అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

4 May 2016

మాట్లాడాడు...మాట్లాడాడు..మాట్లాడుతూనే ఉన్నాడు..

Kavi Yakoob 





నరేష్కుమార్ ఎస్.
March 2,2016
మాట్లాడాడు...మాట్లాడాడు..మాట్లాడుతూనే ఉన్నాడు... ఒక వేపచెట్టూ, మేమూ..అప్పుడప్పుడూ మొక్క జొన్న పైరు మీదినుంచి వీచే గాలీ... చుట్టూ వెలుతురుని దాచేసిన చీకట్లో పాడే కీచురాళ్ళు.... ఆ రాత్రంతా ఆయనా నేనూ అలా కూర్చునే ఉన్నాం ... మరిచిపోలేని ఙ్ఞపకాల్లో ఆరోజు కూడా ఒకటి..

//ఒక జీవించాక//

అతనిప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు
ఒక జీవితపు ఒడ్డున కూర్చుని బతుకు ప్రవాహంలో కాళ్ళనాడిస్తూ
మాట్లాడే చెట్టులా లేదూ ఒక ప్రాచీన భాషలా తన కతని
చెప్తూనేఉన్నాడు
తెరలు తెరలుగా తన బాల్యపు ఙ్ఞాపకాల్లోని
కొన్ని అమ్మచేతి దెబ్బలని మళ్ళీ అనుభవిస్తున్నంత
అనుభూతితో అలా చెప్తూనే ఉన్నాడు
"నాకు మాట్లాడే ఒక మనిషి కావాలి" అంటూ
ఎప్పట్లానే సంభాషణని మొదలుపెట్టాడు

కొన్ని వాలిపోయిన గోడల్లాంటి మనుషులని కౌగిలించుకుంటూనే
అలసిన ఆ ముసలి దారులని దుప్పటిలా మడతేసుకుంటూ
పశువుల వెంట కావలి కుర్రవాడిలా కొన్ని క్షణాలు జీవించాక
కొల్పోయిన తండ్రిని గుర్తు తెచ్చుకొని
రెండు కన్నీటి బిందువులపాటు నిట్టూర్చాడు
ఆవుపాలంత స్వచ్చంగా కాదుగానీ పంటచేల కావలి రాత్రులంత చిక్కని చీకటిగా..
లేదూ..! ఎండాకాలపు సెగలు కక్కే రోడ్డుని పొలినంత నల్లని,
అమాయకపు ప్రేమలని చెప్తూ
ఒక వాగుఒడ్డు పై కూర్చుని
వచ్చీపోయె నేలలని ఆప్యాయంగా పలకరించాలనే
ఒక పచ్చి చిగురాకు నీడలా
చలించిపోతూనే ఉన్నాడు

ఆ వేపచెట్టుని కౌగిలించుకుని ఆ పాత ఇంటివాసనతో
తడిసినగోడల వాసనతో మొహం కడుక్కుంటూ
తనలా అచ్చంగా తనలా జీవించే కథని మళ్ళీ
జీవిస్తూ.....
మొక్కజొన్న చేల మీదుగా వచ్చిన రైలుశబ్దంతో
కలిసిపోతూ మళ్ళీ మళ్ళీ నాట్యం చేస్తూ
చె
ప్తూ
నే

న్నా
డు....
బహుశా...! అతనికి ఇక్కడ... ఆ చిన్న ఊరిలో ఉన్నప్పుడు
శ్రోతలెవరూ అవవసరముండదేమో
అతను తననుతాను ప్రేమించటానికి
లేదూ...! చుట్టూ ఉన్న మనుషులని ప్రేమించటానికి తన కథగా జీవిస్తూండవచ్చు...
కొందరు మనుషులుగా విడిపొయిన ఒక్క జీవితాన్ని మళ్ళీ వాంచిస్తూ ఉండవచ్చు....
అతనా ముప్పై ఇళ్ళ కుగ్రామాన్ని ఒక ప్రపంచంగా మలుచుకునే
శిల్పిగా ఒక జన్మని కోరుకొనీ ఉండవచ్చు...
ఆ పిల్లిగెడ్డపు వ్యక్తి...! నేనూ అవొచ్చు లేదా ఒక పల్లెని విడిచిన నువ్వూ ఐ ఉండవచ్చు....


(ఒక్కరోజు యాకుబ్ గారి గ్రామం రొట్టమాకు రేవులో రాత్రిపూట వేపచెట్టుకింద ఆయనతో మాట్లాడాక)

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...