అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

4 May 2016

జయహో కవిత్వం ..


అంతర్జాల ప్రపంచంలో
ఏమీ తోచక అటూ ఇటూ తిరుగుతుంటే
ఒక చెట్టు కనిపించింది ...
ఫలవంతమైన ఎన్నో కొమ్మలు ఉన్న
ఆ చెట్టుకింద కూచుందామని వెళితే
ఒక్కొక్క కొమ్మ నుంచి ఒక్కో నవ కవి చేతిలోంచి
జాలువారిన కవిత పలకరించింది ...
* * *
అతడి వైద్యం స్వస్థత చేకూరుస్తుందో
లేక అతడి కవిత్వం పరవశింపజేస్తుందో
అటు వైద్యం, ఇటు కవిత్వం - రెండింటితో
స్వాంతన కలిగిస్తున్న విరించికి జయహో
* * *
తన స్మృతి పథంలోకి మననూ లాక్కెళ్ళి
అప్పటి జీవితాల్లోని అమాయకత్వాన్ని, ఆవేదనలను
భాషతో, యాసతో, రాత తీరుతో కట్టిపడేస్తున్న
హెచ్చార్కెకి జయహో
* * *
ఆవేశాన్ని ఆలోచనలని
అక్షరాల్లో మిళితం చేసి ఉర్రూతలూగించే
సత్తా ఉన్న సిద్ధార్థ కట్టాకి జయహో
* * *
అటు కదిలించే గజల్
ఇటు ఆలోచింపజేసే కవిత్వం
రెండింటితో పరవశింపజేస్తూ, సత్తా చాటుతున్న
రోహిణి వుయ్యాలకి జయహో
* * *
అక్షరాల్లో వెన్నెలని ఒలికించి
ఆహ్లాదాన్ని పంచే
పుష్యమి సాగర్ కి జయహో
* * *
కెరటం తీరం దాటితే ఎలా ఉంటుందో
ఆ ఉధృతిని తమ కవిత్వంతో పరిచయం చేసే
అనిల్ డాని, నరేష్కుమార్ లకి జయహో
* * *
రోజుకొకటో రెండో లెక్కన
పదులు, వందలు రాసి పడేశామని
కుప్పలు చూసుకుంటూ సంతోషపడేవారి మధ్యన
గంగిగోవు పాలలా తన కవిత్వంతో
ఆలోచింపజేసి, సమాజాన్ని పరిచయం చేసే
సైఫ్ అలీ సయ్యద్ కి జయహో
* * *
.
.
.
కవిత్వానికి కాలం చెల్లిపోయిందని
పుట్టకొకరు, గుట్టకొకరుగా ఉన్నవారిని
ఒక చెట్టు కిందకి తెచ్చి
కవిసంగమంని తీర్చి దిద్ది నడిపిస్తున్న
యాకూబ్ మహాశయా - జయహో
* * *
రాసుకుంటూ పొతే
వాసి గలిగిన కవులందరిని లెక్కించుకుని రాయటానికి
నా ఈ ఒక్క జీవితం సరిపోదేమో
కవిత్వాన్ని శ్వాసిస్తున్న అందరికీ జయహో
జయహో కవిత్వం జయహో కవి సంగమం
--- 'కవి సంగమం' ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ, మరెంతో మంది ప్రతిభ ఉన్నవారిని వెలికితీస్తోంది. నేను ఇక్కడ ప్రస్తావించగలిగినది కూడా అతి కొద్దిమందినే. ఎంతమందినని, ఎవరినని ప్రస్తావించాలి అనే సంశయం లోంచి బయటపడి 'ప్రతి ఒక్కరికీ జయహో' అనటమే మార్గంగా ఎంచుకుని తప్పించుకుంటున్నందుకు మిగతావారందరూ మన్నించాలి. జయహో కవిత్వం ...


#వంశీ కలుగోట్లమార్చ్ 31,2016 ,Facebook

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...