అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

3 Jun 2016

సృజనానుభవం -1


కొన్ని పదాలు కలిసి ఒక వాక్యమవుతుంది. కొన్ని పదాలు కలిసి ఒక కవితలో పాదమవుతుంది.
ఈ పదాలు ఏమిటి? వాటిలో ఏముంది?
మనిషిలోని ఆలోచనను, ఆవేశాన్ని, అనుభూతిని వ్యక్తీకరించే సాధనాలే పదాలు.
ఆకలేసినా, అలసటగా ఉన్నా, ఆగ్రహించినా ఎదుటి వారికి చెప్పాలంటే పదాలే కావాలి. బాధగా ఉన్నా, సంతోషపడినా చెప్పుకోవాలంటే పదాలే కావాలి. పదాలు కేవలం జీవంలేని సాధనాలు మాత్రమేనా!? - కానే కాదు, పదాల్లో జీవం తొణికిసలాడుతుంది. ప్రతి పదానికి దానిదైన ప్రాణం అక్షరాల గదుల్లో రహస్యంగా నిక్షిప్తమై ఉంది.
1
కేవలం కాలక్షేపానికి పత్రికలు చదివితే, పాప్ మ్యూజిక్ వింటే లేదా టీ.వీ కార్యక్రమాలు చూస్తే అందులోను మనకు పదాలే కనబడతాయి, వినబడతాయి. కాని ఆ పదాల్లోని జీవం, మన కళ్ళముందు రహస్యమయ లోకాలను సాక్షాత్కరింపజేసే జీవం కనబడదు.
పదాల ఈ జీవరహస్యం తెలిసినవాడే కవి.
పదాల జీవరహస్యాన్ని కనిపెట్టిన వాడే కవి. ఇది గొప్ప ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ గురించి పదిమందికి చెప్పాలన్నదే కవి పడే తపన. అందుకే కవిత రాస్తాడు.
2
అసలు కవిత ఎలా సృష్టించబడుతుంది?
ఒక్కోసారి అలవోకగా, నెమలీకలా అలా గాల్లో తేలుతూ వస్తుంది. జీవరహస్యం తెలిసిన కవి వెంటనే దాన్ని ఒడిసిపట్టుకుంటాడు. రంగురంగుల అందాల సీతాకోకచిలుకలా కవి కలంలో పదాలు ఒదిగిపోయి కాగితంపైకి ప్రవహిస్తాయి.
కాని కవితలన్నీ అంత తేలిగ్గా దొరకవు. ఒక్కో కవిత అడవి ఏనుగులా మచ్చిక కానంటుంది. కవి చేతికి దొరకనంటుంది. దాన్ని పట్టుకోడానికి కవి తనకు చేతనైన ప్రయత్నాలన్నీ చేస్తాడు. మాటు తవ్వుతాడు. పట్టుకోవాలని దాని వెనక పరుగెడతాడు, జింకలా పారిపోతున్న పద్యం వెంట లంఘిస్తాడు. రాత్రంతా ప్రయాసపడతాడు. కాని దొరకదు.
‘’పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టి విడుచుట కన్నా పడిచచ్చుటది మేలు.’’ వేమన ఎప్పుడో చెప్పిన మాటలను ఏ కవి మరచిపోడు. పట్టుపడక తప్పించుకుపోయిన కవితను వెంటాడ్డం మానడు. గోడపైకి ఆహారాన్ని లాక్కెళ్ళే చీమలా మళ్ళీ, మళ్ళీ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాడు. మరీ అలసిపోతే కాస్త కునుకు తీస్తాడు.
కలల్లోను పద్యమే రాజహంసలా ఎగురుతుంటుంది. ఏ తెల్లవారు జామున మూడుగంటలకో, నాలుగు గంటలకో అమ్మచేతి స్పర్శలా తాకుతుంది. అంతే హఠాత్తుగా కలలోనే లేచి కూర్చుంటాడు. కలం వెదుక్కుంటాడు. అప్పటికే కాగితంపై కవిత నవ్వుతూ సిద్ధంగా ఉంటుంది. కలనుంచి నిజంలోకి వెంటనే రావాలని, కవ్విస్తున్న ఆ కవిత మాయం కాకముందే దాన్ని ఒడిసిపట్టుకోవాలని కవి పెనుగులాడతాడు. అతను గెలిచాడా ! నిద్రమత్తు వదిలి పెన్ను వెదుక్కుని కవితను అక్షరాల్లో బంధిస్తాడు. అందుకే చాలా మంది కవులు తలగడ కింద పెన్ను పెట్టుకుని నిద్రపోతారు. ఒక్కోసారి అదృష్టం వెక్కిరిస్తే, కొన్ని అస్పష్టమైన పదాలు తప్ప కవిత కలల ప్రపంచంలోకే నెమ్మదిగా జారుకుంటుంది.
కొన్ని కవితలు చాలా చక్కగా, పొందిగ్గా, ముచ్చటగా ఉంటే, కొన్ని కవితలు అల్లరిపిల్లల్లా, చింపిరిజుత్తు, ఫ్యాషన్ కోసం చిరుగులున్న జీన్సుప్యాంటు వేసుకొస్తాయి. మరి కొన్ని కవితలు అనవసరపు లగేజీని మోసుకుంటూ అపసోపాలు పడుతుంటాయి. అవసరం లేని లగేజీని కవిత భుజాలపై నుంచి దించే బాధ్యత కవి తన భుజాలకెత్తుకుంటాడు. కాస్త ఎడిట్ చేసుకుంటాడు. కాస్త అన్న మాటే కాని, ఈ కాస్తకు అంతుండదు. ఎంత దిద్దినా ఇంకాస్త మిగిలే ఉంటుంది. అద్దం ముందు నిలబడి అద్దాన్ని వదలబుద్ది కానట్లు, కవికి కూడా తన కవితను ఎంత రాసినా, ఇంకా కొంచెం మిగిలిందన్న సందేహం ఉండనే ఉంటుంది.
*
చివరకు ఆ కవితను కాగితంపైకి ఎప్పుడు స్వేచ్ఛగా వదులుతాడా అన్నది ప్రశ్నార్ధకంగానే ఉంటుంది.
కవి తన కవితను ప్రచురణకు పంపేముందు చదివిన ప్రతిసారీ... ’’అరే, ఈ లైను బాగోలేదు, తీసేయాలి... ఈ స్టాంజా ఇక్కడ కాదు పైన పెట్టాలి... ఈ లైనులో ఈ పదాలెక్కడినుంచి వచ్చాయి...‘‘ అనుకోవడం మార్చుతూ ఉండడం కొనసాగుతూనే ఉంటుంది. కొట్టివేతలు, దిద్దివేతలు... తీగలు చిందరవందరగా పెరిగిన చిట్టడవిలా కాగితం మారిపోతుంది. చివరకు, ఎలాగోలా కవికి కాస్త సంతృప్తి కలుగుతుంది.
3
చాలా మంది కవులు ప్రాసల కోసం, శబ్ధాలంకారం కోసం ప్రయత్నిస్తారు. ప్రతి స్టాంజాలోని పాదాల సంఖ్య కోసం లేదా, కాగితంపై కవిత రూపం కోసం (చిత్రకవితలు) ప్రయాసపడుతుంటారు. ఒక కవితలో చెప్పాలనుకున్న భావాలను పదాలద్వారా చెప్పడం మాత్రమే కాదు, కవిత చూడ్డానికి కూడా ఆ భావానికి ప్రతినిధి రూపంలో కనబడేలా రాయడం.
చివరకు ఒక కవితను అనుకున్నట్లు తీర్చిదిద్దిన తర్వాత ఆ ఆవిష్కరణను ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే కవి దృష్టిలో ఉంటుంది. తన ఆవిష్కరణను యావత్తు ప్రపంచం చూడాలి. అంటే చదవాలి.
అందుకే కవిత్వాన్ని చదువుదాం.
కవి దర్శించిన పదాల జీవరహస్యాన్ని, ఆ రహస్యమయలోకంలోని అనుభూతుల ప్రపంచాన్ని చూద్దాం. దాని గురించి మాట్లాడదాం.
జయహో కవిత్వం.

*

జనవరి 21,2015 

4 comments:

 1. జయహో కవిత్వం..
  ఒక మంచి కవికి, కవితకి ఉండాల్సిన లక్షణాలను గురించి చాలా చక్కగా విశదీకరించారు సార్..ధన్యవాదములు

  ReplyDelete
 2. జయహో కవిత్వం..
  ఒక మంచి కవికి, కవితకి ఉండాల్సిన లక్షణాలను గురించి చాలా చక్కగా విశదీకరించారు సార్..ధన్యవాదములు

  ReplyDelete
 3. nice
  hi
  We started our new youtube channel : Garam chai . Please subscribe and support
  https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

  ReplyDelete
 4. The designs work is great in app see more excellent best modular kitchen designers in chennai in google app. Keep watch and check the chennai reviews.

  ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...