అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

4 May 2016

నిదురలో నిదురించాలి !


లైట్లన్నీ ఆర్పేసిన చీకటిగదిలా మనసు .
భూమ్మీద చివరిసారిగా నృత్యంచేస్తున్న మనిషిలా
వీస్తున్న గాలి.
రంగుల్ని తుడిపేశాక, రూపాల్ని తుడిచేసాక
మిగిలిన గోడలా గతం.
సమాంతరంగా గడిపే భ్రమల క్షణాల్లో
రూపుకట్టని జీవితం.
నిజమైన ప్రపంచం లోపలెక్కడో ఉంది.
లోపలికి ప్రయాణించే దిగుడుబావి మెట్లు
కానరావు ఎంతకీ .
*
*
ఎక్కడివో కలలు :
ఎవరివైనా కానీ, కలలు నిదురలోకి ప్రవేశించాలి అసలు.
లోపలి లోయలోకి నువ్వైనా నేనైనా కొన్ని ఆకులతో ,కొన్ని పూలతో
ప్రవేశించాలి.
నక్షత్రాలమై ఆకాశం నిండా పరుచుకోవాలి మిణుకు మిణుకుమంటూ.
*
ఆ అద్దం ముందునుంచి చూపులు తిప్పి
అసలు దేహరహస్యమేదో కనిపెట్టాలి .
రహదారుల్లో మిగిలిన నలిగిన అడుగుల్లోకి
మనమిక అడుగుల్లా దూరాలి .
చివరిక్షణాల ఒంటరితనంలో
ఒకింత మనుషులమై , అల్పులమై ఆదమరచాలి.
విశ్రమించాలి , నిద్దురలో నిదురించాలి. నిదురించాలి.
*
11.2.2015

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...