అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

4 May 2016

కవిత్వ నిబద్ధత


కవి యాకూబ్ 
Wahed Abd
March 2
సాధారణంగా పుట్టిన రోజుల పట్ల పెద్దగా ఆసక్తి నాకు లేదు. అందువల్ల చాలా మంది మిత్రుల కోపతాపాలు కూడా భరించవలసి వస్తుంది. పుట్టినరోజులు గుర్తు పెట్టుకుని శుభాకాంక్షలు చెప్పడం చాలా మంది చాలా శ్రద్ధగా చేస్తారు. కాని పుట్టినరోజు జరుపుకునే అలవాటే లేని నాకు మిత్రులకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలన్న స్పృహ కూడా సహజంగా ఉండదు కదా.
కాని నా ఈ అలవాటు ఈ రోజు చాలా బాధపడేలా చేసింది. ఫేస్బుక్ తెరిచి చూడగానే అన్న యాకూబ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా మంది పెట్టిన పోస్టులు చూసి కాస్త సిగ్గుపడ్డాను. నేను ముందుగా శుభాకాంక్షలు చెప్పవలసిందే అనిపించింది. ఆలస్యమైనా సరే ఇప్పుడు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు యాకూబ్ తో నా పరిచయాన్ని కాస్త నెమరువేసుకుంటూ మీతో పంచుకోవాలనిపించింది.

యాకూబ్ ... ఈ పేరు మొదట నేను విన్నది, తెలుగులో ఎలా రాయాలో నాకు నేర్పిన గురువుగారు మలిక్ గారి నోట. బహుశా 1992లో అనుకుంటాను, అప్పటికి నేను గీటురాయి వారపత్రికలో పనిచేస్తున్నాను. మలిక్ గారు ఎడిటర్. ఒక రోజు సాయంత్రం ఆయన ’’ఈ వాళ యాకూబ్ పుస్తకావిష్కరణ ఉంది, నేను వెళుతున్నా, నువ్వు వస్తావా‘‘ అన్నారు. నాకు మ్యాగజైన్ పని పూర్తి కాలేదు కాబట్టి రాలేనన్నాను.
క్యాఖూబ్ అనిపించుకున్న యాకూబ్ అని ఆ తర్వాత ఆయన రాశాడు. చేరాతలు శీర్షికన చేకూరి రామారావు గారు రాసిన వ్యాసంలోను యాకూబ్ ను అలాగే అభినందించారు ’’బహుత్ ఖూబ్ యాకూబ్‘‘ అన్నారాయన. అలా యాకూబ్ పేరు నాకు పనిచయమైంది అప్పుడు ఆవిష్కరణ జరిగిన పుస్తకం ’’ప్రవహించే జ్ఙాపకం‘‘
గీటురాయి కార్యాలయానికి అప్పట్లో దేవిప్రియగారు తరచు వస్తుండేవారు. మలిక్ గారికి ఆయనకు మధ్య చాలా గాఢమైన స్నేహం. దేవిప్రియ గారితో పాటు చేకూరి రామారావు వంటి పెద్దలు కూడా వస్తూ ఉండేవారు. అలా యాకూబ్ కూడా గీటురాయి కార్యాలయానికి రావడం, ఆయనతో పరిచయం, స్నేహం దశాబ్ధాలుగా కొనసాగుతున్నాయి.

యాకూబ్... కేవలం మిత్రుడు మాత్రమే కాదు, స్వంత అన్నలాంటి వాడైపోయాడు. ఇన్ని దశాబ్ధాల కాలంలో ఎప్పుడు కలిసినా అదే అప్యాయత.. అరేయ్.. అంటూ పిలిచే పిలుపులో అదే ప్రేమ. ఆయన మాట్లాడుతుంటే తొలకరిలో నేల గుబాళింపులాంటి అనుభూతి. యాకూబ్ ఒక కవి మాత్రమే కాదు, ఇన్ని సంవత్సరాల పరిచయంలో ఆయన ఒక కవిగానే కాదు, ఒక కవితగా బతుకుతున్నట్లే నాకు కనబడింది.
అట్టడుగు స్థాయిన నుంచి వచ్చిన వాడు, మట్టి విలువ తెలిసినవాడు, ఉడుకుతున్న అన్నం మెతుకు వాసనలాంటి వాడు. ఈ రోజు అధ్యాపకుడిగా, కవిగా పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నప్పటికీ తాను అనుభవించిన జీవితాన్ని, గతాన్ని, గతంతో తన అనుబంధాన్ని, ఒక్క క్షణం పాటు కూడా మరువని కవిత్వ ప్రవాహం యాకూబ్.
కవిత్వం రాయడమే కాదు, తెలుగు కవిత్వాన్ని, వర్ధమాన కవులను ప్రోత్సహించడానికి ఆయనెల్లప్పుడు చాలా ఆసక్తి చూపించేవాడు. కవిసంగమం గురించి మాత్రమే కాదు నేను చెప్పేది. నాకు యాకూబ్ పరిచయం అయినప్పుడు కవిసంగమం కాదు కదా అసలు ఇంటర్నెట్ వాడకమే పెద్దగా లేదు. అప్పుడు కూడా ఒకటి రెండు నా కవితలు చదివి ఇంకా రాసేలా ప్రోత్సహించేవాడు. ఎవరైనా ఒక మంచి కవిత రాస్తే అదేదో ఆయనే రాసినంతగా సంబరపడిపోవడం, కవిగా ఎవరికైనా పేరు వస్తే ఆ పేరేదో తనకే వచ్చినట్లు సంతోషపడిపోవడం బహుశా మరెవ్వరూ చేయలేరేమో. దశాబ్ధాలుగా యాకూబ్ నాకు అలాగే తెలుసు. దశాబ్ధాలుగా ఆయన స్వయంగా కవిత్వం రాయడం, తెలుగు కవిత్వంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు, తెలుగు కవిత్వంపై తనదైన ముద్ర వేశాడు. మరోవైపు అనేకమందిని కవిత్వం రాసేలా ప్రోత్సహిస్తూ వచ్చాడు. కవిత్వాన్ని ప్రోత్సహించాలన్న ఆయన తపన ఎలాంటిదంటే, ప్రతి మార్గాన్ని, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసేవాడు. 
kavisangamam

ఇంటర్నెట్, ఫేస్ బుక్ వచ్చిన తర్వాత ఫేస్ బుక్ వేదికగా తెలుగు కవిత్వాన్ని ప్రోత్సహించగలమన్న ఆలోచన ఆయనలో కలిగిందంటే దానికి కారణం ఆయనలో ఉన్న ఈ తపనే. కవిసంగమం పేరిట ఒక ఫేస్ బుక్ గ్రూపు ప్రారంభించాడు. తెలుగులో కవిత్వం రావడం లేదు. తెలుగులో కవిత్వానికి భవిష్యత్తు లేదనుకునే సమయంలో కవిసంగమం ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. తెలుగులోకవిత్వం పట్ల ఎంత ఆసక్తి, ఆదరణ ఉందో కవిసంగమం నిరూపించింది. ప్రతినెల రెండవ శనివారం కవిసంగమం పొయట్రీ రీడింగ్ కార్యక్రమాలను తన స్వంత ఖర్చులతో నిర్వహిస్తూ తెలుగులో ఒక కవిత్వ వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే కాదు, ఏటా కవిత్వ పండుగలను కూడా, ఖర్చుకు వెనుదీయక నిర్వహించిన ధైర్యం యాకూబ్ ది. ఇతర భాషల్లో లబ్ధప్రతిష్ఠులైన కవులను ఆహ్వానించి నిర్వహిస్తూ వస్తున్న కవిత్వ పండుగలు తెలుగులో కవిత్వం భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉందో నిరూపించాయి. బుక్ ఫెయిర్లలో కవిత్వ పుస్తకాలు విరివిగా అమ్ముడు కావడం ప్రారంభమయ్యింది. కవిత్వాన్ని ఆదరించేవారి సంఖ్య పెరిగింది. కవిత్వం చదివేవారి సంఖ్య పెరిగింది. కవిత్వం రాసే వారి సంఖ్య పెరిగింది. కవిసంగమంలో కొత్త కొత్త శీర్షికలు ప్రవేశపెట్టి అనేకమందిని ప్రోత్సహించి ఆ శీర్షికల్లో రాసేలా చేయడం ద్వారా వర్ధమాన కవులకు చాలా ఉపయోగకరంగా మారింది. నెల నెల నిర్వహించే పొయట్రీ రీడింగ్ కార్యక్రమాల్లో మూడు తరాల కవులు కలుసుకోవడం, వర్ధమాన కవులకు సీనియర్ కవుల సలహా సూచనలు లభించడం, వారికి అవసరమైన ప్రోత్సాహం దొరకడం ఇవన్నీ తెలుగులో కవిత్వ పూదోట మళ్ళీ వికసించడానికి కారణమయ్యాయి.
నేను అనేక సార్లు చెప్పినట్లు నేడు నేను కవిత్వం రాయడానికి కారణం కూడా యాకూబే. ఎప్పుడో తొంభైలలో కవిత్వం రాసిన నేను ఆ తర్వాత బతుకు పోరాటంలో కవిత్వానికి దూరం కావలసి వచ్చింది. కవిసంగమం ప్రారంభించిన కొత్తలో నా వ్యక్తిగత పనిమీద యాకూబ్ ను కాలేజీలో కలవడానికి ఒకసారి వెళ్ళాను. నా పని చేసిపెడుతూ, ల్యాప్ టాప్ తెరిచి కవిసంగమం గురించి పూర్తి డెమో ఇచ్చాడు. అప్పుడు నేను టి.వీ.మీడియాలో పనిచేస్తున్నాను. కవిసంగమం గురించి చెప్పిన యాకూబ్ నువ్వు మళ్ళీ కవిత్వం రాయి. రాయడం ఎందుకు ఆపేశావు అని తనకు సహజంగా నాపై ఉండే అభిమానంతో కాస్త కోపంగానే చెప్పాడు. కానీ, నాకున్న పని ఒత్తిళ్ళ వల్ల అప్పట్లో నేను కవిసంగమంలోకి రావడం కాని, కవిత్వం రాయడం కాని జరగలేదు. 

ఆ తర్వాత రెండు సంవత్సరాలకు కాని నేను కవిసంగమం గ్రూపును చూడలేదు. చూడగానే ఇంతమంది కొత్తవాళ్ళు కవిత్వం రాస్తున్నారా అని ఆశ్చర్యం కలిగింది. నేను ఎప్పుడో రాసిన ఒక కవితను పోస్టు చేశాను. వెంటనే దానికి ప్రతిస్పందనలు వచ్చాయి. ఇది ఇంటర్నెట్ ఫాస్ట్ యుగం, పత్రికలో కవిత అచ్చయ్యేవరకు ఆగవలసిన పనిలేదు. ఆ తర్వాత దానిపై ప్రతిస్పందనల లేఖలు ప్రింటయ్యే వరకు వేచి ఉండవలసిన పని లేదు. ఇదేదో బాగుందే అనిపించింది. కవిసంగమంలో ఒకటి రెండు కవితలు, కొన్ని గజల్సు రాసిన వెంటనే యాకూబ్ ఉర్దూ కవిత్వాన్ని తెలుగులో అనువదించి ఇవ్వవచ్చు కదా అని కొత్త ప్రతిపాదన పెట్టాడు. ప్రతిపాదన పెట్టడం మాత్రమే కాదు, చేయిపట్టి రాయించినంత పని చేశాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కవిత్వం పట్ల ఆయనకున్న నిబద్దత. ఇరవై నాలుగు గంటలు కవిత్వాన్ని శ్వాసిస్తుండడం వల్లనే ఆయన నాతో ఏం రాయించాలన్న విషయమై ఆలోచించగలిగాడు. ఆ విధంగా కవిసంగమంలో రాయడం వల్లనే నేడు ఫైజ్ అహ్మద్ ఫైజ్ పైన ఒక పుస్తకం అచ్చయ్యింది. మక్దూం పై మరో పుస్తకం అచ్చుకు సిద్ధంగా ఉంది. కొత్త కవుల కవిత్వాన్ని నారాయణశర్మ వంటి విమర్శకుడితో విశ్లేషణ చేయించి, ఈనాటి కవిత శీర్షికన కవిసంగమంలో రాయించడం, ఆ విశ్లేషణలన్నీ పుస్తకంగా అచ్చేయించడం ఇవన్నీ ఆయనకు కవిత్వం పట్ల ఉన్న మక్కువకు నిదర్శనాలు. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. తెలుగు చేసిన యాకూబ్, హైదరాబాదులో తెలుగు పండిత శిక్షణ కూడా పొందాడు. రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠం నుంచి ’’తెలుగు సాహిత్య విమర్శలో రారా మార్గం‘‘ అనే అంశంపై పరిశోధనా పత్రం రాసి ఎం.ఫిల్ పట్టా పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ’’తెలుగు సాహిత్య విమర్శ ఆధునిక ధోరణలు‘‘ అనే అంశంపై పిహెచ్డీ చేశాడు.
తెలుగులో కవులను కవిత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలతో పాటు తన కవిత్వాన్ని కూడా అశ్రద్ధ చేయలేదు. ప్రవహించే జ్ఙాపకం తర్వాత సరిహద్దు రేఖ, ఎడతెగని ప్రయాణం, నదీమూలం లాంటి ఇల్లు కవిత్వ సంపుటులు వేశారు. తెలంగాణ సాహిత్య విమర్శ పేరుతో సాహిత్య వ్యాసాలు రాశాడు.
ఫ్రీవర్స్ ఫ్రంట్, రంజనీ కుందుర్తీ అవార్డు, ఎస్.వి.టి.దీక్షితులు అవార్డు, అమిలినేని లక్ష్మీరమణ స్మారక ధర్మనిధి పురస్కారం, కె.సి.గుప్తా సాహిత్యపురస్కారం, డా.సి.నా.రె.కవితాపురస్కారం, నూతలపాటి గంగాధరం సాహిత్యపురస్కారం, ఉత్తమ కవిత్వం అవార్డు , రాష్ట్ర ఉత్తమకవి అవార్డులు అందుకున్నాడు.
కవిత్వాన్ని ప్రోత్సహించడమే కాదు, పల్లెల్లో గ్రంథాలయాలను, కవిత్వ పఠనాన్ని ప్రోత్సహించాలని నడుం కట్టి తన స్వంత ఊరు రొట్టమాకు రేవులో ఆ కార్యక్రమానికి పునాది వేశాడు.
రొట్టమాకు రేవు ఒక మారుమూల పల్లె. దానికి కవిత్వ ప్రపంచంలో ఒక గుర్తింపు ఇవ్వాలనుకున్నాడు. ఆధునికత పెరిగిపోయిన మనం మన వేర్ల నుండి దూరమైపోతున్నామన్న బాధ యాకూబ్లో ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. మనం మన ఊళ్ళ నుంచి ఎంత దూరం వెళ్ళిపోయినా ఊరు మనకు అంత దగ్గరగా వస్తూనే ఉంటుంది. ఎన్నెన్నో జ్ఙాపకాలు రొట్టమాకు రేవులోని బుగ్గవాగులా సదా మదిలో పారుతూనే ఉంటాయంటాడు యాకూబ్. 

కేరళలోని తుంచన్ కవి స్మారకంగా కట్టిన తుంచన్ మెమోరియల్ ట్రస్ట్, కుమారన్ ఆసన్ స్మారక కేంద్రం, హైదరాబాదులోని లామకాన్, గోల్డెన్ థ్రెషోల్డ్ లను చూసిన తర్వాత యాకూబ్ మదిలో రొట్టమాకు రేవును కూడా ఒక సాహిత్య కేంద్రంగా మార్చాలన్న ఆలోచన వచ్చింది. కేరళ, కర్నాటక, ఉత్తరభారత దేశాల్లో గ్రామీణ సాహిత్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో పల్లెలు సాహిత్య కేంద్రాలుగా ఎదగాలని కలగన్నాడు. ఆ కలను సాకారం చేయడానికి రొట్టమాకు రేవులో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక కేంద్రం ఏర్పాటు చేయాలనుకున్నాడు. అనేక ప్రాంతాలకు, పల్లెలకు ఒక కల్చరల్ పొయట్రీ స్పేస్ గా ఇది స్ఫూర్తి నివ్వాలన్నది ఆయన ఆలోచన. కవిత్వం రాయడం, చదవడం మాత్రమే సరిపోదు ఒక కవిత్వ వాతావరణాన్ని ఏర్పరచుకోవాలంటాడు యాకూబ్. అదొక ప్రక్రియలా నిరంతరం కొనసాగుతూ ఉండాలంటాడు. అందుకే రొట్టమాకు రేవులో ఒక గ్రంథాలయాన్ని, ఒక పొయట్రీ స్పేస్ ఏర్పాటు చేసి, రొట్టమాకు రేవు కవిత్వ అవార్డులను కూడా ప్రకటించాడు. తన తండ్రి షేక్ ముహమ్మద్ మియా, కే.ఎల్.నరసింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డులను అక్కడ ప్రతి సంవత్సరం ప్రకటించడం ప్రారంభించాడు. ఒక మారుమూల పల్లె పేరుతో అవార్డుల కార్యక్రమం జరపడం వల్ల పల్లెలకు సాహిత్య ప్రపంచంలో ప్రాముఖ్యం పెంచాలన్నదే ఆలోచన.
సౌభాగ్య, అరుణ్ సాగర్; షాజహానా, నందకిశోర్, నందిని సిధారెడ్డి, మోహన్ రుషి, హిమజలకు అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. 

పేరులోనే కవిని చేర్చుకుని కవిత్వంగా బతుకుతున్న యాకూబ్ తెలుగు కవిత్వంలో అక్షరమై వెలుగొందుతున్నాడు. ఈ అక్షరం మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని, తెలుగు కవిత్వానికి మరింత శోభ సంతరించాలని మనసారా ఆశిస్తూ....పుట్టిన రోజు శుభాకాంక్షలు.

~ వాహెద్ 
మార్చి 2, 2016 

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...