అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

22 Jul 2013

లోపలి పరుగు

 
...............................

ఏం మర్చిపోయాను ఇంట్లో 

తాళం వేశానా ,లేదా ?, గీజర్ స్విచ్ కట్టేశానా, పాలగిన్నె ఫ్రిజ్ లో పెట్టానా ,ఆ మూడు పిల్లులూ ఏం చేస్తాయో ఏమో
టామీ రానీయకుండా మొరుగుతుందిలే,గేటు దాకా తరిమేస్తుందిలే
అదేమిటో దానిదీ మొద్దునిద్రే !

అవునూ- ల్యాప్టాప్ లో logout అయ్యానో లేదో
facebook అలానే ఉంచేసానా

ఈ ట్రాఫిక్ లో ఇలా చిక్కుకున్నాను,ఇలా రోజూ ఉన్నదే కానీ మళ్ళీ అలానే అనుకోవాలి.అనుకోకపోతే అదో వెలితి.ఇంకో 12 నిమిషాలే మిగిలింది, ఆలోపు ఆఫీసుకు వెళ్ళగలనా ,సంతకం పెట్టగలనా intime లో ,ట్రాఫిక్ సిగ్నల్స్ మీద ఎన్నాళ్ళిలా నన్ను నేనే
ఇలా కోపగించుకోవడం .

*
కవిసమయం మారింది.
కకావికలమైన జీవితం నిండా లోపలి పరుగుల గాయాల గుర్తులు. రాత్రంతా కురుస్తున్న వర్షం కోసిన రోడ్లమీద పారుతున్నవరదలో ఎక్కడో నావి కొన్ని రక్తపుచారికలు. బిగుసుకున్న రోజుల్లో కీల్లనోప్పుల్లాంటి బాధ.
మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్.మాటలన్నీ జమాఖర్చు లెక్కల చిట్టాలే. ఒకటవతేదీ నుండి ముప్పై ఒకటి వరకు మాత్రమే ఊహించగలిగిన జీవితం. బిల్లులు,చిల్లులూ ,వెరసి తరుగుదల ఖాతా లాంటి బతుకువాణిజ్య శాస్త్రం.
కొన్ని పుస్తకాలూ,కొందరు మనుషులూ మనసుకు తగిలించుకున్న పెయింటింగ్స్ లా అపుడపుడూ మనసుకు రంగులు పూస్తారు .

వారంనిండా ఆదివారం కల.
ట్రాఫిక్ లేని, తాళం కప్పలేని,పరుగులేని మరుపులాంటి ఒక కల.

*
22.7.2013

21 Jul 2013

సన్నటి అలికిడి

 
................................

గుడ్డులా చితుకుతోంది రాత్రి -
చుట్టూతా సొనలు కారుతున్నదేదో బాధ. మూగగా రోదిస్తున్న క్షణాలు ఆచ్చాదనల్ని ఒక్కొక్కటిగా ఒలుచుకుంటూ మీది మీదికి ఒస్తున్నట్లుగా ఉంది.

దూరంగా ఏదో వస్తున్నట్టు 
రైలుపట్టాల్లాంటి ఈ మనసు మీద సన్నటి అలికిడి.

ఎక్కడో కొన్ని వందల మైళ్ళకు అవతల
నాకోసం పక్కలో తడుముకుంటూ చిన్నప్పుడు నాకు
తినిపించకుండా
మిగిలిపోయిన అన్నం ముద్దల్ని తలుచుకుంటూ
" నా బిడ్డ-తిన్నడో లేదో, ఏం బాధలు పడ్తున్నడో"అని
దిండుగా చేసుకున్న తన చేతిని ఈ రాత్రి
కన్నీళ్ళతో తడుపుతుందేమో ?!

తప్పిపోయానని శోకాలు పెట్టి
మాఊరు వాగు మడుగుల్లో ఉబ్బిన శవామైనా దొరుకుతుందని
రోజంతా నాకోసం దేవులాడిన మా అమ్మకు
దొరక్కుండా
పిలిస్తే పలక్కుండా
ఇంత దూరంగా దాక్కున్నాననే కదూ -నేను కలిసినప్పుడల్లా
తన కొడుకుని నాలో కాక నా కొడుకులో వెతుక్కుంటుంది.!

నిజమే
మనం మనలో కాక
ఇతరుల్లోనే ఎక్కువగా దొరికిపోతాం కదూ !!!

# 11.7.2013

అనువాద కవిత

 
టి.పి.రాజీవన్ [మలయాళ కవి]
...................................

ఇసుకరేణువులకు విశేషత ఉంది -

సూర్యోదయం ముందు, సూర్యాస్తమయం తర్వాత 
అవి మనుషుల్లా మారి పోతాయి 
ఏడుస్తాయ్, పోట్లాడుకుంటాయ్, నవ్వుతాయ్,
కౌగలించుకుని ముద్దు పెట్టుకుంటాయి

చీకటి ముసిరినా , వెలుతురు వచ్చినా
మళ్ళీ ఇసుకరేణువుల్లా మారిపోతుంటాయి
నీలాగా, నాలాగా
కలుసుకునేముందు, విడిపోయే ముందులా !

*ప్రణయ శతకం నుండి.

నల్లవాగు

 
........................

చెరువు అలుగు పారకముందు ఎండిన కట్టేలా తనలోకి తానే
ముడుచుకుని గొణుక్కుంటూ నీళ్ళను కలగంటుంది

అక్కడక్కడా మడుగుల్లో మిగిలిన బురద నీళ్ళలో 
తనే ఒక జ్ఞాపకమై 
కలవరిస్తుంది 

ఎండాకాలం
మడుగులచుట్టూ బురదలో
పశువుల గిట్టల గుర్తుల్లో మిగిలిన నీటితడిలో
ప్రవాహాన్ని కలగంటున్న వాగు

వానజల్లుల తర్వాత
వాగుముఖంలో నీటినవ్వు.

అలక తీరిన అలుగు పారి
కాళ్ళకు తొడుక్కున్న చక్రాలతో
నల్లవాగును రహదారిగా మార్చేస్తుంది.

ఊరిముందటి రేవులో వడివడిగా నడుస్తూ
మట్టిబుంగల్లోంచి ఊళ్లో గాబుల్లో చేరే నల్లవాగు
రాత్రి చంద్రుడిని తనలోకి వొంపుకుంటుంది.

తుమ్మముళ్ళ కొనలమీంచి, బర్రెంక చెట్ల మీంచి,ఊడుగుపొదల మీంచి
జిల్లేడుఆకుల మీంచి, మాబీర రొట్టమీంచి, బురద రొచ్చు మీంచి,
పరుగులు పెట్టే నల్లవాగు నీళ్ళకు
వైద్యం కోసం నానపెట్టిన ఔషధరసాయనంలాంటి కమ్మదనం.

-చవచవ్వగా,ఉప్పఉప్పగా మా వూరు గొంతు తడిపే నల్లవాగు
న్నిజంగానే
మాకు ఒక గోదావరి,ఒక కృష్ణా,ఒక ప్రాణహిత.!


*మా వూరి కవిత -సీరీస్ 1
15.7.2013

అక్కడే మిగిలాను.


.......................................

నిన్నటిలోంచి ఇవాళ్టిలోకి 
వొంపుకున్నాక ఇంకొంచెం అక్కడే మిగిలాను.

వర్షంలో తడిసి అరచేతిలో అంటుకుపోయి
నాతోనే ప్రయాణిస్తున్న గునుగుపూల నూగు.

*

చారెడు నేలలో బతుకుని కలగన్న స్వాప్నికుడు మహమ్మద్ మియా
కారేపల్లి సమాధుల తోటలో నిద్రిస్తున్నా
ఇవాళ్టి బతుకుచెట్టుకి
అప్పుడే విత్తనం నాటిపోయాడు.

ఇంటిపంచలో చోటిచ్చి ,ఆమె చేతి గటకముద్దలలో ఆకలి తీర్చి
బతకడానికి ఒక దోవ చూపించిన బొర్ర రామక్కకు
చీరె పెట్టి, కాళ్ళకు దణ్ణం పెట్టి కళ్ళల్లో నీళ్ళు కుక్కుకుంటూ ఎక్కెక్కి ఏడుస్తున్నప్పుడు
ఆమె ఋణం తీర్చుకుంటున్న నాన్న కన్పించాడు.

మేస్త్రీ పనుల్లో తాపీ పట్టి ఇళ్ళను కడ్తున్నప్పుడు
తన కళ్ళల్లో మెదిలిన గూడును
తాటిదూలాల ఒంటి గుడిసెగా సాకారం చేసుకోవడంలో కన్పించింది.

అక్షరం ముక్క తెలియక అప్పుకాగితం మీద
అంగుష్ఠం వేస్తున్నప్పుడు ఆయన బొటనవేలి మీద మిగిలిన సిరాలో
తన కొడుకుల చేతుల్లో కదలాల్సిన పలకా బలపాలు
ఊపిరిపోసుకోవడం కన్పించింది.

కావిడితట్టల్లో పేర్చుకుని ఊరూరా అమ్మడానికి తీసికెళ్ళే
అరిసెలు,మురుకులు,మసాలా దినుసులు,బెల్లం,ఉప్పు,పప్పుల్ల
తన పిల్లల ఆకలి తీర్చే అన్నం ముద్దలు కన్పించాయి.

*

నువ్వెవరివో నీకన్నా ఇంకెవరికీ తెలియదేమో ,నీ దారులేవో నువ్వు మాత్రమే గుర్తుపట్టగలవేమో, నీ వగపోతలూ,ఎగపోతలూ,ఎక్కే మెట్లూ దిగే మెట్లూ, చీత్కారాలూ,
నాన్నలోంచి ఇవాల్టిదాక కురుస్తున్న కుండపోత వర్షం.

చెట్ల కొమ్మలమీంచి
ఊరి పూరిగుడిసెల చూరుల లోంచి
సమాధుల తోట జ్ఞాపకాల్లోంచి
నిన్నటిలోంచి ఇవాళ్టిలోకి
వొంపుకున్నాక
ఇంకొంచెం అక్కడే మిగిలాను.

#17.7.2013

15 Jul 2013

తప్పక మళ్ళీ ఎగురుతాం.



["ఒక్కోసారి జీవితంలో మనం వెళ్లేదారి మనని విజయం దాకా తీసుకు వెళ్తుందని కచ్చితంగా చెప్పలేం. కానీ హటాత్తుగా ,ఎక్కడినుంచో మీకొక చిన్న సూచన దొరుకుతుంది. మీరు సరైన దారినే ముందుకు సాగుతున్నారని అది మీకు సూచిస్తుంది ''
-Jim Stovall, 'The Ultimate Gift' .]

గాలిలో తేలుతూ రెండు పక్షి ఈకలు వాకిట్లోకి వచ్చాయి.
వాటి రెపరెపల చప్పుడులో ఇప్పటిదాకా ఎగిరిన విహారమంతా కనిపిస్తోంది.
గూళ్ళలో పొదువుకున్న తల్లిరెక్కల వేడి జ్ఞాపకపు వాసన. కాళ్ళకు అంటుకున్న చెట్లకొమ్మల మీది వగరు. ఆకులమీంచి ఎగిరిన గోళ్ళపై అంటిన పసరు కమ్మదనం.

అంతకుమించి వియోగంలోని దు:ఖం. ఎండల్లో వానల్లో గడ్డకట్టించిన చలిలో ప్రాణాలు దక్కించుకుని ఆకాశమై విస్తరించిన పయనం. ముక్కున కరుచుకుని గూటి గూటికి మార్చిన తల్లి మమకారం. డేగ కాళ్లకు చిక్కనంత ,పాము నోటికి అందనంత రక్షణకవచమై కాపాడిన అమ్మతనం.

పక్షి ఈకల్లో ప్రవహిస్తున్న జీవితం.
రాలుతున్న జ్ఞాపకాల వాసన.
ఒక్కోసారి తమలోకి తామే ముడుచుకుపోతూ ,కొంచెం కొంచెంగా కదులుతూ
గుసగుసలుగా సంభాషణ.

'ఎక్కడ ఉన్నాం'
'వెనక్కి వెళ్లి మళ్ళీ ఎక్కడ అతికించుకుందాం'
'ఏ ఆకుల కొమ్మల్లో గూడులమై విశ్రమిద్దాం'
'ఏ రెక్కల కుదురుల్లో ఎగిసే గాలులమై ఊపిరి పోసుకుందాం'

' రెక్కలకష్టం తెలిసిన వాళ్ళం .'
' దు:ఖపు అర్థం విడమరిచి చూసినవాళ్ళం '
' ఆకలిదప్పుల అంతరార్థం మనకంటే ఇంకెవరికి తెలుసు '
' కన్నీళ్లను ,కష్టాలను సరాసరి మనమే అనుభవించాం. '
'జీవితాన్ని చెత్తకుప్పలోంచో, మురికి ఇంటి ముంగిటిలోంచో ,బీదతనపు కరుకుతనంలోంచో మొదలుపెట్టినవాళ్ళం. రెడీమేడ్ భద్ర కుటుంబాల ధైర్యమేదీ అసలే లేదు. అంతకుమించి వంశపారంపర్యపు అతిశయం అంతకన్నా లేదు. అట్టడుగునుంచి అందిపుచ్చుకున్న వారసత్వపుబలం మనలోనే దాగిఉంది.'

'ఇప్పుడిక్కడ పడ్డాం.
తప్పక మళ్ళీ ఎగురుతాం.
ఇవాళ రెక్కలు మనతో లేకపోవచ్చు. జీవితపు అనుభవం మన ఆస్తి. మన బలం.
ఎగురుదాం.
తప్పక -ఎగురుతాం !! '

***
వాటి రెపరెపల చప్పుడులో ఇప్పటిదాకా ఎగిరిన విహాయసమంతా వినిపిస్తోంది
విశ్వాసం ధ్వనిస్తోంది.

8 Jul 2013

మళ్ళీ ఒక రోజు


................................

నిరాటంకంగా నిర్విఘ్నంగా సాగాల్సిందేదీ ముందుకు సాగదు
ఆనందంగా గడవాల్సిన రోజేదీ చివరికంటా అలా మిగలదు
ముఖమ్మీద గంటు పెట్టుకున్నట్టు ,
కాలిపిక్క మెలితిరిగి శరీరమే ఒక గాయమన్నట్లు భారంగా రోజు.

ఎర్రటి ఎండలో తాటిగెలల్ని ముందేసుకుని
రోడ్డుమీద కూచుని
నాలుగు డబ్బుల్ని రేపటి తన చదువు కోసం కలగన్న ఆ కుర్రాడు
మళ్ళీ నిన్న గుర్తొచ్చాడు.


పరీక్షాహాలులో ప్రశ్నార్థకమై తనముందున్న పరుచుకున్న
ప్రశ్నాపత్రాన్ని ఎగాదిగా చూస్తూ తననుతానే బహిష్కరించుకుంటున్న విద్యార్థి
క్యాంటీన్ లో ఒక సిగరెట్ పీకలో దహించుకు పోతుండటం
మళ్ళీ నిన్న గుర్తొచ్చింది.

ఖరీదైన జీవితంలోకి అలవాటు పడిన నగరంలో
అస్తవ్యస్తంగా పోగేసుకున్న నాలుగు అక్షరాలను
ఏదో ఒకలా పేర్చుకుని,నేర్చుకుని రేపటిలోకి ప్రయాణం కట్టిన
ఆ పిల్లలందరూ గుర్తొచ్చారు.

పూర్తిగా కోల్పోయాకో,లేదా ఎంతోకొంత మిగిలాకో
ఆ జీవితాన్ని జీవిస్తున్నట్లు నటిస్తూ, అందరిముందూ అలాగే కొనసాగిస్తూ
రోజుల్నీ,నెలల్నీ,సంవత్సరాలనీ దాటిస్తూ
జీవించడం- ఒక పనిగా పూర్తిచేసుకుంటున్నమనుషులూ గుర్తొచ్చారు.

ఊడిపోతున్న అట్టలమధ్య పదిలంగా కుట్టుకుని
రోజుకిన్ని పేజీలుగా తిప్పుకుంటూ తిరగవేసుకుంటున్న జీవితం పాతవాచకమే !
అందుకే
అన్నీ ఇలా గుర్తుకొస్తాయేమో మరి !

# 8.7.2013

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...