అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

Showing posts with label నదీమూలంలాంటి ఆ ఇల్లు. Show all posts
Showing posts with label నదీమూలంలాంటి ఆ ఇల్లు. Show all posts

21 Apr 2016

యాకూబ్ కవిత్వం -నదీమూలం లాంటి ఆ ఇల్లు -లో ఏముంది ?



-జాషువా కలల కన్నీళ్ళ తడి ఉంది .
-మృత్యువును ప్రేమించే నిజమైన మిత్రుడికోసం అర్థం కానీ పాఠం ఉంది
-నీడ పక్కనే కలవర పెట్టే కలలు ,మనసును కప్పిన దిగుళ్ళు ఉన్నాయి
ఆకలి నిఘంటువులో అమ్మ అన్నం ముద్దకు అర్థం వెతికాడు
ఇవాల్టి నుంచి రేపటిలోకి విస్తరించే క్రమంలో ...కొంచెం తడిగా ,కొంచెం చిగురింతగా ,రేపటి మొలకై కన్పించాడు
చినుకు భాషకు చివరి అర్థం కోసం వ్యాకరణ సూత్రాన్ని కనుగొన్నాడు
చేతికి అంటిన అన్నం మెతుకుల ఎంగిలిగా ,వేళ్ళ మధ్య దాగిన కరువు మరకలా ..
ఏదో మిగిలి ఉన్నదానికోసం పలవరించాడు .
ఊపిరాడని జీవిత స్పర్శలో ఆప్యాయ తను ,ఆర్తినీ ,ఆవేదననూ పంచు కున్నాడు
అలవాటైన మర్యాద లాంటి కోర్కెను ఒకప్పటి మాటగా నెమరేసుకున్నాడు
ఈ మధ్య మనుషులుగా మిగిలున్న వారిని కలుసుకోవడానికి ప్రయత్నించాడు
నీమీద నీకు నమ్మకం తో పడిలేచే కెరటాలతో కసిగా చల్తే రహొ ..అన్నాడు
వదిలేసే ఆ సగం కోసమే చేరసాలల్లాంటి జీవితం గురించి తెలుసు కోవడం కోసం ,
ప్రయాణం మొదలు పెట్టాడు
ఇంకా ..ఇంకా ..బతికేవారికోసం ,ప్రేమించేవారికోసం ,భరించేందుకు
కవిత్వ ముందన్నాడు
బతుకు యుద్దమైన తెలంగాణా కోసం అనువదించుకున్న బతుకును వివరించాడు
చూపులో ఒంటరితనం ,నిశేబ్దం తో మాటల్ని కోల్పోయిన మనిషి తనం చూపించాడు
ఒక సెలవుదినం ముగిశాక ..అపురూపమైన రెక్కలు హటాత్తుగా మాయమయ్యాక
రెక్కలు తెగిన పావురంలా ,యంత్రంలా మారిపోయాడు
ఒకప్పటి అత్మన్యూనతంతా ఇప్పటి అసలు స్వరూపమే నని ఇప్పటి ప్రవాసం లో
అభిమానంగా చెప్పాడు
జీవించడమే వర్తమానంగా ,గతంగా ,ప్రయాణపు కొలమానంగా వివరణ ఇచ్చాడు
నువ్వొచ్చి వెళ్ళాక ..దినదిన గండం లాంటి మనసు బెంగను ,
ఇన్నేళ్ళ తర్వాత కూడా చెప్పుకోలేని బెంగను మనతో పంచుకున్నాడు
ఎంత దుప్పటి ఉందొ అంతే కాళ్ళు జాపాలి అన్నాడు
అదంతా జీవితమేగా !వాచీలులెని ,సైకిళ్ళు లేని ,ప్రేమేలేని యవ్వనంలో
మర్యాదలూ ,మన్ననలూ మసక మసక రేవులో మనం ఉదయించ లేదా అన్నాడు
అంత ఈజీ కాదు అనుకున్నట్లుగా అన్నీ అయిపోవడం .కన్నీళ్లు ,దుఃఖాలు ,సత్యాలు
అన్నీ ఉంటాయన్నాడు
మెలిపెట్టే బతుకును వడపోసి ,వంపి అక్షరాలుగా ఎత్తు కోవాలన్నాడు
నదీమూలం లాంటి ఆ ఇంటిలోకి వెళ్ళలేక పోవడమే క్షమించరాని నేరమన్నాడు
వెళ్ళలేక చింతిస్తున్నా ,దుఃఖిస్తున్నా ,కలవరిస్తున్నా ,అన్నాడు
ఆకుపచ్చ గాలిని ,అయ్యప్ప ఫణికర్ ముసి ముసి నవ్వుల్లా ,
సేదదీరిన జ్ఞాపకంగా పలవరించాడు
కవి సంగమానికి ఒక విత్తనం ఇచ్చాను ,అక్కడ వనమే మొలిచిందని
ఆనందపడుతున్నాడు
చెల్లెలు ఫోన్ లో ,అమ్మ లాంటి వదినతో సుదీర్ఘ సంభాషణ చేశాడు
తోడబుట్టిన వాడితో తనివిదీరా మాట్లాడలేని నిస్సహాయత ఉంది
లోపలి మైదానంలో --నిన్నటి అనుభవం ,ఎత్తు పల్లాలు ,గుంటలు
అలిసి ,సేదదీరి ,కలగలిసి ,విడివడి ..వంటరిగా మిగిలి పోవడం ఉంది
మళ్ళీ జన్మించి సరి కొత్తగా నీలోకి నన్ను ఓంపుకోవడానికి అక్షరాలా
పుడతా నంటాడు.సంక్షోభాల్లోంచీ గొంతు సవరించు కుంటనంటాడు
చిన్నప్పటి ముఖంలోంచీ తప్పిపోయిన అసలు ముఖాన్ని తెలుసుకోవాలని
ఆసక్తి కనబరుస్తాడు
కకావికల మైన జీవితం నిండా గాయాల గుర్తులను పసి కడ్తాడు .
కవిసమయం మారిందంటాడు
పాత్రలెవరూ లే కపోయినా నాటకం సాగిపోతూనే ఉందంటాడు
నిజంగా హృదయంతో కరచాలనం చేసే అనుభవం కావాలంటాడు
బొటన వేలుల్ని నరికేసినా కొత్తగా మొలవని కాలం పోయిందంటాడు
ఇసుక రేనువులకు విశేషత ఉందంటాడు
ఇవాళ రెక్కలు మనతో లేకపోవచ్చు ,జీవితపు అనుభవం మన ఆస్తి
మన బలంఅంటాడు
రాజకీయాన్ని పేజీలుగా తిప్పుకుంటూ తిరుగ రాసుకొంటున్నాం
జీవితం ఎప్పటికీ పాతబడకూడ దంటాడు
నమ్మకాన్ని ఓడి పోనీకుండా నిలబెట్టు కోవాలంటాడు
విధ్వంస కూడలి దిలషుక్ నగర్ ను స్మరిస్తాడు
జీవితానికి కొన్ని త్యాగాలు ,కొంత మానవత్వం అవసరమంటాడు
ప్రేమను ఒక ఉనికి గా అనువదించు కొమంటాడు
ప్రతి అడుగూ ఒక కవాతు ,ప్రతి నినాదం ఒక ఆకాంక్ష
జీవితం ఒక జ్ఞాపకాల పెట్టే .వెన్నంటి వుండే అమ్మ ఒక
ధిక్కార స్వరం అంటాడు
ప్రతి పోరనూ విడదీసుకుంటూ సాగడం ,అలిసి పోకుండా గమ్యం చేరాలంటాడు
వంచనల మధ్య రాటుదేలి ,కలుపుగోలుగా సాగిపోవాలంటాడు
నిన్ను నీవు వెతుక్కోవడమే ఇక మిగిలింది ,మిగతా అంతా యధాతధం
ఇదీ యాకూబ్ కవిత్వం
ఇదీ యాకూబ్ హృదయ వాదం
అక్షరాన్ని నమ్ముకున్న ,గింజలు గా మిగుల్చు కున్న కవిత్వం
మొలకెత్తే ఆ గింజలే పంటపోలమైన కవిత్వం
చెట్లు గా విస్తరించిన కవిత్వం
ఇది కవి యాకూబ్ పై నా అవగాహనా పత్రం !!

~ డా. రాధేయ 
ఫిబ్రవరి 18 ,2016

లౌకికస్వాప్నికుడు



యాకూబ్....మగ్ధుం,కాళోజీ వంటి కవులు నిర్మించిన కవిత్వ వంతెనమీద నడుస్తున్న కవి మానవ సంబంధాలను మార్కెట్ శాసిస్తున్న సంక్షుభిత కాలంలో మతం గీసిన సరిహద్దు రేఖల్ని ద్వంసం చేయాలని ఒక లౌకికస్వప్నాన్ని స్వప్నిస్తూ పట్టణ నాగరికత లోని మానసిక ఉక్కపోతను తట్టుకోలేక భౌతికఘర్షణలు వదిలి ఇంటికోసం పరుగెడుతాడు. నదీమూలంలాంటి ఆ ఇల్లు కవితాసంపుటి తెలంగాణ ఆవిర్భవించిన సందర్భంలో రావడం ఒక చారిత్రక విశేషం దళిత ముస్లింగా తనను తాను తెలుసుకొని గ్రామాలను,చెఱువులను,జన్మనిచ్చిన తల్లిదండ్రులను కవితామయం చేశాడు.ప్రాచీన కవిత్వంలో కనిపించని సంఘర్షణ,ఉద్యమస్పూర్తి,స్త్రీలను గౌరవించే ఉన్నత సంస్కృతి కవిత్వంలో చోటుచేసుకుంది ఫాసిజం అంటే గిట్టదు పదహారణాల ప్రగతిశీల కవి భిన్నభాషా సంస్కృతులతో పరిచయం విభిన్న వ్యక్తిత్వాలతో మమేకమవ్వడం జన్మతః లభించిన వరం.
సూఫీతత్వ మార్గంలో పయనిస్తూ....కవితలన్నీ మానవీకరణ పొందిన అనుభూతి వాహికలు సాటి మనిషి ఆవేదన పట్టించుకోని ప్రపంచాన్ని కవిత్వం ద్వారా నిలదీసిన కవి ఇన్ఫర్మేటివ్ కవిగానే కాక ఈస్థటిక్ కవిగా కనిపిస్తాడు కలవరపెట్టే కలలతో కాలాన్ని వ్యయంచేసేభావుకుడు మాత్రమేకాదు అన్నంపెట్టిన అమ్మను గౌరవించి ముద్దాడటం తెలిసినకవి కొదరికి మనుష్య భాష మాత్రమే పరిచయం కానీ చినుకు భాష తెలిసిన ముసురు కవి హృదయం ద్రవించడం తెలుసు కాబట్టి ఊపిరాడదు అనే కవితలో ''ఓ కవిమిత్రుని తడిఆరని అక్షరాలని ఆప్యాయంగా స్పృశించాను''అంటాడు. కవి మనల్ని బలవంతుల్ని చేసే కవితలల్లుతాడు తనమీద తనకు నమ్మకముండాలని ఎప్పటిలాగే నడిస్తే దారేకాదు గమ్యంకూడా దొరుకుతుందని''ఛల్తేరహో! కవిత చెప్తుంది.  అవ్యాజమైన ప్రాంతీయాభిమానానికి మాఊరు తెలంగాణా కవిత చక్కని నిదర్శనం అస్థిత్వం కోసం తానెంత కష్టపడ్డాడో తనకు ప్రాంతానికి ఉద్యమానికి అబేధాన్ని ప్రకటించాడు.జివీతంలో ఎన్నోఎత్తుపల్లాలను నేలమీది పరిస్థితులను తరగతిగదుల్లో తారుమారవుతున్న ఆసక్తులను గుర్తుచేస్తాడు ఎవ్వరిని పరుషంగా దూషించక ''వంచనను స్నేహానికి మరోముఖమని వారు తేల్చేశారు'' అని సాధించిన దానిని బాగుచేయక తప్పదు.  ''తుప్పుపట్టిన లోపలిని మళ్ళీసరికోత్తధిగా మార్చాలి'' అని మనోభావాన్ని తెలిపాడు.
ఒలికిన పద్యమనే కవితలో.....పద్యాన్ని జీవితాన్ని సమన్వయపరుస్తూ తెలిపిన భావాలుఅద్భుతమైనవి ''కల్లుమూసి తెరిస్తే నువ్వోపద్యం'' జీవితయాత్రలో చివరిమజిలీగా వ్యక్తమవుతుంది ''నదీమూలంలాంటి ఆ ఇల్లు'' కవిత కేవలం అనుభూతి మాత్రమేకాదు చిరకాల జ్ఞాపకసిక్తమై సంఘర్షించిన బాల్యంతో సంయుక్తమై కనిపిస్తుంది. ఏ ఇంటితో సంబంధం లేకున్నా వెళ్ళడం మనిషికి మర్యాదగా మారింది.కానీ....పుట్టినిల్లు,గడప,ద్వారం,కిటికీలు,దూలాలు,ఇంటిముందు వేపచెట్టు మరువలేని నిజాలు.ఏ ఇజాలకు కట్టుబడని జీవితసత్యాలు! తన బాల్యానికి గోపురమై నిలిచిన జీవధార లాంటి ఇల్లంటే ఎంతో ప్రేమ ''అంతేలేనిజ్ఞాపకం''ఇల్లంటే చిన్నప్పటినుంచి నాలోనే నిద్రిస్తున్న ద్వారబంధం!ఈవాక్యం చాలు కావ్యం కావడానికి [వాక్యంరసాత్మకం కావ్యం] ''అక్కడ ఒక జీవితం ఉంది''జీవితపయనంలో ఎన్నో లోయలు,శిఖరాలు ఉన్నాయని స్పురింపచేస్తుంది. ''చెల్లెలిఫోన్'' కుటుంబ ధర్మాన్నిగుర్తుచేస్తుంది లోపలిపరుగు ఆదివారానికి సంకేతమయ్యింది
తరతరాలకు అక్షరాలకు దూరంగాఉన్న మనుషుల జీవితాల్లో వెలుగునింపే ''పాఠంలధ్వని''గర్భితమైన కవిత అధ్యయనం,అనుశీలనం,ఆక్రోశం,ఆవేశం ఉంటేకానీ ''బొటనవ్రేలుల్నినరికేసినా కొత్తగామొలవని కాలంపోయింది'' అంటూ ప్రతిసృష్టి చేసే ఏకలవ్యులు పుట్టుకోస్తారనే సందేశాన్నిస్తుంది.మనిషిలో అంతర్గతంగా అద్భుతమైన విద్యదాగివుందని మొదళ్ళు పీకేసినా సరికొత్తగా మొలుచుకొచ్చే విద్యనేర్చుకునే పుట్టాము అనే కవితలో కనిపిస్తుంది వానజల్లుల తర్వాత వాగుముఖంలో నీటినవ్వును గమనించిన కవి కృష్ణా,గోదావరులు కరుణించకపోయినా తనకు తెలిసిన నల్లవాగే వాటితో సమానమని భావించినప్పుడు సామన్యునికి ఎంతసంతృప్తి కలుగుతుందో తనఊరు గొంతును తడిపే వాగును వర్ణించి దేశీ కవిగా నిలుస్తాడు. దిల్షుక్నగర్ ప్రదేశాన్ని ''బాంబులమధ్య వణుకుతున్న బెదురుచూపుల లేగదూడ'' అన్నాడు. ''ఇప్పుడొక బతుకువిద్వంసాన్ని కూర్చిపేర్చిన ప్రతీకలకూడలి''అంటూ నినదిస్తాడు.పోరాటకవిలో భావకవి ఉంటాడు ప్రేమ ఒక ఉనికి అనే కవితలో ''తెల్ల తెల్లని సంతోషంలాంటిపాట'' అంటూ పాడుకోవడం కవికి అలవాటు!
జీవితాన్ని జ్ఞాపకాల పెట్టెగా బతుకు కథగా భావించి ''అత్మనంతా ఒకచోటకుచేర్చి ఒంపుతాను''అంటూ ఎదిగాడు సంధిగ్ధ ప్రపంచంలో ఉద్విగ్నగళంతో ''నాపేరు ఒకప్రశ్న నావూరు ఒకప్రశ్న'' అని చిరునామాను గుర్తుచేసుకుంటాడు జీవితాన్ని ''నీడలు''గా భావించి ''అక్షరాన్నినమ్ము''కున్నాడు. ''కవిసమయం''ను గుర్తించి కవితాసంగమంలో జీవించాడు. ఎనిమిదిపాదాల పలుకులు మర్చిపోలేము! విత్తనమేస్తే వనమయ్యింది! పిల్లనగ్రోవినిస్తే సంగీతమైనది!పదాలు వెదజల్లితే జీవితమైంది!స్వార్థం లేని కవి ''రేపు నన్నేయిస్తానుఅక్కడ కవిత్వం విస్తరించాలి'' అంటున్న కవిసంగమం యాకుబ్ గారికి అభినందనలు.
[ కవి యాకూబ్ ఇస్మాయిల్ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా...]

~నిర్మలనందిగామNovember 29, 2015

11 Jul 2014

అర్ధంకాని పాఠం


...................................
మృత్యువును చూద్దామా మనచుట్టూ ఉన్న బొమ్మల్లోంచి !
ఉనికిని ఎలా కనిపెడతారు
దేహంతోనా , మాటలతోనా , ఊపిరితోనా , ఏదో ఒక రూపంతోనా -
కొట్టివేతల్లోంచి, సందేహాల్లోంచి
నిజమైన సందేశాలు ,ఆత్మ ఆవిష్కరించబడతాయేమో !
1
నిలబడని వాగ్దానాల్లా ఇంకా ఇంకా తిరుగాడే మనుషులు
దేహాల్ని దు:ఖాలకు ,మోహాలకు ,లాభాలకు , లోభాలకు
ఇచ్చేసి ఎక్కడా మిగలకుండా వెళ్ళిపోతారు
ఉన్న మిగతా మనుషులు
బొమ్మలతోనే మిగిలినదంతా పంచుకుంటూ
అలానే ఉండిపోతారు
2
అదృశ్యం అవడంలోని రహాస్యాన్ని
ఎక్కడనుండి రాబట్టాలి
ఒక పాఠంలోంచి మరో పాఠంలోకి పేజీలు తిప్పినట్లు
నేర్చుకోవాల్సింది ఎపుడూ అర్ధం కాని పాఠమే !?
3
దగ్గరవడం కోసమేనేమో ఇలా దూరం అవడం !
దూరమవడంలోనే
నిజమైన జీవితార్ధం ఇమిడిఉందా?
ఈ దూరమే మృత్యువు ప్రేమించే నిజమైన మిత్రుడేమో!!!
*31.12.2012

అమ్మ అన్నంముద్ద


.....................................
అమ్మ అన్నం తినడం
చిన్నప్పట్నుంచే చూస్తూనే ఉన్నాను
నిన్నమాత్రం ఆమె తింటున్న పద్ధతిని పరీక్షగా చూసాను
ఆమె నా గమనింపును పసిగట్టకుండా
జాగ్రత్తపడుతూ కొత్తగా ,వింతగా చూస్తుండిపోయాను
అన్నం తినడం ఎలా ఉంటుందో ,అన్నం విలువేమిటో
ఆ పేద రైతుభార్య తినడంలోని ఆత్మీయమైన తీరులో గమనించాను
ఆ తినడం-
ఒకటీ అరా మెతుకుల్ని అలా అలా
పెదాలు కదలకుండా తినడంలా లేదు
సుతారంగా వేళ్ళకు
కలిపిన అన్నం అంటకుండా తినడంలా లేదు
దవడలు కదలకుండా ,పెదవులు విప్పకుండా
పళ్ళుకనపడకుండా తినే నాగరీకవిద్యలా లేదు
అన్నం అసలుస్వరూపమేమిటో ,నిర్వచన మేమిటో
బోధిస్తున్నట్లుగా ఉంది.
పిసికి,కలిపి పిడికిటినిండా పట్టి
నోటికి అందించే ముద్దకి ఆత్మగౌరవాన్నేదో ఆపాదిస్తున్నట్లుగా ఉంది
పచ్చడి కలుపుకున్నా ,పచ్చిపులుసు పోసుకున్నా
ఆమె చేతిలోని ముద్ద మాత్రం అచ్చం
అమ్మకళ్ళలోని వెలుగులా మెరుస్తుంది
ఆకలిని ఆమె గౌరవిస్తుంది
ఆకలికి,అన్నం ముద్దకున్న అనుబంధాన్ని ప్రేమిస్తుంది
అందుకేనేమో
ఆమె తింటున్నప్పుడు నిండుమనసుతో
పిల్లల్ని ఆశీర్వదిస్తున్నట్లు నిర్మలంగా ఉంది
చేతులు కడుక్కుని అలా వచ్చి అమాయకంగా
పక్కన కూచోగానే నన్ను నేను సంభాళించుకోలేక
అమ్మ చేతుల్ని ముద్దాడాను
26.2.2013

ఇవాళ్టినుంచి రేపటిలోకి ...


..............................................
నన్ను నువ్వూ, నిన్ను నేనూ
ఎప్పుడోకప్పుడు కోల్పోతాం
మూగవాని సైగలా మారిపోతాం, పుట్టుచెవుడు మాటలా మిగిలిపోతాం
నిన్నూ నన్నూ కొలిచే మైలురాళ్ళ వెనుకాముందూ
రాసిపెట్టిన ప్రయాణపు దూరాలూ ,చేరవలిసిన గమ్యాలూ
మనతోనే ప్రయాణిస్తున్నా పెద్దగా పట్టించుకోం
నిన్నో మాటంటాను,నువ్వొక మాటా అనేస్తావు
ఈ మాటల్లోనే మరణించాక
ఇంకొంచెం మిగిలిన బూడిదలా అపుడపుడు రాలుతుంటాం
నువ్వేమో కొలబద్దలా మారి
నాకో కొలబద్దరూపాన్ని తొడుగుదామనుకుంటావు
అక్కడే పేచీ !
నిన్ననే కదూ -నేనొక వాడిపోతున్న ఆకులతీగెను
నాలోంచి తెంపేసి కొత్తగా మొలకెత్తుతున్నది ,
చిట్టచివరిగా మబ్బు విదిల్చిన చినుకులోకి దూరి
ఇంకొంచెం తడిగా పలుకుతున్నది
కొంచెం తడి, కొంచెం చిగురింత
రేపటికి కనీసం మొలకలా అయినా కన్పిస్తాను
కోల్పోయాననే స్పృహ ఏమాత్రమూ నాలోకి
ప్రవిశించకుండా జాగ్రత్తగా రెమ్మలు,కొమ్మలుగా విస్తరిస్తాను
ఇవాళ్టినుంచి రేపటిలోకి ...
#24.7.2013

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...