అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

5 Jun 2014

చెల్లెలి ఫోన్


...........................

నిన్న చెల్లెలు ఫోన్ చేసింది 
తన బరువైన ,దిగులునిండిన జీవితాన్ని వొంపుతూ 
అమ్మలాంటి వదినతో సుదీర్ఘంగా మాట్లాడుతూనే ఉంది.

తనలో కరుగుతున్న దు:ఖాన్ని, మోస్తున్న దిగుళ్ళ పర్వతాల్ని, శెలవేస్తున్నగాయాల్ని, వలపోతల్ని ఏకరువుపెడుతూఉంది.
రోజురోజుకీ పెరుగుతున్న ఆశలపట్టికలనేరంవల్ల 
తన కాపురం వధ్యశిలమీదకు చేరుకుంటున్న ఘట్టాన్ని 
వివరిస్తూవుంది.
ఇద్దరు పిల్లల భవిష్యత్తుని ఫణంగాపెట్టి ఎటూ తేల్చుకోలేని
అశక్తతను వారబోస్తూనే ఉంది.

ఒకింటికెళ్ళాక, ఆ ఒకింటిలో ఎండిపోయిన తనలోపలి
నదుల్ని తలుచుకుంటూ నీరైపోతోంది.
అందరూ ఉండి, ఎవరూ లేనట్లుగా మారిన జీవితంలో
అందరూ వచ్చివెళ్ళే సమయం కోసం
తన దేహమ్మీద మిగుల్చుకున్నగాయాలగుర్తుల్ని తడుముకుంటూ
ఎదురుతెన్నులు చూస్తోంది.

తప్పెవరిదో ఎవరికి తెలుసు-
కాపురం నిలబడాలని కలగజేసుకోకుండా కాలానికే వదిలేసిన
నాలాంటి మర్యాదస్తులదా?
తనలో తానే సమాధానపడుతూ,సముదాయించుకుంటూ
భర్త అయినందుకు భరిస్తూ నోరెత్తకుండా
జీవితాన్ని కొంచెం కొంచెం జరిపేస్తున్న తనదా?

**

నేను పక్కనే ఉంటానని తెలుసు.
తోడబుట్టినవాడి గొంతు తన గొంతుతో కలిపితే
తను విరిగిపోతానని
మాట్లాడలేని నిస్సహాయపు తనం..

అనుకుంటాం కానీ,
అన్ని సమస్యలకూ, ఆవేదనలకూ
పరిష్కారాలు ఒకేలా ఉండవు కాక ఉండవేమో?!

5.2.2014

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...