అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

21 Apr 2016

యాకూబ్ కవిత్వం -నదీమూలం లాంటి ఆ ఇల్లు -లో ఏముంది ?



-జాషువా కలల కన్నీళ్ళ తడి ఉంది .
-మృత్యువును ప్రేమించే నిజమైన మిత్రుడికోసం అర్థం కానీ పాఠం ఉంది
-నీడ పక్కనే కలవర పెట్టే కలలు ,మనసును కప్పిన దిగుళ్ళు ఉన్నాయి
ఆకలి నిఘంటువులో అమ్మ అన్నం ముద్దకు అర్థం వెతికాడు
ఇవాల్టి నుంచి రేపటిలోకి విస్తరించే క్రమంలో ...కొంచెం తడిగా ,కొంచెం చిగురింతగా ,రేపటి మొలకై కన్పించాడు
చినుకు భాషకు చివరి అర్థం కోసం వ్యాకరణ సూత్రాన్ని కనుగొన్నాడు
చేతికి అంటిన అన్నం మెతుకుల ఎంగిలిగా ,వేళ్ళ మధ్య దాగిన కరువు మరకలా ..
ఏదో మిగిలి ఉన్నదానికోసం పలవరించాడు .
ఊపిరాడని జీవిత స్పర్శలో ఆప్యాయ తను ,ఆర్తినీ ,ఆవేదననూ పంచు కున్నాడు
అలవాటైన మర్యాద లాంటి కోర్కెను ఒకప్పటి మాటగా నెమరేసుకున్నాడు
ఈ మధ్య మనుషులుగా మిగిలున్న వారిని కలుసుకోవడానికి ప్రయత్నించాడు
నీమీద నీకు నమ్మకం తో పడిలేచే కెరటాలతో కసిగా చల్తే రహొ ..అన్నాడు
వదిలేసే ఆ సగం కోసమే చేరసాలల్లాంటి జీవితం గురించి తెలుసు కోవడం కోసం ,
ప్రయాణం మొదలు పెట్టాడు
ఇంకా ..ఇంకా ..బతికేవారికోసం ,ప్రేమించేవారికోసం ,భరించేందుకు
కవిత్వ ముందన్నాడు
బతుకు యుద్దమైన తెలంగాణా కోసం అనువదించుకున్న బతుకును వివరించాడు
చూపులో ఒంటరితనం ,నిశేబ్దం తో మాటల్ని కోల్పోయిన మనిషి తనం చూపించాడు
ఒక సెలవుదినం ముగిశాక ..అపురూపమైన రెక్కలు హటాత్తుగా మాయమయ్యాక
రెక్కలు తెగిన పావురంలా ,యంత్రంలా మారిపోయాడు
ఒకప్పటి అత్మన్యూనతంతా ఇప్పటి అసలు స్వరూపమే నని ఇప్పటి ప్రవాసం లో
అభిమానంగా చెప్పాడు
జీవించడమే వర్తమానంగా ,గతంగా ,ప్రయాణపు కొలమానంగా వివరణ ఇచ్చాడు
నువ్వొచ్చి వెళ్ళాక ..దినదిన గండం లాంటి మనసు బెంగను ,
ఇన్నేళ్ళ తర్వాత కూడా చెప్పుకోలేని బెంగను మనతో పంచుకున్నాడు
ఎంత దుప్పటి ఉందొ అంతే కాళ్ళు జాపాలి అన్నాడు
అదంతా జీవితమేగా !వాచీలులెని ,సైకిళ్ళు లేని ,ప్రేమేలేని యవ్వనంలో
మర్యాదలూ ,మన్ననలూ మసక మసక రేవులో మనం ఉదయించ లేదా అన్నాడు
అంత ఈజీ కాదు అనుకున్నట్లుగా అన్నీ అయిపోవడం .కన్నీళ్లు ,దుఃఖాలు ,సత్యాలు
అన్నీ ఉంటాయన్నాడు
మెలిపెట్టే బతుకును వడపోసి ,వంపి అక్షరాలుగా ఎత్తు కోవాలన్నాడు
నదీమూలం లాంటి ఆ ఇంటిలోకి వెళ్ళలేక పోవడమే క్షమించరాని నేరమన్నాడు
వెళ్ళలేక చింతిస్తున్నా ,దుఃఖిస్తున్నా ,కలవరిస్తున్నా ,అన్నాడు
ఆకుపచ్చ గాలిని ,అయ్యప్ప ఫణికర్ ముసి ముసి నవ్వుల్లా ,
సేదదీరిన జ్ఞాపకంగా పలవరించాడు
కవి సంగమానికి ఒక విత్తనం ఇచ్చాను ,అక్కడ వనమే మొలిచిందని
ఆనందపడుతున్నాడు
చెల్లెలు ఫోన్ లో ,అమ్మ లాంటి వదినతో సుదీర్ఘ సంభాషణ చేశాడు
తోడబుట్టిన వాడితో తనివిదీరా మాట్లాడలేని నిస్సహాయత ఉంది
లోపలి మైదానంలో --నిన్నటి అనుభవం ,ఎత్తు పల్లాలు ,గుంటలు
అలిసి ,సేదదీరి ,కలగలిసి ,విడివడి ..వంటరిగా మిగిలి పోవడం ఉంది
మళ్ళీ జన్మించి సరి కొత్తగా నీలోకి నన్ను ఓంపుకోవడానికి అక్షరాలా
పుడతా నంటాడు.సంక్షోభాల్లోంచీ గొంతు సవరించు కుంటనంటాడు
చిన్నప్పటి ముఖంలోంచీ తప్పిపోయిన అసలు ముఖాన్ని తెలుసుకోవాలని
ఆసక్తి కనబరుస్తాడు
కకావికల మైన జీవితం నిండా గాయాల గుర్తులను పసి కడ్తాడు .
కవిసమయం మారిందంటాడు
పాత్రలెవరూ లే కపోయినా నాటకం సాగిపోతూనే ఉందంటాడు
నిజంగా హృదయంతో కరచాలనం చేసే అనుభవం కావాలంటాడు
బొటన వేలుల్ని నరికేసినా కొత్తగా మొలవని కాలం పోయిందంటాడు
ఇసుక రేనువులకు విశేషత ఉందంటాడు
ఇవాళ రెక్కలు మనతో లేకపోవచ్చు ,జీవితపు అనుభవం మన ఆస్తి
మన బలంఅంటాడు
రాజకీయాన్ని పేజీలుగా తిప్పుకుంటూ తిరుగ రాసుకొంటున్నాం
జీవితం ఎప్పటికీ పాతబడకూడ దంటాడు
నమ్మకాన్ని ఓడి పోనీకుండా నిలబెట్టు కోవాలంటాడు
విధ్వంస కూడలి దిలషుక్ నగర్ ను స్మరిస్తాడు
జీవితానికి కొన్ని త్యాగాలు ,కొంత మానవత్వం అవసరమంటాడు
ప్రేమను ఒక ఉనికి గా అనువదించు కొమంటాడు
ప్రతి అడుగూ ఒక కవాతు ,ప్రతి నినాదం ఒక ఆకాంక్ష
జీవితం ఒక జ్ఞాపకాల పెట్టే .వెన్నంటి వుండే అమ్మ ఒక
ధిక్కార స్వరం అంటాడు
ప్రతి పోరనూ విడదీసుకుంటూ సాగడం ,అలిసి పోకుండా గమ్యం చేరాలంటాడు
వంచనల మధ్య రాటుదేలి ,కలుపుగోలుగా సాగిపోవాలంటాడు
నిన్ను నీవు వెతుక్కోవడమే ఇక మిగిలింది ,మిగతా అంతా యధాతధం
ఇదీ యాకూబ్ కవిత్వం
ఇదీ యాకూబ్ హృదయ వాదం
అక్షరాన్ని నమ్ముకున్న ,గింజలు గా మిగుల్చు కున్న కవిత్వం
మొలకెత్తే ఆ గింజలే పంటపోలమైన కవిత్వం
చెట్లు గా విస్తరించిన కవిత్వం
ఇది కవి యాకూబ్ పై నా అవగాహనా పత్రం !!

~ డా. రాధేయ 
ఫిబ్రవరి 18 ,2016

2 comments:

  1. ఓటమిని పదాల పెదవి పూజిస్తే
    పరిస్టితి ప్రయోగాల వలలో నీ
    ఉనికిని వెతికిన నిమిషాన్ని నీ
    మనసున బంధించే మనిషిని
    ఎవరని మాత్రం అడక్కే నా నీడ.

    తెరచాటు సరదాల్లో - కల్పన

    ReplyDelete
  2. ఓటమిని పదాల పెదవి పూజిస్తే
    పరిస్టితి ప్రయోగాల వలలో నీ
    ఉనికిని వెతికిన నిమిషాన్ని నీ
    మనసున బంధించే మనిషిని
    ఎవరని మాత్రం అడక్కే నా నీడ.

    తెరచాటు సరదాల్లో - కల్పన

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...