అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

27 Oct 2011

ఒకానొక శవయోగధారుడు




నాకీ శోకంతో ఏ పేచీలేదు
పేచీ అంతా ఈ లోకంతోనే

నా జేబులోని పైసాను ఖర్చు చేస్తున్న వాడెవడో
నేను చేయని అప్పును వసూలు చేసుకుపోతున్న
బహుళ జాతి అప్పులవాడెవడో

నా నాణేన్ని నానుంచి లాక్కెళ్ళిపోయాడు
చిలిగవ్వకు కొరగాకుండా
నన్ను నాణెం వంచించింది
ముళ్లు లేని గడియారంలా
నిముషాల్లేని రోజుల్లా
కొలమానంలోకి జొరబడని నన్నెపుడో హత్య చేసింది..

ఇప్పటిదాకా
మీతో మాట్లాడుతున్నది
నాలాంటి నా శవమే..
***

21 Oct 2011

పెంజీకటి


                               

ఆటకి పాటకి మాటకీ మధ్య, ప్రపంచ వార్తావాహినుల మధ్య
'షార్ట్ కమర్షియల్ బ్రేక్' లతో
దీర్ఘ చతురస్రపు కంప్యూటర్ తెరల ముఖాల్తో

వయాగ్రహాల యవ్వన కాంతుల్తో
0% వడ్డీతో అమ్మబోయే ఇన్‌స్టాల్‌మెంట్ జన్యుకణాల ప్రొడక్టులతో
వేపచెట్లు, పసుపు కొమ్ములు, బాసుమతీల విదేశీ పేటెంట్లతో
వ్యవసాయ దేశానికి దిగుమతయ్యే నిత్యావసరం బియ్యాల్తో
బ్రాండెడ్ పండ్లతో, మందులతో...

సున్నిపిండ్లు, పసుపుపూతలు లేని ఫేషియల్ కెమికల్ లోషన్‌లతో
కందులు, పెసలు, అనుములు, చిరుగింజలు, గుగ్గిళ్లు లేని
బర్గర్, చాకోబార్, టూటీఫ్రూటీల పల్లెటూళ్లతో

భాగోతాలు, చిరుతలాటలు, దసరావేశాలు
మందెచ్చులు, చిందువేషాల్లేని
ఎఫ్ టీవీలు, స్టార్ టీవీల్తో

కాలినడకల దేహదారుఢ్యాల్లేని
సూపర్ స్పెషాలిటీల సబ్సిడీ ఆపరేషన్ ఆరోగ్య మెనూలతో
నోరూరించే పచ్చళ్లులేని చిల్లీ, టమాటో సాస్‌లతో
ఏకాణా, దోవ్వాణా, చారాణా, ఆఠాణా.. ఏక్ రూపాయిల్లేని
విశ్వరూపమెత్తిన డాలర్లతో, యూరోలతో
కర్రసాములు, సాముగరిడీలు, కబడ్డీలు, వామనగుంటలు
ఉరుకులు, ఈతలు, చెట్టెక్కుడు, జిల్లగోనెల్లేని
బిలియర్డ్స్, గోల్ఫ్, టెన్నిస్, క్రికెట్‌ల స్పాన్సర్డ్ ఆటల్తో
పనుల్లో కోతల్లో కాంపుల్లో కదలికల్లో కాంతులీనే శరీరాల్లేని
జిమ్, బ్యూటీపార్లర్ల ప్రపంచసుందరి తయారీ ఫ్యాక్టరీల్తో
కార్మికుల్లేణి పరిశ్రమల్తో, ఉద్యోగుల్లేని ఆఫీసుల్తో
జీతాల్లేని నెలల్తో, ఖజానాల్లేని ప్రభుత్వాల్తో
అప్పుచేసే క్రెడిట్ కార్డుల్తో, కలల్లేని రాత్రుల్తో, కరెంట్‌లేని బిల్లుల్తో
పిడికిళ్లులేని, నోరుల్లేని, నినాదాల్లేని ఊరేగింపుల్తో, ధర్నాల్తో
హక్కులడగనివ్వని తుపాకులు పేల్చే రాజకీయాల్తో
ఇంకా బతుకుకు భరోసానిచ్చే కులాల్తో, మతాల్తో

లెక్క పత్రాలలో మాత్రమే మిగిలే ఓటర్లతో
సంతోష విషాదాల్లో ఒకేలా వెలిగే మరల్లాంటి మనుషుల్తో

అమ్మలేని డాడీల్తో, డాడిల్లేని కాలనీల్తో
ఆప్యాయతల్లేని, పలకరింపుల్లేని అపార్టుమెంట్లతో
పదాన్వయం లేని పాటల్తో, లయల్లేని వాద్యాల్తో
ఎంతకీ ఒడవని బిల్లుల్తో, చిల్లుపడే జేబుల్తో
రోడ్డుమీద రక్తంలో పడి కొట్టుకుంటున్నవాడిని కూడా
లేవనెత్తలేని పరుగుల్తో పరాయితనాల్తో

ప్రభుత్వాల మనుగడల్లో దిశలు మార్చుకునే స్వయంప్రకటిత యుద్ధాల్తో
మేఘాల్లేని కృత్రిమ వర్షాల్తో
తిండిగింజలు పండించని పొలాల్తో

మరల్తో, తెరల్తో
మెరమెరల్తో మాయపొరల్తో
దేశాన్ని మహా మార్కెట్ చేద్దాం.
ఇక
జీవితాన్ని గ్లోబు చేద్దాం
గ్లోబులో జీవనరేఖలు లేకుండా చేరిపేద్దాం!!

27.2.2002 'గ్లోబల్ ఖడ్గం' సంకలనం

17 Oct 2011

మా సఖుడు


మ్రొక్కిన కొలది కాలితో 
త్రోక్కివేయు నీ కటిన లోకమెల్ల
బహిష్క్రుతమ్ము రండు చిమ్మతలార !
నా వలెనె పాడుకొను మీరె నాకు సఖులు !
       -జాషువా "గబ్బిలం"నుండి.
జాషువా 116 వ జయంతి ఉత్సవాల సందర్బం గా  తెలుగు అకాడెమీ నిర్వహించిన కవి సమ్మేళనం లో చదివిన కవిత ఇది.కవిత శీర్షిక పైన జాషువా రాసిన పద్యం లోంచి తీసుకున్నాను.


నీ కాలంలో నువ్వు వేసిన అడుగుల్ని 
ఇవాళ మెచ్చుకున్టున్నాం,సభలు చేసి చప్పట్లు కొడుతున్నాం 
నీ జీవితాన్ని చదివి ,తెలుసుకుని
నువ్వు రాసిన అక్షరాల్ని తడుముకుని
నీ ముందు మోకరిల్లుతున్నాం 

ఏటికి ఎదురీదడం, గాలి వీచే వాలుకు
ఎదురుగా నడవడం నీ విజయం.

'గబ్బిలాన్ని'నువ్వొక ప్రతీకగా చెప్పడం
'నాలుగు పడగల హైందవ నాగరాజు'బుసలకు ఎదురొడ్డి నిలవడం 
ఒక్కడివే వందలుగా మారి ముందుకు సాగడం
సాధించి చూపిన నీ విజయాలు.
***
నీ తర్వాత నీలా మేం
అన్ని అగచాట్లు ,ఎదురుదెబ్బలు తినకుండానే
నీవు సాదించిన విజయాల మీద ,
నీవు సాగివచ్చిన గమ్యాలతీరం మీదా నిల్చుని 
ఇవాళ ఇలా మాట్లాడుతున్నాం-

నిన్ను శ్లాగిస్తూ ,నీ అక్షరాల అనుభవాల్ని సంపదను 
పదిలంగా మా కలల్లోకి ఓంపుకుని
విశ్వాస ప్రతీకలుగా ఇలా సగర్వంగా నిల్చున్నాం. 


జాషువా!
నీవు  నిర్మించిన కలలసౌధాన్ని 
నీవు అనుభవించకుండానే వెళ్ళిపోయావు
మేమంతా ఆ కలలసౌధం ముందు
నీ కలల్ని ఇలా పాడుకుంటూ ఉన్నాం 

@

15 Oct 2011

నిరసన వాక్యం


                                     

మనసు బాగోలేదు
బాగోలేదని, ఉండదని ఖచ్చితంగా తెలుసు
ఇది ఇలా ఈ జీవనయుగమంతా బాగా ఉండకుండా ఉండడంలోనే
నా విజయమంతా ఉంది

ఈ చెలమను దాహంతో పీల్చాలని
శరీరాన్ని ముఖంగా మార్చి అణువణువునూ దాహకేంద్రంగా మార్చాలని
యవ్వన సంకల్పంతో ప్రయత్నిస్తాను.
ఈ దాహం ప్రియురాలి చిరునవ్వుతో తీరదు. ముద్దుతో ఆరదు
శరీరంతో ఏమారదు.

దాహంకోసమే పుట్టిన మనసు ఇది
అశాంతి కోసమే పుట్టిన రుతువుల శరీరం ఇది
లోపల నదులు ప్రవహించకుండా
అలలు లోపలి సముద్రంలో సంఘర్షించకుండా
పువ్వులు లోపలి చెట్లనుంచి రాలకుండా ఆపనైనా లేను

అశాంతి - నా తొలి పుట్టుకేక లోంచి పుట్టిన సహజాత.

ఆమెలాంటి ఈ లోకం కళ్లలోకి చూసినప్పుడల్లా
దాహం తీరినట్లే అయి,
మళ్లీ రోజూ అలాగే కొత్తగా మొదలై
ఇక ఎక్కడా తీరిగ్గా నిల్చోనీయక, ఉన్నట్టుండి పిడుగులా
నన్ను నిట్టనిలువునా చీల్చి వేస్తుంది.
అచలంగా ఎదిగిన జీవితమూ
దాని ఆర్తిలోంచి పుట్టిన అశాంతి ఇది
ఇంత మౌనంగా ఎట్లా వుంటారు వీళ్లు
ఈ మౌనమే నన్ను వేధిస్తున్న నా ఆఖరి, మొదటి శత్రువని వీళ్లెరుగరా?
ఎరుగరా వీళ్లు... నిశ్శబ్ధాన్ని భగ్నం చేసే నా అన్వేషణని,
నిర్జీవాన్ని సజీవం చేసే మానవ హృదయ ప్రణాళికాకారుడిగానే
ఈలోకంలోకి వచ్చిన వాడినని.
పాడుపడిన మనోగుహల్ని నగిషీలు చెక్కి, అందంగా
ప్రాణవంతంగా, అనుబంధాల రూపునిచ్చే శిల్పినని

అయినా నన్నెందుకు వేధిస్తారు వీళ్లు
నా చుట్టూ మృత్యుదండాల్ని చేబూనిన నిశ్శబ్ద యముళ్ళలా
శబ్దాల్ని పుట్టించి, గొంతు స్వరాల కుచ్చిళ్ళు కదిలించి
ఎందుకు భగ్నం చేయరు నిశ్శబ్ధ తపస్సుని, తమస్సుని
ఈ నాలుగ్గోడల నిశ్శబ్ధం నుంచి ప్రపంచంలోకి విసిరేసే
న్యాయస్థానమేదీ ఇంకా పుట్టనేలేదా?
స్వేచ్చాకాశం కింది నుంచి రోజుల్ని
నా నుంచి దూరం చేసిన బాధ్యుల్ని
శిక్షించే శిక్షాస్మృతుల్లేవా?
కొత్త ఆలోచనల్లోకి, ఆలోకనల్లోకి పచ్చపచ్చని ప్రకృతిగా విస్తరించనీయరా!
వినిపించలేదా ఈ ఆక్రోశం, కన్నీళ్లు, ఆవేదన, తపన, కేక?

శబ్దం మధ్యకు, జనం మధ్యకు, గలగలలాడే సెలయేళ్ల మధ్యకు
శ్వాసించే ఏళ్ల మధ్యకు, కేరింతలు కొట్టే చిన్ని ప్రపంచాల మధ్యకు
మోరలెత్తి 'అంబా' అని అరిచే ఊళ్ళ మధ్యకు, పైర్ల మధ్యకు
ముత్యాలమ్మలు మురుసుకునే అమాయకపు మాటల మధ్యకు
నాకెందుకు దోవ చూపించరు, నన్నెందుకు విసిరెయరు.

నా అన్వేషణంతా అశాంతిలోనే మొదలైంది
నా విజయమంతా యంత్రపు హోరులోంచి
దూరంగా పరిగెత్తే ఈ దాహంలోనే వుంది..

*@*

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...