అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

28 Jun 2011

యాకూబ్ కవితల సందుక.

ఒకానొకరోజు నాలో ఒక అక్షరం మొలిచింది.

అప్పుడు నేను గొర్రు తోలుతున్న మా నాన్న పక్కన
చేనులో వున్నాను.
 మొలుస్తున్న ఆ క్చణాలఅనుభవాన్ని అనుభవిస్తూనే ఉన్నా ,
 నాలో నేను అలా నాగటిచాలులా సాగిపోతూనే ఉన్నా.
  ఈ మధనం ఎలా గుర్తిన్చాడో నాన్న
 గొర్రు ఆపి నన్ను దుగం మీద కూచోపెట్టి
 'నీలో ఏం జరుగుతోంది బేటా!'తల నిమురుతూ అడిగాడు.

నాలోపలి అక్షరపు మొలక గురించి చెప్పాను
 విచ్చుకుంటున్న దాని రెమ్మల గురించి వివరించాను
 మొలకలోని రంగుల గురించి వర్ణించాను

వోపిగ్గా నా వైపే చూస్తూ
నా ముఖంలో మారుతున్న వెలుగుల్ని
గమనిస్తూ వీపు నిమిరాడు.
తలపైన జుట్టు సరిచేశాడు
"నేను చేనంత దున్ని గింజలు చల్లాల
 వానలు పడ్డాక మొక్క మొలుస్తుంది,పంట పండుతుంది .
 నాకు ఈ విద్య తెలుసు
 నా చిన్నపుడు నాలో ఈ విద్య మొలిచింది.
నీలోనేమో అక్షరం మొలిచే విద్య మొలిచింది"
 
 నాలోని ఈ విద్యను నమ్ముకున్నాక
 మన ఇంట్లోకి గింజలు రావడం మొదలైంది
 నువ్వు నీ అక్షరాన్ని నమ్ముకో!
 అక్షరం నిన్ను గింజగా మారుస్తుంది.
  మొలకెత్తుతూనే ఉండు
 పచ్చ పచ్చగా అందర్నీ పలకరిస్తూనే ఉండు,
నువ్వొక పంటపోలంలా మారు.
 నీ ఇంట్లో అక్షరాల గుమ్ములు నేను చూడాలి

 నేను,మా నాన్న ఇద్దరం
 ఇన్నాళ్ళు గింజల గురించి వీలైనప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నాం
 ఆరునెలల నుంచి నాతో మాట్లాడానికి
 నాన్న ఇక్కడ లేడు,పొలం దగ్గరా లేడు
 వెతుక్కుంటున్నాను
 నాలోపలి అక్షరాలతో మొరపెట్టుకున్తున్నాను
" నాలోపలి నాన్నని అక్షరంగా మలిచి నాకివ్వవా!"అని .













27 Jun 2011

దృశ్యమాల

వొక వసంతపు పగలు 
రెక్కలల్లార్చిన సీతాకోకచిలుకలు,నవ్వుతూ పూలు 
నేనో  వాయులీనాన్ని 
సితారాను,వేణువును...

గాలి నా నుంచి వీచడం నేర్చుకుంది 
తంత్రి  నెమ్మదినెమ్మదిగా నన్ను లోబర్చుకోవడం మొదలు పెట్టింది 
చేతివేళ్లు ఆశ్చర్యపరుస్తున్నాయి 
         నాకే తెలియని కదలికలతో ...

వసంతపు పగలు ఆవరించి 
ఉక్కిరి బిక్కిరి చేసిన సంగీతం 
కళ్ళల్లోకి వరుసగా దృశ్యమాల 
చెమర్చిన చూపులోకి తొంగిన ఇంద్రధనుస్సు !
శ్రుతిచేసి  ఉన్నాను 
ఇక  వసంతాన్నే విన్పిస్తాను..


#*#

రహాస్యం



పక్షి ఆకాశాన్ని చుడుతుంది
తన రెక్కలచట్రం లోకి ..
          రెక్కలు దాని ఆత్మవిశ్వాసం !

కొమ్మలు ఆకాశాన్ని
పగలనకా రాత్రనకా అలా చేతులు చాచి
పిలుస్తూనే ఉంటాయి
          వాటి కళ్ళల్లో ఆకుపచ్చని ఆత్మవిశ్వాసం !

సంవత్సరాలు కాలాన్ని
ఎడతెగక  వెం.. బ.. డి.. స్తాయి...
           జీవితం వాటి ఆత్మవిశ్వాసం
 ****
కదిలితే మెరుపులా మెరిసే
ఈ ఆత్మవిశ్వాసమే నాలోపలి రహాస్యం...
#*#
 2009

                                       

ఒక జన్మే!

ఉన్నదొకటే  జన్మ 

నవ్వినా ఏడ్చినా 
ఓడినా పోరాడినా సుఖించినా దుక్కించినా
ఉన్నదొకటే  జన్మ!

ఆ లోపలే చింతచిగురు కుప్పల్లా పిలిచే కోర్కెలు ,
కాగితాలకు చేరుకునే దారుల్లో  పయనిస్తున్న పదాలు,
నొప్పెట్టే పాదాలతో రాత్రుల్ని ఈదే 
దేహాల తీరనితనం ...

ఎవరైనా అడుగుతారా? ఏమైనా తెస్తారా?
ఇంకేం ఇస్తారు ?ఇంకేం అడిగి ఇచ్చి వెళతారు?

ఒక జన్మే తిరిగి రాదు 
తిరిగి మరల రానే రాదు 
 2009 

'' సరిహద్దు రేఖ "
 
 

 

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...