అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

27 Dec 2012

మిగిలుండాలి!

అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి
ఒక చోటుండాలి ,ఊరుండాలి
కనీసం ఒక మనిషైనా మిగిలుండాలి

మాటలన్నీ పగిలిపోయి ,కరిగిపోయి
అర్ధాలన్నీ చెదిరిపోయి,బెదిరిపోయి
భావాలన్నీ కనుమరుగైపోయినప్పుడు
మాటల్ని కొత్తగా నేర్చుకునేందుకు ఒక నెలవుండాలి

కోర్కెలు అంతరించి ,దేహం ఒట్టి పుల్లైనప్పుడు
ఊహలు అరిగిపోయి మనసు ఉత్తి డొల్లయినప్పుడు
దారులన్నీ మూసుకుపోయి చిమ్మచీకటి మాత్రమె మిగిలినప్పుడు
మళ్ళీ కొత్తగా మొలిచేందుకు
ఒక్క పలకరింపు చినుకైనా మిగిలుండాలి

గతంలోకి ,భవిష్యత్తులోకి లోలకమై వేలాడుతున్న వర్తమానంలో
లుంగీ బనీనును మోస్తున్న ఒకానొక ఆకారంలా కాక
నెలవారీ జీవితమై విసిగి వేసారిపోయే చెల్లింపుల బిల్లుల్లోంచి
అర్ధరహితంగా ముఖాలమీంచి జారే చిరునవ్వులలోంచి
వ్యూహాల ఉత్తి సందర్భాలలోంచి
నీవేప్పుడైనా ప్రవేశించగలిగే నీదనే నిజమైన జీవితం ఒకటుండాలి

కనీసం
గూటిలోకి దూరేముందు టపటపా కొట్టుకునే
పక్షి రెక్కల ఒడుపులా
జీవితాన్ని ఒడుపుగా చేరుకోగలగాలి
పారుతున్న నీళ్ళను చేతుల్తో కళ్ళిగొట్టి,తేర్చి దోసిళ్ళతో
నీళ్ళను నోటికందించి దాహం తీర్చుకున్నట్లు
మిగిలిన దాహంలోంచి దేహాన్ని సేదతీర్చాలి
చిప్పిల్లే చిల్లుల్లోంచి పిండి విసిరేసిన మైనపుముద్దలాంటి
తేనెపట్టు మీద చివరిగా విలపిస్తున్నతేనెటీగలాంటి దేహంలోంచి
అవశేషమే నిజమైన ప్రాణవంతజీవితమన్నట్లు ఎదగాలి

నీలోకి ఇమిడిపోయి రగిలిపోయి నీకులా నువ్వు మిగిలిఉండేందుకు
ఎక్కడైనా ఒక చోటుండాలి ,ఊరుండాలి
కనీసం ఒక్క మనిషైనా మిగిలి ఉండాలి

17 Dec 2012

మళ్ళీ వచ్చారెవరో!




ఎవరో వచ్చారు
వాకిట్లో నిలబడి పిలుస్తూనే ఉన్నారు
ఇన్ని సముద్రాల్ని ఈదుకుంటూ,ఇన్ని జీవితాల్ని దాటుకుంటూ
ఎవరో
బహుశా ఇంత ఊపిరిని ,
ఇంకొంచెం కాలాన్ని పట్టుకొచ్చారనుకుంటాను

ఎంతకీ పెదవి విప్పరు
ఎంతకీ ముఖం మీద నవ్వుల తెరచాప ఎత్తరు
గుండెలోకి చేయి దూర్చి
తెచ్చిన కబుర్ల జున్ను ఎంతకీ పంచి పెట్టరు

వచ్చి యుగాలవుతున్నా పెదవి విప్పరు
పుట్టలా పెరిగిపోతున్న కాలాన్ని తొలుచుకుని బయటికీ రారు !
మౌనం చుట్టే తిరుగుతూ ఉంటారు.
పగళ్ళనూ రాత్రులనూ ఆహ్వానిస్తూ
బహుశా జీవితం నిరీక్షిస్తున్నదనుకున్తాను

*
ఎక్కడో మర్రిచెట్టు మీద గుడ్లగూబ ఎగిరింది.
ఇంటినిండా దుఖం కరిగింది
లోపలా బయటా ముసురు.

ఒళ్ళంతా ఇప్పుడు జ్ఞాపకాలకాల్వలా ప్రవహిస్తుంది
ఇక ఎప్పటికీ వాళ్ళు తెచ్చిన కబురుచెప్పరేమో
రాత్రంతా అలానే పిలుస్తూనే ఉంటారేమో
ఏమో !

13 Nov 2012

బహు'ముఖీ'నం


.....................

పూలను రాల్చే చెట్లలాంటి ముఖాలు
ఇసుకతుఫాను కప్పేసిన ఎడారి ముఖాలు
తుపాకుల్లాంటి ముఖాలు
నిదురను తలపించే అశాంతి ముఖాలు

ముఖాల మీది ముఖాలు
లోపలి ముఖాలు
బూజువేలాడే ముఖాలు

క్రౌర్యం మొలిచిన కళ్ళలోంచి
ముళ్ళను ప్రదర్శించే ముఖాలు

మ్రుత్యుశయ్యలాంటి ముఖాలు;
రంగులకు రంగులద్దే ముఖాలు
------దాగివుండే ముఖాలలోని ముఖాలు

తెరచాపలు కట్టుకుని ప్రశాంతంగా సాగిపోయే నావల్లాంటి ముఖాలు, అలల తాకిడికి ఆదమరిచి నిద్రించే ప్రశాంత తీరాల్లాంటి ముఖాలు,ఇంద్రధనుస్సుల్లా ఆకాశాన్ని ముద్దాడే ముఖాలు, స్వేచ్చగా విహరించే ముఖాలు, ముఖాలలోని లోలోని పసిముఖాలు

నిరంతరం
వెంటాడే ముఖాలు బహుముఖీనాలు

1 Nov 2012

పాఠం


........................

తీగెలు తెగాలి ;
కలవనంత కలపనంత దూరం నిలబడి
నిశ్హబ్దాన్ని వాహికగా మలుచుకుని బతికేయాలి

చీకటి కమ్ముకోవాలి ;
వెలుగేమిటో కాంతి ఏమిటో కళ్ళముందు మెరిసేట్లు కదలాలి
అంతా అనుకున్నట్లు జరిగిపోవడం
బోలెడంత బోర్

అడ్డు ఏమిటో, ఆటంకాలేమిటో అర్ధమవ్వాలి

సంతోషాలే నిజమైన జీవితం కానేకాదు
అంచుకు నంజుకునే చింతతొక్కులా చింత పక్కనే ఉండాలి
వంతనల మధ్య రాటుదేలి
మిగిలిన జీవితంతో కలుపుగోలుగా కలిసిపోవాలి

అంతే మరి ?!


31.10.2010

24 Oct 2012

స్మృతిశకలం


...............................

అప్పుడప్పుడు
ఏదోఒక స్వరం వెంటాడుతున్నట్లు ఉంటుంది.
అపరిచితంగా ధ్వనించే
ఆ గొంతు తెల్లని సముద్రపునురగలా
కొండవాలులా దూసుకుపోతున్న పిల్లగాలిలా ఉంటుంది.

చుట్టూతా పరికిస్తాను
పరిచితులెవరూ అగుపించరు

లోలోకి తొంగిచూస్తాను
సముద్రపు నురగ,దూసుకుపోతున్న గాలి...!

ఏమిటీ పోలిక-
పోలికను విడమరిచి అర్థం వెతుక్కునేందుకు
ప్రయత్నిస్తాను.

ప్రయత్నం ప్రయత్నంగానే మిగిలిపోతుంది
బహుశా
అది నన్నో స్మృతిశకలంగా మిగిల్చిన
జ్ణాపకం కాబోలు !

20 Sept 2012

ప్రేమ ఒక ఉనికి


పూలతోటలోంచి పువ్వు కళ్లు విప్పార్చి నవ్వుతున్నట్లు ఆమె నవ్వుతుంది.గలగల పారే సెలయేటి మధ్య సుడులు తిరుగుతున్న నీళ్ళలా ఆమె నవ్వుతుంది.
మిట్టమధ్యాహ్నం నీడల్లోకి ప్రయాణం కట్టిన తెల్లటిమేఘంలా ఆమె నవ్వుతుంది.నవ్వుకు నవ్వులనడకలు నేర్పుతూ అలిసినట్లు అపుడపుడూ కునుకుకూడా తీస్తుంది.
నిద్రపోతున్న ఆ కళ్ళవెనుక కదులుతున్న దృశ్యాల్లో బహుశా ఎవరో దాగిఉన్నారు
.
దాగిన దృశ్యాలకు,దాగని అర్ధాలకు నడుమ చేతనంగా కదులుతున్న భావాలేవో తచ్హాడుతుంటాయి.

పాటలగుంపులు ఆత్మమీదుగా బారులు తీరుతుంటాయి.
అందులోంచి తప్పుకుని కొంగలాంటి పాట. తెలతెల్లని సంతోషం లాంటి పాట. ప్రేమకు ప్రతిరూపం లాంటి పాట.
'కలవరమాయె మదిలో..నా మదిలో' ను హమ్మింగ్ చేస్తో పలవరిస్తూ ఆమెలా రూపుకడుతుంది.
కలలపైన కదిలే నావలా తేలియాడుతుంది.నావలో చరిస్తూ,సంచలిస్తూ ఆమె పాటను వెంటపెట్టుకుని ఎటో వెళ్ళిపోతుంది.

ప్రేమిస్తూనే ఉండిపోవాలి తెల్లటి మేఘాల్లాంటి ఊహల్ని ఆత్మపైన పయనింపచేస్తూ ఆమె గమనాన్ని,గమకాల్ని గమనిస్తూ..
ఆమెలోంచి నేనూ,నాలోంచి ఆమే
పయనిస్తూ అలిసిపోని ప్రయాణీకుల్లా సాగిపోతుంటాం.
మెలకువలోంచి , ఉనికిలోంచి
ఊపిరిలోంచి ,హృదయపుస్పందనలోంచి ఎదురుపడే
సుపరిచితమైన పాటవంటిదేనేమో ప్రేమ.

వింటున్నాను.
కలగంటున్నాను.
ప్రేమను ఒక ఉనికిగా అనువదించుకుంటున్నాను.

*20.9.2012

12 Sept 2012

ఒక జన్మే !


ఉన్నదొకటే జన్మ

నవ్వినా ఏడ్చినా
ఓడినా పోరాడినా
సుఖించినా దుఃఖించినా

=ఉన్నదొకటే జన్మ!

ఆ లోపలే చింతచిగురు కుప్పల్లా పిలిచే కోర్కెలు
కాగితాలకు చేరుకునే దారుల్లో పయనిస్తూ పదాలు
వేళ్లకొనలపై కునుకుతూ ,జోగుతూ
మెలుకువను కలకంటూ అక్షరాలు
నొప్పెట్టే పాదాల్తో
రాత్రుల్నిఈదే దేహాల తీరనితనం=

కొంత ఊరట,ఇంకొంత వగపు

కొన్ని సందర్భాలు,కొన్ని సంకల్పాలు
=కొడిగడుతూ,వెలుగుతూ గడియారపు ముళ్ళు
*
ఎవరైనా అడుగుతారా కుశలాన్నీ
ఏమైనా తెస్తారా

ఇంకేం ఇస్తారూ
ఇంకేం అడుగుతారు ఇంతకుమించి

అడిగి,లోపలంతా కడిగి
ఎవరైనా ఏమివ్వగలరు?!

*
ఒక జన్మే మరలి రాదు
తిరిగి, మరల రానే రాదు

--------------------------------
*పరివర్ధిత కవిత;26.8.2012

॥వృత్తాలు॥


రాత్రంతా ఒక్కడే చంద్రుడు
ఒంటరి ఆకాశపు అద్దంముందు నిల్చొని
మళ్ళీ మళ్ళీ ముంగురులు చెరుపుకుంటూ,తలదువ్వుకుంటూ

=అలిసిపోయాడేమో
నా తొడమీద తలపెట్టుకుని గాఢనిద్రలో ఉన్నాడు
ఇప్పుడిలా


ఉదయానికి
నా రోజువారి పనుల్లోకి వెళ్ళిపోవాలి
హాజరుపట్టీలో నన్ను నేను ఉన్నానని నిరూపించుకోవాలి.
ఎప్పటికప్పుడూ ఇలా ప్రతిరోజు
నిరూపించుకోవడం అలవాటైపోయింది
అలా అలవాటుచేస్తున్న ఉదయాలకు నమస్కారం!

=ఇక్కడేమో ఈ చంద్రుడు
ఎప్పటికీ మేల్కోడు, లేపి నిద్రను చెడగొట్టనూ లేను!
నిద్రకంటే అతనికి నేనివ్వగలిగిన కానుక మరింకేముంది?!
నిద్రిస్తున్నాడు ఎంతో నిశ్చింతగా;మళ్ళీ జీవిస్తున్నట్లు మళ్ళీ జన్మిస్తున్నట్లు

నా ఒక రోజుని కానుకగా ఇస్తాను-
నన్ను వెన్నెల్లో ఆడించినందుకు
నన్నొక కవిత్వాన్ని చేసి నాకే ఇచ్హినందుకు
నాలోపలి కాంతికి వెన్నెలను జోడించినందుకు
నాకిచ్హినదంతా తిరిగి ఇవ్వగలిగినంత ఇచ్హేస్తాను

=వృత్తాన్ని నేనూ,చంద్రుడూ
తన నిద్రతో,నా కృతజ్నతతో చుడుతూనేఉన్నాం
ఎప్పట్నుంచో

మళ్ళీ రాత్రి కోసం
ఆకాశాన్ని అద్దంగా మార్చడానికి
నేనొక వృత్తంగా మారి నాలోకి నేనే ప్రయాణించడానికి!

ష్..
సెలవిక

నిద్రలో ఏదో కలవరింత.
వినాలి వెన్నెలమర్మాలన్నీ చెవియొగ్గి......!!

*7.9.2012

కలవాలి !



నిన్న కొందరిని కలిశాను

కలవకుండానే,ఏ విషయాలు చెప్పకుండానే
వారం క్రితం వెళ్ళిపోయిన సహాధ్యాయి రాయలయ్య
సమాధిలోకి తొంగిచూసి
నిన్ననే='హాలియా'లో
కలిసొచ్హాను.


చదువుకునే రోజుల్లో
కొన్ని కప్పుల టీని,కొన్ని కబుర్లను ఒంపుకున్న
రవి ఆత్మహత్యాగ్రహాన్ని
ఇవాళ వార్తలుగా కలుస్తున్నాను.

కలుద్దామెప్పుడైనా అనుకున్నవాళ్లంతా ఇలా
కనుమరుగై పోతున్నారేమిటీ?!

(అబ్బా...!
కలవడం కూడా కష్టంగా మారిపోతున్నబతుకును
ఇలా మోస్తూ తిరగడం
సెలవేస్తున్న గాయాలను మోయడం
ఎవర్నీకలవగలగని జీవితాన్ని భరిస్తూ,మోస్తూ
చివరిచూపు దక్కని నేరస్తుడిలా మారిపోవడం!!)

కలవాలి,కలవాలి
సమయం లేదు,ప్రతిక్షణం ఎవరినో ఒకరిని కలవాలి
కలవాల్సిన సందర్భాల్ని,కలబోసుకునే కాలాల్ని,కన్నీళ్ల కలబోతల, కదిలింతల వేళల్నితక్షణమే డైరీల్లో రాసుకోవాలి.సమయం లేదు.

కలుద్దామెప్పుడైనా అనుకోవడం
రేపు జీవిద్దామనుకోవడమేమో?!
రేపటిని రేపే జీవిద్దాం ఉంటే గింటే,
ఇవాళను మాత్రం ఇప్పుడే జీవించాలి=

*10.9.2012

27 Jun 2012

ఈ రాత్రిని కొలవాలి

------------
ఈ రాత్రిని కొలవాలి
ముసురుపట్టిన  ఈ రాత్రిలో
ఇంకిన వర్షపుచినుకుల్లో తడిచి వణుకుతున్న
రాత్రిదేహాన్ని కొలవాలి.
1
దుఃఖపుజీర అంటిన కాలపుచెక్కిలి మీద
స్ఫోటకం మచ్చలా నిద్రిస్తున్న రాత్రి;

పగలంతా అలిసి ,ఇల్లంతా తిరిగి తిరిగి విసిరేయబడ్డ
మసిగుడ్డలాంటి రాత్రి;
2
=మరలాంటి రాత్రి ,కాలి ఆరిపోయిన కొరకాసులాంటి రాత్రి=

కొలవగా కొలవగా మిగిలిపొయిన రాత్రిని
కల లో ప లి ర హా స్యా ల లోంచి  కొలవాలి .





23 Jun 2012

ఆత్మకథ

 
ఉగ్గంపల్లి పీరీల కొట్టం,జయ్యారం ఏటిపాట,చినగూడురు గడీల మగ్గిన బతుకులు,
సాయిబులో దూదేకులో తేడాతెలియని అమాయక జ్ఞానం,మాట్లాడితే పీరీలు ఊరేగిన గాధలు,అర్ధరూపాయికోసం ఆరుమైళ్ళు నడిచిన సిత్రాలు,బండమీద తాటిదూలాలతో కట్టుకున్న ఒంటిదూలం గుడిసె కతలు,పొవ్వాకు చుట్టను చుట్టుకునే నేర్పులు,గుక్కతిప్పుకోకుండా ఊపిరితీసుకోకుండా బీడీలు తాగిన వైనాలు,ఐదుగురన్నదమ్ముల ఆరాటాలు,అందరి పొత్తునా పుట్టిన 'అక్కమ్మ 'లాంటి అక్క;
అక్కకోసం అమ్మపంపిన గోష్కీ సాలన్`బుత్తీలు,మీఅమ్మకోసం నువ్వు కొనుక్కొచ్చిన చీరల కధలు,మానుకోటనుండి బెజవాడదాకా రైలుకట్టమీద నడుచుకుంటూ కూలీ కోసం తరలిపోయినకష్టాలు

నాయినా!ఇదంతా నీ కన్నీటి వ్యధ!

మామ్మతో నీ నిఖాముచ్చట్లు,మాతాత కరీంసాబు గొడ్లుకోసి పోగులుపంచిన దృష్టాంతాలు,కావిడి చేతుల కాకలు తీరిన నీ ముచ్చట్లు;ముత్రాసి గూడెం,రేగుల గూడెం,పూసమోళ్ళ గుంపు,అనంతారం 'ఓ సాయిబూ ' అని పిలుచుకున్న దగ్గరితనాలు,వడితిరిగిపోయిన నీ పిక్కల నరాలు,తట్ట మోసిమోసి బోడిగుండైన నీ వంకీల జుట్టు

అబ్బ! ఇదంతా నీ జీవిత గాధ!

ఇరవైగుంటల పొలంలో బంగారం పండించిన వైనాలు,ఏట పెట్టడాలు,ఎగసాయం చేయడాలు,మోట కొట్టడాలు,మోపులెత్తడాలూ,కాసెపోసి పంచెకట్టడాలు,ఎలుగుకట్టడాలు,గిత్త ఒట్టకొట్టడాలు,తాడుపేనడాలు,చిక్కం వేయడాలు,గుమ్మి కట్టడాలు,ఇటుకబట్టి కాల్చడాలు,మునుం పట్టడాలు,రుణంతీర్చుకోవడాలు,పందిరేయడాలు,పగ్గమేయడాలూ

అబ్బా!ఇదంతా నావారసత్వపు కధ!

20 Jun 2012

ఒక సంభాషణ ముగిశాక,మరో సంభాషణ

****

నువ్వెప్పుడైనా నీ సంభాషణలో నువ్వే పరాయిగా మిగలడం
ఆ పిదప
నీ మాటల్లోనే నువ్వు మునిగితేలుతుండటం
గమనించావా?

లేక, నువ్వే నీవి కాని మాటలతో
అప్పటిదాకా గడపటం-అలానే ఇంకా గడిపేస్తుండటం
గమనించావా?

నిన్నటిదాకా నీకు నువ్వే వేసుకున్న దారుల్లో
నీ అడుగుల్నినువ్వే లెక్కించుకుంటూ
ఆ దారుల్లోనే మళ్ళీ మళ్ళీ
నడుస్తూ తడుస్తూ ఆ సంగతులే పదేపదే చెపుతూ
అక్కడే మిగిలిపోయావని గమనించావా?

మనుషుల్నిముడిసరుకులుగా మార్చే
వ్యాపార సంస్క్రుతి లోకి,అంకెలుగా మార్చే వ్యూహాల్లోకి
నువ్వూ, నీ అక్షరమూ చేరిపోతున్నాయని
గమనించావా?

గమనించీ ఎవరూ గమనించడం లేదనే
ధైర్యంతో అలా
ఉండిపోయావా?!

11 Jun 2012

ఒక్కొక్కరోజు-6

ఇప్పుడు నేను మౌనాన్ని
నా నిజమైన వ్యక్తీకరణగా నిర్మించుకున్నాను
నిశ్శబ్దాన్ని నాలోపలి అస్త్రంగా మార్చుకున్నాను

కొన్నేళ్ళనుంచి నాపాదాల కింద నలిగిపోయిన
నేలకు క్షమాపణలు చెప్పి
పాదాక్రాన్తుడిని అవుతున్నాను.
తెరలు తెరలుగా నవ్వే నవ్వుపై
నల్లటి నిషేధపు రంగుల్ని పూస్తున్నాను.

కనపడినంతమేరా
కలిసిమెలిసి తిరిగిన నా ఉత్సాహాన్ని
కుదించు కుంటున్నాను.

కొన్ని మాటలు ,చాలా కొన్ని నవ్వులు
నిర్భయ సందర్భాలు -
లోజేబులో దాచుకుని ఎప్పటికైనా
వాటి అవసరముంటుందని ఎదురు చూస్తాను

రాత్రుల ముందు సాగిలపడి
కొన్ని కలలముందు కూచున్నాను
మంతనాలు సాగుతూనే ఉన్నాయి.
అవి వివరించే ఎన్నో విషయాలను వింటూ
=ఇంకా తేల్చుకోవాల్సినవేవో ,మాన్పుకోవాల్సినవేవో
లోపలి నించి బయటికి తీసి
చూసుకుంటున్నాను.

10 Jun 2012

ఒక్కొక్కరోజు-5


**********

అదేమిటో
సంవత్సరాల తరబడి యేర్చికూర్చినవన్నీ
ఒక్క క్చణంలో
కూలిపోతాయి,కనుమరుగయిపోతాయి.

లోపల తాళంవేసి దాచుకున్న
అపురూపమైనవన్నీ మళ్ళీ ఒకసారి
తిరిగి చూసుకుందామనుకునేసరికి
మాయమౌతాయి.

మాట్లాడే మాటలకు
యెవరికి వారు వేరే అర్ధాలను
పేర్చుకుంటుంటారు.
అప్పటివరకూ వెంట నడిచిన నీడ
ఎంత వెతికినా దరిదాపుల్లో కనిపించదు.
వేళ్ళసందుల్లో దాచుకున్న అక్శరాలు
తెల్లటి కాగితమ్మీద కూచోడానికి
సుతరామూ ఇష్టపడవు.

పొద్దున్నే లేవగానే
నా ముఖం నన్నేకోల్పోయి
మరో కొత్త ముఖంగా అద్దం ముందు
నన్ను నాకే పరిచయం చేస్తుంటుంది
= అదేమిటో...!!

8 Jun 2012

ఒక్కొక్కరోజు-4


**********

లోపలి గదిలోంచి
ఏదైనా చూద్దామని ప్రయత్నిస్తుంటాను..

నిరామయంగా గోడలు,
వాటిపై అప్పుడెప్పుడో తగిలించిన
కొన్ని బొమ్మలు,
అప్పటి మానసికస్తితిలోని బోధపడిన దాని అర్ధాలు;
ఇప్పుడు మారిన ఆ అర్ధాలు-

మధ్యమధ్యన నాలాగే
ఏమీతోచక మనసును అటూఇటూ తిప్పే నాలాగే
ఇల్లంతా మూలమూలకు తిరిగి
ఇంకేం చేయాలో తోచక తోకూపుతూ నావైపే
తదేకంగా చూసే కుక్క 'టామీ'-
***
ఏదో ఫోను మోత పలకరిస్తుంది.
ఎవరో గేటు తడుతున్నట్టు చప్పుడవుతుంది.
ఏదో బిల్లు కోసం పిలుస్తుంటారు.
ఎవరో పలకరింపు కోసం ఇంత ఎండని మోస్తూ
గడప దగ్గర చెమటచుక్కలై మెరుస్తుంటారు.
***
నిరామయపు గోడలు
జీవనాసక్తితో తళతళలాడటం మొదలవుతుంది..
'టామీ' అద్భుత ప్రపంచపు రాయబారిగా
నాచెంతనే ఉన్నట్లు ధైర్యంగా
సుతారంగా తోక ఊపుతుంది.

తగిలించిన బొమ్మలు
చిరునవ్వుల సారాన్ని నాలోకి
ఒంపుతూ, నావైపే తదేకంగా చూస్తూ
నాకో
సరికొత్త రోజుని బహుమతిగా అందిస్తుంటాయి.

3 Jun 2012

ఒక్కొక్కరోజు-3

నిన్ననే ఒక మాట వినగలిగాను.
మొక్కచెప్పే మాటకోసం ఎదురుచూస్తున్నాను' అని
కదా అన్నాను.
విన్నాను ఒకమాట.!

దానిమాట విన్నాక
కొంచెం కుదుటపడ్డాను.

చేతుల్లా చాచిన దాని రెమ్మల నడుమ
లేత చిరునవ్వులాంటి మొగ్గ.
అపుడపుడే దాని లేలేత పెదవులపై మొలిచిన
మొగ్గలాంటి మాట.
అది పెదవి విప్పింది.
దాని మాటల్లో సుగంధం.
రేపటిపై అది నమ్ముతున్ననమ్మకం లాంటి
సుగంధం!!

ఆ సుగంధంలాంటి మాటను
చెవియొగ్గి విన్నాను.
భరోసాతో కూడిన ఆ మాటను
అనువదించుకున్నాను.

వర్తమానంలోంచి దాని మాటను
నా అనుభవసారంగా గ్రహించాను.
మాటలకు బతుకుసుగంధం అద్దాల్సిన
అవసరాన్ని గుర్తించాను.

ఇక బోలుమాటల అవసరమే అక్కర్లేదు.
బతుకుసుగంధపు మాటలే మనమధ్య..!!!

ఒక్కొక్కరోజు-2

 పీలగా వినిపించే గొంతు.

మొక్క నాతో మాట్లాడ్డం మొదలుపెట్టకమునుపే
దాని గొంతుకు అడ్డంపడుతున్నదేదో
సంశయం..

తలకు కుట్లుకుట్టుకుని
అరువుతెచ్హుకున్న జీవితమంత సంశయం.
చివరినిమిషంలో నిర్ణయం మార్చుకుని
మళ్ళీ మొదలుపెట్టిన జీవితంలాంటి సంశయం.

లోపల దాక్కుని
అసలు రూపం కన్పించకుండా
బయటికి మాత్రం కన్పించే
"అసలు మనమే కాని మనం"లాంటి సంశయం.
*
చెవులు దాని మాటల కోసం
నిరీక్శిస్తున్నాయి.
యుగాలుగా వినవలిసినవేవో మాటల కోసం
వేచిచూస్తున్నాయి.
మనకే తెలియని మనల్ని
మళ్ళీ ఎవరైనా చెపితే బాగుండు'నన్నట్లు
మనముందు మనల్ని నిలబెట్టి చూపితే
చూసుకోవాలని తాపత్రయం పడ్డట్లు
ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి..

వినాలి.
వినడం కోసం నేనిలా ఇక్కడ
వేచివున్నాను.

2 Jun 2012

ఒక్కొక్కరోజు

ఒక్కొక్కరోజూ
ఒక అనుభవం..

ఒక గాయమో, చిగిరిస్తున్నరాగమో
లేత పలకరింపులకు మోరలెత్తే ఆనందమో
కానైతే యేదో ఒక అనుభవం.

అప్పటివరకూ చిరునవ్వుగా సమీపించే కాలం
హటాత్తుగా ఉరుముతుంది,నిట్టనిలువుగా చీలుస్తుంది.
*
పొద్దున్నే పలకరించే
పెరటిమొక్క ముఖంలోకి తరచి చూస్తున్నాను.
ఏదో చెప్పేందుకు
నా చెవి దగ్గరికి జరుగుతోంది.
వినాలి.
విన్నాక మీతో చెపుతాను.
అప్పటివరకు సెలవు....!!

26 Mar 2012

అనాధ దేశం కళ్లు



కిటికీని ధరించిన మూడు జతల కళ్లు
రోజూ పొద్దుట్నించి రాత్రిదాకా తలుపు మీదనే అతుక్కుని ఉంటాయి
తలుపు మీదా,
 నా తలపు మీదానూ


తలుపు ధరించిన ఆ లేత కళ్లు ఆకలినే నింపుకున్నవని తెలుసు
అవి ఈ దేశపు మూడు రంగుల జెండాను దీనంగా తలపిస్తాయి
ఆ లేత చూపులు సోకిన కిటికీ
రంధ్రాలుగా, చిల్లులుగా
హృదయమై స్రవిస్తున్నది నా హృదయంలోకి..!

ఈ కిటికీ ఈ అనాధ దేశంలాంటిది.
ఎన్ని సానుభూతులు ప్రకటించినా
ఆ శోకం , దారిద్ర్యం ,
జీవన విషాదం మాత్రం ఎపట్లాగే!


 
నేనేమో ఆ కళ్లను కవిత్వం చేస్తాను
చిత్రకారుడు బొమ్మగా గీస్తాడు
అమ్మేమో..
తన పిల్లల్ని తలుచుకుని దీనంగా లోకాన్ని తిడుతుంది.


నాయకులే బోలు మాటల్లో తేల్చివేస్తారు
ఓట్లకు ముందూ వెనకా వాళ్లకేం చేయాలో బొత్తిగా తెలియదు..

17 Mar 2012

మిలీనియం కానుక

   
గాయమైన కాలమూ, మానుతున్న కాలమూ ఒకటే.

కొత్తకొత్త గాయాల సంఖ్య పెరిగి
సమీక్షించుకునే తీరికా లేక
రక్తసిక్తంగ మారుతున్న కాలంలాంటి దేహమూ
మూసిపెట్టిన బాధలా 'మూసి'
నల్లటి రక్తనాళంలా నగరం నిండా పరుచుకుంది.

కళ్లముందే నేనూ, నా దేశమూ నల్లగా మారిపోతూ
అవసరమైన చోటల్లా నిరసనలు, ధర్నాలు,
నిరసన సంతకాలు మాత్రం చేస్తూ పోతున్నాం.

నేనో సరిహద్దును-
అందుకని నా ఈ ప్రభుత్వాలకు నేనొక క్రీడ!
రెచ్చగొట్టి, కాల్పులు విరమించి, మొదలుపెట్టి
నానావిధ గాధల్ని దేశంనిండా  విసిరేసి
నన్నో మాననిగాయంగా ఎల్లప్పుడూ ఉంచి
దేశాన్ని నిస్సహాయంగా మార్చేందుకు నేనొక ఆటవస్తువును..!!!

ఊపిరి తీయడం మానుకున్నాను
నా ఊపిరిలోని ప్రేమను చంపేస్తారని భయం..!
కలల్ని ఉరితీశాను, కలల సాకుతో కాల్చేస్తారని భయం..!
హాయిగా నవ్వడం మానుకున్నాను--
ఎగతాళిగా భావించి 
నా దేశంలోనే నన్ను ఒంటరివాడిని చేస్తారని భయం
చీకటిలో కూర్చున్నాను, వెలుగు నన్ను దహిస్తుందని భయం.

ఇన్ని భయాల మధ్యన జీవితం... ఈ మిలీనియం కానుక
***

9 Mar 2012

కాలనాళిక


ఇక ఇక్కడనుంచి ఒక నమ్మకంతో
ప్రయాణం మొదలెడతాను
ఒక విశ్వాసాన్ని కవచ వస్త్రంగా ధరించి
అన్ని కాలాల కలతల వెతల ఒడిదుడుకుల్నుంచి
రక్షించుకుంటాను..

ప్రతి వీధిలోనూ నాకు నేనే కన్పిస్తాను
నా ముఖాన్ని ప్రతి గుమ్మం ముందూ చూసి
ఉలిక్కిపడి ఆగి పోతుంటాను.
ప్రతీసారీ కన్నీళ్ళు పెట్టబోతాను
నన్ను గమ్యం నిలదీస్తుంది.
నేనే వేనవేల ముఖాలుగా పరివర్తనం చెంది
ఒక విశ్వాసప్రపంచంగా నిదురలేస్తాను
అచేతనాల అవిశ్వాసాల అశాంతుల లోకంలోంచి
మళ్లీ ఒక కొత్త ఆకాశం కిందకు వలసపోతాను

1.
నన్నెవరూ దొంగలించకుండా
నన్నెవరూ దొంగచాటుగా కూల్చేయకుండా
నా దారిలో నా అడుగుల్ని నా నుంచి  వేరుచేయకుండా
నా నిరంతర తపనను ఎవరూ అవహేళన చేయకుండా
ఇక కాలాన్నే కాపలా ఉంచుతాను

నా కాలం ముందు నేనొక పనిముట్టునైపోతాను
నా అనుభవాల ముందు చిన్న పిల్లాడినైపోతాను.

2.
ఆకలి నాకు పరోక్ష గురువు.

ఏకలవ్యుడినై ఒక్కడినే కాలపరీక్షల్ని తట్టుకుంటాను
ఇక ఎవరికోసమో నా భవిష్యత్తు వేలు తెగ్గొట్టుకోలేను
నేను ఇక బలహీనుణ్ణి కాదు
నా ముందు ఏ ప్రశ్నా మనలేదు. అన్ని సమాధానాలు నేనే.
నేనొక కొత్త జీవశక్తిని రూపొందించాను.
చీకటిని శోధించి వెలుగును పట్టుకున్నవాణ్ణి.
కాలాన్ని అర్ధం చేసుకున్నవాణ్ణి
చరిత్ర పాఠాలు పదిలపరిచిన
కాలనాళికను నేను..

3.
శతాబ్దాలు నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయాక
అందరిముందు మనిషిగా ప్రత్యక్షమవుతాను
స్వేచ్చను శ్వాసిస్తున్న వాణ్ణి
ఎవరు నన్ను బంధించినా స్వేచ్చాగీతాన్నే పాడతాను
విస్మృత మార్గాల గుండా మనిషి అడుగుల్ని ఆవిష్కరించి
కొత్త లోకాన్ని ఆవిష్కరిస్తాను

ఈ మట్టిని 'కన్నతల్లి' అని గొంతెత్తి పిలిచినవాణ్ణి
నా జీవన పుష్పానికి ఈ మట్టి రేణువుల్నే
పుప్పొడిగా అద్దిన వాణ్ణి
పొర్లాడి, పొర్లాడి నా గుండెలోకి
ఈ మట్టిని ఒంపుకున్నవాణ్ణి.

ఈ మట్టి నాకు దూరమైపోతున్నపుడల్లా
ప్రతి గుండె మీద మట్టిలా పుష్పిస్తాను.

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...