అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

3 Jun 2016

ఫ్ల ఫ్ల ఫ్ల


-:::-
ఏదీ స్పష్టంగా మొదలుకాదు
ఎక్కడా ఏ దరీ దొరకదు
అతలాకుతమై పోతున్న ఈతగాడిలా కాలం.
విత్తనాలు విత్తినట్లు మరణాల్ని విత్తి, విధ్వంసాల్ని సేద్యం చేస్తున్న భూమి.
ఇప్పుడీ ధరిత్రి పీడకలలతో బాధపడుతుంది. ప్రతిరోజూ సూర్యుడు ముఖం చాటేసి చీకట్లోనే దాక్కుంటున్నాడు. అన్ని పుస్తకాల పుటల్లోనూ మనిషి సొమ్మసిల్లి నిద్రిస్తున్న అనుభవం.
కొత్త సారాంశమేదీ లేదు.
బతకడమే ఒక అపురూపమైన అంశమైపోయి మృత్యువే పరమసత్యమైన సందర్భం. ప్రయాణం ఎటువైపో తెలియదు. భూమిని నడిపిస్తున్న అంతస్సూత్రమేదో అంతుబట్టదు.
ప్రతి అక్షరం ఇపుడొక వీలునామా
సాలెగూళ్లలాంటి ఇళ్లమధ్య, జైలు గోడలలాంటి మనసులమధ్య, తారురోడ్డుల మీద ఎగబాకుతున్న జీవితం మధ్య రాక్షసబల్లిలా నోరు తెరిచింది వర్తమానం .
ఎక్కడా, చల్లని బతుకు జల్లులు కురుస్తున్న జాడల్లేవు .
ఎక్కడా తెలతెల్లని నవ్వులు పూసే తోటల్లేవు.
ఎక్కడా మనిషి ముద్రతో మనిషి కన్పించడం లేదు.
అన్నిసార్లూ గొంతు విషాదమై రూపుకట్టడం,
రక్తమాంసాల ముద్దలు అస్తిత్వం కోసం కదులుతుండటం,
బిగిసిన మాటల వెనుక సజీవమైన జీవితం పెనుగులాడుతుండటం ఇప్పటి విషాదం.
::
ప్రతి ముఖంలోనూ నేరం చూస్తున్న తొట్రుపాటు.
ప్రతి మాటలోనూ, నవ్వులోనూ సందేహపు వెతుకులాట.
రాక్షసుడు ఎవరో, మనిషి ఎవరో అంతుచిక్కదు.
యుద్ధం చేేసేవాడెవడో, రణరంగం విడిచి జారిపోయే వాడెవడో విభజనరేఖపై ఇమడడు.
అంతా
అంతా
అంతా అస్పష్టమైన స్పష్టం !

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...