అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

25 Aug 2011

అసలు అర్ధాలేవో...

నేను నేనేనని తెలిసేట్లు 
నాలోపలితనమేదో ఎరుక కలిగించేట్లు 
నా అల్పత్వాల అనలతల్పాల మీదుగా 
సాగిపోతుంది ఆమె.

నా క్షణాలన్నీ ఆమెకోసం దాచి ఉంచుతాను.
సాయంత్రాలని ముడుపుకట్టి 
పావురాల రాయబారం నెరుపుతాను.
ఆత్మనంత ఒక చోటికిచేర్చి ఒంపుతాను 

మౌనాన్ని, దూరాన్ని తన అస్త్రంగా చేసుకుంటుంది.
మిషల్ని ఆలంబనగా వాడుకుంటుంది.
చిరునవ్వుల్ని ముభావపు జవాబులుగా విసురుతుంది.
***
వింతలెన్నో , చింతలెన్నో కలగలిసిన 
ఈ జీవితమే ఒక "డిస్కవరీ ఛానల్'.
సందర్భాలే అర్ధాలు బోధపడని అంతుపట్టని చిక్కుముడులు.
మనసుల్ని చేదించే డిస్కవరీ బహుశా ఇంకా తెలియదు.

తెలిస్తే-- ఇన్ని ముభావాలకు,
ఇన్నిచిరునవ్వులకు వెనుక దాగిన 
అసలు అర్ధాలేవో ఖచ్చితంగా భోదపడేవి ఎప్పుడో..!




**8


20 Aug 2011

మాయ

వణికే పెదాలు 
మొలిచే మోహాలూ- శిలల్లాగే దేహాలూ పుట్టాయి.

1
చుంబనాలు , కౌగిలింతలు 
తనువు ఒక స్వరంగా రూపొందేక్రమం 

జీవితంగుండా ప్రయాణించిన 
నఖక్షతాల్లోంచే 
దేహం తరంగితమై పోతుంది.
మదిమాటున రేకెత్తే క్షణాల్ని స్వరపరిచే సజీవాసక్తి

నాడుల స్థావరం దేహం
మోహమే నాడుల్ని సవరించి 
శ్రుతిచేసి ఉంచుతుంది కాబోలు.

ప్రతిసారి కళ్ళల్లోనే దేహం నిద్రిస్తుంది,సుఖిస్తుంది 
మోహరూపాల్ని దర్శించిన వారికోసం 
రాత్రుళ్ళు గుమ్మంలో నిరీక్షిస్తుంది 

స్వరాలు నేర్చుకున్న దేహసంగీతం కోసం 
ఉదయం ఎదురుచూస్తూనే ఉంటుంది 


దేహాన్ని పూజించడం ఒక సృజన 

ఆమె నదిని తన దేహంగా ధరించింది 
అతడు-ఆకాశమై ఆమెలో దాక్కున్నాడు 
ఇద్దరి చుట్టూతా పరిభ్రమించే మోహం


వనం పచ్చదనాన్ని అరువిచ్చింది 
నది ప్రవాహాన్ని జతకలిపింది 

అనుభవాలన్నీ స్వచ్చంగా సుఖించాయి 
......................................................!!!



(మీరానాయర్ 'కామసూత్ర' చూసాక ...1996)

18 Aug 2011

యథాతధం

మిగతా అంతా యథాతధం 
నిన్ను నీవు వెతుక్కోవడమే ఇక మిగిలింది 

నువ్వో అంకెగా మారకముందే -లేదా 
మారాక నువ్వెక్కడున్నావో తెలుసుకోవడం 
                                      చేయాల్సిన పని.
చిక్కుకున్నది 'సునామి'లోనో ,
తప్పిపోయింది ఏ మృత సిద్ధాంతంలోనో,
తొట్రుపడుతూ తిరుగాడుతున్నది ఏ ప్రియురాలి 
అభద్రపు ప్రేమలోనో,
అసలు నువ్వు ఎక్కడున్నావో నిన్నునీవు వెతుక్కో!

సమస్యంతా వెతుక్కోవడం గురించే-

వెతికి వెతికి చిట్టచివరన 
ఏది చేతికి తగులుతుందో -ఆ స్పర్శ 
అదే నువ్వు!-
ఇక చుట్టూతా పేరుకుపోయింది ఇప్పటిదాకా 
వెంటేసుకు తిరుగుతున్న అబద్దం.
***
మిగతా అంతా యధాతదం
కొంత నిజం,చాలా అబద్దం ; కొంచెం నీవు, చాలా నీవే కాని నువ్వు!




10 Aug 2011

Moisture


For him, who sleeps among blossoms
Rainbows are not required at all!


For flushing with verdant green,
Spontaneity of sprouts is not needed!


For him moistened with cloud’s conscience,
Need arises not to be luminous again like lightening!


For him, who slides as strain of bloodstream,
Acquaintance with moisture of momentous life unessential!


To him, who defines nature of love
Its not essential to disclose discourse of debilitating past!



******


[Translated from Telugu by T.  S.  Chandra Mouli & B.  B. Sarojini from the volume Saribaddu Rekha (Nov.2002) ; poem titled : Thadi (P.29) ]

8 Aug 2011

చెప్పలేని జవాబు

సాయంత్రం వాడితో కూచుని 
'ఎలా ఉన్నావురా ' అని ప్రేమగా అడిగాను.

'బాగోలేను డాడీ' అని వాడి సమాధానం ..
'అదేమిటీ-బాగుండకపోవడానికి నీ సమస్య ఏమిటి?'
'మీరే డాడీ!'
'నీకోసమే కదా నా ఈ శ్రమ,కష్టం..'
'నువ్వు చదువుకోవడానికి నీకంటూ ఒక రూమూ,సదుపాయాలూ ,
నీకోసం అనుక్షణం ఆలోచించే అమ్మా నేనూ అన్నయ్య 
నీకేం లోటు నాన్నా!?'

'నన్ను ఏ విషయంలోనూ కోపపడవద్దు,
నాతో ఎప్పుడు శంకించినట్లు మాట్లాడవద్దు ,
నా గురించి నాకు తెలుసు,నన్ను నేను నిర్మించుకోగలను'
'నాతో ప్రేమపూర్వకంగా మాట్లాడండి,నాతో కలిసి గడపండి.
హడావుడుల పరుగులకంటే మీతో నేను గడిపే క్షణాలు ముఖ్యం.
మీరే ముఖ్యం . '

 ***
 ఇన్నాళ్ళ నా జీవితపు పనిముట్లు 
 ఏం నిర్మించాయి,ఏం కూల్చేసాయి ....
వాడు మాట్లాడే ప్రేమలో 
నేను అనుకుంటున్నప్రేమలో
అందని భావార్ధం ఏదో మిగిలిపోతోంది .

అవసరాలు ,అందని ద్రాక్షపళ్ళలాంటి జీవితం 
తీరిగ్గా కూచోనీయని కాలం 
నన్ను నిలువెల్లా దహించిన ప్రేమరాహిత్యం 
రెక్కాడితే కాని డొక్కాడని నేపధ్యం
ఒంటిపైన ఒక చొక్కావిప్పితే ఎలాగోనన్నఅరకొరతనం 
ఏదో ఒకటి చదువే కదా -అని 
హాస్టల్ సీటు మాత్రమే ప్రధానం అనుకున్న సర్దుబాటుతనం

ఇవన్నీ ఎలా అర్ధం చేయించను -నా ప్రేమంతా 
నా కొడుకు నాకులా కాక 
అన్ని సౌకర్యాలమధ్య ఎదగాలని పడుతున్న శ్రమలోనే ఉందని..!

 నా ప్రేమ 
తన ప్రతి కదలికను గమనిస్తూ  
గర్విస్తున్న నా మనసులో ఉందని--!!


3 Aug 2011

'మో' అంటే బహుళం

మోహమో  స్వప్నమో  మౌనమో సహనమో సంక్లిష్టమో సహజమో 
ప్రక్షిక్తమో పవనమో ప్రశాంతమో పర్వతమో కరచాలనమో 
సౌన్దర్యమో సలిలమో సహజాతమో సాక్ష్యమో సాహసమో విసర్గమో 
విహాసయమో ఇహమో పరమో సాకారమో సందేశమో గహనమో 
లలితమో సుఖమో ప్రాప్తమో ప్రయోక్తమో విఖ్యాతమో 
విభ్రమమో బంధమో భయదమో పరిహాసమో సంతోషమో మధురమో 
అనన్యమో విలక్షనమో  రహస్యమో చింతనమో
రహస్తంన్త్రమో బతికిన క్షణాలమో కాక అతడు                                      
                                        మరి ఏమో !?
ఏమేమో !

ఒక కరిగే కవిత 
కరిగి వేలాడుతున్న గడియారం
ఊయలలూగుతూ సేదదీరే కొండ
బతికిన క్షణాల అర్దాల నిగంటువు
విరిగిన పదాల్లాంటి కలలప్రియుడు 
చింతించే చింతలా నడిచే సాంధ్యబాష 
అవునే- మో!?
కాదే-మో!?
**
*'మో'కి 

(ఈ కవిత జూలై 10 ,2000 న రాశాను.నా కవితాసంపుటి 'సరిహద్దు రేఖ 'లో చేర్చాను.(పేజి 106) . ఈ సంపుటిని మో' హైదరాబాద్ లో జరిగిన ఆవిష్కరణసభలో ఆవిష్కరించారు.)


1 Aug 2011

చిరిగిన కాగితం

చిరిగిన కాగితంలో నేనున్నాను 
నన్ను చదవకుండా పారేయకండి!

చదవదగిన వాక్యాన్నే నేను 
వాక్యమవడం కోసమే నేను బాషలోకి వచ్చాను.

ఇంటిచూరులో గూడుపెట్టుకునేందుకు 
పుల్లల్ని ఏరుకునే పిచ్చుకలా 
నేను అనుభవాలతో మీకోసం ఇలా 
వాక్యపుగూడులా మీ ముందు ఉన్నాను.
నన్ను చూడనైనా  చూడకుండా ,తాకనైనా తాకకుండా 
వెళ్ళబోకండి..!
అక్షరాన్నో,అక్షరంలా తలకెత్తుకున్న అనుభవాన్నో 
కొండలమీంచి దొర్లుతూ వచ్చి 
ఈ భూమిని తాకిన శిలనో ,
శిలలోంచి పలకని శిల్పాన్నో ,
నాఊరి గొంతునో,  
పొలంలో చిగిర్చేందుకు యత్నిస్తున్న కందిమొట్టునో,
ముడుచుకుపోయి చెట్టునుండి రాలి నిరీక్షిస్తున్న పండునో 
ఏమో,
నేనుమాత్రం నాలానే అక్షరంలోంచి తలెత్తి చూస్తున్నాను.

ఒకసారి నావైపు చూసిపొండి..!
చిరిగిన కాగితాల్లోనే 
నిజమైన నా జీవితం ఎదురుచూస్తోంది...

#*#
2 . 2 .2002

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...