మానుతున్న గాయాన్ని మళ్లీ ఎవరో కెలికారు
ఎవరో స్వేచ్చను యాభై ఏళ్లలోపే పరీక్షకు నిలబెట్టారు
మేకప్పుల్తో సహా మనుషులందరూ
మళ్లీ వెనక్కి రూపాంతరం చెందారు
రోడ్ల మీద నడుస్తున్నవాళ్లూ
కుడిఎడమలకు సర్దుకున్నారు
పేర్ల వెనక మతాల ఐడెంటిటీ గుర్తులు తగిలించుకుని
అందరూ అప్రమత్తులై పోయారు
మూడు గోపురాలు మూడు సింహాలు
మూడు రంగులు ప్రశ్నార్ధకాలుగా మారిపోయాయి.
అన్ని ప్రతీకలు మరోసారి వంచించబడ్డాయి.
మతనిర్ధారణ కోసం ప్రత్యేక నిర్ధారణ కమిటీలు నియమించబడ్డాయి
చరిత్ర పేజీల్లోంచి మనిషి ఆనవాళ్లు తప్ప
శిధిలాల్నే ప్రమాణాలుగా చూస్తున్నారు
మనిషే అన్ని శిధిలాల్లోంచీ ఆస్థిపంజరమై వెలికి వస్తున్నప్పుడు
మనిషి తప్ప మిగిలిన సమస్యలే ప్రధానమై పోతున్నప్పుడు
మత చదరంగంలో మనుషులే పావులవుతారు!
1.
రాజులు రాజ్యాలు అంత:పురాలు
కాలం పరీక్షించి వదిలేసిన జ్ఞాపికలు
కాలం వెంబడించిన ప్రతి వస్తువు పరివర్తన చెందుతుంది
విలువలు మారతాయి. అవసరాలు మారతాయి
మనిషే మారతాడు
కాని ఇప్పుడు అవరోహణ క్రమంలో
మనిషి ప్రయాణించడం ఎంత చోద్యం
ప్రతి మనిషిని శత్రువుగా చిత్రించి
ప్రతి గుండె మీద అపనమ్మకాల పరదాలు కప్పి
భయాన్ని నిత్యావసరంగా మార్చి
అన్ని మానవతా విలువల్ని కాలరాచి
ఏ రథాల మీదో రామబాణాల మీదో రాతియుగందాకా
తిరుగు ప్రయాణం కట్టిన ఆదిమానవుల్ని చూస్తున్నానిప్పుడు
మనిషిని వెంటాడుతున్న ఉన్మాదాల సాక్షిగా
నిజానికి ముక్కలై పోతున్నాది మనిషే
మనిషి కథ నిజం కానప్పుడు
కల్పిత గాధలే భూగోళాన్ని చుట్టుకుంటాయి
2.
ఊపిరి పోసుకోక ముందే మనిషి మతాన్ని నిర్ణయించే భూమ్మీద
నన్ను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాను
నేనే ఒక కట్టడాన్ని నన్నెవరు కూల్చడానికి ప్రయత్నించినా
నేను మనిషిలా ప్రశ్నిస్తాను
ప్రతిసారీ నేను లౌకిక స్వప్నం గురించే మాట్లాడతాను.



