అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

28 Apr 2016

నువ్వొక పచ్చని చెట్టువు

 //

నువ్వొక పచ్చని చెట్టువు..
మేమంతా కవిత్వపు పక్షులం..
కమ్మని కవితలు ఆలపించేందుకు
గానకోకిల ఇంటినే వేదిక చేశావు
నువ్వొక పచ్చని చెట్టువు..

రొట్టమాకు రేవులో జన్మించి
పుస్తకాలయం కట్టి పుట్టిన రుణం తీర్చుకున్నావు
రాజధానిలో కవిత్వపు సేద్యం చేస్తూ
కవిత్వాన్నే శ్వాసిస్తూ.. జీవిస్తూ.. సహచరిస్తూ..
నువ్వొక పచ్చని చెట్టువు..

కొత్తతరం కలంలో కవిత్వం నింపుతున్నావు
సిరా మరకలు తుడిపేస్తూ..
తరం తరం నిరంతరం
కవిత్వంలో సంగమించేలా
కవిసంగమానికి ఆద్యుడవైనావు
నువ్వొక పచ్చని చెట్టువు..

నువ్వన్నా.. అమ్మన్నా
మాకు కవిత్వం కలిపి గోరుముద్దలు తినిపిస్తుంటే..
మీ కవిత్వ ప్రేమలో మా రెక్కలు నిమురుతుంటే
ఎగరటం నేర్చుకున్నాం.. ఎగురుతున్నాం.. ఎదుగుతున్నాం.
కవిత్వం కావాలి కవిత్వం అంటూ
ఏ ప్రాంతంలో ఉన్నా పునాది మరవక బతుకుతున్నాం..
నువ్వొక పచ్చని చెట్టువు..

యాకూబ్ జీ ... మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు..!

#శాంతిశ్రీ

24 Apr 2016

ధన్యవాదాలు ...సలాములు !

RRLP 


¤|¤
OCTOBER 10,2015న 'రొట్టమాకురేవు కవిత్వ అవార్డు సభ ', ' కె.యల్. పుస్తకసంగమం' (లైబ్రరీ) ప్రారంభోత్సవం జరిగాయి. వందల మంది హాజరయ్యారు.ఈసారి ప్రధానంగా ఫేస్బుక్ లోనూ, పత్రికల సాహిత్య పేజీల లోనూ కార్యక్రమం గురించిన సమాచారం ఇచ్చాను. ప్రత్యేకంగా ఫోన్ ల ద్వారా పిలవలేదు. అయినా అభిమానంతో వచ్చారు .
దూరాలనుంచి వచ్చిన మిత్రులను కొందరిని పలకరించాను. కొందరిని పలకరించలేకపోయాను .కొందరిని కలిశాను. కొందరిని కలవలేకపోయాను. పైగా 102'డిగ్రీల జ్వరం. కొంత అలసటగానూ వున్నాను ఆరోజు. అదికూడా ఒక కారణం.
వచ్చినందుకు వారందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు.
ఎండ వలన, ఉక్కపోత వలన ,వాతావరణానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయలేకపోవడంవలన ఏర్పడిన ఇబ్బంధులన్నింటిని సహించిన మిత్రులందరికీ వందనాలు.
పైగా ఆరోజు బంద్.
బంద్ ను కూడా దాటుకుని రొట్టమాకురేవు దాకా అభిమానంతో వచ్చి,కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ శనార్తులు.
కెమెరాలతో సందడి చేస్తూ కార్యక్రమంలో భాగమై, రొట్టమాకురేవును,అక్కడి జీవితాన్ని తమ కెమెరాల్లోకి ఎక్కించి, ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేస్తున్న కందుకూరి రమేష్ బాబు, రఘు మందాటి, చేగొండి, కొంపల్లి వెంకట్ గౌడ్, దాసరి అమరేంద్ర, భానోజి రావు,భాస్కర్ ...ఇంకెందరొ మిత్రులందరికీ సలాం.
కార్యక్రమంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మిత్రుడు, అధ్యక్షత వహించిన ప్రసేన్.
రెండుగంటలనుండి ఆరున్నర దాకా అలుపు తెలియకుండా కార్యక్రమం నడిపాడు.
ముగ్గురు అవార్డు గ్రహీతలు సరేసరి. వచ్చిన అతిధులు కార్యక్రమాన్ని తమ మాటలతో ఉత్తేజితం చేశారు. నమస్తే తెలంగాణా ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి సభను చూసి, అక్కడి వాతావరణాన్ని చూసి తన పల్లెను తలచుకున్నారు . బాల్యం నుంచి తనకు స్ఫూర్తినిచ్చిన విషయాలను గుర్తుచేసుకున్నారు.
‪#‎లైబ్రరీ‬ ప్రారంభోత్సవం ఎన్ వేణుగోపాల్ గారు చేయాల్సివుంది, కానీ బంద్ కారణంగా రాలేకపోయారు. ఆ స్ధానంలో కె.యల్ గారిని తన చిన్నప్పటి నుంచి ఎరిగిన శాగంటి కృష్ణమూర్తి గారిచేత ప్రారంభించాం. నిజానికి ఆయనను ఇదివరకు నేను చూడలేదు. కానీ గ్రామాలలో గ్రంథాలయాల ఆవశ్యకత గురించి అక్కడ కరపత్రాలు పంచుతూ తిరుగుతున్న ఆయన గురించి ఆరా తీస్తే , కె.యల్ గారితో వారి పరిచయం వివరాలు తెలిశాయి. అందుకని ఆయనతోనే లైబ్రరీ ప్రారంభోత్సవం చేయించడం సబబు అన్పించింది.
2
అవార్డుల ప్రదానం, అవార్డులకు ఎంపికైన కవితాసంపుటాలను సీతారాం, వంశీకృష్ణ ,సత్య శ్రీనివాస్ తమదైన విభిన్నమైన శైలులలో పుస్తకాలను పరిచయం చేశారు .మంచి విశ్లేషణలు. గుర్తుంచుకునే ప్రసంగాలు. సత్య శ్రీనివాస్ 'జీనుబాయి పిట్ట' ప్రస్తావన ఒక కొత్త ఎరుక.
రసమయి బాలకిషన్ తనతో పాటు ధూందాం గాయకుల్ని ను వెంటపెట్టుకొచ్చారు . తీరొక్క పాట. పల్లె పాటలు, తెలంగాణ పాటలు,
ఉరకలెత్తించిన పాటలు , సభ అంతా చివరికంటా ఉద్వేగంతో ఊగిపోయింది. కాసుల ప్రతాపరెడ్డి తనకున్న రొట్టమాకురేవు అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 'తొపుడుబండి' సాదిక్ అలీ లైబ్రరీ కోసం కంప్యూటర్ ను వాగ్దానం చేశాడు. పల్లెల్లో పుస్తకాల పఠనం ఆవశ్యకతను గుర్తించి, తన ఊరులో లైబ్రరీ ఏర్పాటు కోసం పూనుకుంటానన్నాడు.
స్ధానిక ఎం.ఎల్. ఏ మదన్ వాల్ రొట్టమాకురేవు అభివృద్ధి కోసం దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. పొతినేని సుదర్శన్ రావు (సిపియం) ,పోటు రంగారావు(ఎం ఎల్~ న్యూ డెమోక్రసీ) లు పల్లెలు అభివృద్ధి పథంలో నడవడానికి పూనుకోవడం అవసరమని, రొట్టమాకురేవు సభ అందుకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.
‪#‎చివరిగా‬ కొన్ని మాటలు !
రొట్టమాకురేవులో నిర్మాణం సంకల్పించిన నాటినుంచి ఫేస్బుక్ లో అప్డేట్స్ పెట్టుకుంటూ వచ్చాను. హఠాత్తుగా ఒకరోజు ఈ నిర్మాణం కోసం నా వంతు సాయం అంటూ పెద్దాయన Gumma Ramalinga Swamy గారు నాలుగువేల చెక్కును పంపారు. ముందుగా తీసుకోవడానికి సంశయించాను. కానీ ఇది నా సంకల్పానికి ఆశీర్వాదం అనుకుని, అదే విషయం నా ఫేస్బుక్ వాల్ మీద కృతఙ్ఞతను ప్రకటించాను.
మరికొన్ని రోజుల తర్వాత 'తోపుడుబండి' Sheik Sadiq Ali ఈ ప్రయత్నం కోసం పాతికవేేలు ప్రకటించి,అందజేశాడు.
వెంటవెంటనే తమ సహాయంగా రాజేంద్ర ప్రసాద్ గారు,నారాయణ స్వామి, విజయకుమార్, మధు, భాస్కర్, పుల్లారావు, డా.రమేష్ బాబు, ఉషాకిరణ్, సందీప్ ~ మొత్తం అంతా కలిపి లక్షా నలభై వేల అయిదు వందల రూపాయలు నాకు పంపి, ఈ సంకల్పానికి ఊపిరులూదారు.నిర్మాణంలో తోడ్పాటును అందించారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
#లైబ్రరీ కోసం రావెల పురుషోత్తమరావు గారు, దేశరాజు వందల సంఖ్యలో పుస్తకాలనిచ్చారు. మరికొందరు తాము రాసిన పుస్తకాలు సభ రోజున లైబ్రరీలో వుంచారు.
మీ మేలు మరవలేను. సదా గుర్తుంచుకుంటాను.కృతఙ్ఞతలు మీకు !
_/\_
###
రొట్టమాకురేవు సభ గురించి వివరణాత్మక కధనం కోసం కందుకూరి రమేష్ బాబు రాసిన ఈ రిపోర్టు కూడా చదవండి .

~కవి యాకూబ్ 


https://www.facebook.com/permalink.php?story_fbid=1509769289342739&id=1463232627329739
smile emoticon

యాకూబ్ గ్రంథాలయం నేటి సమాజానికి స్ఫూర్తి

తెలంగాణ సాధనలో కళాకారులే ప్రేరక శక్తులు


-యాకూబ్ గ్రంథాలయం నేటి సమాజానికి స్ఫూర్తి 
-చిరస్మరణ నా గమనాన్నే మార్చింది.. రొట్టమాకురేవు కవిత్వ అవార్డుల ప్రదానంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి

కారేపల్లి రూరల్: రాష్ట్ర సాధనలో కళాకారులే ప్రేరక శక్తులని, తెలంగాణను సాధించి పెట్టిన రాజకీయ పార్టీలు కారక శక్తులుగా నిలిచాయని నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రొట్టమాకురేవులో కవి యాకూబ్ ఏర్పాటు చేసిన రొట్టమాకురేవు కవిత్వ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారులు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఉద్యమం సందర్భంగా పుట్టినన్ని పాటలు ప్రపంచంలో ఏ సాహిత్య ఉద్యమంలోనూ రాసిఉండరన్నారు.

గళం విప్పి గర్జించిన కళాకారులు ఉద్యమానికి ఉత్ప్రేరకాలుగా నిలిచారని, స్వరాష్ట్రంలోనూ గళాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తూ సాహిత్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పల్లె ఉత్సవమే రొట్టమాకురేవు కవిత్వ అవార్డు అని అభివర్ణించారు. కవి యాకూబ్ తన స్వగ్రామమైన రొట్టమాకురేవులో ఏర్పాటు చేసిన గ్రంథాలయం నేటి సమాజానికి స్ఫూర్తి అని, ఒక పుస్తకం తన జీవి త గమనాన్ని ఎలామార్చిందో ఉదహరించారు. కేరళ రాష్ట్రం మలబారు ప్రాంతంలో కుగ్రామమైన కయ్యూరు ప్రజల కష్టాలు, కన్నీళ్ల గాథలపై చిరస్మరణ పేరుతో పుస్త కం వెలువడిందని చెప్పారు. పుస్తకాన్ని చదివిన తనను ఆ గ్రామంలో సామాన్యులు ఉద్యమించిన తీరు తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. వామపక్ష ఉద్యమాల వైపు, సమాజాన్ని చదవడం వైపు అడుగులు వేయించిందని విశ్లేషించారు. ఇలాగే రొట్టమాకురేవులోని గ్రంథాలయం కూడా ప్రజల్లో మార్పు తేవాలని ఆకాంక్షించారు. యాకూబ్ ప్రయత్నానికి సహకారంగా తన వంతుగా వంద పుస్తకాలను గ్రంథాలయానికి అందజేస్తానని ప్రకటించారు.

ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర అమోఘం: రసమయి
రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని, ఉద్యమానికి దశ, దిశ చూపించిన ఘనత వారిదేనని సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ప్రశంసించారు. ప్రతి వ్యక్తికి ఒక ఊరు ఉండాలి.. పలకరించే మనిషి ఉండాలని, అలాంటి ఊరు, ఆప్యాయంగా పలకరించే మనుషులను పొం దిన మహనీయుడు యాకూబ్ అని ప్రశంసించారు. పల్లె మూలాలను ప్రపంచానికి చాటిన యాకూబ్, నేటి సమాజంలో మార్గదర్శి అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తర్వాత ఇక్కడి చెట్ల గాలి రచయిత నందిని సిధారెడ్డి, జీరో డిగ్రీ రచయిత మోహన్‌రుషి, సంచిలో దీపం రచయిత హిమజలతోపాటు ప్రముఖ కార్టూనిస్టు శంకర్‌లకు అవార్డులు ప్రదానం చేశారు. కవి, సీనియర్ జర్నలిస్టు ప్రసేన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్, కాసుల ప్రతాపరెడ్డి, పోతినేని సుదర్శన్, పోటు రంగారావు, సాధిక్ అలీ, దాసరి అమరేంద్ర, కొండపల్లి ఉత్తమ్‌కుమార్, ఆనంద్, సామినేని రాఘవులు, వాసిరెడ్డి రమేశ్‌బాబు, కవి యాకూబ్, డాక్టర్ సీతారాం, వంశీకృష్ణ, సత్య శ్రీనివాస్, డాక్టర్ రమణ ప్రసంగించారు.


source - https://www.facebook.com/trsadithyak/photos/a.413524395492249.1073741828.413496642161691/499157553595599/?type=3&theater

🔷 కవిసంగమం - ఒక అభిప్రాయం


_- సులేమాన్🎤వాయిస్ ఆఫ్ టీచర్స్📢 


🔷 ఫేస్ బుక్ కవిసంగమం సమూహం చిన్ని ప్రయత్నంతో ప్రారంభం అయింది. ప్రముఖ కవి యాకూబ్ దీనికి నాంది పలికారు. అంతర్జాలంలో ఉన్న సౌకర్యన్ని వినియోగించుకొని ఫేస్ బుక్ చేస్తున్న వివిధమైన సామాజిక చలనాలను (సోషల్ డైనమిక్స్) గమనించి తెలుగు కవులకు ఒక మంచి వేదికగా దీన్ని మలచుకోవచ్చు అనే ఆలోచన ఈయన దీనిని (సులేమాన్) రూపొందించారు. అతనికి వ్యక్తిగతంగా పాతిక ఏండ్లుగా పరిచయమైన కవి ప్రపంచాన్ని ముఖ్యంగా ఇప్పుడిప్పుడే గొంతువిప్పుతున్న వారు ఆధునిక నెట్ ప్రపంచాన్ని తెలుసుకున్న యువతీ యువకులైన కవులను ఒకచోటికి తేగలిగారు. ఈ రెండు సంవత్సరాలలో ఇది బాగా వ్యాప్తి చెందినది. ఇప్పటివరకున్న వివరాల ప్రకారం 200 మందికి పైగా కవులు ఈ వేదికలో పాలుపంచుకుంటున్నారు.

🔷 తెలుగులో ఒక కవి సుమారు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు కవిత్వం రాసి లేదా ఒక ఏడాదిలో రాసిన కవితలను అన్నింటిన ఒక కవితా సంకలనంగా తెచ్చి, మరికాస్త కష్టపడి దానికి డబ్బుఖర్చూ పెట్టి పుస్తకావిష్కరణ చేయిస్తాడు. ఎవరో ఒక మంచి అనుభవజ్ఞుడో పేరున్నవాడో వచ్చి దాన్ని ఆవిష్కరిస్తాడు. రెండో రోజు పేపర్లో వార్త వస్తుంది. (సులేమాన్) కాని ఆ పుస్తకాన్ని ఎవరు చదువుతారు. సదరు కవే ఒక వంద కాని రెండు వందల కాపీలు కాని తనకు తెలిసనవారికి పోస్టులో, ఆ ఖర్చులూ ఆయనే పెట్టుకొని పంపిస్తాడు. ఆ వందమందిలో కనీసం ఒక పాతిక మంది దాన్ని చదువుతారో లేదో. అందులో ఒక నలుగురు ఆయిదుగురు కాస్త వ్యక్తిగత క్రమశిక్షణ, మంచి బుద్ధీ ఉన్నవారు. మీ కవితలు బాగున్నాయని ఒక నెలకో ఏడాదికో ఉత్తరం రాస్తారు. దానికి ఈ అల్పసంతోషి అయిన కవి ఎంతో సంతోషిస్తాడు.

🔷 తెలుగు కవులకు నిన్న మొన్నటిదాకా ఉన్న పరిస్థితి ఇది. కాని కవిసంగమం ఈ పరిస్థితిన బద్దలు కొట్టింది. ఈ పరిస్థితిని బద్దలు కొట్టింది నిజానికి ఫేస్ బుక్ అంటే అంతర్జాల పరిజ్ఞానం. ఈ పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టి ఆధునిక తెలుగు కవిత్వానికి దీన్ని ఒక వేదికగా మలచిన ఘనత (సులేమాన్) నిస్సందేహంగా యాకూబ్ కు దక్కుతుంది. దీనితర్వాత కవిసంగమంలో భాగం కాని వారు కూడా ఫేస్ బుక్ లో తమ కవిత్వన్ని పెడుతున్నారు. బ్లాగుల్లో పెడుతున్నారు. ఈ కవితలు కూడా భాగస్వామ్యం రీత్యా కవిసంగమం లోనికి వస్తున్నాయి. అంతే కాదు గూగులమ్మ ను అడిగి తెలుగు కవిత్వాన్ని గురించి తెలుసుకోవలనుకున్న వారికి కూడా కవిసంగమంలోని కవుల వివరాలు కవితలు అందుబాటులోనికి వస్తున్నాయి.
🔷 ఒక కవి తన కవితను రాసిన తర్వాత ఏ మాత్రం ఎడం లేకుండా అంటే రాత్రి కవితను రాస్తే తెల్లవారి పాటికి తన బృందంలోని సుమారు 200 మంది కవిత్వంపైన ప్రేమ ఉన్న పాఠకులకు అందేలా చేస్తున్నాడు. ఇది ఫేస్ బుక్ వేదిక మీద సాధ్యం అవుతూ ఉంది. అంతే కాదు దీని విజయం ఏమంటే ఆకవికి చాలా (సులేమాన్) విలువైన అభిప్రాయ మాల మరుసటి రోజు సాయంత్రానికి తెలిసి పోతూఉంది. ఒక కవితకు సుమారు వందకు పైగా అభిప్రాయ ప్రకటనలు ఒక్కరోజులో రావడం ఒక్కరోజులో కొన్ని వందలమంది సాధారణ పాఠకులు కాక కవిత్వం కోసం ఉన్న ప్రత్యేకమైన పాఠకులు ఆ కవితను చదవడం మామూలు విషయం కాదు. ఆ కవికి వచ్చే ప్రోత్సాహం కాని సంతోషం కాని ఇంతకు ముందు సంప్రదాయ పద్ధతుల్లో అచ్చుపుస్తకం ద్వారా రావడం అన్నది కలలో కూడా ఊహించడానికి సాధ్యం కానిది. కవికి వచ్చే స్థితిని కాస్సేపు పక్కకు పెట్టి కవిత్వానికి వచ్చే స్థితిని గురించి ఆలోచిస్తే మరింత సంతోషకరంగా కనిపిస్తూ ఉంది. కవిత్వ వ్యాప్తి ఇబ్బడి ముబ్బడిగా మునుపెన్నడూ లేని వేగంతో వ్యాప్తి చెందుతూ ఉంది. ఇది తెలుగు సాహిత్య కారులు అందరూ సంతోషంగా గర్వించదగిన విషయం.
🔷 మరొక ముఖ్యమైన తెలుసుకోవలసిన విషయం ఏమంటే.. తెలుగు కవిత్వం ఒక కొత్త శకంలోనికి ప్రవేశించింది అని చెప్పాలి. తెలుగు కవిత్వం ఇప్పటిదాకా రెండు మాధ్యమాలలో ప్రవర్తిస్తూ ఉంది. అది ఒకటి మౌఖిక మాధ్యమం రెండోది లిఖిత మాధ్యమం. ఈ రెండు కలిసిన మిశ్రమాధ్యమంలో కొన్ని కవితా ప్రక్రియలు ప్రవర్తించాయి. అవి శతకాలు, తత్త్వాలు వాగ్గేయకారుల పాటలు. కాని అంతర్జాలం కారణంగా మరొక మాధ్యమం వచ్చింది అది ఎలక్ర్టానిక్ మాధ్యమం, దీన్నే విద్యున్మాధ్యమం అని అనాలి. ఇది ఎలా ప్రత్యేక మాధ్యమం అయిందో చెప్పవచ్చు. ఒక కవి తన కవితను బ్లాగులో కాని ఫేస్ బుక్ లో కాని రాస్తున్నాడు అంటే ప్రచురిస్తున్నాడు. అతని పాఠకులు కూడా ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే (సులేమాన్) చదువుతున్నారు. దానిపైని అభిప్రాయాలు కూడా అదే మాధ్యమంలో విస్తరిస్తున్నాయి. అదే మాధ్యమంలో కల కాలం నిలబడుతున్నాయి. అంటే ఇక్కడ కవిత్వం పుట్టుక, వ్యాప్తి నిలకడ అనేవి మొత్తం ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఈ కారణంగా తెలుగు కవిత్వం పూర్తిగా నూతన ప్రసార మాధ్యమంలోనికి చేరిందని చెప్పవచ్చు. ఇది నూతన మాధ్యమంగా నూతన యుగంగా చెప్పుచ్చు. అంతే కాదు ఈ ఆధునిక అంతర్జాల సాంకేతిక కారణంలో తెలుగుకవిత్వంలో గుణాత్మక పరిణామం కూడా వచ్చిందని చెప్పవచ్చు. ఇటీవలికాలంలో కవిసంగమం సభ్యుడైన వంశీధర రెడ్డి రాసిన కవితలు, అఫ్సర్, యాకూబ్ రాసిన కొన్ని కవితలు, దెంచనాల శ్రీనివాస్ మరీ ఇటీవల ప్రకటించిన భస్మసారంగి కవితలు చూస్తుంటే ఆధునిక సాంకేతికత ఆధునికత ఎంతగా తెలుగు కవిత్వాన్ని ప్రభావితం చేస్తూ ఉందో తెలిసి సంతోషం కలుగుతూ ఉంది. ఇందువల్ల తెలుగు కవిత్వం మూడో మాధ్యమంలోనికి ప్రవేశించినదని చెప్పవచ్చు. తెలుగు కవిత గుణాత్మక పరిణామాన్ని, మాధ్యమ పరిణామాన్ని పొందినదని మూడో మాధ్యమంలోనికి ప్రవేశించింది.

🔷 అయితే కవిసంగమం కన్నా ముందే కొన్ని బ్లాగు పత్రికలు తెలుగు కవిత్వాన్ని అంతర్జాల ప్రపంచంలోనికి తీసుకుపోయాయి. పన్నెండు సంవత్సరాలుగా వస్తున్న తెలుగు బ్లాగు పత్రికలు మనకు ఉన్నాయి. ఈమాట, అనే పత్రిక వీటిలో చాలా పాతదిగా కనిపిస్తూ ఉంది. బ్లాగుల హారాలు జల్లెడ, కూడలి కూడా తెలుగు కవిత్వానికి మంచి వ్యాప్తిని (సులేమాన్) తీసుకువచ్చాయి. వీటి ప్రభావాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేము. ఇటీవల వచ్చిన సారంగ, వాకిలి, విహంగ వంటి పత్రికలు కూడా మంచి వ్యాప్తికి కారణం అవుతున్నాయి. కాని బ్లాగుకు కొన్ని పరిమితులున్నాయి. అవేమంటే నాకు ఒక బ్లాగు ఉందన్న సంగతి తెలిసిన వారు నా గురించి తెలిసినవారు మాత్రమే నా బ్లాగులో ఉన్న కవితలను చదువుతారు. అక్కడ ఒక సమాజం అనేది ఉండదు. మూకుమ్మడిగా ఒకే సారి ఒక గుంపుగా అందరికీ చేర్చే వీలు ఉండదు. కాని ఫేస్ బుక్ గ్రూపులో ఈ సౌకర్యం ఉంది. కవిత్వ వేదికగా ఫేస్ బుక్ ప్రయోగం చాలా విజయవంతం అయినదని చెప్పవచ్చు. ముఖ్యంగా కవిసంగమం ప్రయోగం తెలుగు కవిత్వానికి కొత్త ఒరవడిని సృష్టించింది.
🔷 అంతర్జాలాన్ని ఈసడించేవారు. ఆఁ దాన్ని ఎవరు చూస్తున్నారు అనేవారు, దాన్ని అసహ్యించుకునేవారు మనకున్నారు. పెద్దతరం వారిని తప్పు పట్టడం కాదు కాని వారి కాలానికే అందుబాటులో ఉన్న సాంకేతికను ఆహ్వానించలేకపోవడం వల్ల వారిని వారు వెనుకటి కాలానికి పోయిన వారుగా ప్రకటించుకుంటున్నట్లు లెక్క. ఇక సమక్షంలో పొగడి వెనుకనుండి తెగడే గోడమీది పిల్లులు కూడా మనకున్నాయి. వారిని ఉజ్జగించడం మంచిది. కాని పెద్దతరంలో కూడా కొందరు ఇంటర్ నెట్ ప్రభావాన్ని ఫేస్ బుక్ సామాజిక పరిణామ (సులేమాన్) శక్తిని గ్రహించిన వారున్నారు. తెలుగు కవిత్వానికి కూడా ఒక కొత్త మాధ్యమం కొత్త యుగం వచ్చినదని గ్రహించినవారున్నారు. మొదట ఫేస్ బుక్ ప్రయత్నాన్ని కవిసంగమిన్ని నిరసించిన వారు కూడా క్రమంగా దీని శక్తిని గ్రహిస్తున్నారు. ఇది ఒక కొత్త ఒరవడి అని తెలుసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. నిన్నగాక మొన్న జరిగిన కవిసంగమం కవిత్వపు పండుగ చాలా ఆనందాన్ని కలిగించింది. కొత్త తరం సంగతి అలా ఉంచి పాత తరానికి కూడా అంతర్జాల మాధ్యమానికి ఉన్న శక్తిని గురించి తెలుగు కవిత్వపు కొత్త ఉనికిని గురించి తెలియజెప్పడంలో ఈ పండుగ సఫలం అయిందని భావించవచ్చు.

*మార్చి 25 ,2016 

+

Source : 
https://www.facebook.com/permalink.php?story_fbid=1003731006381256&id=992724654148558

23 Apr 2016

పొలంగట్టుపై పచ్చిగాలి వాసనలాంటి సిధారెడ్డి కవిత్వం!

నందిని సిధారెడ్డి 

                                                                         

కవి సిధారెడ్డి నాలుగు దశాబ్ధాలకు పైగా తెలంగాణా ప్రాంత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సందర్భాన్ని కవిత్వంగా మలిచినవాడు. భూమిస్వప్నం‘, మొదలుకుని ఇక్కడి చెట్లగాలివరకు తనదైన ప్రస్ఫుటమైన ముద్రను కనబరిచినవాడు. జీవితమే కవిత్వంగా, కవిత్వమే జీవితంగా, ఆచరణను  అణువణువున నింపుకున్న కవి. స్వీయస్పందనను సమిష్టి స్పందనగా పలుకుతూనే కవిత్వాన్ని సామాజిక శాస్త్ర పరికరంగా మార్చిన నైపుణ్యం అతని కవిత్వంలో కనిపిస్తుంది. కవిగా అన్ని చలనాలకు స్పందిస్తూ, కవిత్వరూపంగా మలుస్తూ దాదాపు నలభై సంవత్సరాలు ప్రయాణించడం అంత సులువేమీ కాదు.ఆయన కవిత్వంలోని కలలు,ఆలోచనలు ,కాలం ,పెనుగులాట, అలజడి ,ఆరాటం ,పోరాటస్ఫూర్తి -ఇలా అన్నీ మనసును తాకుతూ మనిషిని తట్టిలేపుతుంటాయి .ఆలోచించమంటాయి. కాలనాళికలాంటి కవిత్వం సిధారెడ్డి కవిత్వం .

"ఈ లోపల/కూలిపోతున్న ఊరి చెలిమెలో/కూరిమి తోడాలె/ఈలోపల/వలసపోయిన వసంత మేఘానికి/
ప్రేమలేఖ రాయాలె/ వట్టిపోతున్న తరానికి/ మనిషిని కానుక ఇవ్వాలె/ ఈలోపల/ కాలం కనురెప్పల మీద /
జీవితం రచించాలె/ గాలి రెక్కల మీద/ మనిషి చేరుకోవాలె/ఎవరికీ తలవంచని రేషం అద్ది/ పద్యం ఎగురవేయాలె" అంటూ పద్యాలను, పాటలను ఎగరేసిన కవి.తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నిత్యచలనశీలి.
నందిని సిధారెడ్డి 

1
 'ఒక నేలకు సంబంధించిన వేదననూదుఃఖాన్నీ కవిత్వం చేస్తున్నపుడుఆ నేలకు చెందిన భాషపదజాలం అనివార్యంగా ఆ కవిత్వంలోకి వొస్తుందిఅట్లా వొస్తేనే ఆ కవిత రక్త మాంసాలతో తొణికిసలాడుతుంది సార్వజనీన వస్తువుసార్వజనీన వేదన అంటూ వుండవు. ఉదాహరణకు భారత దేశం మొత్తాన్నీ రిప్రేసెంట్ చేసే రైతు ఉండడుఎందుకంటేకోస్తా రైతు దుఃఖంతెలంగాణ రైతు దుఃఖం ఒకటి కాదు తెలంగాణ నేల పైన నిలబడి రైతు దుఃఖం గురించి కవిత్వం చెబుతున్నావంటేఆ రైతు తెలంగాణ రైతే అయి వుండాలి ఆ కవిత స్థానికతకు ఎంత దగ్గరగా వుంటే అంతగా సార్వజనీనం అవుతుంద'ని తన అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించిన సిధారెడ్డి తెలంగాణా బతుకుచిత్రాన్ని గీసాడు. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని గానం చేసే ఆయన ’’నాగేటి సాలల్లో నా తెలంగాణ‘‘ పాటను తెలంగాణాలో ఎవ్వరూ మరిచిపోలేరు.

1997 ఆగష్టు నెలలో ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. అమరులను  స్మరిస్తూ రాసిన 'జోహార్లు జోహార్లు' పాట విన్నవారిని కంటనీరు పెట్టిస్తుంది. నిజానికి సిధారెడ్డి కవిత్వం రాస్తున్నప్పుడు మనిషి బందారం చెరువుకట్ట వద్దనే ఉంటాడనిపిస్తోంది. ఎందుకంటే ఆ పంక్తుల్లో అంత తేమ. ఊరి జ్ఙాపకాలు మదిలో కదిలితేనే కలం ముందుకు సాగుతుందంట. అందుకే ఆయన కవిత్వంలో తెలంగాణ పల్లె కన్నతల్లిలా కనిపిస్తుంది.


సిధారెడ్డి కవిత్వం చదివితే అ అక్షరాల్లో మట్టివాసన కళ్ళను, మనసును కట్టేస్తుంది. ప్రతి కవితలో ఒక అంతర్గత లయ, పల్లెజీవితంలోని స్వచ్ఛమైన పచ్చిగాలి వాసన. ఆయన కవిత్వంలో తెలంగాణ బతుకు  సౌందర్యం ఆహా అనిపిస్తుంది. ఈ విషయం గురించి ఆయనే మాట్లాడుతూ ’’నాకు నేను పుట్టి పెరిగిన నేల మీది భాష అన్నాఆ మాటలు అన్నా ఒక ప్రేమ.  వ్యామోహం అనడం సమంజసమేమో అందుకేఆ వేదనని కవిత్వం చేసినపుడు ఆ నేటివ్ మాటలు విరివిగా వాడడం వల్ల ఆయా కవితలకు ఒక గొప్ప శక్తి వొస్తుందని నమ్మి వ్రాసేవాడినిఅయితేఆ తరువాత అట్లా వాడడం పైన వొచ్చిన విమర్శల పైన కసితో ఆ మాటలని మరింత ఎక్కువగా ఉపయోగించాను.‘‘ అన్నారు. స్ధానికత, స్థానిక భాష కవిత్వాన్ని ప్రజల్లో చొచ్చుకుపోయేలా చేస్తుంది. ఒక జాతి, ఒక ప్రాంత పోరాటాన్ని కవిత్వంగా మలుస్తున్నప్పుడు ఆయా సందర్భాలకు తగిన భాష ఉపయోగించడం కవి ప్రతిభకు నిదర్శనం. సిధ్ధారెడ్డి కవిత్వంలో ఈ ప్రతిభ అక్షరమక్షరం కనిపిస్తుంది.

ఈ జాగల రేషమున్నది / కుటిలం లేదు /కువారం లేదు' అంటూ బల్లగుద్ది మీర చెప్పిన కవి సిధ్దారెడ్డి. ఆయన కవితల్లో' ఉద్రాక్ష పూలు పూసినంత  సహజంగా / మాటలు పూస్తుంటయి ' .'నదిపుట్టుబడి' కవితా సంపుటిలోని కవితలు తెలంగాణా జీవితాన్ని, పోరాటతత్వాన్ని మన కళ్ళముందు ఆవిష్కరిస్తాయి.'దాలిలో పాలు కాగబెట్టినవాండ్లం / అనుభవాలు కాగబెట్టి పోస్తం' వంటి పంక్తుల్లో అద్భుతమైన పల్లెపదాల వాడకంతో పల్లె జనంలోకి ఉద్యమాన్ని నడిపించినవాడు.
"చావుదలకు సుత లేసి ఉరుకుడే / గెలిసినా ఓడినా/ దిగిన తర్వాత కొట్లాడుడే/ దిగుట్లె దీపం ఆరిపోయినా / నమ్ముకం ఆరిపోదు.." అంటూ తెలంగాణా ఉడుకు రక్తం పోరాటపటిమను అక్షరీకరించాడు. తను పుట్టిన మట్టి మీద మమకారం, ఆ మట్టివాసనలోని రోషాన్ని, స్నేహాన్ని, కల్లకపటం ఎరుగని సూటిదనాన్నినిక్కచ్చిగా ప్రకటించిన కవిత్వం సిధారెడ్డిది. ప్రాణగానం కవితలో నిర్మొహమాటంగా ఈ మాటలే చెప్పాడు.
’’ఇక్కడి పిట్టలు
కచ్చితంగ ఇక్కడి పాటలే పాడుతయి
ఇక్కడి చెట్లగాలి
కచ్చితంగా ఇక్కడి కేరింతలే వినిపిస్తది‘‘ ఈ మాటలు చెప్పడంలోని ఆత్మవిశ్వాసం, తెలంగాణా మట్టి పట్ల ప్రేమ, ఇక్కడి గాలి పట్ల మమకారం మాత్రమే కాదు, ఉద్యమవీరులకు ఇక్కడి ప్రకృతి, ఇక్కడి అడవులే తల్లి ఒడి లాంటివన్న ధ్వని గమనించదగినవి. బతకు చితికినప్పుడు, ఆత్మ ఘోషించినప్పుడు, ఆకలికి కడుపులో పేగులు ఎండి కరకరలాడినప్పుడు.. బతుకు బతుకులా ఉండదు. అది మంటల్లో కాలుతున్న పచ్చిమట్టలా పొగబెడ్తుంది. కంటిలో ఆగని కన్నీరై ప్రవహిస్తుంది. అలా ప్రవహించిన అక్షరాలే సిధారెడ్డి కవిత్వం. తరతరాల బానిసత్వం, వెట్టిచాకిరి, వలసలు, దోఫిళ్ళు, కరువులు, తెలంగాణ ఉద్యమ వీరుల త్యాగాలు, రైతుల ఆత్మహత్యలను మోసుకుంటూ వచ్చిన తెలంగాణ ఉద్యమంలో కన్నీరు ఆవిరైన హృదయఘోష ఆ కవితల్లో ఉరుములురిమే ఆకాశంలా గర్జించింది.

సిధారెడ్డి కవిత్వంలో తెలంగాణా చిత్రాన్ని మనముందుంచడమే కాదు, మానవ సంబంధాల్లో, మానవవిలువల్లో అంతరించిపోతున్న మనిషితనాన్ని, మనిషికి మనిషికి మధ్య పెరుగుతున్న దూరాలను కూడా స్పర్శించాయి. ముఖ్యంగా గ్రామీణ, వ్యవసాయ జీవనం ఆయన కవితల కాన్వాసుపై ప్రముఖంగా కనిపిస్తుంది. వ్యవసాయ జీవనం, ప్రపంచీకరణ తెచ్చిన కష్టాలు, పోగొట్టుకోవడంలోని దు:ఖం, పరాయీకరణ, వలసలు కవిని కల్లోలానికి గురిచేస్తే, తెలంగాణా అస్తిత్వ పోరాటం కవిలోని అలజడిని అక్షరాలుగా కురిపించింది.
సిద్ధారెడ్డి కవిత్వంలో గ్రామీణ వ్యవసాయజీవనానికి సంబంధించిన పదచిత్రాలు ఎక్కువ. రైతుకుటుంబ నేపథ్యం అందుకు కారణం కావచ్చు. ఒక నోస్టాల్జిక్, మెలోంకలి ధ్వనిస్తుంది. ప్రపంచీకరణ తర్వాత పల్లెల్లోని ఇండ్లలోకి కూడా మార్కెట్ అడుగుపెట్టడం వల్ల ధ్వంసమవుతున్న పల్లె నేలను, ఎండిపోతున్న పల్లెకు కన్ను వంటి చెరువు గుండెను తడిమిన కవితలు ఎన్నో. అయితే ఉద్యమ నేపథ్యంతో రాసిన కవితలు కూడా చాలా ఎక్కువే. అనేక సామాజిక, ఆస్తిత్వ ఉద్యమాలతో సన్నిహిత సంబంధాలు, ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో భాగస్వామ్యం ఆయన కవితల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

సిధారెడ్డి కవిత్వం పాఠకుడిని చెయ్యి పట్టి పల్లెకు తీసుకెళ్తుంది. పొలంగట్లపై నడిపిస్తుంది. ఎండిన నెర్రెలను చూపిస్తుంది. గొంతెండిన చెరువులను చూపిస్తుంది. ఎండిన పొలంలా దిగాలుపడిన రైతు వెనుక నడిపిస్తుంది. గతాన్ని గుర్తు చేస్తుంది. ప్రపంచీకరణ గాలికి కొట్టుకుపోతున్న మానవవిలువలను చూపిస్తుంది. పచ్చిఆకులే చెట్టునుంచి రాలిపోతున్న సందర్భాలను పరిచయం చేస్తుంది. తడారిన కండ్లల్లో ఎండిన ఆశల బావులను చూపిస్తుంది. పాఠకుడి చెంపలపై రెండు తడి చారికలై మెరుస్తుంది.
’’చెరువు కట్టమీద /నిలుచున్నా /మునుపటి తృప్తి ఉండది / గాలిలో అసహత్వమేదో /కనబడని వేదనతో /గులుగుతంటది‘‘ అంటూ గుండెల్లో ముణకేసిన దిగులును ’’కట్టమీద‘‘ కవితలో ప్రకటించాడు.నేడు ప్రతి మనిషి మనిషిగా మిగల్లేదు. మార్కట్ మనిషిని వినియోగదారుడి స్థాయికి దిగజార్చింది. ప్రతి సంబంధం ఆర్థిక సంబంధంగా మారిపోయింది. ప్రపంచం ఒక కుగ్రామమైనా, పల్లె మిగల్లేదు. ఈ కుగ్రామంలో పూరిగుడిసెల మానవత్వం లేదు, సంతలో అమ్ముడయ్యే విలువలే అయ్యాయి. నిజానికి ఇది కుగ్రామం కాదు, ఒక సంతగా మారిపోయింది. నిన్నటి పైరగాలి లేదు, నిన్నటి ఏటిపాట లేదు. మిగిలింది దిగులు మాత్రమే.
పల్లెలు మాయమైపోయాయి. టౌన్ షిప్పులు వెలుస్తున్నాయి. ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు, పారిశ్రామిక వాడలు పుట్టుకొస్తున్నాయి. మనిషి ఎంత మారినా ప్రకృతి మాత్రం మారదు.
’’మనిషి ధర్మం మారినా/చెట్టు ధర్మం మారదు /చేను చెలకా నేలంతా /ఆకుపచ్చ పులకింత /ఇప్పుడు భూమి /అద్దిన రంగులుగా ధగధగమంటున్నది /కొత్త ఆహర్యంతో /ప్రకృతి ఉరుకులాడుతున్నది.
...
 ముసలితాత ఉత్తచేతుల వలె /రెండు మామిడి చెట్లు /మిగిలే ఉన్నయి /నేల కనుకొలకుల మీద జారి /ఆగిపోయిన కన్నీటి బొట్లవలె /రెండు మామిడి చెట్లు /నిస్తేజంగ /
నిలబడే ఉన్నయి ‘‘ (రెండు మామిండ్లు)
మారుతున్న పరిస్థితుల్లో మనిషి ఉనికిని ప్రశ్నార్థకమవుతుందా? మనిషి ఉనికే ప్రశ్నార్థకమైన చోట యంత్రంలా పరుగెత్తే ఈ బాదరబందీ ఎందుకు? ఇలాంటి  అనేక ప్రశ్నలు సిధారెడ్డి కవిత్వం చదివిన ప్రతి పాఠకుడి మనసులో తప్పక మెదులుతాయి.సిద్ధిపేట ప్రాంతంలో ఉన్న కోమటి చెరువుతో ఉన్ అనుబంధాన్ని సిధ్ధారెడ్డి అపురూపంగా తనలో ఇముడ్చుకున్నాడు. కట్టమీద, చెరువొడ్డు, ఒంటరి దిగులు కవితల్లో మనకు తెలంగాణా గ్రామాల్లోని చెరువు, ఊరు, చెలకల దృశ్యాలు చూపిస్తాడు.’’బురద చేతుల్తో /పొలంలో డైరీ రాస్తున్న రైతు /బట్టల మురికి వదిలించేతందుకు /బండమీద కరుగుతున్న యౌవనం /వెనుక కూర్చుని నేర్పుతూ ఆయన /కొత్త ప్లెజర్ నడుపుతూ/టెన్షన్కూ ప్లెజర్కూ నడుమ ఆవిడ
...
పరుగులు /పరవశాలు /దు:ఖాలు చూసిన ఒడ్డు /కాలాలు /కల్లోలాలు /కాఠిన్యాలు భరించిన ఒడ్డు /మునుగుతది, తేలుతది /నానుతది, ఎండుతది /ఆ ఒడ్డు /పొద్దున సందడి /రాత్రి ఒంటరి‘‘ చెరువొడ్డు కవితలో రాసిన ఈ పంక్తుల్లోని చివరి పంక్తులలోని రాత్రి అనే పదం బహుశా నేటి మార్కెట్ కాలానికి ప్రతీకగా ఉపయోగించాడా అనిపిస్తుంది. నేడు చెరువు ఒంటరయ్యింది. ’’ఒంటరి దిగులు‘‘ కవితలోని దృశ్యాలు నిజంగానే ఒక దిగులును దృశ్యీకరించాయి.’’తోటకు నీళ్ళుపెట్టి /నిలబెట్టిన రాయి ఒంటరిదే /చిటపటలాడినా /చిత్తడి జల్లులు పంచిన /రుతువే వెళ్ళిపోయిన తర్వాత /దిగులు దిగుతద
...
ఆ మబ్బును ఒంటరిగానే ఉండనీ‘‘ ఈ కవితల్లోని బతుకుచిత్రాలు పాఠకుడిని తమలోకి ఒంపుకునే శక్తి కలిగినవి. తెలంగాణా పల్లెలు ,జీవితం మనముందు నిలబడి మాట్లాడుతున్నట్టుగా,ముచ్చట చెబుతున్నట్టుగా  ఉంటుంది ఈ కవిత్వం .మనసును అల్లకల్లోలం చేస్తుంది. ఆలోచించేందుకు వివశం చేస్తుంది.అన్యాయాన్ని ప్రశ్నించమని పురికొల్పుతుంది .ఇంతకంటే ఏ కవైనా,కవిత్వమైనా ఆశించేదేముంది? సిధారెడ్డి కవిత్వం చేసిన పని అదే !
నందిని సిధారెడ్డి 


2

1955 జులై 12న మెదక్ జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో బాలసిధారెడ్డి, రత్నమాలలకు జన్మించిన పేదరికం కాలడ్డుతున్నా ధైర్యంగా కష్టాలను ఎదిరించి చదువు కొనసాగించి 1981లో ’’ఆధునిక తెలుగు కవిత్వంలోు సూర్యుడు‘‘ అనే అంశంపై ఎం,.ఫిల్, 1986లో ’’ఆధునిక తెలుగు కవిత్వంలో వాస్తవికత, అధివాస్తవికత‘‘ అనే అంశంపై పి.హెచ్.డీ పూర్తి చేశారు. పుస్తకాలు చదవడం కాదు, పుస్తకాలు రాయడం గొప్ప అని చెప్పిన తండ్రి మాటలే ఆదర్శంగా తెలంగాణా బతుకు చిత్రాలను తన కలం నుంచి మన కంటికి చూపించిన కవి సిధ్ధారెడ్డి.  సాహిత్య ప్రయాణాన్ని చూస్తే, 1973లో మిత్రుడు భగవంతరెడ్డి ప్రోత్సాహంతో సామాజిక కవిత్వం రాయడం ప్రారంభించిన సిధారెడ్డి రాసిన మిని కవితల సంపుటిని కందుకూరు శ్రీరాములు, కర్ణాల బాలరాజు కలిసి 1974లో అచ్చేయించారు. అప్పటి నుంచి 1991 వరకు ఆయన రాసిన పుస్తకం ఏదీ అచ్చవ్వలేదు. 1991లో సంభాషణ, 1995లో ప్రాణహిత, 1997లో భూమిస్వప్నం, 2001లో ఒక బాధకాదు, 2007లో నదిపుట్టుబడి, 2007లో ఇగురం, 2008లో తెలుగు కులవృత్తుల సాహిత్యం, 2011లో తెలంగాణా సాహిత్యంపై వ్యాసాలు రాశారు. 2012లో ఆయన రాసిన ’’నాగేటి సాలల్లో నా తెలంగాణ‘‘ పాటకు నంది బహుమతి లభించింది. ఇది ఆయన రాసిన మొదటి పాట.
నందిని సిధారెడ్డి 

1987లో భూమిస్వప్నం కవితా రచనకు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అందుకున్నారు, 1988లో దాశరథి అవార్డు, 2001లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది. కాని రైతు ఆత్మహత్యల పట్ల కలత చెందిన సిధారెడ్డి ఆ అవార్డును తిరస్కరించారు. 2009లో ఉత్తమ కావ్యస్నేహనిధి పురస్కారాన్ని అందుకున్నారు. నిజానికి పురస్కారాల పట్ల ఆయనెప్పుడు ఆసక్తి చూపించలేదు. కోడూరి విజయకుమార్ కు  ఇచ్చిన ఒక ఇంటర్వ్యులో మాట్లాడుతూ ’’ఒకట్రెండు సందర్భాలలో ఆయా పురస్కార ప్రదాతలతో నాకున్న ఆత్మీయ అనుబంధం వల్లనే ఒప్పుకున్నాను ఉదాహరణకు ఈ పురస్కారం[రొట్టమాకురేవు అవార్డు] ఇస్తోన్న యాకూబ్ వ్యక్తిగతంగా నాకు ఆత్మీయుడు ఆర్నెళ్ళ కిందటే అన్నా మీరు తప్పకుండా తీసుకోవాలే‘ అన్నడు ఎట్ల కాదనటం ?‘‘ అని చెప్పారు. 1984లో మెదక్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి కవిత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన ప్రయత్నాలు ఆ తర్వాత 1986లో ’’మంజీర రచయితల సంఘం‘‘ ఏర్పాటుకు కూడా దారితీశాయి. మంజీర రచయితల సంఘం తెలంగాణా కవులకు కొత్త వేదికనిచ్చింది. 2001లో తెలంగాణా రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షునిగా వ్యవహరించారు. మంజీర అనే ద్వైమాసిక పత్రికకు, సోయి అనే త్రైమాసిక పత్తికకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


 సిధారెడ్డి కవి, పాటల రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, బోధకుడు. అన్నింటికీ మించి తెలంగాణ సమాజానికి దార్శనికుడు.సామాజిక కార్యకర్త . అలాంటి కవికి రొట్టమాకురేవులో షేక్ మహమ్మద్ మియా స్మారకంగా ఇచ్చే 'రొట్టమాకురేవు అవార్డు'ను  ఇవ్వడం తెలంగాణా పల్లె ఇచ్చిన అవార్డుగా ఆయనకు ఇవ్వడం నా కన్నవూరు  అదృష్టంగా భావించాను. జయహో !
-కవి యాకూబ్
March,2016

22 Apr 2016

Rottamaku Revu Library & Poetryspace (RRLP)


#RRLP 
అది ఒక  మామూలు పల్లె. మారుమూల వాగు వొడిలో తలదాచుకున్న పల్లె. దాన్ని కవిత్వ పటం మీద స్ఫుటంగా నిలపాలని యాకూబ్ స్వప్నం. ఆ స్వప్న సాకారానికి కొన్ని రూపాలు: మూడు పురస్కారాలూ, ఒక కవిత్వ లైబ్రరీ. ప్రతి అక్టోబరు పదినా అక్కడ కవిత్వ ఉత్సవం. ఆ సందర్భంగా ఈ ప్రత్యేక విశేషాలు…
~
కవిత్వం ఒక సాంస్కృతిక సంభాషణ. భాషని ఆధిపత్యంలో ఉంచుకోవడం అంటే కేవలం ఒక వ్యక్తి , సమూహం, ప్రాంతం పెరుగుదలే. కాని భాషని ఇవ్వడం, మరొకరితో పంచుకోవడం అంటే , చాలా ఉన్నతమైన భావన మాత్రమే కాక, ఒక మార్పుకు నాందీసూచన కూడా !
అవార్డు మెమొంటొలు 
సమకాలిక కవిత్వం కవిని సమూహంతో కలిపే ప్రయత్నం చేయాలి. కవి ‘నేను మీలో ఒకడ్ని అంటే’ పాఠకుడు ‘నువ్వు నాలో ఒకడివి’ అన్న ప్రతిస్పందన రావాలి. కాని ఆధునికత పేరిట మనం మన వేర్లనుండి విడిపోతున్నాం. నానాటికి దూరంగా జరిగిపోతున్నాం.అలా జరిగిపోవడం గమనించినా ఏమీ చేయలేని అశక్తులుగా మిగిలిపోతున్నాం.
మనం గ్రామాల నుండి ఎంత దూరంగా వెళ్ళిపోతే వాటి జ్ఞాపకాలు మనని అంతే వెనక్కు సదా లాగుతుంటాయి .
ఇలా ఎన్నెన్నో ఙ్ఞాపకాల ఊట రొట్టమాకురేవులోని బుగ్గవాగులా సదా మదిలో నాలో పారుతూనే వుంది. ఈ చిన్నపాయ వివిధ రూపాల్లో ప్రత్యక్షమై వెంటాడుతూనేవుంది.
yakubఅలాంటి తరుణంలో కేరళ లో ‘తుంచన్’ అనే కవి స్మారకంగా నిర్మించిన “తుంచన్ మెమొరియల్ ట్రస్ట్ “, కుమారన్ ఆసన్ స్మారక కేంద్రం ; హైదరాబాద్ లోని “లమకాన్”, ‘గోల్డెన్ త్రెషొల్డ్’లను చూడ్డం జరిగింది. కేరళ, కర్ణాటక, ఉత్తర భారత ప్రాంతాలలోని మరికొన్ని గ్రామీణ సాహిత్య కేంద్రాలు చేస్తున్నపనులు ఆకర్షించాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు సాహిత్య, సాంస్కృతిక కేంద్రాలుగా మారవలిసిన అవసరం వుందని అన్పించింది.
చిన్నప్పుడు ప్రతి ఉదయం పల్లెలలో తిరిగే బుర్రకధలవాళ్ళు, తంబురకధలవాళ్లు, బుడబుక్కలవాళ్లు, ఒగ్గు కథలవాళ్లు ఇలా ఎన్నెన్నో కళారూపాలను చూసిన కాలం గుర్తొచ్చింది. రొట్టమాకురేవులాంటి పల్లెటూర్లో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక వేదికను ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షకు ఈ ఎడతెగని ఆలోచనే ప్రేరణగా నిలిచింది . అందుకు వున్న కొద్దిపాటి వనరులతో , మిత్రుల సహకారంతో ఈ చిన్ని ప్రయత్నం, ప్రయోగం చేయడానికి సంకల్పించాం. భవిష్యత్తులో అదొక కల్చరల్,పొయెట్రీ సెంటర్ గా ఎదగాలని,ఈ ప్రయత్నం మరికొన్ని ప్రాంతాలకు స్ఫూర్తిగా మారాలని లోపల ఎక్కడో చిన్ని ఆశ.
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఈ ప్రయత్నం అందరినీ ఆకర్షిస్తుందని, అతి త్వరగా ఊపందుకుంటుందన్న భరోసా మాత్రం వుంది .
కవిత్వం అంటే కేవలం రాయడం ,చదవడంతో మాత్రమే సరిపోదు. కవిత్వ వాతావరణాన్ని కల్పించడంకూడా ముఖ్యం. పొయెట్రీ స్పేస్ కూడా ముఖ్యం. ఇతర భాషల కవిత్వం వినడం, కవులను కలవడం, మన కవులను కలపడం ఇదంతా జరగాలి. ఇదొక ప్రాసెస్ లో నిరంతరంగా జరగాలి. అప్పుడు మాత్రమే కవిత్వాన్ని గ్లోబల్ స్థాయికి చేర్చడం సాధ్యం.
ఇన్ని ఆలోచనలు, సంకల్పాలతో ఇలా మొదలైన ప్రయాణంలోని తొలి అడుగుగా – ప్రతి సంవత్సరం అక్టోబరు 10 న “షేక్ మహమ్మద్ మియా, కె.ఎల్. నరసింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక కవితా పురస్కారం “ను గుదిగుచ్చి “రొట్టమాకురేవు కవిత్వ అవార్డు “గా ఇవ్వడం . ఒక ఊరి పేరుతో అవార్డు నెలకొల్పి యివ్వడం ద్వారా పల్లెలు, స్ధానికత అనే అంశాలకు ప్రాధాన్యత పెరగాలని కాంక్షించాం.
2015 అవార్డు సభ 
నిజానికి 2010 లో ప్రారంభించాలనుకున్న ఈ అవార్డును 2014 లో మొదలుపెట్టాం.
గత సంవత్సరం(2010-2014) అవార్డు గ్రహీతలు సౌభాగ్య(సాభాగ్య కవిత) , అరుణ్ సాగర్ (మేల్ కొలుపు) ,షాజహానా(దర్దీ) ,నంద కిషోర్ (నీలాగే ఒకడుండేవాడు) లకు అవార్డులు ప్రదానం చేశాం.
2015 సంవత్సరం నందిని సిధారెడ్డి (ఇక్కడి చెట్ల గాలి) ,మోహన్ రుషి (జీరో డిగ్రీ) ,హిమజ (సంచీలో దీపం) అవార్డులు ప్రదానం చేస్తున్నాం.

+++
ఇలా తొలి అడుగు పురస్కారాల ద్వారా ప్రోత్సాహాన్ని పెంపొదించడం అయితే, ఆ అడుగుకు జోడుగా అందర్ని కలుపుతూ వెళ్ళే ప్రయత్నం, రొట్టమాకురేవులో లైబ్రరీని ఏర్పాటు చేయడం. దానికి కె.యల్. పుస్తకసంగమం గా పేరు పెట్టాం. లైబ్రరీ కేంద్రంగా చదవడం, రాయడం, చర్చించడం లాంటి విషయాలు కొంతైనా జరగాలని కోరిక.
లైబ్రరీ కోసం పుస్తకాల సేకరణలో తొలుత గుంటూరు నుండి రావెల పురుషోత్తమరావు గారి పుస్తకాలతో శుభారంభం జరిగింది. పుస్తకాలు ఇవ్వడానికి ఇంకా ఎందరో మిత్రులు సూచనప్రాయంగా తెలియజేశారు. అలాగే, కవి దేశరాజు ఇచ్చిన 100కు పైగా పుస్తకాలను యింటికి వచ్చి మరీ వచ్చి యిచ్చి వెళ్ళారు.
రొట్టమాకురేవు గురించి ::
రొట్టమాకురేవు ఖమ్మం జిల్లాలో కారేపల్లికి అతి సమీపంలో వున్న అతి చిన్న పల్లెటూరు. పట్టుమని యాభై, అరవై ఇళ్లకు మించి వుండవు. పక్కనే పారే చిన్న బుగ్గవాగు. బుగ్గవాగు మీద రైలు వంతెన. డోర్నకల్ నుండి కొత్తగూడెం (భద్రాచలం రోడ్) ,మణుగూరుకు వెళ్లే రైళ్లు ఆ పట్టాలమీంచే వెళ్తాయి. మరో పక్క మాధవరం డొలమైట్ ను రవాణా చేసేందుకు కారేపల్లి నుండి మాధవరం వరకు వేసిన రైల్వే ట్రాక్.
ఊరు మొత్తం నాలుగు ఇళ్లు తప్ప అన్నీ గిరిజన కుటుంబాలే. ఎక్కువగా రైతుకూలీలు. కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు. ఇంకొందరు రైతుల దగ్గర జీతానికి కుదిరినవాళ్లు. కొందరు పనికి ఆహారపథకం కోసం పనులకు పోయేవాళ్లే !
తరచూ ఇల్లందు, ఖమ్మం వెళ్లి వస్తుంటారు. కారేపల్లి/ సింగరేణి కి అయితే రోజుకు ఒకసారైనా వెళ్లాల్సిందే ! అంత దగ్గర.
పాలు అమ్మడానికో, చేను మందులు కొనడానికో, ఏమీ పనిలేకపోయినా ఉబుసుపోక కూడా వెళ్లిరావాల్సిందే.
ఇక ఖమ్మం నుంచి ఇల్లెందుకు రోడ్డు. ముప్పై కి.మీ. ప్రయాణించాక కారేపల్లి క్రాస్ రోడ్. అక్కడినుంచి అయిదు కి.మీ. కారేపల్లి. కారేపల్లి నుండి ఒకటిన్నర కి.మీ.రొట్టమాకురేవు. ఆటోలు అటూఇటూ తిరుగుతుంటాయి.
ఇక్కడ ఈ రొట్టమాకురేవులో కవిత్వ అవార్డు ప్రదానం. పైగా ఊరు పేరుమీద అవార్డు. ఇలానైనా పల్లెల ప్రామినెన్స్ పెరగాలని, కేవలం నగరాలకు , పట్టణాలకు పరిమితం అవుతున్న కవిత్వం/సాహిత్యం పల్లెలకు చేరాలని, పల్లెలు చూడాలని, తద్వారా క్రొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో వినూత్నమైన దిశగా పల్లెలు అడుగులు వేయాలని ఎక్కడో, ఏదో చిన్న ఆశ.
ఈ దిశలో ఇదివరకే అడుగులు వేసినవారు లేరనికాదు, కానీ ఇప్పుడు ఇది కొత్త సందర్భం. కాబట్టి స్ఫూర్తినింపే దిశగా ఈ ప్రయోగం కొంతైనా పనిచేయకపోదా అనే ఆకాంక్ష.
అదీ సంగతి !
రొట్టమాకురేవుకు చేరే మార్గం:
Rottamaku Revu Library &Poetryspace
(RRLP)
Rottamaku Revu
Karepalli, Khammam Dist.

Links :http://magazine.saarangabooks.com/2015/10/08/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%AE%E0%B1%82%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8/

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...