అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

3 Jun 2016

పువ్వులసంద్రం


కవిత్వమధువు కోసం పుప్పొడిని సమీకరించుకునే పువ్వుల సంద్రమాతడు .
శరీరపుబుట్టనిండా కవిత్వపు పూలే !.
అతడిని అలుముకున్న తేనెచుక్కలన్నీ
ఒలుకుతూ వాలుతూ తూలుతూ కవిత్వమే పలుకుతున్నాయి .

.
కవిత్వమొక తియ్యని దాహార్తి.
గాయాల చిత్తడిపై తేనెపూత కవిత్వం .
అనుభవాల ఒత్తిడిపై పూలతేరు కవిత్వం.
అనుభూతుల చెలిమలో నిశ్శబ్దపుగీత కవిత్వం.
అనుసృజనల సెలయేరులో సహజత్వపు రాత కవిత్వం .

.
కవికెప్పుడూ వయసు లేదు, రాదు
కవితకెప్పుడూ సజల హృదయమే !
కవిత్వమెప్పుడూ నిత్య జీవనోత్సాహామే !

.
కవి మరణించడు, మరణమంటూ లేదు
అక్షరవలువల్ని ధరించి ,మనముందే నడయాడే భావవీచిక.
కవిత్వాన్ని కలగంటూ, కలుపుకుంటూ
అంతర్జాలపు వేదికపై 'కవిసంగమ'గగనవీధిలో
తిరుగాడే ఏడాదిబిడ్డ అతడు
మనసులోనూ
వయసులోనూ...!!!

[పుట్టినరోజు కానుక].

#శిలాలోలిత
2.3.2013

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...