అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

21 Apr 2016

నదీమూలంలాంటి ఆ యిల్లు !

'యాకూబ్ | నదీమూలంలాంటి ఆ యిల్లు !' కవితకి నా స్పందన !
**
జీవితంలో సౌలభ్యం లేనంతకాలం కవిత్వంలో సౌలభ్యసాధన కష్ఠభూయిష్ఠమే. జీవించడమే కష్టమైన కాలంలో కవిగా జీవించడం మరీ కష్టం. నిజానికి ఊపిరి పీల్చడం ఎంత సులభమో కవిత్వం చెప్పడం కూడా అంత సులభమే.. కానీ ఎంతమందిమి ధారాళంగా ఉపిరి పీల్చగలుగుతున్నాం? అని శ్రీ శ్రీ సందేహం. చాలా ఏళ్ళ కిందటే. నిజమే.. చాలా చోట్లకు చాలా సందర్భాల్లో.. అసందర్బాల్లో వెళ్ళలేని ఆ దుస్థితులే ఇప్పుడూ దాపురించి ఉన్నాయి అంతటా. అలా వెళ్ళినందుకు కించపడ్డ క్షణాలు, వెళ్ళనందుకు దుఃఖబడ్డ క్షణాలు తప్పనిసరిగా క్షోభలే మిగిల్చే పరిస్థితులు. కానీ ఆ క్షోభలే .. శ్రద్ధగా లోలోపలికి తొంగి చూస్తే.. మంచి స్మృతులు. మనసుతోటే అవి కలసి వెంట నడుస్తుంటాయి.యాకూబ్ జీ కవి. కాబట్టె ఆయన హృదయం ఒక పుష్పంలా ఆ చింతల్నంన్నింటినీ ఇలా జ్ఞాపకాల పుప్పొడి రేణువుల్లాగా భావాకాశంలోకి వెదజల్లడం! తెల్లరెక్కల సాయంతో గాలి వాలుకు తేలుకుంటూ వచ్చే ఆ భావరేణువుల్ని చిట్టి చిట్టి చేతులతో పట్టుకోవాలని వెంటబడే పిల్లకాయలం అవడమే మన వంతు.
మల్లెల చేత కరిపించడం ముళ్లకి కన్నీళ్లు పెట్టించడం కవి కొక్కడికే అబ్బిన రసవిద్యేమో! 'ఊళ్ళో ఇప్పుడెవరూ లేరు' అని ఈ కవి ఫిర్యాదు. బాల్యాన్ని మురిపించిన ఊరు ఇన్నేళ్లైనా ఇంకా అలాగే ఉంటుందా.. అత్యాశ కాకపోతే!
పూరిళ్ళు డాబాలైనట్లు.. ఊరిచెరువు ఊసరవెల్లి సినీ క్షేత్రమైనట్లు.. మట్టిదారి మదమెక్కిన సిమెంటు పోకడలు పోతున్నట్లు.. మగ్గిన చింతపిక్కలు మక్కువగా రాల్చిన చింతచెట్లు ఊరి కేబులు వైర్లతో ఊరేగే పొగరు జెండాలై రెపరెపలాడుతున్నట్లు.. ఊరు తీరూ వై-ఫై కలలు కనే వగలాడిగా మారడం కాలం మాయాజాలం. కలల్లో, మనసుల్లో కలిసే, తలిచే ఆ తాతయ్యలు.. తమ్ముళ్లు.. అన్నయ్యలు.. బాబాయిలు.. పెద్దయ్యలు.. పిన్నమ్మలు.. అత్తమ్మలు..అవ్వలు ఇప్పుడు అక్కడింకా ఎందుకు తచ్చాడుతుంటారంట మన పిచ్చిగానీ! 'వృద్ధాప్యంలో ఉన్న ఇల్లంటే చిన్నప్పటినుంచీ నాలోనే నిద్రిస్తున్న ద్వారబంధం' అని కవి తలపు. ఇల్లంటే చిన్నప్పడు మనం నిద్రించిన ఆ నులకమంచం వారగా నిలబడిన పెచ్చులూడిన వట్టి మట్టి గోడలే కాదుగా. తిన్న ఎంగిలి కంచం పళ్లేల మెతుకుల్ని ఆవురావురమని ఎగిరివచ్చి కతికే కాకుల్ని ఆదరంగా పొదువుకున్న చిట్టి పిట్టగోడలూ కాదు. బడి పుస్తకాల సంచుల్ని భద్రంగా గూటికడుపులో దాచుకున్న చచ్చు చూర్లూ కాదు. బైటెక్కడ ఎంత మాలకాకికి మల్లే చెడ తిరిగి వచ్చినాగానీ. మైలబట్టలన్నీ వలిపించి చన్నీ ళ్లతో తలస్నానం చేయించే మంచు గిలకబావి వట్టి గిలకబావే అనుకుంటే పొరపాటే. ఏళ్ల తరబడి నిద్రకుబడి లేచిన పిదప రిప్ వాన్ వింకిల్ చేసే ఊహలకి మల్లే ఉన్నా ఇక్కడ యాకూబ్ చేసేది ఊహకీ వాస్తవానికీ మధ్య గల వ్యత్యాసాన్ని కవిత్వం చేయడం. ఆ చేయడం బాగుండే ఇలా చెప్పడం!
'ప్రజ్ఞా నవనవోన్మేషశాలినీ ప్రతిభామతా' అని శాస్త్రం నిర్వచనం. కొత్త కొత్త కల్పనలు చేసే బుద్ధివికాసంతో స్వర్గ మధ్యమ లోకాలకు మధ్య సర్వశుభంకర ప్రయాసలకు కట్టుబడ్డ ప్రతిభావంతుడేనట కవి. స్వర్గం ఓ మధురోహా లోకానికి సంకేతం అనుకుంటే మధ్యమ లోకం మన కంటెదుట ఉండే కటిక వాస్తవం అనుకోచ్చేమో. ఇక్కడ కవి ఊహా స్వర్గం- ఆ చిన్నపట్టి 'నదీమూలంలాంటి ఆ ఇల్లు'.బాగుంది.
' చిన్నిచిన్ని కిటికీలు రెండు; కొన్ని దూలాలు; వాకిట్లో ఎదుగుతున్న కొడుకులాంటి వేపచెట్టు.
బెంగగా వుంటుంది దూరంగా వచ్చేసానని ' అని కవి ఆవేదన. ఆయన అలా పదే పదే దిగులు పడుతుంటే మనకీ మన దిగుళ్ళన్నీ మళ్ళీ చిగుళ్ళు తొడగటం మొదలు పెడతాయి! అదే గమ్మత్తు. 'ఒక మారిచటా ఒక మారచటా...నీ హృదయములో నా హృదయములో-గంటలు, గంటలు!' అనే శ్రీ శ్రీ ఖండిక గుర్తుకొస్తుంది ఇక్కడ.
కవి కలల్లో ఆ చిన్నప్పటి స్వర్గం కనిపించినప్పుడల్లా ఏడుస్తూలేచి , పక్కలో తడుముకుని.. దొరక్క వాటిని కన్నీళ్ళతో సముదాయిస్తాడు. He saw through life and death, through good ill/ He saw through his own soul,/ The marvel of the everlasting will' అని -టెన్నిసన్ అన్నదీ అపస్మారక భావ స్థాయిని గురించే కాబోలు!
అనుభూతికి ఉండే రెండు కొసల్ని అనుభవాల వేళ్లతొ మీటితేగాని పదును తెలియదు.
వట్టి మట్టి ఆలోచనలు మాత్రమే చేసే మనకి ఆ చేవ లేక పోవచ్చు. బెంగల్ని వెళ్లగక్కే దోవా దొరక్క పోవచ్చు. అలాగని కవిని ప్రేమించినట్లే ఏ కవులమూ కాని మనల్నీ ఇంకా తనని మనలోనే మిగుల్చుకుని ఉన్నందుకు కాలం క్షమించకుండా ఉండదు. కవి ఈ కవితతో మనలోనే ఉండి మనకు తెలీకుండా మెలిపెట్టే ఈ సొదలన్నింటినీ మళ్లా కదలబారుస్తున్నాడు. కదిలేదీ ..కదిలించేదే కదా కవిత్వం.. మహాకవి శ్రీశ్రీ మాటల్లో కూడా!
'ఇంతున్నప్పుడు తనని సాకిన రుణంతో మోయడం' వల్ల కాలం క్షమకు తాను అర్హుణ్నే అని కవి భావన. పసితనంలో పేదగాయాలకి ఇల్లే ఒక తల్లై గోసాయి చిట్కాలతో వైద్యం చేసిన అనుభవం కవికి మల్లే మనకీ ఉండే ఉంటుంది. ఉండవలసింది ఆ కవికి మల్లే ఆ తల్లి లాలనమీద ఎంత ఎదిగినా తరగ కూడని కృతజ్ఞత. పఠిత మనసులో ఆ ఫీల్-గుడ్ ని తట్టిలేపడమే మంచి కవితగా యాకూబ్ ఈ కవిత ప్రయోజనం. Meaning is only a meat to the house dog of the intellect.
'Give me a Theme', the little poet cried.
'And I will do my part'.
'It is not a theme you need' , the world replied.
'You need a heart". యాకూబ్ కవిత్వంలో వినిపిస్తున్నది ఆ గుండె చప్పుడే!
'వృథా వర్షమని శపించకు/ఎంతో దయలేకపోతే గాని ఎవరూ అథోముఖంగ యీ పృథ్విపై బడరు/పిడుగైనా సరే' అంటారు వేగుంట చితి-చింతలో. మరి కాలం పరుగుపందెంలో అమాయకంగా వెనకబడిందని ఆ ముసలి నేలను ఇప్పుడసలు పట్టించుకోనంటే ఎలా?ఉత్సాహంతో గంతులేసేందుకు దానికే కొత్త లక్షణాలూ కూడక పోవచ్చు.
మట్టి మనుషులం కాబట్టి మన దృష్టిలో ఆ ఒకప్పటి మనం ఊయలలూగిన ఇల్లుతొట్టి వట్టి ఖాళీ జాగాలాగానే అనిపించడం అన్యాయం కాదా? కానీ భావుకుడు యాకూబ్ ఊహ ముక్కుపుటాలకు మాత్రం ఆ పరిత్యక్త భూమిలో ఇంకా ఒక జీవం..జీవితం.. ఒకనాటి జీవించిన క్షణాల సువాసనలు సజీవంగానే సోకుతున్నాయి. మనిషికి.. కవికి మధ్య తేడా అదే. టి. ఎస్. ఇలియట్ అనలేదూ.. మాటల్లో చెప్పలేని అనుభూతిని మాటల్లో పెట్టటానికి కవి ప్రయాస పడతాడని! పెంచి పోషించిన కాలాన్ని పని తీరిపోయిందని మనలా కాలదన్నకుండా కవిత్వంలోకి పిలిచి దండ వేస్తాడు. కవిగా యాకూబ్ చిన్ననాటి తన ఇంటి ద్వారబంధాలకు ఈ మార్గంలో రుణం తీర్చుకున్న పద్దతే హృదయంగమంగా ఉంది.
ముందే అనుకున్నాం.. చాలా చోట్లకు వెళ్ళలేక పోవడం నిజానికి క్షమించలేని నేరమే. ఐనా.. నిజానికి ఆ నేరానికి భాద్యులం మనం కాదు.
నదీమూలంలాంటి ఆ యింటికి వెళ్లలేని దుర్భర పరిస్థితులు ఎన్ని దాపురిస్తేనేమి.. కవికాబట్టి ఆ అవరోధాలనన్నింటిని అధిగమించేందుకు యాకూబ్ కాలం మధ్యన ఊహల వంతెన అందంగా కట్టాడు. మహ బాగుందీ కవిత్వం పన్నాగం.
అభినందనలు యాకూబ్ జీ! దూరమైన వాటిని దిగులుగా తల్చుకుంటూ కుమిలి పోయే కన్నా మనిషి చూపదగ్గ కనీస కృతజ్ఞత ఎలా ఉండాలో ఇలా ఒక మంచి కవితారూపంతో పాఠం చెప్పినందుకు. 'మునిగిపోతూన్న పడవ దిక్కు చూడు/అరుణవర్ణ పశ్చిమాద్రిని జారిపోతూన్న కమలా కాయని చూడు, నన్ను చూడు' అన్న వేగుంట చితి చింత మళ్ళీ పొడగట్టినట్లుంది గుండెకాయలకు. 'వెలుగు చల్లారి పోతూన్న జీవితం/ఇది నా దుఃఖానికి హేతువే కానీ/ఇదే సౌందర్యానికి సేతువు' అన్న ఆయన ఆ సూత్రాన్నే మళ్లా మా మెదళ్ళకు ముడి వేసావు కదూ ఇలా గడుసుగా! ధన్యవాదాలు మిత్రమా!
కవిత్వానికి కవిత్వంగా విలువ కట్టడం వేరు. ఆ కవిత్వాన్ని సామాజిక ప్రయోజన దృష్టితో వెల కట్టడం వేరు.ఏ అనుభూతి కవిత్వానికైనా ప్రధానమైనది సౌందర్యమే. అంతకు మించిన మరేదో ప్రయోజనాన్ని ఆశిస్తున్నట్లూ ఉమ్ది ఈ కవిత్వం.
కచ్చితంగా ఇది ఉత్తమ జాతి 'అనుభూతి కవితల' జాబితాలోకి ఎక్కవలసిందే. అడుగడుక్కీ ఎన్నో అభ్యంతరాలు, ఆందోళనలు. మానవుడి జీవితం కష్టపరంపరల జాబితా, దుఃఖసమూహాల తోరణం. ఎవరైనా కవి, శాస్త్రజ్ఞుడు, చివరికి రాజకీయవాదైనా సరే ఎక్కడైనా సౌలభ్యాన్ని సాదించాడంటే దాని వెనక ఎంతో శ్రమ తపన, అన్వేషణ అణిగి ఉన్నట్లే అంటాడు నిత్య సంఘర్షి శ్రీ శ్రీ. నిజమే.. పైకి కనిపించే సౌలభ్యం ఒక చిరదీర్ఘ సంక్షోభకి ఫలితం. ఆ సౌలభ్యం.. ఆ సంక్షోభం రెండూ మనసులకి తగులుతున్నయ్ బ్యాయ్ మాకీ మీ 'నదీమూలంలాంటి ఇంటి తలపుల్లో'!శహభాషూ!
'దృష్ట పూర్వా అపి హ్యర్థాః కావ్యే రసపరిగ్రహాత్
'సర్వే నవా ఇవా భాంతి మధుమాస ఇవ ద్రుమాః'
-పూర్వం ఎరిగున్న శబ్దార్థాలే అయినా, ఆయా కావ్యంలోని రసవిశేషములవల్ల అన్నీ వసంతకాలంలోని చెట్లలాగా-కొత్త కాంతితో ప్రకాశిస్తాయి అని ఓ సంస్కృత కవి సూక్తి. మాఘమాసంలో చూసిన పూలతోటను మళ్లా చైత్రమాసంలో చూస్తే-అదే తోట, అదే చోట ఎంత మార్పు! పగటిపూట ఎండకు విసుగుపుట్టించే ప్రకృతి.. చీకటిపడి చంద్రోదయం కాగానే బంగారం కరిగించి పారబోసిన మెత్తల శయ్యకు మల్లే కంటికి ఎంత హాయినిస్తుంది! మీ ఈ కవిత్వం చదువుతుంటే మనసుకి అంతే హాయి! ప్రపంచ వైతరణిని దాటించే గోదానంలాగా కవిత ఉండాలని నారాయణ బాబు అన్నాట్ట గదా! ఆ దానాన్ని మించిన ఫలం మీ కవిత్వం ద్వారా కలుగుతుందని నా నమ్మకం.
వీలైనంత మేరా మనం వెనకకు తప్పుకుని హృదయతోరణద్వారం గుండావచ్చే రసదేవతకు స్వాగతం పలికితే యాకూబ్ ఈ 'నదీమూలాల్లాంటి ఆ ఇల్లు' ఒక అపుర్వానుభూతిగా మిగిలిపోతుంది.

-కర్లపాలెం హనుమంత రావు

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...