అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

11 Jul 2014

నా బతుకు కథ | యాకూబ్ - వల్ద్ - మొహమ్మద్ మియా


July 3, 2014 at 4:12pm
Memoirs -7

స్కూల్ ముచ్చట - ముందుగాల మా ఊళ్ళ బడి లేదు.  నేను పుట్టాక నా ఐదో ఏటనో ,ఆరో ఏటనో బడి శాంక్షన్ అయ్యిందంట. స్కూల్ ఏడ పెట్టాల్నో తెలవలేదు. ఇరప ముత్తయ్య మావూరు కోయోల్ల కులపెద్ద గొడ్లకొట్టంల స్కూల్ మొదలు పెట్టిన్రంట. నాకంటే ముందు ఈడోల్లు ఎవరూ చదువుకున్నట్లు నాకు గుర్తులేదు. కానీ మా అన్న బందేఅలీ [ఊళ్ళ బందెల్లి అని పిలుస్తరు], మూతి బుచ్చిరాములు, చింత రాఘోలు,ఇరప వెంకటిలాంటోల్లు ఐదారుగురు మాత్రం అక్షరాభ్యాసం మొదట మా ఊరి బడిలనే అయినంక, రెండో తరగతి దాకా [ఉన్నదే అక్కడ అంత]చదివినంక ; కారేపల్లి [రికార్డుల్లో సింగరేణి అని పేరు. ఆ తర్వాత సింగరేణి కాలరీస్ కు ఆ పేరే వచ్చింది] చిన్న బడికి పోయిన్రు. మా అన్న చిన్న బడిల నాలుగో తరగతి కూడా పూర్తి చేసుకుని కారేపల్లి పెద్దబడిలో పదవతరగతి దాకా చదివిండు. ఆయన వెనకాల నేను. మూడు సంవత్సరాల వెనక. అంటే ఆయన పదో తరగతిల వుంటే,నేను ఏడో తరగతిల ఉన్న.

మా అన్న దంటగాళ్ళు[సావాసగాళ్ళు] మధ్యల్నే చదువులు ఆపిన్రు . ఆ జమానాల [1974] రోజుల్ల మా అన్న పదో తరగతి స్కూల్ ఫస్ట్ కూడా వచ్చిండు. ఆప్పట్ల అదొక ముచ్చట .అందరు విసిత్రంగా సెప్పుకున్నరు. '' రొట్టమాకురేవు సాయిబు కొడుకు పదిల పాసయ్యిండంట. స్కూల్ ల అందరికన్న ఎక్కువ మార్కులు కూడా వచ్చినయంట '' అని ఆ చుట్టుపక్కల ఊళ్లల్ల ఒకటే ముచ్చట్లు. మా నాన్న సరుకులు తెచ్చే సావుకారు ఎర్ర పుల్లయ్య ,ఆయన కొడుకులు ఎర్ర హనుమంతరావు, ఎర్ర కృష్ణమూర్తి ; ఆ పక్క కొట్టు సావుకారు మొరిసెట్టి లక్ష్మయ్య లాంటోళ్ళు మా నాన్న కొట్టుకు సామాన్లకు పోయినప్పుడు కూచోబెట్టుకుని ''సాయిబూ ! నీ కొడుకు ఫస్టున పాసయ్యిండు. చిన్న పల్లెటూళ్ళ ఉండి, ఇంత బీదతనంల బతుక్కుంట కూడా నీ పిలగాల్లను సదివించడం గొప్ప. నీ పిల్లలకు చదువు అబ్బుతది. అబ్బుతాంది. మా పిల్లలు అన్నీ ఉండికూడా చదవక ,గైరాదులు అవుతున్రు. నువ్ మాత్రం నీ పిల్లల్ని చదివించుడు మాన్పియ్యకు'' అన్నారంట.

మా అందరికీ పలకలు,బలపాలు,నోట్సులు వాళ్ళే ఇచ్చింరు కూడా ! మా ఇంట్ల ఎవరు చదువు మొదలుపెట్టినా ఎర్ర పుల్లయ్య ఒక కొత్త పలక, బలపాలు పిలిపించి ఇచ్చేవాడు. అట్లా మా ఇంట్ల అందరి అక్షరాభ్యాసం ఆ కొత్త పలకల మీద మొదలు అయ్యేది. మా నాన్న కూడా అందర్నీ పదో తరగతి దాకా చదివించాలని అందరి మాటలకు సంతోషపడి మనసుల ఖాయం చేసుకున్నడు.  మా ఇంట్ల ఐదుగురు అన్నదమ్ములం, మా చెల్లె పదో తరగతి పొలిమేర మాత్రం అట్లా  దాటినం.

చదువుకు పోయినా పొద్దుగాల వాగునుంచి నీళ్ళు మోయడం, గొడ్లకు గడ్డికోసుకురావడం, సందకావిలికి పొద్దున్నే చీకట్లల లేచి సేన్లకు పోవడం,అపుడపుడు గొడ్లు,మేకలు మేపకరావడం వంటి  పనులు చదువుకునే రోజుల్లో తప్పేవికావు. అట్లా స్కూల్ కు పోని రోజులల్ల పాఠాలు పోయ్యేవి.స్కూలుకు పోయినంక సార్లు కొట్టేదెబ్బలు తప్పేవికావు. స్కూలుకు పొయ్యేటప్పుడు రాతెండి టిఫిన్లల్ల మా అమ్మ సల్ల అన్నం [మజ్జిగ] పెట్టి, దానిమీద గోంగూర తొక్కు, మామిడికాయ పచ్చడి నంజుకోసం పెట్టేది. మధ్యాహ్నం ఆ టిఫిన్ స్కూల్ దోస్తులతో కూచుని తినడం ఇప్పటికీ మరువలేం. మా అన్న హైస్కూల్ ల ఉన్నప్పుడు నేను చిన్న క్లాసుల్ల ఉండేవాడిని. ఆయనకు కోపం ఎక్కువ. ఆయన టిఫిన్ వేరు.నా టిఫిన్ వేరు. ఇంటికి వచ్చినంక ఏమైన చదివేటప్పుడు తప్పులు చదివితే కొట్టేవాడు. మా అమ్మ,నాన్న కంటే ఆయన కొట్టిందే ఎక్కువ. డిగ్రీ అయ్యిందాక ఆయన దెబ్బలు తప్పలే.
మా అన్న పదోతరగతి అయినంక ఇంకా చదవాలని ఆయనకు ఉండేది. అప్పట్లనే అమ్మకు జబ్బుచేసి ఆయనకు ఇక చదవడం కాలేదు. ఇంట్ల కొట్టు ఆయనే చూసుకోవాల్సి వచ్చింది. మామీద ఇప్పటికీ కోపం, చదువుకోలేకపోయిన్నని. ఇంకొన్నాల్లకు పెళ్లి కూడా అయిపాయే. ఇంకెక్కడి చదువు. అట్లా ఆయన చదువు పదోతరగతితోనే ఆగిపోయింది. కానీ,మాఇంట్ల ముందు  ఆయన మంచిగ చదువుకుని పేరుతెచ్చినందువల్ల ,ఆ తర్వాత మాకు చదువుకోవడానికి మంచి దారి దొరికింది.
[ఇంకొన్ని చదువు ముచ్చట్లు తర్వాత...] 

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...