అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

5 Feb 2013

నీడ పక్కన


కొంచెం కొంచెంగా తరిగిపోతున్న రోజులో
ఒక పక్కన ఒద్దికగా నడుస్తూ,
చిట్టచివరికి ఇలా కొంత మిగుల్చుకున్నాను

రాత్రుల్లో కలవరపెట్టే కలల్లోంచి
మిగిలిన నావి అనే కలల్ని జేబులో వేసుకుని
నిద్రలేచాను.
కొన్ని నాణేలు మటుకు గుండెల్ని హత్తుకుని
కలల పక్కనే కూచుని కబుర్లు చెప్పుకుంటూ
ఎంతోకొంత జీవితానికి భరోసాగా ఉన్నాయి నాతోపాటే.
రోజంతా వాటి గుసగుసలు నావెంట.

పొద్దుటి మంచును దాటివచ్చాను.
మనసును కప్పిన దిగులును మాత్రం వెంట తెచ్చాను
జీవితం నీడతో పాటు
సాగడం,ఆగడం అలవాటైతే అయ్యింది.
కనీసం ఈ నీడపక్కన
మిగలడానికి ప్రయత్నిస్తూ సాగాలి
............................................
OTHER VERSION:/ MODIFICATION

కొంచెం కొంచెంగా తరిగిపోతున్న రోజులలో
ఒక పక్కన ఒద్దికగా నడుస్తూ, చివరికిలా
కొంత మిగుల్చుకున్నాను

కలవరపెట్టే రాత్రి కలలలోంచి
నావైన కలల కలలని వేరు పరచుకుని
నిదుర లేచాను. ఇక ఈ రోజంతా వాటి
రహస్య గుసగుసలు నావెంట-

పొద్దుటి మంచును దాటివచ్చాను.
మనసును వొత్తిన ఈ దిగులును మాత్రం
వెంట తెచ్చాను

ఇక మిగిలేందుకు – నీతో, నాతో-
కొంత మిగిలి
ఉండేందుకు

కొంత ఓరిమితో ప్రయత్నిస్తాను.
ఎవరన్నారు జీవితం
అయిపోయిందని-?

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...