అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

6 Jul 2011

పక్షిచూపు

చిత్రకారుడు కాన్వాసును ముందేసుకుని
రంగుల్ని కలుపుకుని దేనికోసమో నిరీక్షిస్తున్నట్లు
                    ధ్యానంగా , మౌనంగా కూచున్నాడు.
గంటలు గడుస్తున్నా
ఏమీ ఆరంభించకుండా అలాగే కూచున్నాడు.
సాయంత్రమైంది 
ఏ కదలికా లేదు,కాన్వాస్ మీద కుంచె కూడా కదలలేదు.
కాన్వాసును మడిచి 
రంగుల్ని డబ్బాలోకి వొంపుకుని
ఇంటికి తిరుగుముఖం పట్టాడు.

మరో రోజూ అంతే!

అతనిలోపలి రంగులతోనే పేచీ అంతా!
ప్రపంచంలోకి అతను చేసే ప్రయానంతోనే అసలు సమస్య.
కదలడం లేదు,లోలోపలి తంత్రి మెదలడం లేదు.
డబ్బాల్లోని  రంగులు తనలోకి వెళ్ళడం లేదు
కళ్ళు మూసుకొని  నుదిటిని రుద్దుకుంటూ 
తనలోకి తానూ  చూసుకుంటున్నాడు 

బయటికి వెళ్ళడం, మళ్ళీ లోపలికి  ప్రయాణించడం .. 
ఏవో అడుగులు తనవైపుకు మరలడం లేదు 

హటాత్తుగా ఆకాశంవైపుకు రెక్కలుచాచిన పక్షి 
తనవైపే చూస్తూ ఏదో మాట్లాడుతున్నట్లు 
వింత వింత శబ్దాలు చేయడం మొదలుపెట్టింది.
గాలిలో గిరికీలుకొడుతూ , అతని వైపే చూస్తూ 
ఏవేవో అర్ధాలు బోధపరచడానికి ప్రయత్నించింది .
కిరణాల్ని తాకి వింత వింత అందాలతో గోములు పోయింది.
ఇంకెంతో వయ్యారంగా ఎగరడం మొదలుపెట్టింది
అప్పుడే అతని చేతిలోకి 
ఏదో అతీతమైన శక్తి ప్రసరించినట్లు అతను కదిలాడు. 
అతనితోపాటు కుంచె కదిలింది.
లోలోపలి రంగులు కలవడం మొదలయింది.
తనలో ఇంకా మిగిలిన ధ్యానం వింత మెరుపులు మెరిసింది.

యిన్నాళ్ళ నిరీక్షణ ఒక్క క్షణంలో
రూపంలోకి జొరబడి ,అతనిలోంచి అతని రంగుల్లోంచి
పక్షివైపుకి చూడ్డం మొదలుపెట్టింది.
తెల్లని కాన్వాస్ ఇప్పుడొక ప్రపంచమైంది
ప్రవాసం వీడి నేలమీద అడుగుమోపింది.

ఇప్పుడు మీముందు
అతని రంగుల ప్రపంచం,పక్షిలోంచి అతనిలోకి
జొరబడిన అద్భుత ప్రపంచం
 
*** 

అందరిలోనూ రంగులు ఎప్పుడూ ఉంటాయి.
అవి వెలికి వచ్చేందుకు పక్షిచూపు మాత్రం అవసరం.
పక్షిచూపులాంటి మనోనేత్రం అవసరం.
మనోనేత్రమే ప్రపంచంలోకి మనకోసం తెరుచుకున్న కిటికీ.!


(m .f .హుస్సేన్ స్మృతిలో......)
ఆంధ్రజ్యోతి దినపత్రిక, సోమవారం'' సాహిత్య వేదిక '' 4 .7 .2011 లో ప్రచురితం.

4 comments:

  1. కవిత్వం ఉద్భవించటానికి ఉత్తేజం కావాలి. ఒక ప్రేరకం కావాలి. ఇలాంటి ప్రేరణ పక్షి నుంచి కవికి అందిందని కవితలో చక్కగా వ్యక్తమైంది. ఎం.ఎఫ్.హుస్సేన్ గారి స్మృతిలో వ్రాసిన కవితలో హుస్సేన్ గారి బొమ్మో లేక వారు గీసిన చిత్రమో కూడా ఉంటే బాగుంటుంది.

    ReplyDelete
  2. This reminds me of O Henry's story ... Last Leaf.

    ReplyDelete
  3. chala bavundi. Oka sangharshna, maro Nireekshana, chivaraki oka spandana.

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...