెద్ద తప్పే !
వాటినే నేరాలుగా చూపిస్తూ మరీ ఇంతగా నటిస్తూ, వంచనలుగా చూపిస్తూ
తెరలుతెరలుగా నవ్వుకోవడమే విచిత్రం.

మరీ ఇంతగా అసలు ముఖం బయటికొస్తుందని ప్రేక్షకులెవరూ అసలే అనుకోలేదు.
ఆ తర్వాత అసలు ఏ ముఖం నిజమో తెలియనంత పాత్రల్లో జీవించడం
అదే వింతల్లో నీచమైన వింత.

మరో నాటకం తెరలేస్తుందిప్పుడు
పాత్రలెవరూ లేరు
కానీ నాటకం సాగిపోతూనే ఉంటుంది.

ఎవరూ కనపడకుండానే అంతా నటించినట్లు ,సారం అంతా అర్థమైపోయేట్లు
సరికొత్త సృష్టి రూపకల్పన చేసినందుకు
చివరికి - అందరూ నిలబడి చప్పట్లు కొట్టే దృశ్యం .

క్షమించు.
విదూషకుడు నిశ్శబ్దంగా ఇప్పుడు మారిపోయాడు.
నవ్వుతున్నది ఇప్పుడు ప్రేక్షకులు.!

27.9.2013
[మరాఠీ కవి హేమంత్ దివాటే 'A Depressingly Monotonous Landscape' కవితా సంపుటి చదివాక]

ఇంకా ఇంకా ఇంకా ...



కొంచెం కొంచెంగా తరిగిపోతున్న రోజులలో
ఒక పక్కన ఒద్దికగా నడుస్తూ, చివరికిలా
కొంత మిగుల్చుకున్నాను

కలవరపెట్టే రాత్రి కలలలోంచి
నావైన కలలలోని కలలని వేరు పరచుకుని
నిదుర లేచాను. ఇక ఈ రోజంతా వాటి రహస్య గుసగుసలు నావెంట-

పొద్దుటి మంచును,పొద్దుటి ఇంటిని దాటివచ్చాను.
మనసును వొత్తిన ఈ దిగులును మాత్రం
వెంట తెచ్చాను;నిన్నటి సాయంత్రం సరాసరి నాలోకే ఒరిగిన కన్నీళ్ళలో
జీవితాన్ని తోడాను.

అవునులే !
ఎవరూ వోర్వరు,న్నిజంగానే నువ్విలా ఇంకా బతికే ఉన్నావని
తొందరగా పోరాదూ
నువ్వున్నప్పటి కంటే పోయాకే ఎక్కువగా ప్రేమించేవారి కోసం

ఇక మిగిలేందుకు – నీతో, నాతో-
కొంత మిగిలి ఉండేందుకు కాలం ఉంది. కవిత్వం ఉంది. బోలెడు అక్షరాలున్నాయి

కొంత ఓరిమితో ప్రయత్నిస్తాను.
ఎవరన్నారు జీవితం
అయిపోయిందని-

3.4.2013

దండం ,ప్రణామం ,సలాం !



అన్నీ తెలిసి తెలియనట్లుండే నీకు, 
అన్నీ చదివి చదవనట్లుండే ,చూసినా చూడనట్లుండే నీ తెలివికి 
సలాం

గుర్తుపట్టినా గుర్తుపట్టనట్లు; పలకరించినా గుర్తురానట్లు ,
ఎరిగినా ఎరగనట్లు మరీ చెప్పించుకుని,రప్పించుకుని,
అపుడపుడూ తప్పించుకుని మొత్తానికి నిన్ను నువ్వే
ప్రత్యేకంగా ప్రతిష్టించుకునే నిపుణతకు
ప్రణామం.

చదివితే అబ్బే వినయం; చదవగా వొచ్చే పరిణతి;
చదవగా చదవగా కన్పించే ఒకానొక విజ్డం,ఉదాత్తత
ఇవేవీ దరికే రానీక జాగ్రత్తలెన్నోపడి చిట్టచివరికిలా
రాజదండపు కొసన వేలాడే
మంత్రదండంలా మారిపోయినందుకు
దండం.

అక్కరకు రాని చుట్టంలాంటి అక్షరాలను
డబ్బాలో వేసుకుని డబాడబా మోగిస్తూ
నిశ్శబ్దం కోసం మాటల్నినిద్రామాత్రలుగా మార్చి
అక్షరాలా ప్రయోగిస్తున్నందుకు
ప్రణామం.

****
నాకనిపిస్తుంది, పేపర్ మీది నాలుగు రాతల్తో కరపత్రంగా
మిగలడం తప్ప,నిజంగా హృదయంతో కరచాలనం చేయడం
నీకేనాటికైనా అనుభవంలోకి వస్తుందా అని?!


6.10.2013

3 Sept 2013

పాఠాల ధ్వని



నిన్న మొన్నటివరకూ ఇటువైపే చూడలేదు.

రెండు ఎంగిలి అక్షరం మెతుకులైనా విదల్చలేదు
చిరుగుల్లోంచి తొంగిచూసే దారిద్ర్యపు దేహంపై
ఒక్క భరోసా వస్త్రాన్నయినా కప్పనేలేదు
ఉబుసుపోని అక్షరాలలోనైనా ఆశ్రయం కల్పించనేలేదు
నీకోసం నువ్వే, నీలో నువ్వే ఒకానొక ఆధిపత్య శిబిరానివై
పలవరించావ్,కలవరించావ్,పేజీలు పేజీలుగా కీర్తిపుటలవై రెపరెపలాడావు

ప్రయాణం నీనుంచే ప్రారంభించి, నీలోకే ముగించావు
నీ స్మరణ లోనే నువ్వే మునిగితేలావ్
అన్ని ప్రారంభాలు నీ కాలికింది నుంచే కావాలని
అన్ని నిర్మాణాలు నీ కనుసన్నల్లోనే నడవాలని
అన్ని కలబోతలు నీ ప్రణాళికల ప్రహేళికలే అవ్వాలని
నీవిన్నాళ్ళూ పన్నిన వ్యూహాలు
ప్రశ్నల్లా ఎదురుతిరిగి నీకే గుచ్చుకుంటున్నాయి.

*
నువ్వతికించిన ప్లాస్టర్ ల వెనుక గొంతు
సరికొత్త భాషని సమాయత్తం చేసుకుంది.
సంకేతాల్లో,పదచిత్రాల్లో,అభివ్యక్తిలో
నీ వ్యూహాల వ్యుత్పత్తి అర్ధాలను ఛేదించే కొడవల్లిక్కుల్నిసమకూర్చుకుంది.

నీ నీ అవసరాల ,అభ్యర్థనల,అహంకారాల,ఆకాంక్షల
అవసరంగా చేసుకున్న అక్షరాన్ని చెర విడిపించి
సమిష్టిగొంతుగా మలుచుకున్న కొత్త బడిలో సరికొత్త పుస్తకంగా చదువుకుంటోంది.
ఇక కొత్త పదచిత్రం ,సరికొత్త సంకేతం ,విస్మయపరిచే నిర్మాణం
నీ వైపే చూస్తూ కవ్విస్తాయి,పందెం కాస్తాయి,పరుగులు తీస్తాయి చూడు.

నువ్విన్నాళ్ళు పన్నిన వ్యూహాల్లోకి జొరబడి
నీ వలల్ని,వలువల్ని కొరికి కొరికి తినేస్తాయి కాచుకో .
బొటనవేలుల్నినరికేసినా కొత్తగా మొలవని కాలం పోయింది.
మొదళ్ళు పీకేసినా సరికొత్తగా మొలుచుకొచ్చే ప్రతిసృష్టి విద్య నేర్చుకునే పుట్టాం.

నిన్న మొన్నటివరకూ ఇటువైపు చూడనేలేదు.
ఇప్పుడిక మేం వల్లెవేసే పాఠాల ధ్వని నీదాకా చేరుతుంది విను.

#2.9.2013

ఒకప్పటి మాట

 
తునికొర్రెలో ఎలుగ్గొడ్డు దాక్కున్నట్టు 
దేహంలో కోర్కె పడుకుంది

ఊరోళ్ళంతా కర్రలు పట్టుకుని
ఒర్రె వైపు పోతున్నారు ఎలుగ్గొడ్డును తరుముదామని
-మరి ఈ ఈ దేహం మాటేమిటి?

చుట్టూతా పన్నిన వలలే
వేసిన మాటులే
బెదరదు
కదలదు
తనను తానే పారదోలుతుంది , ఎదురు తిరుగుతుంది

తప్పించుకోవడం ఎప్పటికీ కుదరదు
పారిపోవడం
ఈ దేహంలోని కోర్కెకు అలవాటే
ఎదురు తిరగదు

ఎదురు తిరగడంకన్నా
ఇలా దేహం లోనే దాక్కోవడం
అలవాటైన మర్యాదలాంటి సులువు.

#30.8.2013

ఊపిరాడదు !



తెరలు తెరలుగా దగ్గు , ఊపిరాడనంత.

గుక్కెడు నీళ్ళలోని తడి గొంతులోని ఏ పొరను తాకిందో
ఉక్కిరిబిక్కిరి చేసే దగ్గు 

తలపై ఆదుర్దా అమ్మ స్పర్శ
'ఎవరో నిన్ను గుర్తు 
చేసుకుంటున్నారని' నా కళ్ళల్లోని కన్నీళ్లను తుడుస్తూ అంటుంది.
దగ్గుకూడా బావుంటుందనే ఆ అమ్మ స్పర్శ
నగరంలొ ఓ మూల- పైకప్పునీ నాలుగ్గోడలనీ పంచుకుంటూ భార్యాపిల్లలూ
రొటీన్ పరుగులూ, క్రమం తప్పని బిల్లులూ
అపుడపుడు, అక్షరస్పర్శకోసం వో సాహిత్య సమావేశం,
ఎప్పుడో నిర్వచనం మరిచిపోయిన జీవితస్పర్శ
- ఇంతకుమించి చెప్పుకోవడానికేమీ మిగలని తనంలో 
ఎవరు గుర్తుచేసుకుంటారులే - 
నేనేమన్నా కిచకిచమని పలకరించే బల్లి తప్ప!
**
నిన్ననే నేనొక కొత్త మనిషిని పలకరించాను . 
ఓ కవిమిత్రుడి తడి ఆరని అక్షరాలని ఆప్యాయంగా
స్పృశించుకున్నాను మనసారా--
మెచ్చుకుంటూ వో రెండు మాటల్నీ రాశాను .
కవిమిత్రుని ఆర్తినీ, ఆవేదననీ అర్ధంచేసుకున్నానన్న
నా నాలుగు అక్షరాలనీ పంచుకున్నాను కూడా
ఆమధ్యే కొందరం కలిసి కూచుని 
మరో సమావేశంలో నాలుగు అక్షరాల్ని తలచుకున్నాం.
***
తెరలు తెరలుగా దగ్గు , ఊపిరాడనంత.
గుండెల్ని పిండేసే దగ్గు..ఆత్మీయస్పర్శ కోసమడిగే దగ్గు
బహుశా--
ఇలా పలకరించుకోవడం,రాయడం,పంచుకోవడం,కలుసుకోవడం 
నచ్చడం లేదేమో ! 
కలవకుండా, కలపకుండా ఉంచే పెట్టుబడిదారీ మనస్తత్వమేదో
ఎక్కడో ఓ చోట నన్ను గుర్తుచేసుకుంటూ 
ఇలా ఊపిరాడనీయని దగ్గులా చుట్టేస్తుంది కాబోలు.

స్పర్శ మాత్రం మిగిలే ఉంటుందంటూ గోడపై బల్లి కిచకిచ...

#29.8.2013

22 Aug 2013

కవిసంగమం-Facebook Poetry Group



2013 లో ఇప్పటివరకూ ఎనిమిది 'కవిసంగమం' కార్యక్రమాలు ప్రతినెలా రెండవ శనివారం జరిగాయి.
ఈ 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' కవిసంగమం కార్యక్రమంలో ఐదుగురు చొప్పున కవులు కవిత్వం విన్పించారు.

1. ఒక ప్రముఖ కవి.
2.ఇదివరకే కవిగా గుర్తింపు పొంది, 'కవిసంగమం'లోనూ రాస్తున్న కవి.
3.ముగ్గురు ప్రవర్థమాన కవులు.

ఈ సంరంభంలో పాల్గొన్న కవులు ~

వేదిక :లామకాన్ 
....................
జనవరి 27- నగ్నముని | వసీరా | కిరణ్ గాలి,మెర్సీ మార్గరెట్,చింతం ప్రవీణ్ .
ఫిబ్రవరి 9 - నిఖిలేశ్వర్ | పులిపాటి గురుస్వామి | నందకిషోర్,జయశ్రీనాయుడు,క్రాంతి శ్రీనివాసరావు
మార్చి 9 - విమల | బివివి ప్రసాద్ | యజ్ఞపాల్ రాజు,శాంతిశ్రీ ,చాంద్ ఉస్మాన్
ఏప్రిల్ 13 -వరవరరావు | కాసుల లింగారెడ్డి | అనిల్ డానీ,మెరాజ్ ఫాతిమా,నరేష్ కుమార్
మే 11 - దేవిప్రియ |కోడూరి విజయకుమార్ |సివి సురేష్,వనజ తాతినేని,బాలు వాకదాని
జూన్ 8 - అమ్మంగి వేణుగోపాల్ | రెడ్డి రామకృష్ణ | మొయిద శ్రీనివాసరావు,రాళ్ళబండి శశిశ్రీ ,తుమ్మా ప్రసాద్

వేదిక : 'గోల్డెన్ త్రెషోల్డ్'
.........................
జూలై 13 - శీలా వీర్రాజు | సత్యశ్రీనివాస్ | లుగేంద్ర పిళ్ళై,సొన్నాయిల కృష్ణవేణి,కృపాకర్ పొనుగోటి
ఆగష్టు 10 - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ |దాసరాజు రామారావు |కాశిరాజు,పూర్ణిమా సిరి,శ్రీకాంత్ కాన్టేకర్

ఈ వరసలో ఈ సంవత్సరంలో ఇంకా మిగిలిన కార్యక్రమాలు :
సెప్టెంబర్ 14 -
అక్టోబర్ 12 -
నవంబర్ 9 -
డిసెంబర్ 14 -K_A_V_I_S_A_N_G_A_M_A_M P.O.E.T.R.Y F.E.S.T.I.V.A.L.



ఏదో మిగిలే ఉంది !


లోపల ఇంకా ఏదో మిగిలే ఉంది.స్థిరంగా ఉంది.తడిగా ఉంది.రక్తమంటి జిగట జిగటగా ఉంది.
చేతికి అంటిన అన్నంమెతుకుల ఎంగిలిలా ఉంది.కడిగిన చేతివేళ్ళ మధ్య దాగిన కారపుమరకలా ఉంది.

ఏదో మిగిలే ఉంది.

ఒంటరిగా వొంటరి ఒంటరివై వొంటరి 
వొంటరితనంతో కసిగా రక్కేస్తున్న -ఒంటరి.

నిజమో కాదో తెలియక ,మిగిలిందే చివరిదని,చివరికి మిగిలిందేనని
నమ్ముతూ రోజుల్ని అమ్ముతూ పగళ్ళూ రాత్రుళ్ళూపొర్లుతూ దొర్లుతూ
ఎంతో మిగిలిపోతూ, మిగిలినదేదో తెలియని
ఏదో మిగిలే ఉంది.

లోపల దాచిన అసలు రహాస్యమే నువ్వు
బయటికి కన్పిస్తున్నది అసలు నువ్వేకాదు.

అసలు ఏం చెబుతావో
మాటలేవీ మాటలే కావు.
ముఖం దాచుకోవాల్సిరావడం
ముఖంపై నిజాల్ని తొడుక్కోలేకపోవడం ఇవాల్టి పదచిత్రం.

నిజమేనేమో- ఇలా తవ్విపోస్తున్నది ఈ మెట్రో రైలు గుంతలని కానేకాదు
నగరం నడిబొడ్డు మీద నిన్నే నిన్నే నిన్నే....!!

#15.8.2013

కలవంటి మరణం

త్రిశ్రీ చనిపోయాక నివాళిగా ఒక కవిత 10.11.96 లో రాసాను. నా 'సరిహద్దు రేఖ'[పుట .78,79]లో ప్రచురించాను.


....................

చెట్లు ఎండిన అశ్రువుల్ని రాల్చాయి
మేఘం ఇది చూసి కలవరపడి ఉంటుంది 
మరణాన్నే బహుశా ఇది సంశయానికి గురిచేసి ఉంటుంది.

కలవంటి మరణం 
మరణం వంటి కల 
కలకూ,జీవితానికీ చివరికంటా తెగని ప్రశ్న 

తల పగిలి కలలన్నీ భళ్ళున రాలి చెల్లచెదురై పోయుంటాయి 
కాగితాలకేత్తేవాళ్ళెవరూ ఆ దారిలో సంచరించి ఉండరు.

అక్షరాలవంటి జ్ఞాపకాలు 
జ్ఞాపకాలవంటి అక్షరాలు 

అక్షరాలే ఇప్పుడు ఇక అతడి రూపం 
వర్షంలా,రోడ్డులా,నీడలా మరణమే ఇక అతని వెంట నడుస్తుంది 

1

అన్నిటికీ మించి జీవించడమే గొప్ప వరం 
అన్ని రహాస్యాలు అక్కడే దాగి ఉంటాయి 
దేహం రహస్యాల ఖని 
లోపల తవ్వుకుని,అక్షరాలుగా రాసిపోసేందుకే 
ఎప్పటికప్పుడు శ్రమించాలి ,అవైనా మరణాన్ని జయిస్తాయి.

కలల్ని జయించేందుకే అతడు జీవించాడు 
కలలే అతడిని ఇంకా బతికిస్తాయి 
కలల్ని కనే వాళ్లందరూ చిరంజీవులు ,అతని కలల్లో మచ్చుకి ఒకటి :
"వస్తూనే అనుకున్నాను కొత్తగా వద్దు 
పాతగానే మాట్లాడుదామని 
కొన్ని కొత్త సంగతులను 
పాతగా చెబితేనే కొత్తగా అర్థమవుతాయి"

మరణాన్ని కలగా మార్చినవాడు 
స్వప్నాలకు గజ్జెలు కట్టినవాడు
'హో' అన్నవాడు,రహాస్యోద్యమకారుడు ,అక్షరాలకు ఆగ్రహం నేర్పినవాడు,దళితవాదం 
సంధించినవాడు,'కవిత్వం ప్రచురణ'య్యినవాడు 
'యికలేడు' అని అంత తొందరగా తేల్చవద్దు! 

అతడిది 
"ఒక ప్రారంభం కోసం 
ఒక ముగింపు నిరీక్షణ"

[త్రిపురనేని శ్రీనివాస్ జ్ఞాపకానికి]

22 Jul 2013

లోపలి పరుగు

 
...............................

ఏం మర్చిపోయాను ఇంట్లో 

తాళం వేశానా ,లేదా ?, గీజర్ స్విచ్ కట్టేశానా, పాలగిన్నె ఫ్రిజ్ లో పెట్టానా ,ఆ మూడు పిల్లులూ ఏం చేస్తాయో ఏమో
టామీ రానీయకుండా మొరుగుతుందిలే,గేటు దాకా తరిమేస్తుందిలే
అదేమిటో దానిదీ మొద్దునిద్రే !

అవునూ- ల్యాప్టాప్ లో logout అయ్యానో లేదో
facebook అలానే ఉంచేసానా

ఈ ట్రాఫిక్ లో ఇలా చిక్కుకున్నాను,ఇలా రోజూ ఉన్నదే కానీ మళ్ళీ అలానే అనుకోవాలి.అనుకోకపోతే అదో వెలితి.ఇంకో 12 నిమిషాలే మిగిలింది, ఆలోపు ఆఫీసుకు వెళ్ళగలనా ,సంతకం పెట్టగలనా intime లో ,ట్రాఫిక్ సిగ్నల్స్ మీద ఎన్నాళ్ళిలా నన్ను నేనే
ఇలా కోపగించుకోవడం .

*
కవిసమయం మారింది.
కకావికలమైన జీవితం నిండా లోపలి పరుగుల గాయాల గుర్తులు. రాత్రంతా కురుస్తున్న వర్షం కోసిన రోడ్లమీద పారుతున్నవరదలో ఎక్కడో నావి కొన్ని రక్తపుచారికలు. బిగుసుకున్న రోజుల్లో కీల్లనోప్పుల్లాంటి బాధ.
మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్.మాటలన్నీ జమాఖర్చు లెక్కల చిట్టాలే. ఒకటవతేదీ నుండి ముప్పై ఒకటి వరకు మాత్రమే ఊహించగలిగిన జీవితం. బిల్లులు,చిల్లులూ ,వెరసి తరుగుదల ఖాతా లాంటి బతుకువాణిజ్య శాస్త్రం.
కొన్ని పుస్తకాలూ,కొందరు మనుషులూ మనసుకు తగిలించుకున్న పెయింటింగ్స్ లా అపుడపుడూ మనసుకు రంగులు పూస్తారు .

వారంనిండా ఆదివారం కల.
ట్రాఫిక్ లేని, తాళం కప్పలేని,పరుగులేని మరుపులాంటి ఒక కల.

*
22.7.2013

21 Jul 2013

సన్నటి అలికిడి

 
................................

గుడ్డులా చితుకుతోంది రాత్రి -
చుట్టూతా సొనలు కారుతున్నదేదో బాధ. మూగగా రోదిస్తున్న క్షణాలు ఆచ్చాదనల్ని ఒక్కొక్కటిగా ఒలుచుకుంటూ మీది మీదికి ఒస్తున్నట్లుగా ఉంది.

దూరంగా ఏదో వస్తున్నట్టు 
రైలుపట్టాల్లాంటి ఈ మనసు మీద సన్నటి అలికిడి.

ఎక్కడో కొన్ని వందల మైళ్ళకు అవతల
నాకోసం పక్కలో తడుముకుంటూ చిన్నప్పుడు నాకు
తినిపించకుండా
మిగిలిపోయిన అన్నం ముద్దల్ని తలుచుకుంటూ
" నా బిడ్డ-తిన్నడో లేదో, ఏం బాధలు పడ్తున్నడో"అని
దిండుగా చేసుకున్న తన చేతిని ఈ రాత్రి
కన్నీళ్ళతో తడుపుతుందేమో ?!

తప్పిపోయానని శోకాలు పెట్టి
మాఊరు వాగు మడుగుల్లో ఉబ్బిన శవామైనా దొరుకుతుందని
రోజంతా నాకోసం దేవులాడిన మా అమ్మకు
దొరక్కుండా
పిలిస్తే పలక్కుండా
ఇంత దూరంగా దాక్కున్నాననే కదూ -నేను కలిసినప్పుడల్లా
తన కొడుకుని నాలో కాక నా కొడుకులో వెతుక్కుంటుంది.!

నిజమే
మనం మనలో కాక
ఇతరుల్లోనే ఎక్కువగా దొరికిపోతాం కదూ !!!

# 11.7.2013

అనువాద కవిత

 
టి.పి.రాజీవన్ [మలయాళ కవి]
...................................

ఇసుకరేణువులకు విశేషత ఉంది -

సూర్యోదయం ముందు, సూర్యాస్తమయం తర్వాత 
అవి మనుషుల్లా మారి పోతాయి 
ఏడుస్తాయ్, పోట్లాడుకుంటాయ్, నవ్వుతాయ్,
కౌగలించుకుని ముద్దు పెట్టుకుంటాయి

చీకటి ముసిరినా , వెలుతురు వచ్చినా
మళ్ళీ ఇసుకరేణువుల్లా మారిపోతుంటాయి
నీలాగా, నాలాగా
కలుసుకునేముందు, విడిపోయే ముందులా !

*ప్రణయ శతకం నుండి.

నల్లవాగు

 
........................

చెరువు అలుగు పారకముందు ఎండిన కట్టేలా తనలోకి తానే
ముడుచుకుని గొణుక్కుంటూ నీళ్ళను కలగంటుంది

అక్కడక్కడా మడుగుల్లో మిగిలిన బురద నీళ్ళలో 
తనే ఒక జ్ఞాపకమై 
కలవరిస్తుంది 

ఎండాకాలం
మడుగులచుట్టూ బురదలో
పశువుల గిట్టల గుర్తుల్లో మిగిలిన నీటితడిలో
ప్రవాహాన్ని కలగంటున్న వాగు

వానజల్లుల తర్వాత
వాగుముఖంలో నీటినవ్వు.

అలక తీరిన అలుగు పారి
కాళ్ళకు తొడుక్కున్న చక్రాలతో
నల్లవాగును రహదారిగా మార్చేస్తుంది.

ఊరిముందటి రేవులో వడివడిగా నడుస్తూ
మట్టిబుంగల్లోంచి ఊళ్లో గాబుల్లో చేరే నల్లవాగు
రాత్రి చంద్రుడిని తనలోకి వొంపుకుంటుంది.

తుమ్మముళ్ళ కొనలమీంచి, బర్రెంక చెట్ల మీంచి,ఊడుగుపొదల మీంచి
జిల్లేడుఆకుల మీంచి, మాబీర రొట్టమీంచి, బురద రొచ్చు మీంచి,
పరుగులు పెట్టే నల్లవాగు నీళ్ళకు
వైద్యం కోసం నానపెట్టిన ఔషధరసాయనంలాంటి కమ్మదనం.

-చవచవ్వగా,ఉప్పఉప్పగా మా వూరు గొంతు తడిపే నల్లవాగు
న్నిజంగానే
మాకు ఒక గోదావరి,ఒక కృష్ణా,ఒక ప్రాణహిత.!


*మా వూరి కవిత -సీరీస్ 1
15.7.2013

అక్కడే మిగిలాను.


.......................................

నిన్నటిలోంచి ఇవాళ్టిలోకి 
వొంపుకున్నాక ఇంకొంచెం అక్కడే మిగిలాను.

వర్షంలో తడిసి అరచేతిలో అంటుకుపోయి
నాతోనే ప్రయాణిస్తున్న గునుగుపూల నూగు.

*

చారెడు నేలలో బతుకుని కలగన్న స్వాప్నికుడు మహమ్మద్ మియా
కారేపల్లి సమాధుల తోటలో నిద్రిస్తున్నా
ఇవాళ్టి బతుకుచెట్టుకి
అప్పుడే విత్తనం నాటిపోయాడు.

ఇంటిపంచలో చోటిచ్చి ,ఆమె చేతి గటకముద్దలలో ఆకలి తీర్చి
బతకడానికి ఒక దోవ చూపించిన బొర్ర రామక్కకు
చీరె పెట్టి, కాళ్ళకు దణ్ణం పెట్టి కళ్ళల్లో నీళ్ళు కుక్కుకుంటూ ఎక్కెక్కి ఏడుస్తున్నప్పుడు
ఆమె ఋణం తీర్చుకుంటున్న నాన్న కన్పించాడు.

మేస్త్రీ పనుల్లో తాపీ పట్టి ఇళ్ళను కడ్తున్నప్పుడు
తన కళ్ళల్లో మెదిలిన గూడును
తాటిదూలాల ఒంటి గుడిసెగా సాకారం చేసుకోవడంలో కన్పించింది.

అక్షరం ముక్క తెలియక అప్పుకాగితం మీద
అంగుష్ఠం వేస్తున్నప్పుడు ఆయన బొటనవేలి మీద మిగిలిన సిరాలో
తన కొడుకుల చేతుల్లో కదలాల్సిన పలకా బలపాలు
ఊపిరిపోసుకోవడం కన్పించింది.

కావిడితట్టల్లో పేర్చుకుని ఊరూరా అమ్మడానికి తీసికెళ్ళే
అరిసెలు,మురుకులు,మసాలా దినుసులు,బెల్లం,ఉప్పు,పప్పుల్ల
తన పిల్లల ఆకలి తీర్చే అన్నం ముద్దలు కన్పించాయి.

*

నువ్వెవరివో నీకన్నా ఇంకెవరికీ తెలియదేమో ,నీ దారులేవో నువ్వు మాత్రమే గుర్తుపట్టగలవేమో, నీ వగపోతలూ,ఎగపోతలూ,ఎక్కే మెట్లూ దిగే మెట్లూ, చీత్కారాలూ,
నాన్నలోంచి ఇవాల్టిదాక కురుస్తున్న కుండపోత వర్షం.

చెట్ల కొమ్మలమీంచి
ఊరి పూరిగుడిసెల చూరుల లోంచి
సమాధుల తోట జ్ఞాపకాల్లోంచి
నిన్నటిలోంచి ఇవాళ్టిలోకి
వొంపుకున్నాక
ఇంకొంచెం అక్కడే మిగిలాను.

#17.7.2013

15 Jul 2013

తప్పక మళ్ళీ ఎగురుతాం.



["ఒక్కోసారి జీవితంలో మనం వెళ్లేదారి మనని విజయం దాకా తీసుకు వెళ్తుందని కచ్చితంగా చెప్పలేం. కానీ హటాత్తుగా ,ఎక్కడినుంచో మీకొక చిన్న సూచన దొరుకుతుంది. మీరు సరైన దారినే ముందుకు సాగుతున్నారని అది మీకు సూచిస్తుంది ''
-Jim Stovall, 'The Ultimate Gift' .]

గాలిలో తేలుతూ రెండు పక్షి ఈకలు వాకిట్లోకి వచ్చాయి.
వాటి రెపరెపల చప్పుడులో ఇప్పటిదాకా ఎగిరిన విహారమంతా కనిపిస్తోంది.
గూళ్ళలో పొదువుకున్న తల్లిరెక్కల వేడి జ్ఞాపకపు వాసన. కాళ్ళకు అంటుకున్న చెట్లకొమ్మల మీది వగరు. ఆకులమీంచి ఎగిరిన గోళ్ళపై అంటిన పసరు కమ్మదనం.

అంతకుమించి వియోగంలోని దు:ఖం. ఎండల్లో వానల్లో గడ్డకట్టించిన చలిలో ప్రాణాలు దక్కించుకుని ఆకాశమై విస్తరించిన పయనం. ముక్కున కరుచుకుని గూటి గూటికి మార్చిన తల్లి మమకారం. డేగ కాళ్లకు చిక్కనంత ,పాము నోటికి అందనంత రక్షణకవచమై కాపాడిన అమ్మతనం.

పక్షి ఈకల్లో ప్రవహిస్తున్న జీవితం.
రాలుతున్న జ్ఞాపకాల వాసన.
ఒక్కోసారి తమలోకి తామే ముడుచుకుపోతూ ,కొంచెం కొంచెంగా కదులుతూ
గుసగుసలుగా సంభాషణ.

'ఎక్కడ ఉన్నాం'
'వెనక్కి వెళ్లి మళ్ళీ ఎక్కడ అతికించుకుందాం'
'ఏ ఆకుల కొమ్మల్లో గూడులమై విశ్రమిద్దాం'
'ఏ రెక్కల కుదురుల్లో ఎగిసే గాలులమై ఊపిరి పోసుకుందాం'

' రెక్కలకష్టం తెలిసిన వాళ్ళం .'
' దు:ఖపు అర్థం విడమరిచి చూసినవాళ్ళం '
' ఆకలిదప్పుల అంతరార్థం మనకంటే ఇంకెవరికి తెలుసు '
' కన్నీళ్లను ,కష్టాలను సరాసరి మనమే అనుభవించాం. '
'జీవితాన్ని చెత్తకుప్పలోంచో, మురికి ఇంటి ముంగిటిలోంచో ,బీదతనపు కరుకుతనంలోంచో మొదలుపెట్టినవాళ్ళం. రెడీమేడ్ భద్ర కుటుంబాల ధైర్యమేదీ అసలే లేదు. అంతకుమించి వంశపారంపర్యపు అతిశయం అంతకన్నా లేదు. అట్టడుగునుంచి అందిపుచ్చుకున్న వారసత్వపుబలం మనలోనే దాగిఉంది.'

'ఇప్పుడిక్కడ పడ్డాం.
తప్పక మళ్ళీ ఎగురుతాం.
ఇవాళ రెక్కలు మనతో లేకపోవచ్చు. జీవితపు అనుభవం మన ఆస్తి. మన బలం.
ఎగురుదాం.
తప్పక -ఎగురుతాం !! '

***
వాటి రెపరెపల చప్పుడులో ఇప్పటిదాకా ఎగిరిన విహాయసమంతా వినిపిస్తోంది
విశ్వాసం ధ్వనిస్తోంది.

8 Jul 2013

మళ్ళీ ఒక రోజు


................................

నిరాటంకంగా నిర్విఘ్నంగా సాగాల్సిందేదీ ముందుకు సాగదు
ఆనందంగా గడవాల్సిన రోజేదీ చివరికంటా అలా మిగలదు
ముఖమ్మీద గంటు పెట్టుకున్నట్టు ,
కాలిపిక్క మెలితిరిగి శరీరమే ఒక గాయమన్నట్లు భారంగా రోజు.

ఎర్రటి ఎండలో తాటిగెలల్ని ముందేసుకుని
రోడ్డుమీద కూచుని
నాలుగు డబ్బుల్ని రేపటి తన చదువు కోసం కలగన్న ఆ కుర్రాడు
మళ్ళీ నిన్న గుర్తొచ్చాడు.


పరీక్షాహాలులో ప్రశ్నార్థకమై తనముందున్న పరుచుకున్న
ప్రశ్నాపత్రాన్ని ఎగాదిగా చూస్తూ తననుతానే బహిష్కరించుకుంటున్న విద్యార్థి
క్యాంటీన్ లో ఒక సిగరెట్ పీకలో దహించుకు పోతుండటం
మళ్ళీ నిన్న గుర్తొచ్చింది.

ఖరీదైన జీవితంలోకి అలవాటు పడిన నగరంలో
అస్తవ్యస్తంగా పోగేసుకున్న నాలుగు అక్షరాలను
ఏదో ఒకలా పేర్చుకుని,నేర్చుకుని రేపటిలోకి ప్రయాణం కట్టిన
ఆ పిల్లలందరూ గుర్తొచ్చారు.

పూర్తిగా కోల్పోయాకో,లేదా ఎంతోకొంత మిగిలాకో
ఆ జీవితాన్ని జీవిస్తున్నట్లు నటిస్తూ, అందరిముందూ అలాగే కొనసాగిస్తూ
రోజుల్నీ,నెలల్నీ,సంవత్సరాలనీ దాటిస్తూ
జీవించడం- ఒక పనిగా పూర్తిచేసుకుంటున్నమనుషులూ గుర్తొచ్చారు.

ఊడిపోతున్న అట్టలమధ్య పదిలంగా కుట్టుకుని
రోజుకిన్ని పేజీలుగా తిప్పుకుంటూ తిరగవేసుకుంటున్న జీవితం పాతవాచకమే !
అందుకే
అన్నీ ఇలా గుర్తుకొస్తాయేమో మరి !

# 8.7.2013

15 May 2013

చప్పట్లు


అవును ,అందరూ అలానే భావించారు.

ఇవ్వాళ్టికి సరిగ్గా ఇరవైమూడేళ్ళ ముందు కొన్ని పూలదండలు,
మరీ ముఖ్యంగా సాంబమూర్తి స్పాన్సర్డ్ నాకిష్టమైన ఆకుపచ్చని పుదీనా దండా
మెళ్ళో వేసుకున్నాక కూడా వీల్లెలాగూ పదికాలాలు కలిసి ఉండటం కనా కష్టమని
-అవునలానే అనుకున్నారు.

మరీ ముఖ్యంగా మిత్రులుగా మెలుగుతూనే శత్రువులుగా రాణిస్తున్న
మిత్రశత్రువులు,అప్పటికలాగా ఫిక్స్ అయిపోయారు.

ఏం ఆశించాను అప్పటికి
కనీసం నన్ను కోరుకునే ఒక్క మనిషైనా ఈ లోకంలో
నాకోసం మిగిలున్దాలని.
నాక్కొంచం నేను ఒక మనిషినేనని నమ్మకం ఇవ్వాలని.

ఆపై గుప్పెడు మెతుకులు నాతోపాటు తినడం కోసం
ఎదురుచూసే ఒక నిండు అన్నమ్మెతుకులాంటి ఒక మనిషి
నా అన్నేళ్ల ఆకలి కడుపుపై జాలి చూపుతూ
అప్పటివరకూ మాడిన నా రోజుల్ని మరిపింపజేయాలని.

కొంచెం కూడూ, ఒక గూడూ, ఒక నమ్మకం, మరికాస్త స్నేహం,
విసుగులు ,అలకలు ముగిశాక పున: పున: జీవించే కాంక్ష
వెతుక్కునే పర్సులు, లేని ఆదాయంతో పెట్టే ఖర్చులు, ఖర్చుల కోసం శ్రమించే గంటలు
ఆ గంటల్లో కోల్పోయే ఆత్మవిశ్వాసాలు,
ఎన్నెన్నో కంప్లయింట్స్, ఆ తర్వాత జీవితపు తీరం గుర్తొచ్చి సర్దుబాటులు

ఇవన్నీ కలగలిసిన ఒక హిందూ ముస్లిం జంట ఒక ఆదర్శపు బతుకుజంటలా
ఏ ఇబ్బందీ లేని ఒకానొక జీవన క్షేత్రం నిర్మించి
అందరినీ మెప్పిస్తున్నట్లు బతుకు వెళ్లదీయటం- ఇదొక అదనపు బాధ్యత.

పిల్లలోచ్చారు, పేర్లలో మతమేదో స్ఫురించకుండా జాగ్రత్తలు.
కిరాయి యింటి ఓనరు ముందు
మేమెవరమో తెలిసి ఇల్లివ్వడేమోనని శంకలు .
అందరూ అదోలా చూస్తుండడాన్ని పట్టించుకోనట్లు గంభీరమైన ముఖముద్రలు

అవును- ఇవన్నీ దాటుకుంటూ ఇరవై మూడేళ్ళ సహజీవనం
ఒక పండుగను మించిన
ఒకానొక సాహసం చేసొచ్చిన జీవితమంతటి అనుభవం.

**
అవును ,అందరూ అలానే భావించారు.

ఇప్పుడు మా ప్రయాణం చూసాక చప్పట్లు కొడుతూ
వాళ్ళే మాచుట్టూ మూగారు.
గెలిచాక చప్పట్ల శబ్దం వినడం గొప్ప తృప్తి.!

*10.5.2013

25 Feb 2013

చిందరవందర



ఎవరికి చేరుతున్నానిప్పుడు, ఎక్కడికి చేరుతున్నానిప్పుడు
ఆ దారిని వదిలేశాక ఈ దారినెటువైపుగా సాగుతున్నాను

ఈ గతపు దారుల్లో మిగిలిన ఈ పాదముద్రలు ఇలా మోసుకుంటూ,బరువైపోయాక కూడా
ఇంకిలానే భుజం మార్చకుండా  ఈ మూటనిలా దించకుండా ,ఇంకెవరికీ అప్పగించకుండా
మోసుకుంటూ తిరుగుతూ తిరుగుతూ తిరగడం.

కాళ్లేప్పుడో నొప్పెట్టడం మర్చిపోయి
అలిసిపోయి అవీ నాలోకే ముడుచుకు పడుకున్నాయి.

ఇన్నిన్ని  జ్ఞాపకాల శవాలు ,అవి బతికిన గతపు దుర్గంధం
వాటినుండి నాలోకి,నాలోంచి వాటిలోకి
వస్తూ పోతూ అలాగే గడ్డకట్టిన దు:ఖం లోని చివరి కరగని రాలని కన్నీటిబొట్టు

మొన్నటినుంచి నిన్నటిలోకి,ఇవాల్టిలోకి
నేనే నన్నే ఒంపుకున్నానిలా ;ఎవరూ చూడ్లేదు
సరిపోయింది ,కానైతే నన్నెలానూ పసిగట్టరు
నా నమ్మకం ఓడిపోకుండా ఇలా ఇక్కడ నిలబెట్టుకున్నాను సరే;ఎలాగూ ఖచ్చితంగా గుర్తించరు

నన్నో బాంబు ముద్దిడింది
ఆ తర్వాతే తనను అసహ్యించుకుని పేలిపోయింది
పగిలిపోయిన దేహమ్మీదికి ఒంగి తనలో తాను కాలిపోయింది.

సమూహంలోకి,మృత్యువులోకి
రాలిన క్షణాల్లోకి,నెప్పెట్టిన బతుకుల్లోకి ముక్కలుముక్కలై
తేదీలు తేదీలుగా రోడ్డు మీదికి వస్తూ పోతూ
పలరింపుల పడజాలమేదో మార్చి అందర్నీ నిందిస్తుంది

నన్నెవరో  గుర్తుగా మార్చారు
వంచించారు,వలచారు,లెంపకాయ కొట్టారు,అలిగారు నాపై కసితో శోకించారు
బోలెడు సోదలున్నాయి ఇంకా;మిగిలినవెన్నో కథలున్నాయి

"ఎవడ్రా -నన్నో మనిషని పిలుస్తున్నారు
కనీసం అమర్యాద కూడా తెలవని ఆ పిలుపెవడిది"



--

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...