అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

28 Jun 2011

యాకూబ్ కవితల సందుక.

ఒకానొకరోజు నాలో ఒక అక్షరం మొలిచింది.

అప్పుడు నేను గొర్రు తోలుతున్న మా నాన్న పక్కన
చేనులో వున్నాను.
 మొలుస్తున్న ఆ క్చణాలఅనుభవాన్ని అనుభవిస్తూనే ఉన్నా ,
 నాలో నేను అలా నాగటిచాలులా సాగిపోతూనే ఉన్నా.
  ఈ మధనం ఎలా గుర్తిన్చాడో నాన్న
 గొర్రు ఆపి నన్ను దుగం మీద కూచోపెట్టి
 'నీలో ఏం జరుగుతోంది బేటా!'తల నిమురుతూ అడిగాడు.

నాలోపలి అక్షరపు మొలక గురించి చెప్పాను
 విచ్చుకుంటున్న దాని రెమ్మల గురించి వివరించాను
 మొలకలోని రంగుల గురించి వర్ణించాను

వోపిగ్గా నా వైపే చూస్తూ
నా ముఖంలో మారుతున్న వెలుగుల్ని
గమనిస్తూ వీపు నిమిరాడు.
తలపైన జుట్టు సరిచేశాడు
"నేను చేనంత దున్ని గింజలు చల్లాల
 వానలు పడ్డాక మొక్క మొలుస్తుంది,పంట పండుతుంది .
 నాకు ఈ విద్య తెలుసు
 నా చిన్నపుడు నాలో ఈ విద్య మొలిచింది.
నీలోనేమో అక్షరం మొలిచే విద్య మొలిచింది"
 
 నాలోని ఈ విద్యను నమ్ముకున్నాక
 మన ఇంట్లోకి గింజలు రావడం మొదలైంది
 నువ్వు నీ అక్షరాన్ని నమ్ముకో!
 అక్షరం నిన్ను గింజగా మారుస్తుంది.
  మొలకెత్తుతూనే ఉండు
 పచ్చ పచ్చగా అందర్నీ పలకరిస్తూనే ఉండు,
నువ్వొక పంటపోలంలా మారు.
 నీ ఇంట్లో అక్షరాల గుమ్ములు నేను చూడాలి

 నేను,మా నాన్న ఇద్దరం
 ఇన్నాళ్ళు గింజల గురించి వీలైనప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నాం
 ఆరునెలల నుంచి నాతో మాట్లాడానికి
 నాన్న ఇక్కడ లేడు,పొలం దగ్గరా లేడు
 వెతుక్కుంటున్నాను
 నాలోపలి అక్షరాలతో మొరపెట్టుకున్తున్నాను
" నాలోపలి నాన్నని అక్షరంగా మలిచి నాకివ్వవా!"అని .













27 Jun 2011

దృశ్యమాల

వొక వసంతపు పగలు 
రెక్కలల్లార్చిన సీతాకోకచిలుకలు,నవ్వుతూ పూలు 
నేనో  వాయులీనాన్ని 
సితారాను,వేణువును...

గాలి నా నుంచి వీచడం నేర్చుకుంది 
తంత్రి  నెమ్మదినెమ్మదిగా నన్ను లోబర్చుకోవడం మొదలు పెట్టింది 
చేతివేళ్లు ఆశ్చర్యపరుస్తున్నాయి 
         నాకే తెలియని కదలికలతో ...

వసంతపు పగలు ఆవరించి 
ఉక్కిరి బిక్కిరి చేసిన సంగీతం 
కళ్ళల్లోకి వరుసగా దృశ్యమాల 
చెమర్చిన చూపులోకి తొంగిన ఇంద్రధనుస్సు !
శ్రుతిచేసి  ఉన్నాను 
ఇక  వసంతాన్నే విన్పిస్తాను..


#*#

రహాస్యం



పక్షి ఆకాశాన్ని చుడుతుంది
తన రెక్కలచట్రం లోకి ..
          రెక్కలు దాని ఆత్మవిశ్వాసం !

కొమ్మలు ఆకాశాన్ని
పగలనకా రాత్రనకా అలా చేతులు చాచి
పిలుస్తూనే ఉంటాయి
          వాటి కళ్ళల్లో ఆకుపచ్చని ఆత్మవిశ్వాసం !

సంవత్సరాలు కాలాన్ని
ఎడతెగక  వెం.. బ.. డి.. స్తాయి...
           జీవితం వాటి ఆత్మవిశ్వాసం
 ****
కదిలితే మెరుపులా మెరిసే
ఈ ఆత్మవిశ్వాసమే నాలోపలి రహాస్యం...
#*#
 2009

                                       

ఒక జన్మే!

ఉన్నదొకటే  జన్మ 

నవ్వినా ఏడ్చినా 
ఓడినా పోరాడినా సుఖించినా దుక్కించినా
ఉన్నదొకటే  జన్మ!

ఆ లోపలే చింతచిగురు కుప్పల్లా పిలిచే కోర్కెలు ,
కాగితాలకు చేరుకునే దారుల్లో  పయనిస్తున్న పదాలు,
నొప్పెట్టే పాదాలతో రాత్రుల్ని ఈదే 
దేహాల తీరనితనం ...

ఎవరైనా అడుగుతారా? ఏమైనా తెస్తారా?
ఇంకేం ఇస్తారు ?ఇంకేం అడిగి ఇచ్చి వెళతారు?

ఒక జన్మే తిరిగి రాదు 
తిరిగి మరల రానే రాదు 
 2009 

'' సరిహద్దు రేఖ "
 
 

 

26 Jun 2011

ఎడతెగని ప్రయాణం'

ఎడతెగని ప్రయాణం' 2009 లో అచ్చయింది.

ఆట

పాప ఆడుకుంటున్న బొమ్మను 
ఎవరో లాక్కెళ్ళారు 
లాగి విరిచి చెల్లాచెదురుగా విసిరేశారు 
 1 
దేహం మొత్తాన్ని తాగాలి 
తాగగా మిగిలినది దుక్కం.
సుఖించిన క్షణాలు ,సేదతీరిన కణాలు ,
దాహం వైపుకే మళ్లే రోజులు-
       రోజులగుబుర్లలో గుసగుసలాడే పక్షులు...

ప్రేమించడం ఒక దృశ్యం; ఒక కరుణ 
తనువుల తరువులు పుష్పించే రుతువు.
 2 
చెల్లాచెదురుగా విసిరిన కలలబొమ్మల్ని 
కలిసి ఏరుకునే పిల్లల ఆట 
     దేహమూ,సుఖమూ,దుక్ఖమూ,ఓటమి మరియూ  ప్రేమలూ........!
                                                                     
(సరిహద్దు రేఖ, పేజి.149 ; ప్రచురణ 2002 )

23 Jun 2011

నేను కవిగా 1986 లో మొదలయ్యాను.
 మొదటి కవితల సంకలనం 'ప్రవహించే జ్ఞాపకం'
రెండవ సంకలనం"సరిహద్దు రేఖ"
మూడవ సంకలనం"ఎడతెగని ప్రయాణం"

21 Jun 2011

M.F.HUSSAIN

ఎం. ఎఫ్ . హుస్సేన్

ఒక బొమ్మని
కళా కారుడు చుట్టుకుని , అల్లుకుని
కోర్కెలాంటి తామరతూడు రూపు దాల్చినట్టు

ఎన్ని అశ్వాలు:
అశ్వాల పదఘట్టనలు
ఆ వెనుక దాగిన రంగు రంగు నిద్రలు
పాదరక్షలు లేని భుమ్యయస్కాంత ముచ్చట్లు
1
సరస్వతిని
కుంచెల లోంచి కాన్వాసు భూమి మీదికి దింపినందుకు
చాందసుల చర్నాకోల దెబ్బలు తిన్నవాడా!
ఇంకా నీ కళల గుడ్లు
తొండగుడ్లలా చితికి పోలేదా?

సృష్టి , స్థితి , లయల కాన్వాసునిండా
పరుచుకున్న మన భారత దేశపు భూమి?

ఆ భూమి నీ చేసిన రంగులదానంతో
నవ్వినట్లు, పచ్చిక బయళ్ళపై ఆటలాడుకున్నట్టు
ఒక మతాతీత లోకమైనట్టు
ఒక వీడని కల

ఎన్నో మధురి హొయలు పోయే
నీ వెండి తీగెల్లాంటి జులపాల కదలికలేనా!

అమలిన ప్రేమల అర్దాలేనా
చిరిగి , ఆ పై విరిగి రక్తంలా గ్యాల్లెరీలో
ప్రవహించిన నీ రంగులేనా !

2

శిలలుగా మారిన మాకలలపైన
కొన్ని మిగిలిన రంగులు పోయరాదా
నిన్ను
మా పౌరుడిగా నన్నైనా ప్రకటించుకోనీరాదా
చిన్నప్పటినుంచి నీకోసం నే దాచుకున్న
నేమలీకలాంటి నా ఇష్టాన్ని మిగుల్చుకోనీరాదా!
నీ గుర్రాన్నీ
నా వాకిట్లో ఎప్పట్లాగే కట్టేసుకోనీరాదా!
……………………………………………………18-02-2001
యాకుబ్ …..”సరి హద్దు రేఖ” కవిత సంపుటినుండి

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...