అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

25 Feb 2013

చిందరవందర



ఎవరికి చేరుతున్నానిప్పుడు, ఎక్కడికి చేరుతున్నానిప్పుడు
ఆ దారిని వదిలేశాక ఈ దారినెటువైపుగా సాగుతున్నాను

ఈ గతపు దారుల్లో మిగిలిన ఈ పాదముద్రలు ఇలా మోసుకుంటూ,బరువైపోయాక కూడా
ఇంకిలానే భుజం మార్చకుండా  ఈ మూటనిలా దించకుండా ,ఇంకెవరికీ అప్పగించకుండా
మోసుకుంటూ తిరుగుతూ తిరుగుతూ తిరగడం.

కాళ్లేప్పుడో నొప్పెట్టడం మర్చిపోయి
అలిసిపోయి అవీ నాలోకే ముడుచుకు పడుకున్నాయి.

ఇన్నిన్ని  జ్ఞాపకాల శవాలు ,అవి బతికిన గతపు దుర్గంధం
వాటినుండి నాలోకి,నాలోంచి వాటిలోకి
వస్తూ పోతూ అలాగే గడ్డకట్టిన దు:ఖం లోని చివరి కరగని రాలని కన్నీటిబొట్టు

మొన్నటినుంచి నిన్నటిలోకి,ఇవాల్టిలోకి
నేనే నన్నే ఒంపుకున్నానిలా ;ఎవరూ చూడ్లేదు
సరిపోయింది ,కానైతే నన్నెలానూ పసిగట్టరు
నా నమ్మకం ఓడిపోకుండా ఇలా ఇక్కడ నిలబెట్టుకున్నాను సరే;ఎలాగూ ఖచ్చితంగా గుర్తించరు

నన్నో బాంబు ముద్దిడింది
ఆ తర్వాతే తనను అసహ్యించుకుని పేలిపోయింది
పగిలిపోయిన దేహమ్మీదికి ఒంగి తనలో తాను కాలిపోయింది.

సమూహంలోకి,మృత్యువులోకి
రాలిన క్షణాల్లోకి,నెప్పెట్టిన బతుకుల్లోకి ముక్కలుముక్కలై
తేదీలు తేదీలుగా రోడ్డు మీదికి వస్తూ పోతూ
పలరింపుల పడజాలమేదో మార్చి అందర్నీ నిందిస్తుంది

నన్నెవరో  గుర్తుగా మార్చారు
వంచించారు,వలచారు,లెంపకాయ కొట్టారు,అలిగారు నాపై కసితో శోకించారు
బోలెడు సోదలున్నాయి ఇంకా;మిగిలినవెన్నో కథలున్నాయి

"ఎవడ్రా -నన్నో మనిషని పిలుస్తున్నారు
కనీసం అమర్యాద కూడా తెలవని ఆ పిలుపెవడిది"



--

దిల్ షుక్ నగర్

 
దిల్ షుక్ నగర్ ఇప్పుడు
బాంబుల మధ్య వణుకుతున్న
బెదురు బెదురు చూపుల లేగదూడ

కొన్ని మిర్చీబజ్జీలు,వేడి వేడి పునుగులు,కొన్ని సమోసాలు, కొంచెం చాయ్,
కూడా మరణించాక
విసిగి వేసారిన సాయంత్రాలని గడపడానికి
ఏ దిక్కూతోచక బిత్తర చూపుల బాటసారి

మరణం కొసన వేలాడుతూ
విరిగిన ఎముకల మధ్యన తీసుకుంటున్న చివరి శ్వాస
*
ఇదొక
ఆస్తమా పేషెంటులా బతుక్కోసం ఇన్హేలర్ వెతుక్కుంటున్న
రేపటి ప్రశ్నార్ధకం .

రోజూ వచ్చీపోయే దారిలో తుమ్మముళ్ళను చల్లినట్లు ,
తినాల్సిన అన్నంలో ఇసుకనెవరో పోసినట్లు
ఇక్కడెవరో జీవితంలోకి బతుకుభయాన్ని,
కొన్నిశవాలను ,మరికొన్నిగాయాలను చల్ల్లిపోయారు.

దిల్ షుక్ నగర్
ఇప్పుడొక బతుకువిధ్వంసాన్ని
కూర్చి పేర్చిన ప్రతీకల కూడలి !


23.2.2013

20 Feb 2013

వ్యాఖ్యలు లేవు


నీ కుతూహలమంతా
నా వ్యాఖ్యల గురించే

తెగని సంకెలను నాలోనే మోస్తూ
తాళంచెవి కోసం వెతుక్కుంటూ
ఇక్కడిలా బంధింపబడి ఉండిపోయాను.

నా సమస్తం ఒక గది

ఆ గదిలోనికి అపుడపుడూ తొంగిచూసే
ఒక కిరణం, మరికొన్ని అస్పష్ట శబ్దాలు
వాటిలోకి దూరిపోయి నన్ను నేనే అనువదించుకుంటున్నాను
నేనేమి వ్యాఖ్యానించగలను

రెండు పొడిమాటల చివర్న తగిలించుకున్న
ఒక చిర్నవ్వుగా పిలవబడే ఒకానొక అగ్నిపర్వతాన్ని మోస్తూ
చిట్టచివరికిలా మిగిలే ఉన్నాను.
నేనేమీ వ్యాఖ్యానించగలను

కొన్ని మాటలు, మరికొన్ని లాలసతో నిండిన ఊహలు
కొన్ని అనుబంధాలు,వాటిని ఇష్టంగానే కొనసాగించే ఆదర్శాలు
కొన్ని త్యాగాలు,వాటిని చివరికంటా నిభాయించే సంకల్పం
కొంత మానవత్వం ,దగ్గరి దారులేవీ వెతుక్కోని నిర్మలత్వం
ఇంతకుమించి
నేనేమి వ్యాఖ్యానించగలను

అలసటల్లోనూ,అశాంతుల్లోనూ,ధిక్కారాలలోనూ ,పెనుగులాటల్లోనూ
ఇంకా కాస్తో కూస్తో మిగిలి నాదాకా చేరే నిర్మలస్నేహాల్లోనూ
మిత్రశత్రువుల్లో
శత్రుమిత్రులల్లో దాగిన వ్యూహాల్లోని పలకరింపులలోనూ
ఇలా బంధింపబడి
నాకోసం మిగిలిన జీవితాన్ని
చివరికిలా
జీ వి స్తూ నే ఉ న్నా ను.

నా దగ్గర ఇంకేమీ వ్యాఖ్యలు మిగలనే లేదు !
నేనేమి వ్యాఖ్యానించగలను !!

16.2.2013

5 Feb 2013

నీడ పక్కన


కొంచెం కొంచెంగా తరిగిపోతున్న రోజులో
ఒక పక్కన ఒద్దికగా నడుస్తూ,
చిట్టచివరికి ఇలా కొంత మిగుల్చుకున్నాను

రాత్రుల్లో కలవరపెట్టే కలల్లోంచి
మిగిలిన నావి అనే కలల్ని జేబులో వేసుకుని
నిద్రలేచాను.
కొన్ని నాణేలు మటుకు గుండెల్ని హత్తుకుని
కలల పక్కనే కూచుని కబుర్లు చెప్పుకుంటూ
ఎంతోకొంత జీవితానికి భరోసాగా ఉన్నాయి నాతోపాటే.
రోజంతా వాటి గుసగుసలు నావెంట.

పొద్దుటి మంచును దాటివచ్చాను.
మనసును కప్పిన దిగులును మాత్రం వెంట తెచ్చాను
జీవితం నీడతో పాటు
సాగడం,ఆగడం అలవాటైతే అయ్యింది.
కనీసం ఈ నీడపక్కన
మిగలడానికి ప్రయత్నిస్తూ సాగాలి
............................................
OTHER VERSION:/ MODIFICATION

కొంచెం కొంచెంగా తరిగిపోతున్న రోజులలో
ఒక పక్కన ఒద్దికగా నడుస్తూ, చివరికిలా
కొంత మిగుల్చుకున్నాను

కలవరపెట్టే రాత్రి కలలలోంచి
నావైన కలల కలలని వేరు పరచుకుని
నిదుర లేచాను. ఇక ఈ రోజంతా వాటి
రహస్య గుసగుసలు నావెంట-

పొద్దుటి మంచును దాటివచ్చాను.
మనసును వొత్తిన ఈ దిగులును మాత్రం
వెంట తెచ్చాను

ఇక మిగిలేందుకు – నీతో, నాతో-
కొంత మిగిలి
ఉండేందుకు

కొంత ఓరిమితో ప్రయత్నిస్తాను.
ఎవరన్నారు జీవితం
అయిపోయిందని-?

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...