అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

3 Jun 2016

పువ్వులసంద్రం


కవిత్వమధువు కోసం పుప్పొడిని సమీకరించుకునే పువ్వుల సంద్రమాతడు .
శరీరపుబుట్టనిండా కవిత్వపు పూలే !.
అతడిని అలుముకున్న తేనెచుక్కలన్నీ
ఒలుకుతూ వాలుతూ తూలుతూ కవిత్వమే పలుకుతున్నాయి .

.
కవిత్వమొక తియ్యని దాహార్తి.
గాయాల చిత్తడిపై తేనెపూత కవిత్వం .
అనుభవాల ఒత్తిడిపై పూలతేరు కవిత్వం.
అనుభూతుల చెలిమలో నిశ్శబ్దపుగీత కవిత్వం.
అనుసృజనల సెలయేరులో సహజత్వపు రాత కవిత్వం .

.
కవికెప్పుడూ వయసు లేదు, రాదు
కవితకెప్పుడూ సజల హృదయమే !
కవిత్వమెప్పుడూ నిత్య జీవనోత్సాహామే !

.
కవి మరణించడు, మరణమంటూ లేదు
అక్షరవలువల్ని ధరించి ,మనముందే నడయాడే భావవీచిక.
కవిత్వాన్ని కలగంటూ, కలుపుకుంటూ
అంతర్జాలపు వేదికపై 'కవిసంగమ'గగనవీధిలో
తిరుగాడే ఏడాదిబిడ్డ అతడు
మనసులోనూ
వయసులోనూ...!!!

[పుట్టినరోజు కానుక].

#శిలాలోలిత
2.3.2013

అంతే !


~*~
బతకడం ఏమీ కొత్తకాదు
అదేదో బొత్తిగా తెలియనిదేమీ కాదు
కానీ,
కొన్ని సందర్భాల్లో అంతా కొత్తగా వుంటుంది
అదేదో అంతుబట్టని రహస్యంలా వుంటుంది.
బతుకుతున్నది బతుకేనా అనే సందేహమూ,
అటుతిప్పి ఇటుదిప్పి చివరికేదో సమాధానం దొరికి
అప్పటికి సంతృప్తి పడిపోతాం.
*
అసలు బతకడమంటే ఏమిటి?
ఊహ అపుడపుడే తెలుస్తున్నప్పుడు ఏదో అర్ధమవుతున్నట్లు, అంతా తెలిసి పోయినట్లు, నిర్వచనమేదో కనిపెట్టినట్లు
నింపాదిగా బతికేస్తుంటాం.
కొన్నాళ్లు పోయాక
బతికేయడమనే ఊహను బతికేస్తుంటాం.
సర్దబాట్లు, సంజాయిషీలు, ఆత్మనివేదనలు, సంతృప్తుల అసంతృప్తులు,
రోజులు భారంగా మారడం గమనించినా
గమనించడాన్ని కూడా అంగీకరించకుండా సాగుతుంటాం.
*
ఆపైన బాధ్యతల్ని నెరవేర్చడమే
జీవించడమనే నిర్వచనమేదో వచ్చి చేరుతుంది.
రోజులు ఉదయించి చాలా మామూలుగా అస్తమిస్తాయి.
ఇంకొన్ని రోజులు ఇలాగే గడిచాక
బతకడం ఏమీ కొత్తగా అన్పించదు .
అలాగని,
అదేదో బొత్తిగా తెలిసినట్లుగానూ వుండదు.
8.12.2015

ఫ్ల ఫ్ల ఫ్ల


-:::-
ఏదీ స్పష్టంగా మొదలుకాదు
ఎక్కడా ఏ దరీ దొరకదు
అతలాకుతమై పోతున్న ఈతగాడిలా కాలం.
విత్తనాలు విత్తినట్లు మరణాల్ని విత్తి, విధ్వంసాల్ని సేద్యం చేస్తున్న భూమి.
ఇప్పుడీ ధరిత్రి పీడకలలతో బాధపడుతుంది. ప్రతిరోజూ సూర్యుడు ముఖం చాటేసి చీకట్లోనే దాక్కుంటున్నాడు. అన్ని పుస్తకాల పుటల్లోనూ మనిషి సొమ్మసిల్లి నిద్రిస్తున్న అనుభవం.
కొత్త సారాంశమేదీ లేదు.
బతకడమే ఒక అపురూపమైన అంశమైపోయి మృత్యువే పరమసత్యమైన సందర్భం. ప్రయాణం ఎటువైపో తెలియదు. భూమిని నడిపిస్తున్న అంతస్సూత్రమేదో అంతుబట్టదు.
ప్రతి అక్షరం ఇపుడొక వీలునామా
సాలెగూళ్లలాంటి ఇళ్లమధ్య, జైలు గోడలలాంటి మనసులమధ్య, తారురోడ్డుల మీద ఎగబాకుతున్న జీవితం మధ్య రాక్షసబల్లిలా నోరు తెరిచింది వర్తమానం .
ఎక్కడా, చల్లని బతుకు జల్లులు కురుస్తున్న జాడల్లేవు .
ఎక్కడా తెలతెల్లని నవ్వులు పూసే తోటల్లేవు.
ఎక్కడా మనిషి ముద్రతో మనిషి కన్పించడం లేదు.
అన్నిసార్లూ గొంతు విషాదమై రూపుకట్టడం,
రక్తమాంసాల ముద్దలు అస్తిత్వం కోసం కదులుతుండటం,
బిగిసిన మాటల వెనుక సజీవమైన జీవితం పెనుగులాడుతుండటం ఇప్పటి విషాదం.
::
ప్రతి ముఖంలోనూ నేరం చూస్తున్న తొట్రుపాటు.
ప్రతి మాటలోనూ, నవ్వులోనూ సందేహపు వెతుకులాట.
రాక్షసుడు ఎవరో, మనిషి ఎవరో అంతుచిక్కదు.
యుద్ధం చేేసేవాడెవడో, రణరంగం విడిచి జారిపోయే వాడెవడో విభజనరేఖపై ఇమడడు.
అంతా
అంతా
అంతా అస్పష్టమైన స్పష్టం !

కొత్త భాష


~*~
వానకొమ్మల మీంచి నడుస్తూ జారిపోయే నీటిచుక్కల బుగ్గలమీద సంతకం చేయాలని వుంది.
కరుగుతున్న మేఘాల చిట్టచివరి అంచుమీద
కాళ్ళూని కాలంపై గెంతాలనివుంది.
1
అక్కడక్కడా తడిచిన తడిపిట్టలు,
అక్కడక్కడా నిద్రిస్తున్న నదులు.,వాగువంకలు.
అటువైపునుంచి ఎటొ పరుగెత్తుతున్న చెట్లు ,
ఇంకెవరూ ఇటుగా చూడని దారులు, డొంకలు. నోళ్ళుతెరిచి కూచున్న చెరువులు.
రాత్రిని రాత్రే చంపుకుంటున్న చెదురుమదురు ఘటనలు, లేత లేతగా నవ్వుతూ ఉరిమినట్లు మాట్లాడే మాటలు, కళ్ళు కర్పూరంలా మండుతూ ఏవేవో పొగల్ని కక్కుతూ దృష్టిని కోల్పోయిన చూపులు.
ఇంతేకాక మరింకేమీ లేని వానకురవని ,అసలే లేని అనేక రోజుల తర్వాతి ఈరోజు !
2
అసలింకేం జరగాల్సివుంది !
నువ్వొకమారు మారి చెప్పు.
ఎండిన కళేబరంలా మాట్లాడు . నీరింకిన నదిలా పలుకు. పగిలి బీటలువారిన మబ్బులా గొంతు విప్పు.
నీకు నోటీసులు పంపుతున్నా / చల్. . మాట్లాడు !
*
13.8.2015

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...