అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

Showing posts with label కవిసంగమం. Show all posts
Showing posts with label కవిసంగమం. Show all posts

4 May 2016

కుంకుడు చెట్టు - పచ్చని చెట్టు

కవిసంగమం 


మూడు తరాల కవిత్వపఠనం, లక్షల కొద్దీ కవితలు, ఎందరెందరో కొత్త కవులు ఇది కవిసంగమం వర్తమాన సాహిత్యనిధికి అందజేసిన సిరి సంపద. ఈ మాట అందరికీ తెలిసిందే ఈ ప్రంపంచీకరణ రోజుల్లో కవిత్వంతో పాటూ ఇక్కడ కొన్ని స్నేహాలు బంధుత్వాలై కలవడం మరో ఆసక్తికర చారిత్రిక పరిణామం., ఇందుకు "నీవొక పచ్చని చెట్టైతే పిట్టలు వాటంత అవే వచ్చి వాలేను" అంటూ ఆహ్వానించిన పిలుపే సాక్షం.
కవిసంగమం నెలవారీ సభలకి వచ్చిన సీనియరు కవులు పుత్రోత్సాహంతో మురిసిపోవడం మనం చూస్తూనే ఉన్నాం, అదే సమయంలో కొత్త కవుల కళ్ళలో మెరుపు ఎన్ని సాయంత్రాలని దేదీప్యమానం చేసిందో ఎంత చెప్పినా తక్కువే, ఇంటికి తిరిగి వెళ్ళి పచ్చని చెట్టు పంచిన జ్ణాపకాలని కవిత్వంలో ప్రాణ వాయువుగా నింపి ఈ సాహితీ చారిత్రక ఘట్టాలని కవితల రూపంలో పొందుపరచడం కూడా మనం చూస్తున్నాం.
తొలినాళ్లలో వెళ్దాం అని కుదరక "ఈ-శనివారం" అని నేను రాసుకున్న కవిత. "నా లామకాన్ గోల" యశస్వీ సతీష్ కవిత, తదుపరి బాల సుధాకర్ మౌలి రాసుకున్న అపురూప వ్యాసం, నా చెల్లెలు తోట నిర్మలా రాణి రాసిన కవిత, ఇప్పటి కుంకుడు చెట్టు ఇదే కోవకి చెందినవే, రాసిన నాలుగైదు కవితల్లో విభిన్న కొణాల్ని వస్తువులని తీసుకోవడం తనదైన ఓ ప్రత్యేక ముద్రతో Indus Martin రాసిన "కుంకుడు చెట్టు" పసిరి వాసన వేసి కవి పరిణితిని పచ్చగా మన ముందుంచింది.
ఎత్తుగడలో ప్రపంచీకరణ గుర్తు చేస్తూ, భారతీయ నాగరికత మూలాలని ఇతర ప్రాశ్చాత్య దేశాల కంటే ముందుగా నడిచిన మన గతాన్ని గుర్తుచేసింది. ఆరునెలల క్రితం కుంకుడు కాయ వాసన వస్తోందని కొన్న tresmee shampoo గుర్తుకొచ్చి టెంకిజెల్ల కొట్టినట్టు ఐంది.
రెండు మూడు పేరాలలో పాఠకుడుని కవితలోకి తీసుకెల్లిన తీరు బలే ముచ్చటేసింది,అక్షరాలని "నిఖార్సైన నల్లని కాయలతో" అని పోల్చినప్పుడు, మరీ ముఖ్యంగా మూడో పేరా చదవగానే కవిని పొగడకుండా ఉండలే కదూ...
నాలుగో పేరాలో "ఎన్ని తరాల తలల మురికినీ
తేటనైన నురగలో ప్రక్షాళన చేసాయో ఆ ఫలాలు" అంతర్లీన సూక్ష్మ విమర్స చేసి ఫలాలు అనడం, కొంత విస్మయాన్ని కలిగించి శభాష్ అనిపిస్తుంది.
ఐదో పేరాకి వస్తే తెలుగు వైభవం ఎన్ని ఆటుపోట్లకు గురైందో చెప్పి "ఇప్పటికీ నిలబడే ఉంది తనను కన్న గడ్డపై" అన్నప్పటికీ "తెల్ల తుఫానులు" అన్నపదం నాకెందుకో "తెల్ల పాములు"గానే కనపడింది నాలుగైదు సార్లు చదివినప్పటికీ....మొదటి రెండు పేరాలు నేను ఎందుకు రాయవలసి వచ్చిందో కవిత చివరికి వచ్చారుగా ఆరో పేరాతో మీకే అర్ధం ఐవుంటుంది.
తెలుగు భాష మరియు సాహిత్యాన్ని అత్యంత ప్రేమించే " Indus Martin " ఇప్పటికే "అనగనగా" అంటూ తన ప్రయత్నంతో సఫలీకృతం చెందాడు. ఈ బాటసారికి కవిత్వం కొత్తో పాతో తెలియదు కానీ ఇతనిలో ఓ సహజ కవి దాగున్నాడన్న మాట నిఖర్సైన సత్యం. కవి.మార్టిన్ మరిన్ని సామాజిక ప్రయోజన కవితలతో వర్తమానానికి తలంటాలని కోరుకుంటూ...మరో కవిని తెలుగు సాహిత్యానికి అందించిన కవిసంగమానికి అభినందనలు.కృతజ్ణతలు.....మీ మూడో వేప చెట్టు...
మార్టిన్//కుంకుడుచెట్టు// 24 నవంబర్ 2014
ఇప్పటి ఇంగ్లీష్ షాంపోలు రాకముందునుండీ
అమేరికన్ కండీష్నర్లు రసెల్స్ దుకాణాల్లో
అమ్మబడడానికి పూర్వంనుండీ
ఇక్కడేవుంది ఈ కుంకుడు చెట్టు
నిఖార్సైన నల్లనికాయలతో నిటారైన దేహంతో
ఎంత దర్పంగా వెలిగిందో
ఆంధ్రభోజులూ, అతిధి బ్రౌన్లూ
ఎంత శ్లాఘించారో దీని సరళసౌందర్యాన్ని
ఎందరు తిక్కనలు ఏతాళ్ళపాక నుండో తెచ్చ్చిన
గుండ్రాళ్ళకింద మెత్తగానలిగి
ధూర్జటుల జటిలహస్తాలలో పిసకబడి
ఎన్నెన్ని తరాల తలల మురికినీ
తేటనైన తమ నురగల్లో ప్రక్షాళన చేశాయో ఆఫలాలు
ఏంవైభవం దానిది... ఏచీడలూ పట్టలేదు దానికి
ఏసముద్రాలు దాటి ఎన్నిరాలేదూ తెల్లతుపానులు?
ఖైబరు కనుమలుదాటి రాలేదా ప్రళయాలు?
విప్పత్తులను దాటి, ఆపత్తులకు నిలచి
ఇప్పటికీ నిలబడేవుంది తననుకన్న గడ్డపై
ఇప్పటికీ ఈ చెట్టుకొమ్మలక్రింద కూర్చుని
ఏ శారదమ్మో తన సి.వి. రాసుకుంటూనేవుంది
ఏరాజో తన కాశీమజిలీ కథల్ని మననంచేసుకుంటూనే వున్నాడు
ఏ యశశ్వో తపస్విగా మారి
ప్రయోక్తగేయాల్ని జపిస్తూనే వున్నాడు
ఏ వీరఫాండ్య 'కట్ట 'బ్రహ్మన్నో అక్కడ చేరిన పిట్టల పాటల్ని
'వాహ్', 'ఖూబ్' అంటూ ఆనందిస్తూనే వున్నాడు
ఏ రా(రాం)కుమారుడో గోలచేస్తున తుంటరి వుడుతల్ని
ప్రేమతో అదిలిస్తూనే వున్నాడు
అటుగా వచ్చిపోయే ఏబాటసారో తనకథను
అనగనగా అంటూ కొనసాగిస్తూనే వున్నాడు
బంగారువాకిళ్ళలో జరుగుతున్న సంగమాల సాక్షిగా
కుంకుడు చెట్టు కొత్తపూత వేస్తూనేవుంది
In the fond memories of "Poetry Reading' conducted under a soap-nut tree in Golden Threshold last night ...!

~
వర్మ కలిదిండి 
Nvmvarma Kalidindi

జయహో కవిత్వం ..


అంతర్జాల ప్రపంచంలో
ఏమీ తోచక అటూ ఇటూ తిరుగుతుంటే
ఒక చెట్టు కనిపించింది ...
ఫలవంతమైన ఎన్నో కొమ్మలు ఉన్న
ఆ చెట్టుకింద కూచుందామని వెళితే
ఒక్కొక్క కొమ్మ నుంచి ఒక్కో నవ కవి చేతిలోంచి
జాలువారిన కవిత పలకరించింది ...
* * *
అతడి వైద్యం స్వస్థత చేకూరుస్తుందో
లేక అతడి కవిత్వం పరవశింపజేస్తుందో
అటు వైద్యం, ఇటు కవిత్వం - రెండింటితో
స్వాంతన కలిగిస్తున్న విరించికి జయహో
* * *
తన స్మృతి పథంలోకి మననూ లాక్కెళ్ళి
అప్పటి జీవితాల్లోని అమాయకత్వాన్ని, ఆవేదనలను
భాషతో, యాసతో, రాత తీరుతో కట్టిపడేస్తున్న
హెచ్చార్కెకి జయహో
* * *
ఆవేశాన్ని ఆలోచనలని
అక్షరాల్లో మిళితం చేసి ఉర్రూతలూగించే
సత్తా ఉన్న సిద్ధార్థ కట్టాకి జయహో
* * *
అటు కదిలించే గజల్
ఇటు ఆలోచింపజేసే కవిత్వం
రెండింటితో పరవశింపజేస్తూ, సత్తా చాటుతున్న
రోహిణి వుయ్యాలకి జయహో
* * *
అక్షరాల్లో వెన్నెలని ఒలికించి
ఆహ్లాదాన్ని పంచే
పుష్యమి సాగర్ కి జయహో
* * *
కెరటం తీరం దాటితే ఎలా ఉంటుందో
ఆ ఉధృతిని తమ కవిత్వంతో పరిచయం చేసే
అనిల్ డాని, నరేష్కుమార్ లకి జయహో
* * *
రోజుకొకటో రెండో లెక్కన
పదులు, వందలు రాసి పడేశామని
కుప్పలు చూసుకుంటూ సంతోషపడేవారి మధ్యన
గంగిగోవు పాలలా తన కవిత్వంతో
ఆలోచింపజేసి, సమాజాన్ని పరిచయం చేసే
సైఫ్ అలీ సయ్యద్ కి జయహో
* * *
.
.
.
కవిత్వానికి కాలం చెల్లిపోయిందని
పుట్టకొకరు, గుట్టకొకరుగా ఉన్నవారిని
ఒక చెట్టు కిందకి తెచ్చి
కవిసంగమంని తీర్చి దిద్ది నడిపిస్తున్న
యాకూబ్ మహాశయా - జయహో
* * *
రాసుకుంటూ పొతే
వాసి గలిగిన కవులందరిని లెక్కించుకుని రాయటానికి
నా ఈ ఒక్క జీవితం సరిపోదేమో
కవిత్వాన్ని శ్వాసిస్తున్న అందరికీ జయహో
జయహో కవిత్వం జయహో కవి సంగమం
--- 'కవి సంగమం' ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ, మరెంతో మంది ప్రతిభ ఉన్నవారిని వెలికితీస్తోంది. నేను ఇక్కడ ప్రస్తావించగలిగినది కూడా అతి కొద్దిమందినే. ఎంతమందినని, ఎవరినని ప్రస్తావించాలి అనే సంశయం లోంచి బయటపడి 'ప్రతి ఒక్కరికీ జయహో' అనటమే మార్గంగా ఎంచుకుని తప్పించుకుంటున్నందుకు మిగతావారందరూ మన్నించాలి. జయహో కవిత్వం ...


#వంశీ కలుగోట్లమార్చ్ 31,2016 ,Facebook

24 Apr 2016

🔷 కవిసంగమం - ఒక అభిప్రాయం


_- సులేమాన్🎤వాయిస్ ఆఫ్ టీచర్స్📢 


🔷 ఫేస్ బుక్ కవిసంగమం సమూహం చిన్ని ప్రయత్నంతో ప్రారంభం అయింది. ప్రముఖ కవి యాకూబ్ దీనికి నాంది పలికారు. అంతర్జాలంలో ఉన్న సౌకర్యన్ని వినియోగించుకొని ఫేస్ బుక్ చేస్తున్న వివిధమైన సామాజిక చలనాలను (సోషల్ డైనమిక్స్) గమనించి తెలుగు కవులకు ఒక మంచి వేదికగా దీన్ని మలచుకోవచ్చు అనే ఆలోచన ఈయన దీనిని (సులేమాన్) రూపొందించారు. అతనికి వ్యక్తిగతంగా పాతిక ఏండ్లుగా పరిచయమైన కవి ప్రపంచాన్ని ముఖ్యంగా ఇప్పుడిప్పుడే గొంతువిప్పుతున్న వారు ఆధునిక నెట్ ప్రపంచాన్ని తెలుసుకున్న యువతీ యువకులైన కవులను ఒకచోటికి తేగలిగారు. ఈ రెండు సంవత్సరాలలో ఇది బాగా వ్యాప్తి చెందినది. ఇప్పటివరకున్న వివరాల ప్రకారం 200 మందికి పైగా కవులు ఈ వేదికలో పాలుపంచుకుంటున్నారు.

🔷 తెలుగులో ఒక కవి సుమారు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు కవిత్వం రాసి లేదా ఒక ఏడాదిలో రాసిన కవితలను అన్నింటిన ఒక కవితా సంకలనంగా తెచ్చి, మరికాస్త కష్టపడి దానికి డబ్బుఖర్చూ పెట్టి పుస్తకావిష్కరణ చేయిస్తాడు. ఎవరో ఒక మంచి అనుభవజ్ఞుడో పేరున్నవాడో వచ్చి దాన్ని ఆవిష్కరిస్తాడు. రెండో రోజు పేపర్లో వార్త వస్తుంది. (సులేమాన్) కాని ఆ పుస్తకాన్ని ఎవరు చదువుతారు. సదరు కవే ఒక వంద కాని రెండు వందల కాపీలు కాని తనకు తెలిసనవారికి పోస్టులో, ఆ ఖర్చులూ ఆయనే పెట్టుకొని పంపిస్తాడు. ఆ వందమందిలో కనీసం ఒక పాతిక మంది దాన్ని చదువుతారో లేదో. అందులో ఒక నలుగురు ఆయిదుగురు కాస్త వ్యక్తిగత క్రమశిక్షణ, మంచి బుద్ధీ ఉన్నవారు. మీ కవితలు బాగున్నాయని ఒక నెలకో ఏడాదికో ఉత్తరం రాస్తారు. దానికి ఈ అల్పసంతోషి అయిన కవి ఎంతో సంతోషిస్తాడు.

🔷 తెలుగు కవులకు నిన్న మొన్నటిదాకా ఉన్న పరిస్థితి ఇది. కాని కవిసంగమం ఈ పరిస్థితిన బద్దలు కొట్టింది. ఈ పరిస్థితిని బద్దలు కొట్టింది నిజానికి ఫేస్ బుక్ అంటే అంతర్జాల పరిజ్ఞానం. ఈ పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టి ఆధునిక తెలుగు కవిత్వానికి దీన్ని ఒక వేదికగా మలచిన ఘనత (సులేమాన్) నిస్సందేహంగా యాకూబ్ కు దక్కుతుంది. దీనితర్వాత కవిసంగమంలో భాగం కాని వారు కూడా ఫేస్ బుక్ లో తమ కవిత్వన్ని పెడుతున్నారు. బ్లాగుల్లో పెడుతున్నారు. ఈ కవితలు కూడా భాగస్వామ్యం రీత్యా కవిసంగమం లోనికి వస్తున్నాయి. అంతే కాదు గూగులమ్మ ను అడిగి తెలుగు కవిత్వాన్ని గురించి తెలుసుకోవలనుకున్న వారికి కూడా కవిసంగమంలోని కవుల వివరాలు కవితలు అందుబాటులోనికి వస్తున్నాయి.
🔷 ఒక కవి తన కవితను రాసిన తర్వాత ఏ మాత్రం ఎడం లేకుండా అంటే రాత్రి కవితను రాస్తే తెల్లవారి పాటికి తన బృందంలోని సుమారు 200 మంది కవిత్వంపైన ప్రేమ ఉన్న పాఠకులకు అందేలా చేస్తున్నాడు. ఇది ఫేస్ బుక్ వేదిక మీద సాధ్యం అవుతూ ఉంది. అంతే కాదు దీని విజయం ఏమంటే ఆకవికి చాలా (సులేమాన్) విలువైన అభిప్రాయ మాల మరుసటి రోజు సాయంత్రానికి తెలిసి పోతూఉంది. ఒక కవితకు సుమారు వందకు పైగా అభిప్రాయ ప్రకటనలు ఒక్కరోజులో రావడం ఒక్కరోజులో కొన్ని వందలమంది సాధారణ పాఠకులు కాక కవిత్వం కోసం ఉన్న ప్రత్యేకమైన పాఠకులు ఆ కవితను చదవడం మామూలు విషయం కాదు. ఆ కవికి వచ్చే ప్రోత్సాహం కాని సంతోషం కాని ఇంతకు ముందు సంప్రదాయ పద్ధతుల్లో అచ్చుపుస్తకం ద్వారా రావడం అన్నది కలలో కూడా ఊహించడానికి సాధ్యం కానిది. కవికి వచ్చే స్థితిని కాస్సేపు పక్కకు పెట్టి కవిత్వానికి వచ్చే స్థితిని గురించి ఆలోచిస్తే మరింత సంతోషకరంగా కనిపిస్తూ ఉంది. కవిత్వ వ్యాప్తి ఇబ్బడి ముబ్బడిగా మునుపెన్నడూ లేని వేగంతో వ్యాప్తి చెందుతూ ఉంది. ఇది తెలుగు సాహిత్య కారులు అందరూ సంతోషంగా గర్వించదగిన విషయం.
🔷 మరొక ముఖ్యమైన తెలుసుకోవలసిన విషయం ఏమంటే.. తెలుగు కవిత్వం ఒక కొత్త శకంలోనికి ప్రవేశించింది అని చెప్పాలి. తెలుగు కవిత్వం ఇప్పటిదాకా రెండు మాధ్యమాలలో ప్రవర్తిస్తూ ఉంది. అది ఒకటి మౌఖిక మాధ్యమం రెండోది లిఖిత మాధ్యమం. ఈ రెండు కలిసిన మిశ్రమాధ్యమంలో కొన్ని కవితా ప్రక్రియలు ప్రవర్తించాయి. అవి శతకాలు, తత్త్వాలు వాగ్గేయకారుల పాటలు. కాని అంతర్జాలం కారణంగా మరొక మాధ్యమం వచ్చింది అది ఎలక్ర్టానిక్ మాధ్యమం, దీన్నే విద్యున్మాధ్యమం అని అనాలి. ఇది ఎలా ప్రత్యేక మాధ్యమం అయిందో చెప్పవచ్చు. ఒక కవి తన కవితను బ్లాగులో కాని ఫేస్ బుక్ లో కాని రాస్తున్నాడు అంటే ప్రచురిస్తున్నాడు. అతని పాఠకులు కూడా ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే (సులేమాన్) చదువుతున్నారు. దానిపైని అభిప్రాయాలు కూడా అదే మాధ్యమంలో విస్తరిస్తున్నాయి. అదే మాధ్యమంలో కల కాలం నిలబడుతున్నాయి. అంటే ఇక్కడ కవిత్వం పుట్టుక, వ్యాప్తి నిలకడ అనేవి మొత్తం ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఈ కారణంగా తెలుగు కవిత్వం పూర్తిగా నూతన ప్రసార మాధ్యమంలోనికి చేరిందని చెప్పవచ్చు. ఇది నూతన మాధ్యమంగా నూతన యుగంగా చెప్పుచ్చు. అంతే కాదు ఈ ఆధునిక అంతర్జాల సాంకేతిక కారణంలో తెలుగుకవిత్వంలో గుణాత్మక పరిణామం కూడా వచ్చిందని చెప్పవచ్చు. ఇటీవలికాలంలో కవిసంగమం సభ్యుడైన వంశీధర రెడ్డి రాసిన కవితలు, అఫ్సర్, యాకూబ్ రాసిన కొన్ని కవితలు, దెంచనాల శ్రీనివాస్ మరీ ఇటీవల ప్రకటించిన భస్మసారంగి కవితలు చూస్తుంటే ఆధునిక సాంకేతికత ఆధునికత ఎంతగా తెలుగు కవిత్వాన్ని ప్రభావితం చేస్తూ ఉందో తెలిసి సంతోషం కలుగుతూ ఉంది. ఇందువల్ల తెలుగు కవిత్వం మూడో మాధ్యమంలోనికి ప్రవేశించినదని చెప్పవచ్చు. తెలుగు కవిత గుణాత్మక పరిణామాన్ని, మాధ్యమ పరిణామాన్ని పొందినదని మూడో మాధ్యమంలోనికి ప్రవేశించింది.

🔷 అయితే కవిసంగమం కన్నా ముందే కొన్ని బ్లాగు పత్రికలు తెలుగు కవిత్వాన్ని అంతర్జాల ప్రపంచంలోనికి తీసుకుపోయాయి. పన్నెండు సంవత్సరాలుగా వస్తున్న తెలుగు బ్లాగు పత్రికలు మనకు ఉన్నాయి. ఈమాట, అనే పత్రిక వీటిలో చాలా పాతదిగా కనిపిస్తూ ఉంది. బ్లాగుల హారాలు జల్లెడ, కూడలి కూడా తెలుగు కవిత్వానికి మంచి వ్యాప్తిని (సులేమాన్) తీసుకువచ్చాయి. వీటి ప్రభావాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేము. ఇటీవల వచ్చిన సారంగ, వాకిలి, విహంగ వంటి పత్రికలు కూడా మంచి వ్యాప్తికి కారణం అవుతున్నాయి. కాని బ్లాగుకు కొన్ని పరిమితులున్నాయి. అవేమంటే నాకు ఒక బ్లాగు ఉందన్న సంగతి తెలిసిన వారు నా గురించి తెలిసినవారు మాత్రమే నా బ్లాగులో ఉన్న కవితలను చదువుతారు. అక్కడ ఒక సమాజం అనేది ఉండదు. మూకుమ్మడిగా ఒకే సారి ఒక గుంపుగా అందరికీ చేర్చే వీలు ఉండదు. కాని ఫేస్ బుక్ గ్రూపులో ఈ సౌకర్యం ఉంది. కవిత్వ వేదికగా ఫేస్ బుక్ ప్రయోగం చాలా విజయవంతం అయినదని చెప్పవచ్చు. ముఖ్యంగా కవిసంగమం ప్రయోగం తెలుగు కవిత్వానికి కొత్త ఒరవడిని సృష్టించింది.
🔷 అంతర్జాలాన్ని ఈసడించేవారు. ఆఁ దాన్ని ఎవరు చూస్తున్నారు అనేవారు, దాన్ని అసహ్యించుకునేవారు మనకున్నారు. పెద్దతరం వారిని తప్పు పట్టడం కాదు కాని వారి కాలానికే అందుబాటులో ఉన్న సాంకేతికను ఆహ్వానించలేకపోవడం వల్ల వారిని వారు వెనుకటి కాలానికి పోయిన వారుగా ప్రకటించుకుంటున్నట్లు లెక్క. ఇక సమక్షంలో పొగడి వెనుకనుండి తెగడే గోడమీది పిల్లులు కూడా మనకున్నాయి. వారిని ఉజ్జగించడం మంచిది. కాని పెద్దతరంలో కూడా కొందరు ఇంటర్ నెట్ ప్రభావాన్ని ఫేస్ బుక్ సామాజిక పరిణామ (సులేమాన్) శక్తిని గ్రహించిన వారున్నారు. తెలుగు కవిత్వానికి కూడా ఒక కొత్త మాధ్యమం కొత్త యుగం వచ్చినదని గ్రహించినవారున్నారు. మొదట ఫేస్ బుక్ ప్రయత్నాన్ని కవిసంగమిన్ని నిరసించిన వారు కూడా క్రమంగా దీని శక్తిని గ్రహిస్తున్నారు. ఇది ఒక కొత్త ఒరవడి అని తెలుసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. నిన్నగాక మొన్న జరిగిన కవిసంగమం కవిత్వపు పండుగ చాలా ఆనందాన్ని కలిగించింది. కొత్త తరం సంగతి అలా ఉంచి పాత తరానికి కూడా అంతర్జాల మాధ్యమానికి ఉన్న శక్తిని గురించి తెలుగు కవిత్వపు కొత్త ఉనికిని గురించి తెలియజెప్పడంలో ఈ పండుగ సఫలం అయిందని భావించవచ్చు.

*మార్చి 25 ,2016 

+

Source : 
https://www.facebook.com/permalink.php?story_fbid=1003731006381256&id=992724654148558

20 Apr 2016

కవిసంగమం ఒక జీవన్మది



-జి.సత్యశ్రీనివాస్

21వ శతాబ్ధo   అచేతన కళా ప్రపంచంతో మొదలైంది. అంతటా అన్ రియల్ వరల్డ్ ఎస్టేట్లు ఏర్పడ్డ కాలం. నేలంతా ఒక పెద్ద రూపాయి కాగితాల మూట. కళలకు  కాలం చెల్లాయని  అనుకుంటున్న  రోజులు. కవిత్వం  వినడానికి ఎవ్వరికి తీరికలేదు. రాసుకొని  జేబులో మడిచి పెట్టుకోవాలి. తర్వాత సాంకేతిక పరిజ్ఞానం మనుషుల్ని కలిపేందుకు అంతర్జాలంలో ఓ ముఖపుస్తకం తెరిచింది. తర్వాత మీ నుదిటి రాతలు మీరే రాస్కోండి అంది. కవులు ఎవరి భావనల్నివాళ్ళ గోడలమీద రాసారు.   తర్వాత ఈ గోడ మీద రాతలన్ని   ఒకటితో  ఒకటి  మాట్లాడుకోవడానికి  నీడను ఏర్పరిచిన  చెట్టు కవిసంగమం.

ఇంకొక రెండు నెలలలో మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. కవిసంగమం ఫేస్ బుక్ గ్రూపులో ౩౦౦౦ పైగా సభ్యులున్నారు.ప్రతి రోజు కవితలు వాలుతు వుంటాయి. అలానే ప్రతిరోజూ ,రోజుకొక అంశానికి సంబంధించిన  వ్యాసాలున్నాయి. ఇప్పుడు కవిసంగమం  కవిత్వానికి  సంబంధించిన గ్రంధాలయం.
9-2-2012  నుండి నేటి వరకు తెలుగు సాహిత్యానికి ఎందరో  నూతన కవుల్ని పరిచయం చేసింది. ఈ నూతన కవుల్ని కేవలం అంతర్జాలం మాధ్యమానికే పరిమితం చేయకుండా  పాత తరానికి కొత్త తరానికి మధ్య కవిత్వ వారధి అయ్యింది. ఈ బాటలో వచనకవిత్వం అనుభందిత అంశాల పై  నిరంతర సంభాషణ కొనసాగుతోంది.అందులో భాగంగా వర్క్ షాపులు కవిత్వానికి సంబంధించిన   సమాచారాన్ని  పంపిణి చేయడం.
ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' మార్గాన్ని  సృష్టించింది. ఇది ఇన్ ప్రాసెస్స్ లర్నింగ్ కూడ.  జరుగుతున్న వాటి నుండి నేర్చుకోవడం ఒకటైతే, నేర్చుకోవడానికి సరైన పధ్ధతిని ఏర్పాటు చేయడం మరొకటి. ఇదంతా    ప్రక్రియలో భాగం.  కవిసంగమం నేర్చుకోవడానికి  శాస్త్రీయ పద్ధతుల్ని ప్రయోగిస్తోంది.  ప్రాసెస్స్ లర్నింగ్ లో నేర్పేవాళ్ళు, నేర్చు కునేవాళ్ళు  ఇద్దరు ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటారు. అప్పుడు తరాల మధ్య వున్న అంతరాలు తొలుగుతాయి.ఇది భాగస్వామ్య పధ్ధతి. కవిసంగమం లోని ప్రాసెస్ లో   వివిధ తరాలకు, పలు శైలి,ప్రత్యేకతలు వున్న కవులు కనపడతారు. అందుకే ఒక పర్టిక్యులర్  సిద్ధాంతానికి, తరానికి లేక కోవకో చెందినది కాదు.  పలు రకాల పక్షులకు ఒక చెట్టు గూడు కవిసంగమం.

Article in Namaste Telangana

*****
2013- kavisangamam poetry festival -Inaugural Session 

ఈ ప్రాసెస్ ఒకలో ఒక  భాగం   2013లో లామఖాన్-నిరాశ్రయుల గూడులో మొదలై, గోల్డెన్ త్రిషోల్డ్ బంగారు గడపలో కొనసాగుతోంది. ఈ బంగారుగడప గాన కోకిల,కవయిత్రి సరోజినినాయిడు ఇల్లు.కేవలం హైదరాబాద్ కే   కాక తెలంగాణాలోనే ప్రత్యెక స్ధానమున్న ప్రదేశం. విశ్వవిద్యాలయాలలో సాహిత్యం పై చదువులుంటాయి కాని, కవిత్వం ఎలా రాయాలి అన్న పాఠాలు వుండవు. కవిసంగమం హైదరాబాద్ విశ్వవిద్యాలయం గడపలో మూడుతరాల కవులతో ప్రతి నెలా అయిదుగురు కవులుతో ఆ పాఠాల్ని నేర్చుకుందుకు కొత్త ఒరవడి సృష్టించింది. 

మూడుతరాల   వారి వారి కవితల్ని అందరి సమక్షంలో చదివేందుకు వేదికైయ్యింది. ఈ వేదిక  ఉద్దేశ్యం కొత్త తరం పాత తరం నుండి నేర్చుకోవడం. వాస్తవానికి కవిత్వానికి తరాలతో గొడవ వుండదు.  ఈ వేదిక తరం మధ్య వుండే గోడను పగలగొట్టే ప్రయత్నం. కళాకారుడికి,కవికి స్కిల్ తో బాటు క్రాఫ్ట్మెన్షిప్ అవసరం. అది ఈ ప్రక్రియలో జరుగుతోంది. ఏ కళలోనైనా ఏది అనవసరం అని తెలిస్తే రూపం దాననంతట అదే ఆవిష్కరిస్తుంది. ఇలా జరగడానికి కళాకారుడు నిరంతర శ్రామికుడు ,పరిశోధకుడు, అన్వేషి అవ్వాలి. అవన్నీ  ఈ ప్రక్రియలో ఇమిడి వున్నాయి. అందుకే ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు  గోడలలో పగ్గుళ్ళు వస్తున్నాయి. తర్వాత అవి కూలిపోతాయి. ఇది కవిత్వాన్ని ఆస్వాదిస్తూ నేర్చుకునే సంగీత పాఠం. ఒక నూతన రాష్ట్రం లో ఒక వినూత్న ప్రయత్నం. 
ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో వందమంది కవులకు పైగా  పాల్గొన్నారు అందులో ప్రముఖలు, అప్పటికే కవుల్లుగా ఎస్టాబ్లిష్ అయిన వారు ,కొత్త వారు. వీళ్ళందరూ  జుగల్ బంది.

2013 -kavisangamam poetry festival 
ఇవే కాక ఇతర బాషా కవులతో ప్రత్యేక సదస్సులు జరిగాయి. అందులో బెంగాలీ కవి సుభోద్ సర్కార్, ప్రసిద్ద తమిళకవి చేరన్ రుద్రమూర్తి, తమిళ కవయిత్రి సల్మ, కన్నడ కవయిత్రి మమత సాగర్, హిందీ కవయిత్రి రతి సక్సేనా, గుజరాతీ కవి శీతాంశు యసశ్చన్ద్ర  పాల్గొన్నారు. దీని ద్వారా వివిధ బాషలోని కవిత్వ తీరుతెన్నులని వారి అనుభవాలనుండి మనం  స్వయంగా తెలుసుకునే అవకాశం.. ఈ ప్రయోగం కవిత్వంలో చాల అవసరం.  కేవలం చదివి తెలుసుకోవడమే కాక, ఆ కవులతో ముఖాముఖిగా నేర్చుకోవడం. ! ఇది కేవలం విషయ సేకరణకే కాక కవికీ  కవికి మధ్యన స్నేహబంధం ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్స్ లో డిలర్నింగ్, రీలర్నింగ్ కూడ జరుగుతుంది. కవిత్వాన్ని రాజకీయ, సామాజిక, సాంస్కృతికదృష్టితో చూసే అవకాశం ఏర్పడుతుంది. ఇది సంభాషణలలో సంభాషణలు జరిగేందుకు ఏర్పరిచే  ప్రక్రియ. 
సంగమంలో వివిధ కవిత్వ పాయలను కలిపే తీరం.

కవిసంగమంలో 'మీట్ ద పోయెట్' అనే  కార్యక్రమంలో  నారాయణస్వామి వెంకటయోగి, అఫ్సర్,ఈ నెలలో ఎ. కృష్ణారావు[కృష్ణుడు ] గారితో జరగబోతోంది.
 ఈ వేదిక ఒకరితో ఒకరు, కవిత్వానికి సంబంధించిన  అంశాల్ని పదిమందితో పంచుకోవడానికి కవులకి దోహదపడుతుంది. పాల్గోనేవారికి కవి,వాళ్ళ కవిత్వ ప్రస్ధానం ప్రాసెస్స్ ని  కాప్చర్ చేసేందుకు వీలవుతుంది. ఈ ప్రక్రియ పద్ధతిని సామజిక శాస్త్రం పరిశోధనలో ముఖ్యంగా నెరటివ్ రిసర్చ్ లో ప్రయోగిస్తారు. కవిసంగమంలో ఈ ప్రక్రియ ద్వారా సోషియాలజి ఆఫ్ పోయట్రి ని కాప్చర్ చేయచ్చు. దీని వల్ల నేర్చుకునేటప్పుడు మన దృష్టితో కాక ఎదుటి వాళ్ళ దృష్టితో పరిశీలించే అవకాశం ఏర్పడుతుంది.

కవిసంగమంలో  జరుగుతున్న ప్రక్రియల్లో కవిత్వానికి సంబంధించిన  ప్రత్యేక రోజులని జరుపుకోవడం, ప్రపంచ కవితా దినోత్సవం వంటివి జరుగుతున్నాయి., కవిత్వ ఉత్సవాలు 2013డిసెంబర్ 15 న జరిగిన ఉత్సవంలో ముఖ్యఅతిధిగా ప్రసిద్ధ గుజరాతీ కవి ప్రొ.శితాంషు యశస్చంద్ర గారు పాల్గొన్నారు. ఈ నెల డిసెంబర్ 14న   గోల్డెన్ త్రిషోల్డ్ లో జరగబోయే ఉత్సవంలో  ముఖ్య అతిధిగా ప్రముఖ తమిళ కవయత్రి సల్మ పాల్గొంటున్నారు . 

**
ఈ ప్రక్రియ కవిత్వాన్ని పరివ్యాప్తి చేయడానికి జరిగే ఒక మాస్ క్యాంపెయిన్. సోషల్ నెట్ వర్కింగ్ లో ఎక్కువగా ఉపయోగించే సాధనం. ఒక అంతర్జాల సాధనాన్ని జనజీవన స్రవంతిలోకి తెచ్చే ఇంధనం.ఇది అడవిలో నిప్పు పెట్టినట్టు ,ఒకసారి నిప్పు అంటిస్తే ఇక మంటలార్పడం ఎవడి తరం కాదు. సామాజిక అస్తిత్వ పోరాటాలలో  ఈ ప్రక్రియ కీలక పాత్ర వహించింది. ఆ ప్రక్రియ ఇప్పుడు కవిత్వానికి  కొత్త రూపాన్ని అవిష్కరించేదుకు జరుగుతోంది. జీవకవిత్వ నినాదానికి కొనసాగింపు. 
కవిత్వం లో  కవిసంగమం ఒక రినైసెన్స్ సృష్టిస్తోంది. యూరోప్ లో కవిత్వం కొత్తపోకడలు సంతరించుకుంటోంది. కవిత్వాన్న్ని కోరియోగ్రఫ్ చేస్తున్నారు. గతంలో కొద్దిగా మన దేశంలోనూ  జరిగింది.
ఈ ప్రయత్నాలన్నీ కవిత్వాన్ని కేవలం రాయడం ,చదవడం, అన్నదే కాక వినడం , చూడడం కోసం చేసే ప్రక్రియలు . మన రాతలకి జీవం పోయడం. తద్వారా   నిర్జీవమైన మన ప్రాణానికి మనం ప్రాణం పోసుకోవడం. అంతేకాక ప్రసిద్ద తమిళకవి చేరన్ రుద్రమూర్తి చేసిన ప్రసంగాలు,చదివిన కవిత్వం పాల్గొన్న కొందరు కవులు అనువదించి ఆయన కవితలని వేదికపై చదివారు. 
ఇది లర్నింగ్ లో షేరింగ్ ప్రక్రియ. సంగమ దృశ్యం.
**

ఈ మూడేళ్ళకాలంలో కవిసంగమం కొన్ని వందలకొద్ది ఫోటోలు, వీడియోలు, ఆడియోలు పొందుపర్చింది. ఇది కవిత్వం, కవులకు సంబంధించిన  ఆడియో, విజువల్ డేటా. ఇది ప్రాసెస్స్ లర్నింగ్ లో కీలకమైనది ముందుతరాలకు  పొందుపరచిన నిధి. 
ఇది సృష్టించడానికి, పొందుపర్చడానికి కొన్ని లక్షల డబ్బు వెచ్చిస్తారు. ఈ సమాచారాన్ని  కవిసంగమం యు-ట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా పరివ్యాప్తి చేస్తోంది. దీనివల్ల కవులకి విశ్వవ్యాప్తిగా గుర్తింపు లభిస్తోంది. ఇది నేర్చుకున్న వాటిని  విస్తరింపచేయడమే కాక, ఇతరుల్ని ఈ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేయడం.
144 కవితలతో 'కవిసంగమం-2012 ' కవితా సంకలనం ప్రచురించింది.. ఇందులో  ఎనభైమందికి పైగానే వర్థమాన కవులు అరంగేట్రం చేసారు. ఇది వాళ్ళకి గొప్ప ప్రేరణ. ఎంతోమంది కొత్త కవులు తమ తొలి కవితా సంపుటి ఆవిష్కరణకు కవిసంగమం 
వేదిక అయ్యింది.
కవిసంగమంలో రోజు వచ్చే వివిధ శీర్షికల్లోని వ్యాసాల్లో కవిత్వసంబధిత  అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి .
బహుశా ఇప్పటి వరకు ఏ  ప్రత్రిక ఇవ్వని శీర్షిక , స్వేఛ్చా కవి/రచయితలకు  ఇక్కడ దొరికింది. వాళ్ళ వ్యాసాల్లోని విశ్లేషణ  అమోఘం. వారి ఓపికకు, కాన్ట్రిబ్యుషన్ కి  జోహార్లు. ఈ ప్రయత్నం కవిత్వానికి ఓ కొత్త ఒరవడిని కల్పించింది. ఈ ప్రక్రియ లర్నింగ్ లో  కొత్తదృష్టిని ఇచ్చేందుకు ,కాలానుసారంగా మానని మనమ సరిచేసుకునేందుకు  దోహద పడుతుంది. ఒక విధంగా మనని మననం క్రాస్ చెక్  చేస్కోవడానికి ఉపయోగపడే మంత్రం.
ఒక అంతర్జాల పుస్తకం వివిధరకాలుగా కవిత్వవేదిక అవ్వడం చాలా అరుదు .మరి ముఖ్యంగా మన దేశంలో. ఇదంతా చూస్తుంటే కవిత్వం ఒక మానవీయ రసాయనిక చర్యలా కనిపిస్తోంది. ఒక వాల్కనో బద్దలై  లావా  ప్రవహిస్తోంది. ఈ ప్రవహం పై నిఖిలేశ్వర్ గారు అన్న మాటలు ‘'మూడుతరాల కవిసంగమం’', విమల గారి మాటల్లో  ‘'ఉత్సవంలా జరుగుతున్న ఇటువంటి కవిత్వ ప్రయత్నంలో కొత్త పూలు వికశించే దృశ్యాన్ని చూస్తున్నాను.'.
 ***
జీవితం టి.వి. సీరియల్లా కొనసాగుతున్నకాలంలో కవిసంగమం ఒక రిలీఫ్ తో కూడుకున్న బ్రేక్ నిచ్చింది. కవిత్యం మీద ఇష్టం లేకపోయినా  కవిసంగమం ప్రతినెల ఏర్పాటుచేసే కవులవేదికలో  పాల్గొంటే' నేటితరానికి  కవిత్వం రాక పోయినా పదిమందితో కల్సి కాలం గడిపే లైఫ్ స్కిల్ అయినా  వస్త్తుంది. అది కవిత్వం రాయకపోయినా కవితలా బతకాలి అన్న లక్షణం నేర్పిస్తుంది. మనం మన ముందుతరాలకి ఇది ఇచ్చివెళితే చాలు. అప్పుడు కవిత్వం తప్పక కవిత్వమే అవుతుంది.

కొత్తవాళ్ళు కవిత్వంలోకి రావడంలేదనే దశనుంచి అనేక కొత్తగళాలతో 'కవిసంగమం'-- 'నువ్వొక పచ్చని చెట్టైతే, పిట్టలు వాటంతటవే వచ్చి వాలేనుఅన్నమాటను నిజం చేసి చూపింది. జీవనది ఒడ్డునున్నజమ్మిచెట్టు కవిసంగమం. రండి,ఆ జమ్మిఆకుల తో అలై బలై పండగ చేస్కుందాం.

[కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్ డిసెంబర్ 14 న హైదరాబాద్ లో జరుపుకుంటున్న సందర్భంగా ]

30 Oct 2013

సాక్షి లో ఇంటర్వ్యూ | 14.10.2013

కవిసంగమం  గురించి సాక్షిలో ..


ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...