అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

15 Oct 2011

నిరసన వాక్యం


                                     

మనసు బాగోలేదు
బాగోలేదని, ఉండదని ఖచ్చితంగా తెలుసు
ఇది ఇలా ఈ జీవనయుగమంతా బాగా ఉండకుండా ఉండడంలోనే
నా విజయమంతా ఉంది

ఈ చెలమను దాహంతో పీల్చాలని
శరీరాన్ని ముఖంగా మార్చి అణువణువునూ దాహకేంద్రంగా మార్చాలని
యవ్వన సంకల్పంతో ప్రయత్నిస్తాను.
ఈ దాహం ప్రియురాలి చిరునవ్వుతో తీరదు. ముద్దుతో ఆరదు
శరీరంతో ఏమారదు.

దాహంకోసమే పుట్టిన మనసు ఇది
అశాంతి కోసమే పుట్టిన రుతువుల శరీరం ఇది
లోపల నదులు ప్రవహించకుండా
అలలు లోపలి సముద్రంలో సంఘర్షించకుండా
పువ్వులు లోపలి చెట్లనుంచి రాలకుండా ఆపనైనా లేను

అశాంతి - నా తొలి పుట్టుకేక లోంచి పుట్టిన సహజాత.

ఆమెలాంటి ఈ లోకం కళ్లలోకి చూసినప్పుడల్లా
దాహం తీరినట్లే అయి,
మళ్లీ రోజూ అలాగే కొత్తగా మొదలై
ఇక ఎక్కడా తీరిగ్గా నిల్చోనీయక, ఉన్నట్టుండి పిడుగులా
నన్ను నిట్టనిలువునా చీల్చి వేస్తుంది.
అచలంగా ఎదిగిన జీవితమూ
దాని ఆర్తిలోంచి పుట్టిన అశాంతి ఇది
ఇంత మౌనంగా ఎట్లా వుంటారు వీళ్లు
ఈ మౌనమే నన్ను వేధిస్తున్న నా ఆఖరి, మొదటి శత్రువని వీళ్లెరుగరా?
ఎరుగరా వీళ్లు... నిశ్శబ్ధాన్ని భగ్నం చేసే నా అన్వేషణని,
నిర్జీవాన్ని సజీవం చేసే మానవ హృదయ ప్రణాళికాకారుడిగానే
ఈలోకంలోకి వచ్చిన వాడినని.
పాడుపడిన మనోగుహల్ని నగిషీలు చెక్కి, అందంగా
ప్రాణవంతంగా, అనుబంధాల రూపునిచ్చే శిల్పినని

అయినా నన్నెందుకు వేధిస్తారు వీళ్లు
నా చుట్టూ మృత్యుదండాల్ని చేబూనిన నిశ్శబ్ద యముళ్ళలా
శబ్దాల్ని పుట్టించి, గొంతు స్వరాల కుచ్చిళ్ళు కదిలించి
ఎందుకు భగ్నం చేయరు నిశ్శబ్ధ తపస్సుని, తమస్సుని
ఈ నాలుగ్గోడల నిశ్శబ్ధం నుంచి ప్రపంచంలోకి విసిరేసే
న్యాయస్థానమేదీ ఇంకా పుట్టనేలేదా?
స్వేచ్చాకాశం కింది నుంచి రోజుల్ని
నా నుంచి దూరం చేసిన బాధ్యుల్ని
శిక్షించే శిక్షాస్మృతుల్లేవా?
కొత్త ఆలోచనల్లోకి, ఆలోకనల్లోకి పచ్చపచ్చని ప్రకృతిగా విస్తరించనీయరా!
వినిపించలేదా ఈ ఆక్రోశం, కన్నీళ్లు, ఆవేదన, తపన, కేక?

శబ్దం మధ్యకు, జనం మధ్యకు, గలగలలాడే సెలయేళ్ల మధ్యకు
శ్వాసించే ఏళ్ల మధ్యకు, కేరింతలు కొట్టే చిన్ని ప్రపంచాల మధ్యకు
మోరలెత్తి 'అంబా' అని అరిచే ఊళ్ళ మధ్యకు, పైర్ల మధ్యకు
ముత్యాలమ్మలు మురుసుకునే అమాయకపు మాటల మధ్యకు
నాకెందుకు దోవ చూపించరు, నన్నెందుకు విసిరెయరు.

నా అన్వేషణంతా అశాంతిలోనే మొదలైంది
నా విజయమంతా యంత్రపు హోరులోంచి
దూరంగా పరిగెత్తే ఈ దాహంలోనే వుంది..

*@*

6 comments:

  1. నా అన్వేషణంతా అశాంతిలోనే మొదలైంది
    నా విజయమంతా యంత్రపు హోరులోంచి
    దూరంగా పరిగెత్తే ఈ దాహంలోనే వుంది......ఈ ఆఖరి చరణాలు చాలా బాగుంది....మొత్తానికి కవిత హృదయానికి హత్తుకుని ఆలోచింపజేసేదిగా వుంది sir...thanks for this beautiful peom

    ReplyDelete
  2. wow....what an expression of thoughts....

    ReplyDelete
  3. అశాంతి - నా తొలి పుట్టుకేక లోంచి పుట్టిన సహజాత.
    very touching lines sir....

    ReplyDelete
  4. avedana anveshana rendoo hrudini dravimpajestunnay .....premato ...jagathi

    ReplyDelete
  5. ఉన్నట్టుండి పిడుగులా
    నన్ను నిట్టనిలువునా చీల్చి వేస్తుంది.
    అచలంగా ఎదిగిన జీవితమూ
    దాని ఆర్తిలోంచి పుట్టిన అశాంతి ఇది
    ఇంత మౌనంగా ఎట్లా వుంటారు వీళ్లు...
    Yes, the surrounding silence should always surprise us and inspire to action. Silence is always a kind of compromise. A poet should never compromise with his times. There is always room for improvement and you can identify that only when you are observant.

    ReplyDelete
  6. @ananymous @teluguaunuvaadaalu @k cube varma @curve gaaru!
    Delighted with ur response sir..!
    ee poem naaku yentho ishtam...i quote myself with this poem,whenever i want to tell about myself.
    TQ.

    ReplyDelete

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...