అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

3 Sept 2013

పాఠాల ధ్వని



నిన్న మొన్నటివరకూ ఇటువైపే చూడలేదు.

రెండు ఎంగిలి అక్షరం మెతుకులైనా విదల్చలేదు
చిరుగుల్లోంచి తొంగిచూసే దారిద్ర్యపు దేహంపై
ఒక్క భరోసా వస్త్రాన్నయినా కప్పనేలేదు
ఉబుసుపోని అక్షరాలలోనైనా ఆశ్రయం కల్పించనేలేదు
నీకోసం నువ్వే, నీలో నువ్వే ఒకానొక ఆధిపత్య శిబిరానివై
పలవరించావ్,కలవరించావ్,పేజీలు పేజీలుగా కీర్తిపుటలవై రెపరెపలాడావు

ప్రయాణం నీనుంచే ప్రారంభించి, నీలోకే ముగించావు
నీ స్మరణ లోనే నువ్వే మునిగితేలావ్
అన్ని ప్రారంభాలు నీ కాలికింది నుంచే కావాలని
అన్ని నిర్మాణాలు నీ కనుసన్నల్లోనే నడవాలని
అన్ని కలబోతలు నీ ప్రణాళికల ప్రహేళికలే అవ్వాలని
నీవిన్నాళ్ళూ పన్నిన వ్యూహాలు
ప్రశ్నల్లా ఎదురుతిరిగి నీకే గుచ్చుకుంటున్నాయి.

*
నువ్వతికించిన ప్లాస్టర్ ల వెనుక గొంతు
సరికొత్త భాషని సమాయత్తం చేసుకుంది.
సంకేతాల్లో,పదచిత్రాల్లో,అభివ్యక్తిలో
నీ వ్యూహాల వ్యుత్పత్తి అర్ధాలను ఛేదించే కొడవల్లిక్కుల్నిసమకూర్చుకుంది.

నీ నీ అవసరాల ,అభ్యర్థనల,అహంకారాల,ఆకాంక్షల
అవసరంగా చేసుకున్న అక్షరాన్ని చెర విడిపించి
సమిష్టిగొంతుగా మలుచుకున్న కొత్త బడిలో సరికొత్త పుస్తకంగా చదువుకుంటోంది.
ఇక కొత్త పదచిత్రం ,సరికొత్త సంకేతం ,విస్మయపరిచే నిర్మాణం
నీ వైపే చూస్తూ కవ్విస్తాయి,పందెం కాస్తాయి,పరుగులు తీస్తాయి చూడు.

నువ్విన్నాళ్ళు పన్నిన వ్యూహాల్లోకి జొరబడి
నీ వలల్ని,వలువల్ని కొరికి కొరికి తినేస్తాయి కాచుకో .
బొటనవేలుల్నినరికేసినా కొత్తగా మొలవని కాలం పోయింది.
మొదళ్ళు పీకేసినా సరికొత్తగా మొలుచుకొచ్చే ప్రతిసృష్టి విద్య నేర్చుకునే పుట్టాం.

నిన్న మొన్నటివరకూ ఇటువైపు చూడనేలేదు.
ఇప్పుడిక మేం వల్లెవేసే పాఠాల ధ్వని నీదాకా చేరుతుంది విను.

#2.9.2013

ఒకప్పటి మాట

 
తునికొర్రెలో ఎలుగ్గొడ్డు దాక్కున్నట్టు 
దేహంలో కోర్కె పడుకుంది

ఊరోళ్ళంతా కర్రలు పట్టుకుని
ఒర్రె వైపు పోతున్నారు ఎలుగ్గొడ్డును తరుముదామని
-మరి ఈ ఈ దేహం మాటేమిటి?

చుట్టూతా పన్నిన వలలే
వేసిన మాటులే
బెదరదు
కదలదు
తనను తానే పారదోలుతుంది , ఎదురు తిరుగుతుంది

తప్పించుకోవడం ఎప్పటికీ కుదరదు
పారిపోవడం
ఈ దేహంలోని కోర్కెకు అలవాటే
ఎదురు తిరగదు

ఎదురు తిరగడంకన్నా
ఇలా దేహం లోనే దాక్కోవడం
అలవాటైన మర్యాదలాంటి సులువు.

#30.8.2013

ఊపిరాడదు !



తెరలు తెరలుగా దగ్గు , ఊపిరాడనంత.

గుక్కెడు నీళ్ళలోని తడి గొంతులోని ఏ పొరను తాకిందో
ఉక్కిరిబిక్కిరి చేసే దగ్గు 

తలపై ఆదుర్దా అమ్మ స్పర్శ
'ఎవరో నిన్ను గుర్తు 
చేసుకుంటున్నారని' నా కళ్ళల్లోని కన్నీళ్లను తుడుస్తూ అంటుంది.
దగ్గుకూడా బావుంటుందనే ఆ అమ్మ స్పర్శ
నగరంలొ ఓ మూల- పైకప్పునీ నాలుగ్గోడలనీ పంచుకుంటూ భార్యాపిల్లలూ
రొటీన్ పరుగులూ, క్రమం తప్పని బిల్లులూ
అపుడపుడు, అక్షరస్పర్శకోసం వో సాహిత్య సమావేశం,
ఎప్పుడో నిర్వచనం మరిచిపోయిన జీవితస్పర్శ
- ఇంతకుమించి చెప్పుకోవడానికేమీ మిగలని తనంలో 
ఎవరు గుర్తుచేసుకుంటారులే - 
నేనేమన్నా కిచకిచమని పలకరించే బల్లి తప్ప!
**
నిన్ననే నేనొక కొత్త మనిషిని పలకరించాను . 
ఓ కవిమిత్రుడి తడి ఆరని అక్షరాలని ఆప్యాయంగా
స్పృశించుకున్నాను మనసారా--
మెచ్చుకుంటూ వో రెండు మాటల్నీ రాశాను .
కవిమిత్రుని ఆర్తినీ, ఆవేదననీ అర్ధంచేసుకున్నానన్న
నా నాలుగు అక్షరాలనీ పంచుకున్నాను కూడా
ఆమధ్యే కొందరం కలిసి కూచుని 
మరో సమావేశంలో నాలుగు అక్షరాల్ని తలచుకున్నాం.
***
తెరలు తెరలుగా దగ్గు , ఊపిరాడనంత.
గుండెల్ని పిండేసే దగ్గు..ఆత్మీయస్పర్శ కోసమడిగే దగ్గు
బహుశా--
ఇలా పలకరించుకోవడం,రాయడం,పంచుకోవడం,కలుసుకోవడం 
నచ్చడం లేదేమో ! 
కలవకుండా, కలపకుండా ఉంచే పెట్టుబడిదారీ మనస్తత్వమేదో
ఎక్కడో ఓ చోట నన్ను గుర్తుచేసుకుంటూ 
ఇలా ఊపిరాడనీయని దగ్గులా చుట్టేస్తుంది కాబోలు.

స్పర్శ మాత్రం మిగిలే ఉంటుందంటూ గోడపై బల్లి కిచకిచ...

#29.8.2013

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...