అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

4 May 2016

కుంకుడు చెట్టు - పచ్చని చెట్టు

కవిసంగమం 


మూడు తరాల కవిత్వపఠనం, లక్షల కొద్దీ కవితలు, ఎందరెందరో కొత్త కవులు ఇది కవిసంగమం వర్తమాన సాహిత్యనిధికి అందజేసిన సిరి సంపద. ఈ మాట అందరికీ తెలిసిందే ఈ ప్రంపంచీకరణ రోజుల్లో కవిత్వంతో పాటూ ఇక్కడ కొన్ని స్నేహాలు బంధుత్వాలై కలవడం మరో ఆసక్తికర చారిత్రిక పరిణామం., ఇందుకు "నీవొక పచ్చని చెట్టైతే పిట్టలు వాటంత అవే వచ్చి వాలేను" అంటూ ఆహ్వానించిన పిలుపే సాక్షం.
కవిసంగమం నెలవారీ సభలకి వచ్చిన సీనియరు కవులు పుత్రోత్సాహంతో మురిసిపోవడం మనం చూస్తూనే ఉన్నాం, అదే సమయంలో కొత్త కవుల కళ్ళలో మెరుపు ఎన్ని సాయంత్రాలని దేదీప్యమానం చేసిందో ఎంత చెప్పినా తక్కువే, ఇంటికి తిరిగి వెళ్ళి పచ్చని చెట్టు పంచిన జ్ణాపకాలని కవిత్వంలో ప్రాణ వాయువుగా నింపి ఈ సాహితీ చారిత్రక ఘట్టాలని కవితల రూపంలో పొందుపరచడం కూడా మనం చూస్తున్నాం.
తొలినాళ్లలో వెళ్దాం అని కుదరక "ఈ-శనివారం" అని నేను రాసుకున్న కవిత. "నా లామకాన్ గోల" యశస్వీ సతీష్ కవిత, తదుపరి బాల సుధాకర్ మౌలి రాసుకున్న అపురూప వ్యాసం, నా చెల్లెలు తోట నిర్మలా రాణి రాసిన కవిత, ఇప్పటి కుంకుడు చెట్టు ఇదే కోవకి చెందినవే, రాసిన నాలుగైదు కవితల్లో విభిన్న కొణాల్ని వస్తువులని తీసుకోవడం తనదైన ఓ ప్రత్యేక ముద్రతో Indus Martin రాసిన "కుంకుడు చెట్టు" పసిరి వాసన వేసి కవి పరిణితిని పచ్చగా మన ముందుంచింది.
ఎత్తుగడలో ప్రపంచీకరణ గుర్తు చేస్తూ, భారతీయ నాగరికత మూలాలని ఇతర ప్రాశ్చాత్య దేశాల కంటే ముందుగా నడిచిన మన గతాన్ని గుర్తుచేసింది. ఆరునెలల క్రితం కుంకుడు కాయ వాసన వస్తోందని కొన్న tresmee shampoo గుర్తుకొచ్చి టెంకిజెల్ల కొట్టినట్టు ఐంది.
రెండు మూడు పేరాలలో పాఠకుడుని కవితలోకి తీసుకెల్లిన తీరు బలే ముచ్చటేసింది,అక్షరాలని "నిఖార్సైన నల్లని కాయలతో" అని పోల్చినప్పుడు, మరీ ముఖ్యంగా మూడో పేరా చదవగానే కవిని పొగడకుండా ఉండలే కదూ...
నాలుగో పేరాలో "ఎన్ని తరాల తలల మురికినీ
తేటనైన నురగలో ప్రక్షాళన చేసాయో ఆ ఫలాలు" అంతర్లీన సూక్ష్మ విమర్స చేసి ఫలాలు అనడం, కొంత విస్మయాన్ని కలిగించి శభాష్ అనిపిస్తుంది.
ఐదో పేరాకి వస్తే తెలుగు వైభవం ఎన్ని ఆటుపోట్లకు గురైందో చెప్పి "ఇప్పటికీ నిలబడే ఉంది తనను కన్న గడ్డపై" అన్నప్పటికీ "తెల్ల తుఫానులు" అన్నపదం నాకెందుకో "తెల్ల పాములు"గానే కనపడింది నాలుగైదు సార్లు చదివినప్పటికీ....మొదటి రెండు పేరాలు నేను ఎందుకు రాయవలసి వచ్చిందో కవిత చివరికి వచ్చారుగా ఆరో పేరాతో మీకే అర్ధం ఐవుంటుంది.
తెలుగు భాష మరియు సాహిత్యాన్ని అత్యంత ప్రేమించే " Indus Martin " ఇప్పటికే "అనగనగా" అంటూ తన ప్రయత్నంతో సఫలీకృతం చెందాడు. ఈ బాటసారికి కవిత్వం కొత్తో పాతో తెలియదు కానీ ఇతనిలో ఓ సహజ కవి దాగున్నాడన్న మాట నిఖర్సైన సత్యం. కవి.మార్టిన్ మరిన్ని సామాజిక ప్రయోజన కవితలతో వర్తమానానికి తలంటాలని కోరుకుంటూ...మరో కవిని తెలుగు సాహిత్యానికి అందించిన కవిసంగమానికి అభినందనలు.కృతజ్ణతలు.....మీ మూడో వేప చెట్టు...
మార్టిన్//కుంకుడుచెట్టు// 24 నవంబర్ 2014
ఇప్పటి ఇంగ్లీష్ షాంపోలు రాకముందునుండీ
అమేరికన్ కండీష్నర్లు రసెల్స్ దుకాణాల్లో
అమ్మబడడానికి పూర్వంనుండీ
ఇక్కడేవుంది ఈ కుంకుడు చెట్టు
నిఖార్సైన నల్లనికాయలతో నిటారైన దేహంతో
ఎంత దర్పంగా వెలిగిందో
ఆంధ్రభోజులూ, అతిధి బ్రౌన్లూ
ఎంత శ్లాఘించారో దీని సరళసౌందర్యాన్ని
ఎందరు తిక్కనలు ఏతాళ్ళపాక నుండో తెచ్చ్చిన
గుండ్రాళ్ళకింద మెత్తగానలిగి
ధూర్జటుల జటిలహస్తాలలో పిసకబడి
ఎన్నెన్ని తరాల తలల మురికినీ
తేటనైన తమ నురగల్లో ప్రక్షాళన చేశాయో ఆఫలాలు
ఏంవైభవం దానిది... ఏచీడలూ పట్టలేదు దానికి
ఏసముద్రాలు దాటి ఎన్నిరాలేదూ తెల్లతుపానులు?
ఖైబరు కనుమలుదాటి రాలేదా ప్రళయాలు?
విప్పత్తులను దాటి, ఆపత్తులకు నిలచి
ఇప్పటికీ నిలబడేవుంది తననుకన్న గడ్డపై
ఇప్పటికీ ఈ చెట్టుకొమ్మలక్రింద కూర్చుని
ఏ శారదమ్మో తన సి.వి. రాసుకుంటూనేవుంది
ఏరాజో తన కాశీమజిలీ కథల్ని మననంచేసుకుంటూనే వున్నాడు
ఏ యశశ్వో తపస్విగా మారి
ప్రయోక్తగేయాల్ని జపిస్తూనే వున్నాడు
ఏ వీరఫాండ్య 'కట్ట 'బ్రహ్మన్నో అక్కడ చేరిన పిట్టల పాటల్ని
'వాహ్', 'ఖూబ్' అంటూ ఆనందిస్తూనే వున్నాడు
ఏ రా(రాం)కుమారుడో గోలచేస్తున తుంటరి వుడుతల్ని
ప్రేమతో అదిలిస్తూనే వున్నాడు
అటుగా వచ్చిపోయే ఏబాటసారో తనకథను
అనగనగా అంటూ కొనసాగిస్తూనే వున్నాడు
బంగారువాకిళ్ళలో జరుగుతున్న సంగమాల సాక్షిగా
కుంకుడు చెట్టు కొత్తపూత వేస్తూనేవుంది
In the fond memories of "Poetry Reading' conducted under a soap-nut tree in Golden Threshold last night ...!

~
వర్మ కలిదిండి 
Nvmvarma Kalidindi

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...