అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

30 Jul 2011

హ్యాపి రిటర్న్స్

(ఈ కవిప్రసిద్దకవి - హెచ్చార్కె 3.4.1994 న మా చిన్నబ్బాయి మొదటి పుట్టినరోజు కానుకగా రాసినది. మా బాబు పేరు సాహిర్ .ఈ కవిత ఎక్కడ ప్రచురించబడలేదు.ఇన్నాళ్ళు జాగ్రత్తగా దాచి ఉంచాను.ఈ కవిత వయస్సు 18 ఏళ్ళు..!)

లా సాధ్యం అలా
నిత్యం ప్రవహిస్తూ ఉండటం 
నిత్యం వెన్నెల కాస్తూ ఉండటం 
సాహిర్ వాళ్ళ నాన్నా!
నువ్వొక ప్రవహించే ఆనందానివి 
ఆకాశమన్నాక  మబ్బులుంటాయి  కదా 
ఆకాశాన్నీ వదలవు, వెన్నెలనీ వదలవు 
నువ్వొక జీవనదివి,నీ తీరం వెంట నడుస్తుంటే 
ఊరు ఎంత దూరమైనా నిర్భయం 
దోసిలి ఉంటే చాలు,దాహభయం ఉండదు 

ఉరేయ్ సాహిర్ !
నీ  తప్పెటబండికి  శుభాకాంక్షలు 
నీ శైశవ సౌందర్యానికి  వెయ్యేళ్ళు .
దేహం పెరగనీ, బుద్ధి పెరగనీ
మనసు జాగ్రత్తా 
నవ్వేయ్, అఫ్సర్ మామకొకటి 
రామదాసుకు, ప్రసేన్ కు 
ఒక్కొక్కరికి ఒకటో రెండో నవ్వులు పారెయ్

మంచి కవిత్వంలాగా 
మా బట్టలమీద ఉచ్చపోయ్ 
ఏమంటావ్ శివుడూ! ఏమంటారు చేరా!!
ఎందుకొచ్చిన  క్లాసులూ గ్లాసులూ 
ఎన్ని చందమామలను మిస్సవుతున్నామో 
క్లాసుల్లో,గ్లాసుల్లో, ఏవేవో తిరకాసుల్లో --
సాహిరు పుట్టినరోజు పండుగలు 
మరి మరి మరిమరి వస్తే చాలదూ!!!



#*#
























26 Jul 2011

తడిసి..తడిసి...

ఎప్పటినుంచో తడుస్తున్నాను 
ముద్దముద్దయి నన్ను నేను పిండుకుంటూ
ఇలా నిల్చున్నాను 

గుర్తులేదు కాని 
నాకంటే ముందునుంచే 
నా పుట్టుక -నాలోని విశ్వాసాన్ని లాక్కుంది.
నాకో అభద్రపు మతాన్ని జోడించింది.
సూటిగా కళ్ళల్లోకి చూసే దృష్టిని లాక్కుంది.
కాళ్ళకుఅంటిన మట్టిని భయభయంగా
తుడుచుకుంటూ,కడుక్కుంటూ
నడవాల్సిన దారుల్ని నాకోసం సిద్ధం చేసింది.

ఎన్నెన్ని వ్యూహాలో ...
ప్రతిసారీ విడదీసుకుంటూ సాగడం,
                 అలిసిపోకుండా చివరికంటా చేరడం...
ఎంత శక్తి హరించుకుపోయిందో ఇంత ప్రయాణంలో!
 
నా పేరు ఒక ప్రశ్న? నా ఊరు ఒక ప్రశ్న?
ఇంటి చిరునామా ఒక ప్రశ్న? 
రేషన్ కార్డు ఒక ప్రశ్న? పిల్లల పేర్లు ఒక ప్రశ్న?

ప్రతి అడుగునూ ప్రశ్నలవ్యూహాల్లోంచి  వేసుకుంటూ
రెండింతలశక్తిని  ఖర్చుచేసుకుంటూ  నీ పక్కన నిల్చోవడమే 
నేను సాధించుకున్న జీవితం.
నాకూ నీలాంటి ఓ మతాన్ని ఇవ్వు.
ఇన్నిసార్లు ఇలా
నన్ను నేను పిండి పిండి ఆరవేసుకునే బాధలోంచి
కొంచెం సేపైనా తప్పించుకుంటాను.

***

25 Jul 2011

ఇంకొంత మిగిలిన సందేహం

మిగిలింది నేనే ఇలా 

ఇంట్లో వేలాడకట్టిన గంటల్లోంచి
ఫ్యాన్ గాలికి విన్పించే సన్నని శబ్దంలా 
నేనే ఇలా 

వర్షంలోంచి తప్పించుకుని 
తల దాచుకునేందుకు ఏదో ఒక చోటు వెదుక్కుంటూ 
పరుగులు పెడుతున్న దూడలా 
నేనే ఇలా

ఓ చిరునవ్వుకు, ఓ ఆప్యాయతకు 
ఇంకొంచెం ప్రేమకు వెదుకులాడుతున్న మనిషిలా 
నేనే ఇలా 

నేను మలినం అంటని మాటల్ని  ప్రేమించాను 
మలినం నన్ను  ద్వేషించింది-
ప్రేమను ప్రేమతో ప్రేమించాను
అదేమో మాటల్ని ప్రేమించింది 

లోపలంతా నిజమైన మట్టిని నింపి 
సారవంతం అని నమ్మాను 
తీరా కొన్నాళ్ళకు అది కుళ్ళిపోయి 
నాకున్న నమ్మకమే అబద్దమని తేల్చింది.

చివరకు 
మిగిలింది నేనే ఇలా

***
(''లిఖిత'' 'శ్రీకాంత్ కు ప్రేమతో...)

19 Jul 2011

నీడలు

కొన్ని నీడలు ఏమి చెప్పకుండానే
అలా మిగిలిపోతాయి

వాటి  అసలు బొమ్మలు ఎంతకి కనపడవు

నీటిపై తేలియాడే నీటిబుడగల్లాంటి 
చిట్లిపోవడానికి ముందటి రూపంలాంటివే అవి.
బతికినక్షణాల్లోని భావాతీత నీడల్ని
గుర్తుపట్టడంలోని శ్రమనంతా భారంగా మోస్తూ తిరుగుతుంటాయి

చిన్నప్పటి నీడల్ని కొంచెం కష్టమైనా
గుర్తుపట్టడం ఇన్నేళ్ళకు నేర్చుకున్నాను
ఎన్నని-  అన్నీ నీడలే!
అసలు బతుకే కొన్ని కోట్ల నీడలసంపుటి...
భావార్దాల వెతుకులాటల్లో
కొన్ని శిలల్లా కళ్ళల్లో మిగిలిపోయాయి.
మరికొన్ని
ఎంత దగ్గరకు చేరినా అందని మరీచికల్లా సాగిపోయాయి

నీడలే వాస్తవజీవితంలా భ్రమించే
ఒకానొక మానసిక స్థితి .
అడుగుల్లోకి అడ్డం పడుతూ
ఆటలాడుకునే ఇన్ని నీడల్తో పయనిస్తూనే
తీరిక దొరికినప్పుడల్లా నీడలగురించే మీతో
ఇలా చెప్పడం అలవాటైంది...

17 Jul 2011

ETERNAL DOUBT


She calls me daily and asks me anew
“do you love me?”
Everyday as usual ‘yes I love you’
Is the answer
What are you doing,had your lunch, why is your voice so weak----
Series of questions,
I answer in clarity all of them.
She asks again ‘do you love me?’
Havent I said that I love you----irritation in the tone.
There ----you are annoyed with me,
‘you don’t have love for me’ she  fumes .
She sulks and until after noon
Does not even call me.
Doubting if she is still in the bad mood
I call her and wish.
The same question again
‘are you loving me?’
It had been so long since we are one, and repeatedly
‘How many times can I say the same word daily’.
There you are
‘You have lost love for me’ she snaps again


In the evening
Reaching home I try to wish her in good humor
Who is with a long face.
Keeping a querying face without  a word
She asks everything with her eyes
Unable to keep away I explain everything in words.
Again in the morning
When we are out running to our work
There will be a phone call from her again asking
‘Do you love me’.

Telugu original: NITHYA SANDEHAM
English translation: Jagaddhatri

15 Jul 2011

పెనుకొండ కవితలు

ముత్యాల చెరువు

ఊరు ఊరంతా కొండలు మాత్రమే నివసిస్తున్నట్లు
పెనుకొండ -అదో ఊరు .
11 వ శతాబ్దం ఆ ఊరిని కలగన్నది.

చుట్టూతా పెనవేసుకున్న కొండలమీంచి
దుమికే వర్షాకాలపు నీటిని
తన పక్కనే ముత్యాల చెరువులో దాచుకుని
జలకాలు ఆడుతుంటుంది .

ముత్యాలచెరువు నిజంగానే అది  'భోగినీ చెరువు'.!

వసుచరిత్ర ప్రబంధపు కధాక్షేత్రంలో
చేతులు చాచి నిల్చున్న 'కోలాహల పర్వతం'కళ్ళల్లో
మెరిసిన  'శుక్తిమతి' నది ఈమే !!
గిరిక,వసురాజుల ప్రణయానికి ప్రవాహసాక్ష్యంగా
రామరాజభూషణుడు కలవరించిన కవిసమయం కూడా  ఇదే!
చరిత్రను  తనలో దాచుకుని
గంభీరవదనంతో తనలోతాను సుడులు తిరుగుతోంది.

విజయనగర సామ్రాజ్యం తనను తాను కాపాడుకోవడానికి
తలలెత్తిన శత్రువుల్ని సున్నపుమూటలు కట్టి తోసిన
                                    సెగలు కక్కిన  మృత్యుగుండం ఇదే!
ప్రణయానికి,పరిహారానికి ఒకేలా తుళ్ళింతలు పోయినా
ఇప్పుడది పశ్చాత్తాపంతో కుములుతున్నట్లు చిక్కిపోయింది.
వస్త్రాలు మారుస్తూ స్నానఘట్టంలో 
పరిహాసాలు ఆడుకుంటున్న వనితలవైపు ఓరగా చూసిన పాపానికి
తానే వివస్త్ర అయి  శిక్ష అనుభవిస్తోంది.
కోటచుట్టూ కందకాలలో పరుగులు పెట్టి పెట్టీ
కాళ్ళు సహకరించక కూలబడిన పండు ముదుసలిలా
కదలక మెదలక ఒకచోటే అలా కూలబడిపోయింది.

ఎవరైనా అటువైపు వెళితే
ఒకసారి పలకరించి రండి.
మీతో ఇంకేమైనా రహాస్యాలు చెపుతుందేమో !!!

8 Jul 2011

ROTTAMAKU REVU : MY VILLAGE

MY VILLAGE
MOONLIGHT PONDS EVERYWHERE
TWO MOONS
IN THE SKY,OF THE STREAM

ALL THE NIGHT 
MOON BUILDS SAND'NESTS

IN THE MORNING 
THE BURNING JUNGLE
SHOOTS UP THE JUNGLE

"BOLLIGUTTA"WITH A SHEEN
GREETS OUR VILLAGE

THE BANYAN STRETCHES ITS THIRSTY HANDS

CHILDREN DRIVE ME BACK
TO CHILDHOOD

THE SUN TOO,
SIPPING SHADOWS
TAKES A NAP

CANVAS WAIT 
STANDING IN THE WATER 
ON SINGLE FOOT.

FISH,WITH MOUTHS
DIPPED IN WATER,
LISTEN TO MY FOOT STEPS 

THE STREAM GURGLES CURSE FREE
AT MY TOUCH

IN THE EVENING 
STACKS OF GRASS CARRY THE MOONS DOWN 
INTO THE VILLAGE

TWO MOONS AGAIN

ALL THE NIGHT 
THE VILLAGE SPORTS WITH CONTENT...

(BOLLIGUTTA=WHITE HILL)
         
*POEM FROM   'ARC OF UNREST' ,2000
TRANSLATED BY K.S.P.ROY

6 Jul 2011

పక్షిచూపు

చిత్రకారుడు కాన్వాసును ముందేసుకుని
రంగుల్ని కలుపుకుని దేనికోసమో నిరీక్షిస్తున్నట్లు
                    ధ్యానంగా , మౌనంగా కూచున్నాడు.
గంటలు గడుస్తున్నా
ఏమీ ఆరంభించకుండా అలాగే కూచున్నాడు.
సాయంత్రమైంది 
ఏ కదలికా లేదు,కాన్వాస్ మీద కుంచె కూడా కదలలేదు.
కాన్వాసును మడిచి 
రంగుల్ని డబ్బాలోకి వొంపుకుని
ఇంటికి తిరుగుముఖం పట్టాడు.

మరో రోజూ అంతే!

అతనిలోపలి రంగులతోనే పేచీ అంతా!
ప్రపంచంలోకి అతను చేసే ప్రయానంతోనే అసలు సమస్య.
కదలడం లేదు,లోలోపలి తంత్రి మెదలడం లేదు.
డబ్బాల్లోని  రంగులు తనలోకి వెళ్ళడం లేదు
కళ్ళు మూసుకొని  నుదిటిని రుద్దుకుంటూ 
తనలోకి తానూ  చూసుకుంటున్నాడు 

బయటికి వెళ్ళడం, మళ్ళీ లోపలికి  ప్రయాణించడం .. 
ఏవో అడుగులు తనవైపుకు మరలడం లేదు 

హటాత్తుగా ఆకాశంవైపుకు రెక్కలుచాచిన పక్షి 
తనవైపే చూస్తూ ఏదో మాట్లాడుతున్నట్లు 
వింత వింత శబ్దాలు చేయడం మొదలుపెట్టింది.
గాలిలో గిరికీలుకొడుతూ , అతని వైపే చూస్తూ 
ఏవేవో అర్ధాలు బోధపరచడానికి ప్రయత్నించింది .
కిరణాల్ని తాకి వింత వింత అందాలతో గోములు పోయింది.
ఇంకెంతో వయ్యారంగా ఎగరడం మొదలుపెట్టింది
అప్పుడే అతని చేతిలోకి 
ఏదో అతీతమైన శక్తి ప్రసరించినట్లు అతను కదిలాడు. 
అతనితోపాటు కుంచె కదిలింది.
లోలోపలి రంగులు కలవడం మొదలయింది.
తనలో ఇంకా మిగిలిన ధ్యానం వింత మెరుపులు మెరిసింది.

యిన్నాళ్ళ నిరీక్షణ ఒక్క క్షణంలో
రూపంలోకి జొరబడి ,అతనిలోంచి అతని రంగుల్లోంచి
పక్షివైపుకి చూడ్డం మొదలుపెట్టింది.
తెల్లని కాన్వాస్ ఇప్పుడొక ప్రపంచమైంది
ప్రవాసం వీడి నేలమీద అడుగుమోపింది.

ఇప్పుడు మీముందు
అతని రంగుల ప్రపంచం,పక్షిలోంచి అతనిలోకి
జొరబడిన అద్భుత ప్రపంచం
 
*** 

అందరిలోనూ రంగులు ఎప్పుడూ ఉంటాయి.
అవి వెలికి వచ్చేందుకు పక్షిచూపు మాత్రం అవసరం.
పక్షిచూపులాంటి మనోనేత్రం అవసరం.
మనోనేత్రమే ప్రపంచంలోకి మనకోసం తెరుచుకున్న కిటికీ.!


(m .f .హుస్సేన్ స్మృతిలో......)
ఆంధ్రజ్యోతి దినపత్రిక, సోమవారం'' సాహిత్య వేదిక '' 4 .7 .2011 లో ప్రచురితం.

2 Jul 2011

పూలచెట్టు

ఈ పూలచెట్టు
మా ఇంట్లోకి కొత్త ప్రపంచాన్ని మోసుకొచ్చింది 
అది పూలుపూయడం నేర్చుకున్న దగ్గరినుంచి 
అన్నీ చిత్రాలే !
దాని వెంట కిచకిచలాడుతూ పలకరించే 
చిన్ని చిన్ని పిట్టలు 
  
సద్దుచేసే 
పరిమళ భరితమైన గాలి ,
తలలూపే ఆకులు,తుమ్మెదల రొద

ఇల్లంతా పండుగ సంరంభం

పెరట్లోంచి ఇంట్లోకి రాయబారిలా 
ఈ పూలచెట్టు తొంగిచూస్తూ మమ్మల్ని మాకే 
సరికొత్తగా పరిచయం చేస్తుంది 

                                          


































ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...