అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

Showing posts with label రొట్టమాకురేవు. Show all posts
Showing posts with label రొట్టమాకురేవు. Show all posts

24 Apr 2016

ధన్యవాదాలు ...సలాములు !

RRLP 


¤|¤
OCTOBER 10,2015న 'రొట్టమాకురేవు కవిత్వ అవార్డు సభ ', ' కె.యల్. పుస్తకసంగమం' (లైబ్రరీ) ప్రారంభోత్సవం జరిగాయి. వందల మంది హాజరయ్యారు.ఈసారి ప్రధానంగా ఫేస్బుక్ లోనూ, పత్రికల సాహిత్య పేజీల లోనూ కార్యక్రమం గురించిన సమాచారం ఇచ్చాను. ప్రత్యేకంగా ఫోన్ ల ద్వారా పిలవలేదు. అయినా అభిమానంతో వచ్చారు .
దూరాలనుంచి వచ్చిన మిత్రులను కొందరిని పలకరించాను. కొందరిని పలకరించలేకపోయాను .కొందరిని కలిశాను. కొందరిని కలవలేకపోయాను. పైగా 102'డిగ్రీల జ్వరం. కొంత అలసటగానూ వున్నాను ఆరోజు. అదికూడా ఒక కారణం.
వచ్చినందుకు వారందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు.
ఎండ వలన, ఉక్కపోత వలన ,వాతావరణానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయలేకపోవడంవలన ఏర్పడిన ఇబ్బంధులన్నింటిని సహించిన మిత్రులందరికీ వందనాలు.
పైగా ఆరోజు బంద్.
బంద్ ను కూడా దాటుకుని రొట్టమాకురేవు దాకా అభిమానంతో వచ్చి,కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ శనార్తులు.
కెమెరాలతో సందడి చేస్తూ కార్యక్రమంలో భాగమై, రొట్టమాకురేవును,అక్కడి జీవితాన్ని తమ కెమెరాల్లోకి ఎక్కించి, ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేస్తున్న కందుకూరి రమేష్ బాబు, రఘు మందాటి, చేగొండి, కొంపల్లి వెంకట్ గౌడ్, దాసరి అమరేంద్ర, భానోజి రావు,భాస్కర్ ...ఇంకెందరొ మిత్రులందరికీ సలాం.
కార్యక్రమంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మిత్రుడు, అధ్యక్షత వహించిన ప్రసేన్.
రెండుగంటలనుండి ఆరున్నర దాకా అలుపు తెలియకుండా కార్యక్రమం నడిపాడు.
ముగ్గురు అవార్డు గ్రహీతలు సరేసరి. వచ్చిన అతిధులు కార్యక్రమాన్ని తమ మాటలతో ఉత్తేజితం చేశారు. నమస్తే తెలంగాణా ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి సభను చూసి, అక్కడి వాతావరణాన్ని చూసి తన పల్లెను తలచుకున్నారు . బాల్యం నుంచి తనకు స్ఫూర్తినిచ్చిన విషయాలను గుర్తుచేసుకున్నారు.
‪#‎లైబ్రరీ‬ ప్రారంభోత్సవం ఎన్ వేణుగోపాల్ గారు చేయాల్సివుంది, కానీ బంద్ కారణంగా రాలేకపోయారు. ఆ స్ధానంలో కె.యల్ గారిని తన చిన్నప్పటి నుంచి ఎరిగిన శాగంటి కృష్ణమూర్తి గారిచేత ప్రారంభించాం. నిజానికి ఆయనను ఇదివరకు నేను చూడలేదు. కానీ గ్రామాలలో గ్రంథాలయాల ఆవశ్యకత గురించి అక్కడ కరపత్రాలు పంచుతూ తిరుగుతున్న ఆయన గురించి ఆరా తీస్తే , కె.యల్ గారితో వారి పరిచయం వివరాలు తెలిశాయి. అందుకని ఆయనతోనే లైబ్రరీ ప్రారంభోత్సవం చేయించడం సబబు అన్పించింది.
2
అవార్డుల ప్రదానం, అవార్డులకు ఎంపికైన కవితాసంపుటాలను సీతారాం, వంశీకృష్ణ ,సత్య శ్రీనివాస్ తమదైన విభిన్నమైన శైలులలో పుస్తకాలను పరిచయం చేశారు .మంచి విశ్లేషణలు. గుర్తుంచుకునే ప్రసంగాలు. సత్య శ్రీనివాస్ 'జీనుబాయి పిట్ట' ప్రస్తావన ఒక కొత్త ఎరుక.
రసమయి బాలకిషన్ తనతో పాటు ధూందాం గాయకుల్ని ను వెంటపెట్టుకొచ్చారు . తీరొక్క పాట. పల్లె పాటలు, తెలంగాణ పాటలు,
ఉరకలెత్తించిన పాటలు , సభ అంతా చివరికంటా ఉద్వేగంతో ఊగిపోయింది. కాసుల ప్రతాపరెడ్డి తనకున్న రొట్టమాకురేవు అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 'తొపుడుబండి' సాదిక్ అలీ లైబ్రరీ కోసం కంప్యూటర్ ను వాగ్దానం చేశాడు. పల్లెల్లో పుస్తకాల పఠనం ఆవశ్యకతను గుర్తించి, తన ఊరులో లైబ్రరీ ఏర్పాటు కోసం పూనుకుంటానన్నాడు.
స్ధానిక ఎం.ఎల్. ఏ మదన్ వాల్ రొట్టమాకురేవు అభివృద్ధి కోసం దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. పొతినేని సుదర్శన్ రావు (సిపియం) ,పోటు రంగారావు(ఎం ఎల్~ న్యూ డెమోక్రసీ) లు పల్లెలు అభివృద్ధి పథంలో నడవడానికి పూనుకోవడం అవసరమని, రొట్టమాకురేవు సభ అందుకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.
‪#‎చివరిగా‬ కొన్ని మాటలు !
రొట్టమాకురేవులో నిర్మాణం సంకల్పించిన నాటినుంచి ఫేస్బుక్ లో అప్డేట్స్ పెట్టుకుంటూ వచ్చాను. హఠాత్తుగా ఒకరోజు ఈ నిర్మాణం కోసం నా వంతు సాయం అంటూ పెద్దాయన Gumma Ramalinga Swamy గారు నాలుగువేల చెక్కును పంపారు. ముందుగా తీసుకోవడానికి సంశయించాను. కానీ ఇది నా సంకల్పానికి ఆశీర్వాదం అనుకుని, అదే విషయం నా ఫేస్బుక్ వాల్ మీద కృతఙ్ఞతను ప్రకటించాను.
మరికొన్ని రోజుల తర్వాత 'తోపుడుబండి' Sheik Sadiq Ali ఈ ప్రయత్నం కోసం పాతికవేేలు ప్రకటించి,అందజేశాడు.
వెంటవెంటనే తమ సహాయంగా రాజేంద్ర ప్రసాద్ గారు,నారాయణ స్వామి, విజయకుమార్, మధు, భాస్కర్, పుల్లారావు, డా.రమేష్ బాబు, ఉషాకిరణ్, సందీప్ ~ మొత్తం అంతా కలిపి లక్షా నలభై వేల అయిదు వందల రూపాయలు నాకు పంపి, ఈ సంకల్పానికి ఊపిరులూదారు.నిర్మాణంలో తోడ్పాటును అందించారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
#లైబ్రరీ కోసం రావెల పురుషోత్తమరావు గారు, దేశరాజు వందల సంఖ్యలో పుస్తకాలనిచ్చారు. మరికొందరు తాము రాసిన పుస్తకాలు సభ రోజున లైబ్రరీలో వుంచారు.
మీ మేలు మరవలేను. సదా గుర్తుంచుకుంటాను.కృతఙ్ఞతలు మీకు !
_/\_
###
రొట్టమాకురేవు సభ గురించి వివరణాత్మక కధనం కోసం కందుకూరి రమేష్ బాబు రాసిన ఈ రిపోర్టు కూడా చదవండి .

~కవి యాకూబ్ 


https://www.facebook.com/permalink.php?story_fbid=1509769289342739&id=1463232627329739
smile emoticon

22 Apr 2016

Rottamaku Revu Library & Poetryspace (RRLP)


#RRLP 
అది ఒక  మామూలు పల్లె. మారుమూల వాగు వొడిలో తలదాచుకున్న పల్లె. దాన్ని కవిత్వ పటం మీద స్ఫుటంగా నిలపాలని యాకూబ్ స్వప్నం. ఆ స్వప్న సాకారానికి కొన్ని రూపాలు: మూడు పురస్కారాలూ, ఒక కవిత్వ లైబ్రరీ. ప్రతి అక్టోబరు పదినా అక్కడ కవిత్వ ఉత్సవం. ఆ సందర్భంగా ఈ ప్రత్యేక విశేషాలు…
~
కవిత్వం ఒక సాంస్కృతిక సంభాషణ. భాషని ఆధిపత్యంలో ఉంచుకోవడం అంటే కేవలం ఒక వ్యక్తి , సమూహం, ప్రాంతం పెరుగుదలే. కాని భాషని ఇవ్వడం, మరొకరితో పంచుకోవడం అంటే , చాలా ఉన్నతమైన భావన మాత్రమే కాక, ఒక మార్పుకు నాందీసూచన కూడా !
అవార్డు మెమొంటొలు 
సమకాలిక కవిత్వం కవిని సమూహంతో కలిపే ప్రయత్నం చేయాలి. కవి ‘నేను మీలో ఒకడ్ని అంటే’ పాఠకుడు ‘నువ్వు నాలో ఒకడివి’ అన్న ప్రతిస్పందన రావాలి. కాని ఆధునికత పేరిట మనం మన వేర్లనుండి విడిపోతున్నాం. నానాటికి దూరంగా జరిగిపోతున్నాం.అలా జరిగిపోవడం గమనించినా ఏమీ చేయలేని అశక్తులుగా మిగిలిపోతున్నాం.
మనం గ్రామాల నుండి ఎంత దూరంగా వెళ్ళిపోతే వాటి జ్ఞాపకాలు మనని అంతే వెనక్కు సదా లాగుతుంటాయి .
ఇలా ఎన్నెన్నో ఙ్ఞాపకాల ఊట రొట్టమాకురేవులోని బుగ్గవాగులా సదా మదిలో నాలో పారుతూనే వుంది. ఈ చిన్నపాయ వివిధ రూపాల్లో ప్రత్యక్షమై వెంటాడుతూనేవుంది.
yakubఅలాంటి తరుణంలో కేరళ లో ‘తుంచన్’ అనే కవి స్మారకంగా నిర్మించిన “తుంచన్ మెమొరియల్ ట్రస్ట్ “, కుమారన్ ఆసన్ స్మారక కేంద్రం ; హైదరాబాద్ లోని “లమకాన్”, ‘గోల్డెన్ త్రెషొల్డ్’లను చూడ్డం జరిగింది. కేరళ, కర్ణాటక, ఉత్తర భారత ప్రాంతాలలోని మరికొన్ని గ్రామీణ సాహిత్య కేంద్రాలు చేస్తున్నపనులు ఆకర్షించాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు సాహిత్య, సాంస్కృతిక కేంద్రాలుగా మారవలిసిన అవసరం వుందని అన్పించింది.
చిన్నప్పుడు ప్రతి ఉదయం పల్లెలలో తిరిగే బుర్రకధలవాళ్ళు, తంబురకధలవాళ్లు, బుడబుక్కలవాళ్లు, ఒగ్గు కథలవాళ్లు ఇలా ఎన్నెన్నో కళారూపాలను చూసిన కాలం గుర్తొచ్చింది. రొట్టమాకురేవులాంటి పల్లెటూర్లో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక వేదికను ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షకు ఈ ఎడతెగని ఆలోచనే ప్రేరణగా నిలిచింది . అందుకు వున్న కొద్దిపాటి వనరులతో , మిత్రుల సహకారంతో ఈ చిన్ని ప్రయత్నం, ప్రయోగం చేయడానికి సంకల్పించాం. భవిష్యత్తులో అదొక కల్చరల్,పొయెట్రీ సెంటర్ గా ఎదగాలని,ఈ ప్రయత్నం మరికొన్ని ప్రాంతాలకు స్ఫూర్తిగా మారాలని లోపల ఎక్కడో చిన్ని ఆశ.
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఈ ప్రయత్నం అందరినీ ఆకర్షిస్తుందని, అతి త్వరగా ఊపందుకుంటుందన్న భరోసా మాత్రం వుంది .
కవిత్వం అంటే కేవలం రాయడం ,చదవడంతో మాత్రమే సరిపోదు. కవిత్వ వాతావరణాన్ని కల్పించడంకూడా ముఖ్యం. పొయెట్రీ స్పేస్ కూడా ముఖ్యం. ఇతర భాషల కవిత్వం వినడం, కవులను కలవడం, మన కవులను కలపడం ఇదంతా జరగాలి. ఇదొక ప్రాసెస్ లో నిరంతరంగా జరగాలి. అప్పుడు మాత్రమే కవిత్వాన్ని గ్లోబల్ స్థాయికి చేర్చడం సాధ్యం.
ఇన్ని ఆలోచనలు, సంకల్పాలతో ఇలా మొదలైన ప్రయాణంలోని తొలి అడుగుగా – ప్రతి సంవత్సరం అక్టోబరు 10 న “షేక్ మహమ్మద్ మియా, కె.ఎల్. నరసింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక కవితా పురస్కారం “ను గుదిగుచ్చి “రొట్టమాకురేవు కవిత్వ అవార్డు “గా ఇవ్వడం . ఒక ఊరి పేరుతో అవార్డు నెలకొల్పి యివ్వడం ద్వారా పల్లెలు, స్ధానికత అనే అంశాలకు ప్రాధాన్యత పెరగాలని కాంక్షించాం.
2015 అవార్డు సభ 
నిజానికి 2010 లో ప్రారంభించాలనుకున్న ఈ అవార్డును 2014 లో మొదలుపెట్టాం.
గత సంవత్సరం(2010-2014) అవార్డు గ్రహీతలు సౌభాగ్య(సాభాగ్య కవిత) , అరుణ్ సాగర్ (మేల్ కొలుపు) ,షాజహానా(దర్దీ) ,నంద కిషోర్ (నీలాగే ఒకడుండేవాడు) లకు అవార్డులు ప్రదానం చేశాం.
2015 సంవత్సరం నందిని సిధారెడ్డి (ఇక్కడి చెట్ల గాలి) ,మోహన్ రుషి (జీరో డిగ్రీ) ,హిమజ (సంచీలో దీపం) అవార్డులు ప్రదానం చేస్తున్నాం.

+++
ఇలా తొలి అడుగు పురస్కారాల ద్వారా ప్రోత్సాహాన్ని పెంపొదించడం అయితే, ఆ అడుగుకు జోడుగా అందర్ని కలుపుతూ వెళ్ళే ప్రయత్నం, రొట్టమాకురేవులో లైబ్రరీని ఏర్పాటు చేయడం. దానికి కె.యల్. పుస్తకసంగమం గా పేరు పెట్టాం. లైబ్రరీ కేంద్రంగా చదవడం, రాయడం, చర్చించడం లాంటి విషయాలు కొంతైనా జరగాలని కోరిక.
లైబ్రరీ కోసం పుస్తకాల సేకరణలో తొలుత గుంటూరు నుండి రావెల పురుషోత్తమరావు గారి పుస్తకాలతో శుభారంభం జరిగింది. పుస్తకాలు ఇవ్వడానికి ఇంకా ఎందరో మిత్రులు సూచనప్రాయంగా తెలియజేశారు. అలాగే, కవి దేశరాజు ఇచ్చిన 100కు పైగా పుస్తకాలను యింటికి వచ్చి మరీ వచ్చి యిచ్చి వెళ్ళారు.
రొట్టమాకురేవు గురించి ::
రొట్టమాకురేవు ఖమ్మం జిల్లాలో కారేపల్లికి అతి సమీపంలో వున్న అతి చిన్న పల్లెటూరు. పట్టుమని యాభై, అరవై ఇళ్లకు మించి వుండవు. పక్కనే పారే చిన్న బుగ్గవాగు. బుగ్గవాగు మీద రైలు వంతెన. డోర్నకల్ నుండి కొత్తగూడెం (భద్రాచలం రోడ్) ,మణుగూరుకు వెళ్లే రైళ్లు ఆ పట్టాలమీంచే వెళ్తాయి. మరో పక్క మాధవరం డొలమైట్ ను రవాణా చేసేందుకు కారేపల్లి నుండి మాధవరం వరకు వేసిన రైల్వే ట్రాక్.
ఊరు మొత్తం నాలుగు ఇళ్లు తప్ప అన్నీ గిరిజన కుటుంబాలే. ఎక్కువగా రైతుకూలీలు. కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు. ఇంకొందరు రైతుల దగ్గర జీతానికి కుదిరినవాళ్లు. కొందరు పనికి ఆహారపథకం కోసం పనులకు పోయేవాళ్లే !
తరచూ ఇల్లందు, ఖమ్మం వెళ్లి వస్తుంటారు. కారేపల్లి/ సింగరేణి కి అయితే రోజుకు ఒకసారైనా వెళ్లాల్సిందే ! అంత దగ్గర.
పాలు అమ్మడానికో, చేను మందులు కొనడానికో, ఏమీ పనిలేకపోయినా ఉబుసుపోక కూడా వెళ్లిరావాల్సిందే.
ఇక ఖమ్మం నుంచి ఇల్లెందుకు రోడ్డు. ముప్పై కి.మీ. ప్రయాణించాక కారేపల్లి క్రాస్ రోడ్. అక్కడినుంచి అయిదు కి.మీ. కారేపల్లి. కారేపల్లి నుండి ఒకటిన్నర కి.మీ.రొట్టమాకురేవు. ఆటోలు అటూఇటూ తిరుగుతుంటాయి.
ఇక్కడ ఈ రొట్టమాకురేవులో కవిత్వ అవార్డు ప్రదానం. పైగా ఊరు పేరుమీద అవార్డు. ఇలానైనా పల్లెల ప్రామినెన్స్ పెరగాలని, కేవలం నగరాలకు , పట్టణాలకు పరిమితం అవుతున్న కవిత్వం/సాహిత్యం పల్లెలకు చేరాలని, పల్లెలు చూడాలని, తద్వారా క్రొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో వినూత్నమైన దిశగా పల్లెలు అడుగులు వేయాలని ఎక్కడో, ఏదో చిన్న ఆశ.
ఈ దిశలో ఇదివరకే అడుగులు వేసినవారు లేరనికాదు, కానీ ఇప్పుడు ఇది కొత్త సందర్భం. కాబట్టి స్ఫూర్తినింపే దిశగా ఈ ప్రయోగం కొంతైనా పనిచేయకపోదా అనే ఆకాంక్ష.
అదీ సంగతి !
రొట్టమాకురేవుకు చేరే మార్గం:
Rottamaku Revu Library &Poetryspace
(RRLP)
Rottamaku Revu
Karepalli, Khammam Dist.

Links :http://magazine.saarangabooks.com/2015/10/08/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%AE%E0%B1%82%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8/

21 Apr 2016

'రొట్టమాకురేవు' ఇకముందు 'జీనుబాయి పిట్టగూడు'


ఒక ఊరు తనంతట తాను తాను అల్లుకోవడంలో ఒక్కరు చాలు. అలా ఇప్పుడా ఊరు ఒక 'జీనుబాయి పిట్ట' అయింది. అలాగే 'సంచిలో దీపం' అయింది. అట్లే 'ఇక్కడి చెట్ల గాలి' అయింది. ఇంకా చెప్పాలంటే, అదొక కేంద్రకం అయింది. 'జీరో డిగ్రీ' కూడా.
అవును. 'జీరో డిగ్రీ' అన్నది ఒక శీతల స్థితి కాదు, భయ విహ్వలతా కాదు. ఘనీభవించిన హృదయాలు తిరిగి కరిగి నదిలా ప్రవహించేందుకు తగ్గ కేంద్రబిందువు. ఆ ఊరూ అదే అయింది. మరెన్ని గ్రామాలకు స్ఫూర్తి నిచ్చే రేవు కానున్నది.






                              +++                                                         



నిజం. మొన్న ఆ ఊరు కవిత్వంతో, ప్రసంగాలతో వేడెక్కలేదు. ఆత్మీయ భాషణాలతో, హృదయ కరచాలనాలతో సుసంపన్నం అయింది. రొట్టమాకురేవు మనందరినీ తెలంగాణ పునర్నిర్మాణంలో గ్రామాలకు తరిలాల్సిన పాత్రను యాది చేసింది. ఆయా కార్యరంగాల్లో మనం రచనల్లో పేర్కొన్న స్థానికతను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ మనవైన సృజనాత్మక కార్యాచరణను విశ్వజనీనం చేసే రంగస్థలం అయింది. ఊరును పొందించిన బొడ్రాయి పండుగ అయింది.
నిజానికి స్మారక పురస్కారాలు, ఒక లైబ్రరీ ఏర్పాటు ప్రధానంగా ఇక్కడ కార్యక్రమం జరిగినప్పటికీ ఆ ఊరు అభివృద్దికి కూడా బీజాలు పడటం మరొక సానుకూల అంశం. అవశ్యమైన కల సాకారం కావడమే.
ఆ గ్రామాన్ని స్థానిక శాసన సభ్యులు మదన్ లాల్ గారు దత్తత తీసుకోవడానికి ముందుకు రావడం అభినందనీయం. ఈ వూరికి దగ్గరలోని చెక్ డాం నిర్మాణానికి దేశపతి శ్రీనివాస్ గారి చొరవతో నిధుల విడుదలకు మార్గం సుగమం కావడం మరో మంచి పరిణామం. కార్యక్రమానికి ఇవి అదనపు బలిమి నిచ్చాయి. ఇక ప్రారంబం అయిన లైబ్రరీకి పలువురు పుస్తకాలు ఇవ్వడమే కాదు, తోపుడు బండి సాధిక్ వంటి మిత్రులు కంప్యూటర్ వంటివి బహూకరించడం కూడా విశేషంగా పేర్కొనాలి. ఒక రకంగా కవిత్వం కూడా కార్యకర్త అయి అభివృద్దికి తగ్గ కార్యాచరణకు మార్గం చూపుతుందనడానికి రొట్టమాకురేవులో మొన్న జరిగిన కార్యక్రమం ఒక మంచి ఉదాహరణ.
+++
ఈ సభకు చాలామంది పెద్దలు వచ్చారు, పిల్లలు వచ్చారు. గ్రామీణులు వచ్చారు. నగర జీవులూ వచ్చారు. పాత్రికేయులూ, కవులూ, కళాకారులూ వచ్చారు. సాంసృతిక సారథి అయిన రసమయి బాలకిషన్ అన్న వచ్చి పాట పాడారు. ఒక్క మాటలో అధికారం పక్కన పెట్టి గ్రామ జ్యోతి వెలిగించడానికి తగ్గ బీజం వేయడంలో ఒక్కొక్కరు తమ పాత్ర వహించారు. అధికారం లేనివాళ్లూ అభిమానంతో చేయతగ్గ పని చేశారు. అందరు ఓన్ చేసుకున్న పని - ఈ సభ, సంగమం.
+++
మోహన్ రుషి 
ఇక్కడ కవి మోహన్ రుషి కె.ఎల్.నరసింహారావు స్మారక పురస్కారాన్ని పొందారు, తన 'జీరో డిగ్రీ' కవితా సంపుటికి. ఈ పుస్తకం గురించి సభకు అధ్యక్షత వహించిన ప్రసేన్ గారు మాట్లాడుతూ స్వల్పంగా మాట్లేడే కవి కొత్త భాషా సంవిధానంతో, ప్రయోగాలతో తనదైన శ్లేషతో కవిత్వం చెప్పి మనల్ని మన స్థితిని గుర్తు చేయడం గురించి వివరించారు. మోహన్ రుషి స్పందిస్తూ చిత్రంగా మళ్లీ మళ్లీ ఒకే కేంద్రకం వద్దకు వచ్చి మనుషులు పరిచిత జ్ఞాపక సంచయంతో ఎలా మింగిల్ అవుతారో చెప్పారు. ఏదీ కొత్తది కాదు, అంతా పాతదే. తిరిగి కలుసుకోవడం, ఆశ్చర్యాన్ని పంచుకోవడం గురించి ఎంతో బాగా చెప్పారు. చాలా ఏండ్ల కింద తనకు కలం ఇచ్చిన సిద్దారెడ్డి గారే మళ్లీ తనకు పురస్కారం ప్రధానం చేయడంలో ముందుండటం అటువంటిదే' అని గుర్తు చేశారు. మోహన్ రుషి చెబుతూ నవ్వగా , ఆ నవ్వు ఒక గమ్మత్తు.కావడంతో దాన్ని శ్రోతలు బాగా ఎంజాయ్ చేశారు.
హిమజ 
హిమజ గారు కవయిత్రి శిలాలోలిత (లక్ష్మి) గారి నాన్నగారి పేరిట ఏర్పాటు చేసిన పురిటిపాటి రామిరెడ్డి స్మారక పురస్కారాన్ని పొందారు, తాను వెలువరించిన 'సంచిలో దీపం' కవితా సంపుటికి. ఈ పుస్తకం పై చక్కటి విశ్లేషణ సత్య శ్రీనివాస్ గారు చేశారు. చేస్తూ, జీనుబాయి పిట్ట గురించి చెప్పి ఆశ్చర్యపరిచారు.
ఆ పిట్ట గిజుగాడు వలే చక్కటి గూడు కట్టాక వెళ్లి కాస్తంత బంకమట్టి తెచ్చుకుని, దానికి మిణుగురు పురుగును అతికిస్తుందట, బిడ్డలకు వెలుతురు కోసం. అటువంటిదే ఈ 'సంచిలో దీపం' అన్న పుస్తకం అంటూ, 'సంచిలో దీపం' అన్నది మనుషులను వెలిగించే పుస్తకంగా వివరిస్తూ, సంచివేసుకుని తిరిగిన వాళ్ళు సామాజిక మార్పుకు కృషి చేసిన చేసిన వారే కదా అని కూడా గుర్తు చేశారాయన.
కవయిత్రి హృద్యమైన కవిత్వం గురించి ప్రస్తావిస్తూనే ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంటిని, ఊరును కాపాడుకోవడం గురించిన ఆవశ్యకతను సత్య శ్రీనివాస్ గారు వివరించారు. తాను మాట్లాడుతుంటే కరెంటు పోయింది. కానీ ఆయన తన గొంతు పెంచి ఎంతో అభిమానంగా దీపం అంటే ఏమిటో చెబుతూ అది పుస్తకమే అని గుర్తు చేశారు. అలాగే, 'మనం ఇండ్లు కట్టుకుంటామని అనుకుంటాం. కానీ ఇండ్లను తాపీ మేస్త్రీలు, ఇంజనీర్లు కడతారు. మనం కట్టుకునేది జ్ఞాపకాలను' అని యాది చేశారు. 'మనం జ్ఞాపకాలతో ఇండ్లను సాకుతాం. తల్లిని సాకినట్టు ఇంటిని సాదుకోవాలి. అప్పుడే అది ఇల్లు అవుతుంది. లేకపోతే కేవలం గోడల మధ్య నివాసమే అవుతుంద'ని ఆయన హెచ్చరించారు.
+++
నందిని సిధారెడ్డి 
నందిని సిద్ధారెడ్డి గారు యాకూబన్న తండ్రి షేక్ మహ్మద్ మియా స్మారక పురస్కారాన్ని పొందారు, తన 'ఇక్కడి చెట్ల గాలి' కవితా సంపుటికి. ఈ పుస్తకంపై సీతారం గారు మాట్లాడుతూ స్థానికత, అస్తిత్వ సోయితో మన గాలి, మన నీరు, మన వనరుల మధ్య మన భవిత పునర్నిర్మాణపు అంశాన్ని ఎంతో చక్కగా విపులీకరించారు. ఈ పుస్తకంపై సీతారం మాట్లాడారో, వంశీకృష్ణ మాట్లాడారో సరిగ్గా గుర్తు రావడం లేదు. నేను ఫొటోలు తీస్తూ ఉన్న కారణంగా నా కాన్ సంట్రేషన్ సరిగ్గా పెట్టలేదుగానీ, యాకూబ్ మిత్రులైన అఫ్సర్, ప్రసేన్, సీతారాం, వంశీకృష్ణలు 'హమ్ పాంచ్' గా పేరొందిన టీంగా మళ్లీ జ్ఞపకాల్లోకి రావడం నాకు బాగా నచ్చింది. ఆ విషయాన్ని ప్రసేన్ గారు గుర్తు చేశారు. ఆది వింటుంటే, ఒక మాట చెప్పాలనిపించింది.
చిత్రమేమిటంటే, మలి తెలంగాణ దశ ఉద్యమం ప్రారంభానికి ముందే సంయుక్తంగా సాహిత్య రంగంలో జరిగిన కృషి ఒక రకంగా 'తెలంగాణ పునర్నిర్మాణ సంవిధాన'మే అనిపిస్తుంది. అదంతా ఏర్పడకుండానే జరిగిన నిర్మాణమూ అనిపిస్తుంది. ఒక సామూహిక గానం, అది కవిత్వంలో గానీ, నిన్నటి ధూంధాంలో గానీ ..అదంతా జరిగిన కృషికి వ్యక్తులు, బృందాలు, సమూహాలు, రాజకీయ పార్టీలు అన్నీ దోహదపడ్డాయినిపిస్తుంది. ఒక రకంగా జాయింట్ యాక్షన్ కమిటీకి మూలాలూ సాహిత్యంలో ముఖ్యంగా ఉన్నాయి. ఈ బృందం ....హమ్ పాంచ్...కూడా ఆ ఒరవడిలో ఒకటిగా పరిశీలించవలసే ఉందనిపిస్తుంది.
కాగా, కొన్ని మాసాల క్రితం శంకర్ పామర్తికి గ్రాండ్ ప్రీ పురస్కారం వచ్చినందున అంతర్జాతీయంగా పేరొందిన మన కేరికేచరిస్టుని ఘనంగా సత్కరించుకోవడం ఈ సభలో మరొక విశేషం.
శంకరన్న మాట్లాడుతూ, తెలంగాణ లో జన్మించడం ఒక మహత్తరమైన అంశం అని ఎంతో ఉద్వేగంగా ప్రసంగించడం వింటుంటే, మలి తెలంగాణ దశ - ఆ ఉద్యమంలో తన వంటి వారు చొదకంగా ఉండకపోయినా గని, వివిధ రంగాల్లో కృషి చేస్తూ వచ్చిన వాళ్లు మెల్లగా తెలంగాణ విశిష్టతను ఎలా గమనంలోకి తెచ్చుకుని ఉప్పొంగుతున్నారో తెలుస్తున్నది. ఇదొక అద్భుతమైన పరిణామం. ఒక రకంగా సాంస్కృతిక రంగాల్లో జరిగిన పని మళ్లీ పునర్నిర్మాణంలో మనుషులను బలంగా కనెక్ట్ చేస్తుందనిపించి సంతోషం వేసింది.
మొత్తంగా ఇది కవిత్వ సభేకానీ అన్నిరంగాలూ కలగలసి ఒక గ్రామీణ సంవిధానంలో ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలుగా కానవచ్చిన స్థితి ఆనందానికి కారణమైంది. కాసుల ప్రతాపరెడ్డి గారు అన్నట్లు, మూడు తరాల కవిత్వానికి, తెలంగాణ కవితా భూమికకు దక్కిన పురస్కారాలుగా ఈ సభను గుర్తు పెట్టుకోవాలి. ఈ పురస్కారాలతో ఆ గ్రామం, అక్కడి ప్రజల మధ్య కనీసం ఐదు వందల మందైనా వచ్చారనిపించింది, పెద్ద సంబురమే అయింది ఆ రోజు.
ఇక లైబ్రరీని కూడా ప్రారంభించారు. పుస్తకాలతో జరిగే విప్లవాన్ని గురించి తన జ్ఞాపకాల్లోంచి మా ఎడిటర్ , నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. తన కాలేజీ రోజుల్లో చదివిన 'చిరస్మరణ' అన్న పుస్తకం తనపై ఎంతటి ప్రభావం చూపిందో, ఆ పుస్తకం చదివాక తన యవ్వనోద్రేకపు జీవితం కేరీర్ వైపు కాకుండా సామాజికాంశాల్లోకి వెళ్ళేలా ఎలా ఉత్తేజితం చేసిందో, సామాన్యులు ఎలా అసాధ్యులుగా ఎదుగుతారో అర్థం చేయించి తన జీవితాన్ని వామపక్ష రాజకీయల వైపు మల్లిన్చిందో వివరించారు.
ఇలా ఆ ఊరు ఒక కొత్త కాంతిని లోవెలుపలా ప్రసరింపజేసింది. ఒక జీనుబాయి పిట్ట గూడు లా ఆకర్షించింది. ప్రతి ఒక్కరినీ తమ ఊరిని దర్శించాలనిపించేలా చేసింది. సొంత గూడు ఒకటి కట్టుకునేలా ప్రేరేపించింది.
+++
నేను ప్రధానంగా ఫొటోగ్రాఫర్ గా వెళ్లాను. కానీ రాయకుండా ఉండలేక ఈ నాలుగు మాటలు.
ఈ అవకాశాన్ని కలిగించిన యాకూబ్ భాయ్... మీకు కృతజ్నతలు అన్నా. . లక్ష్మి గారూ...మీ ఆదరణకు చాలా సంతోషం. యాకూబ్ అమ్మగారు హూరాంభీ గారికి హృదయపూర్వక శణార్థులు. యాకూబ్ బాయ్ ఏకైక చెల్లెలు జాన్ బీకి. సోదరులు బందే అలి, మొహమూద్, మహబూబ్ పాషా, రంజాన్ అన్నల పరిచయ భాగ్యానికి ఆనందాలు.
ఆ దూర ప్రయాణానికి కాసుల ప్రతాపరెడ్డి అన్న కారులో వెళ్లాం. ఆ ప్రయాణం పొడవునా మా కుటుంబం, సరస్వతక్కా, ప్రతాపన్నా ఎన్నో మాట్లాడుకున్నాం.
ఇలా రొట్టమాకురేవు కలిపింది అందర్నీ.ఒక మిణుగురు పురుగులా మెరిసే మంచి జ్ఞాపకాలను అద్దింది. పంచుకుంటుంటే మరింత ఆనందంగా ఉన్నది. Happy to share...
-
కందుకూరి రమేష్ బాబు
12. 10. 2015

రొట్టమాకురేవు


నది నాగరికతకు మూలం
పుస్తకం మానవవికాసానికి ధాతువు
అది గతానికి వర్తమానానికి తెగని
జ్ఞాపకాల గొలుసులా....
ఆరని చితిల మధ్య
సరిహద్దు రేఖలా ప్రహరాకాస్తుంది!
ప్రాచీనస్మృతులేవో
నదీ మూలంలాంటి ఆ ఇంట్లో....
ప్రవహించే జ్ఞాపకంలా
సంచరిస్తున్నట్లున్నాయి
ఇప్పుడావూరు...
పల్లె ప్రాచీన పురాస్మ్రుతుల జ్ఞాపకాలకు
వేదికయ్యింది.
కాలిమెట్టెలు కలాపిచప్పుళ్ళు
రెల్లుపొదల నాట్యానికి
స్మృతులవుతున్నాయి
రోట్టమాకురేవు బుగ్గవాగు
ఆరని చెమ్మలా....
సూఫిపకిర్ల తలపోతల్లా
ఏదో నూతన చరిత్రకు
రొట్టమాకుఅంకురమౌతుంది.
ఇంతటి కవితా కృషికి ఖమ్మం గుమ్మంగా మారింది

|| నిర్మలనందిగామ ||

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...