అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

29 Sept 2011

మబ్బు

                                    

ఒకే కల కంటున్నాను
అనేక వందల సార్లు

స్వగతంలో చిగుర్చుతున్నాను

విరిగిన రోజుల్ని ఏరుతూ
ఒంటరి దుఃఖం గుండా ప్రయాణం


1.
మబ్బుకేసి చూసి జాలిపడ్డాను
సంస్కరించేందుకు ఆకాశాన్నే ఎంచుకుంది
 వెలగని రాత్రి కాంతిలో తనలో తాను
ఏ సాగరంలోంచో స్మృతిలా
ఎగురుతూ వచ్చినట్లుంది




జాలిపడకమునుపే చెమ్మగా నావైపు చూస్తోంది
వర్షించడానికేమో అటుఇటూ దిక్కుల్ని
ఏరుకుంటోంది.
ఎన్ని రాత్రుల్లోంచో బరువుగా భారంగా
కదులుతోంది.
దిగుళ్లు వేలాడుతున్న ఆకాశం
మనసులో ఉరితాళ్ల సంభాషణ
క్షమాభిక్షనూ ధిక్కరించాలని విఫల యత్నం
కిటికీ ఊచల వెలుపలే ఖైదు.

బయలంతా బహుశా నేరభావంతో
కుములుతోంది.
జ్ఞానం గుండా సుళ్ళు తిరుగుతున్న అంతర్లోకం
కదిలేది ఎక్కడికో మబ్బు చెప్పదు.


2.
సంగీతకారుని  విమోహగీతంలా
ఏ వాద్యమంటని వేదన
రిక్తస్వప్నాల ముట్టడిలో అనువాద వివాదం
వరదగుడి మధ్య ఊపిరి సలపని చంద్రుడు.


3.
మెట్లు ఎక్కక మునుపు మబ్బులా ఒక స్మృతి
తరుముతూ వచ్చింది
నాకేసి చూసి వర్షించి సేదతీరి వెనుదిరిగింది.
నేనేమో చిత్తడి ఆక్రందనల మధ్య
నిల్చుండిపోయాను..

మట్టిలోపలంతా జాలి
పచ్చగా నవ్వుతుంది కానీ
పచ్చదనాన్ని అది ప్రదర్శించదు

ఉండలు చుట్టుకుంటూ వెళ్లిపోయిన
మేఘంలోంచే
మాట్లాడుతున్నాను.

వినిపిస్తోందా,  స్పష్టంగా!!
 *


ఆంధ్రప్రభ .. 1995 


19 Sept 2011

అవ్వల్ కలిమ


చెబితే నమ్మరు కానీ
మా బాధలెవరూ మాట్లాడడంలేదు
మళ్లీ ఇక్కడ కూడా పదిపదకొండు తరాల తరువాతి వాళ్లే
తమ కోల్పోయిన వైభవాల తలపోతల్ని
మా అందరి భాషగా మాట్లాడుతున్నారు.

అనుభవాల దోపిడీ అంటే ఇదేనేమో!

నిజానికి నవాబు, ముస్లీము, సాయిబు, తురక-
ఎవరెవరు ఏ పేర్లతో పిలవబడుతున్నారో అదే వాళ్ల వర్గం -
చేజారిన రాజరికం, జాగీరు, నవాబీ, పటేల్ దర్పాల్లో
బతికిన వాళ్లకు కోల్పోయిన సుఖాల ఆనవాళ్లయినా మిగిలాయి
రెక్కకూ డొక్కకూ బతుకు బంధిఖానా అయినవాళ్లం.
ఎప్పుడూ మిగుల్చుకోవడానికి ఏమీ లేనివాళ్లం.
చెప్పుకోవడానికి మాకేం మిగుల్తుంది....

'ఓయమ్మా' అని పిలిచే మా అమ్మల్ని
'అమ్మీజాన్'  అని పిలవాలని తెలియదు.
అబ్బూ, అబ్బాజాన్, పప్పా - అని పిలవాలంట నాన్నల్ని
మాకేం తెలుసు - మా అయ్యలూ నేర్పనేలేదు
హవేలీ, చార్‌దివార్, ఖిల్వత్, పరదా అంటే ఏమిటో
మా తడికెల అంతఃపురం   గాళ్ళకు ఏం తెలుసు?
నమాజులంటే ఒంగి లేవటమేనని మా తాత చెప్పేవాడు!
ఈ బిస్మిల్లా హిర్రహిమాన్, అల్లాహో అక్బర్, రోజాల
భాషనెప్పుడూ నేర్వలేదు.

పండగలంటే పచ్చడన్నం మాకు
బిర్యానీలు, తలావ్‌లు, పలావ్‌లు, షీర్‌కుర్మాలూ మీకు
షేర్వాణీలు, రూమీటోపీలు, సలీం షాహి బూట్లు
ఘుమఘుమలాడే ఈధర్లతో మీ వస్త్రాలు
వాయువస్త్రాల నగిషీల్తో మేము


చెబితే నమ్మరేమో కాని చెప్పుకుంటే మీ ముందు
పలచనైపోతామని భయం.

పెంటుసాబు, ఉద్దండు, దస్తాగిరి, నాగులు, చిన ఆదాం
లాలు, పెదమౌలా, చినమౌలా, షేకు శ్రీనివాసు
బేతంచర్ల మొయిను, పాటికట్ట మల్సూరు  - ఇవే కదూ మా పేర్లు.

షేక్ సయ్యద్, పఠాన్ - మీ దర్పాల హోదాల ఖాందాన్ల
పేర్లు చెప్పి మమ్మల్ని దగ్గరికైనా చేరనిచ్చారా!
లద్దాఫ్, దూదెకుల, కసాబ్, పింజారీ ....
వృత్తిని కులమై కరిచిన కాలపు గుర్తులమయ్యాం
మీ ఇళ్లలో నీళ్లు నింపి 'బినిస్తీల'మై
గుడ్డలుతికితే 'దోభీ' దోభన్'లమై
జుట్టు గొరిగితే 'హజ్జామ్'లమై
దొడ్లు కడిగితే 'మెహతర్'  "మెహతరానీ'లమై పోయాం
వృత్తిని కులమై కరిచిన కాలపు గుర్తులుగానే
ఉండిపోయాం.

మీరన్నట్లు అందరమూ 'ముసల్మాను'లమే!
కాదనం – కానీ ఈ వివక్ష సంగతేమిటి?

మాకూ ఇష్టమే - తవ్వకల్లో ఎప్పటినుంచో తేలని లెక్కలు
ఇప్పుడూ తేలిపోతాయంటే  ఇష్టం కాదూ!
ఉమ్మడి శత్రువు గురించి కొత్తగా తెలుసుకునేదేముంది
ఉమ్మడి మితృత్వ మర్మం తేలాలిప్పుడు!
అణచివేయబడ్డ వాళ్లంతా దళితులే - కాదనం
కానీ, అణచివేతల నిర్వచనం కావాలిప్పుడు!

చిత్రం - మాకొచ్చిన బాష మాది కాదట!
మీరు మనదనే బాష మాకు రాదు
చివరికిలా మాతృబాష లేని సంకటంలో పడ్డాం.
తెలుగులో మాట్లాడి వెలివేయబడ్డాం.
"ముసల్మానువై వుండి కూడా తెలుగు బాగా మాట్లాడతావే"
నవ్వాలో, ఏడ్వాలో తెలియదు!

మా కలలన్నీ తెలుగే, కన్నీళ్లు తెలుగే
ఆకలై అన్నం అడిగినా, ఆర్తనాదం చేసినా
మొత్తం భావ వ్యక్తీకరణమంతా తెలుగే!

నమాజు చేయమంటే దిక్కులు చూశాం
'అజాఁ' విని అర్ధంకాక అదిరిపడ్డాం
'సూరా'ల  శృతుల్లో రాగాలు మాత్రమే వెతుక్కున్నాం.
మాకు రాని భాషలో పూజించమంటే
చివరికి ఆరాధనానందాన్ని కూడా కోల్పోయాం

చెబితే నమ్మరు కానీ
మా బాధనెవరూ మాట్లాడ్డం లేదు.

ఆత్మగౌరవం అందరిముందు పరిచిన 'దస్తర్‌ఖాన్'
అది అయినింటి వాళ్లు  మాత్రమే అనుభవించే హక్కు కాదు
సాటివాడి గౌరవంతో ఆడుకునేది
ఎవరైనా, అది ద్రోహం ద్రోహమే

అనుభవాల దోపిడి అంతకంటే పెద్ద ద్రోహం...


**సుప్రభాతం ...1998 లో మొదట అచ్చైయ్యింది.


12 Sept 2011

కవిత్వం ... నన్ను వెంటాడుతున్న నా నీడ !

సరిహద్దు రేఖ ' నా రెండవ కవితా సంకలనం. 2002 లో అచ్చయింది. 123 కవితలు ఇందులో ఉన్నాయి. 203 పేజీల సంకలనం ఇది.
మొదటి కవితా సంకలనం 'ప్రవహించే జ్ఞాపకం' తర్వాత పదేళ్లకు ఇది అచ్చయింది. ఇందులోని కవితలు -కవితా ప్రియులకు బ్లాగులో  అందించాలని అన్పించింది . ఈ సంకలానికి ముందుమాట ప్రసిద్ధ విమర్శకులు డా.బి.తిరుపతిరావు రాశారు.
      ముందుగా నేను రాసుకున్న 'నా మాట'ను బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను. మిత్రులు ప్రతి పోస్ట్ ని చదివి తమ అభిప్రాయాలను రాయాలని వినతి. ఈ పోస్టులు 'సరిహద్దు రేఖ' లేబుల్ క్రింద పోస్టు చేస్తున్నాను. ప్రతి సోమవారం ఈ పాతవాచకం లోని కవితలను మీ ముందుకు తెస్తాను.


 కవిత్వం ... నన్ను వెంటాడుతున్న నా నీడ

"... In my poems I could not shut the door to the street, just as I could not shut the door to love, joy, or sadness in my young poet's heart” 

                                                    -Pablo Neruda 'Memoirs'


గడ్డి కోసి రెండు కట్లమోపు మూడుకట్ల మోపు వేయడం తెలుసా? దుగాలమీద కాలు జారకుండా  మోపు మోయడం తెలుసా? అరక దున్నడం తెలుసా? గొడ్లు కాయడం తెలుసా? పరిగేరడం తెలుసా? మంచెకావిలి తెలుసా? సందకావిలి తెలుసా? మొరం మోయడం తెలుసా? కూలిచేయడం తెలుసా? అరబస్తా వడ్లు ఆరు కిలోమీటర్లు దించకుండా మోయడం తెలుసా? ఊడుగుమండలు కొట్టడం తెలుసా? ఆ మోపు మోయడం

తెలుసా?

జొన్న కోయడం తెలుసా? మొట్లకెల్లి ఆవులురికితే తిప్పకరావడం తెలుసా? నీళ్లు పెట్టడం తెలుసా? చేపలు పునకడం తెలుసా? జొన్నన్నం తిని అరిగించుకోవడం తెలుసా? గటక తెలుసా? గంజి తెలుసా? ఎర్రకారం తెలుసా? రేగ్గాయలు ముళ్లకంపలోంచి కోయడం తెలుసా? జొన్న ఊసలు తెలుసా? దుగం చెక్కడం తెలుసా? నారు వేయడం తెలుసా? వాగులో దూకి కట్టెలు ఒడ్డు చేర్చడం తెలుసా? కాలివేళ్ళ పొట్టలు పగిలితే ఒంటేలు పోసి తగ్గించుకోవడమంటే తెలుసా? గజ్జికి వేపాకు, బర్రెరొచ్చు రాసుకోవడం తెలుసా? బి.సి. హాస్టల్లో పురుగులన్నం తెలుసా? బువ్వంటే తెలుసా? అరటిపండు తొక్క ఎనక పళ్లతో గీకి ఆకలి తీర్చుకోవడం

తెలుసా?

సారాకొట్టు ఉమ్ములమధ్య బతకడం, కిరాణాకొట్లో గుమాస్తాగిరి, సేటుకొట్టే చెంపదెబ్బలు, ఇళ్లు ఊడ్చి అన్నం అడగడం తెలుసా? సిన్నప్పుడు భుజమ్మీద ఐస్‌క్రేట్ డబ్బా మోస్తూ ఎర్రటెండలో ఐదు రూపాయలు సంపాయించిన వాడి గురించి, ప్రేమనెట్టా తెలియబర్చాలో తెలియని అమ్మానాన్నల కరుకుమాటలు, తిట్లూ, బూతుల మధ్య ప్రేమను ఎతుక్కోవడం, బతికున్నడో లేదోనన్నంత.. కాళ్ళతో, రాళ్ళతో, తాళ్ళతో, ముంతపొగల్తో దండించే వారి కసిలోని అజ్ఞానం గురించి తెలుసా? అరల్లో పేర్చుకున్న పుస్తకాల్ని చూసి అమ్మి డబ్బులివ్వమని అడిగే అమాయకపు అమ్మల గురించి తెలుసా? కోళ్ళగంపతోనో, చింతచిగురుతోనో, బుడంకాయలతోనో అమ్మ సంతకెలుతుంటే ఎనక తట్టలు మోస్తూ సంతంతా అదిరిపోయేట్లు అరిచే పిల్లాడి 'చవుక చవుకఅరుపులు

తెలుసా?

కులమో, ఏ మతమో తెలియని అమాయకత్వపు పెంపకం గురించి తెలుసా? ఈద్గాల దగ్గర తప్పిపోయి కౌడుపడ్డ గరీబు కుర్రాడి చిల్లర పైసల శోధన గురించి తెలుసా? సదువు కోసం పదిహేనేళ్లకే ఇల్లువిడిచి పల్లెవిడిచిన వాడి గురించి తెలుసా? పేపర్‌బాయ్‌గా ఇంటింటికి తిరుగుతూ 'ఎవరైనా  పిలిచి ఇంత చాయ్ పొయ్యరా?' అని ఆశగా చూసే పిల్లాడి గురించి

తెలుసా?

ఫీజులు తగ్గించమని అర్ధరాత్రులు గోడలకు పోస్టర్లంటించిన వాడి గురించి తెలుసా? పోలీసుల దెబ్బలు తెలుసా? హాస్టల్ సీటు కోసం కాళ్ళా వేళ్ళా పడ్డవాడి గురించి తెలుసా? విద్యార్థి ఉద్యమాల గొడవల మధ్య రక్తమోడడం తెలుసా? ఫీజుల డబ్బుల కోసం గోదావరిఖని రామగుండం రోడ్లమీద మండే ఎండల్లో చల్లని 'తాజ్ ఐస్‌క్రీం'లు అమ్ముతున్న పిల్లాడు

తెలుసా?

ఒరే ఫ్రెండూ ! అప్పివ్వమని, ఓ స్నేహితుడా! ఒక చొక్కా యివ్వమని' అడుక్కుంటూ తిరిగినవాడి గురించి తెలుసా? పాటలవరసలతో కంజీర దరువులతో గొంతెత్తిన ఉద్యమగాయకుడి గురించి తెలుసా? సింగరేణీ యూనియన్ ఆఫీసులో అర్ధరాత్రులు ఒంటరిగా భయం భయంగా గడిపిన ఆఫీసుబాయ్ గురించి తెలుసా? ఆదరించి డిగ్రీలు చదివించిన అమృతమూర్తుల ఆదరం గురించి తెలుసా? పాటలు విని అన్నంపెట్టి కడుపు నింపిన అమ్మల గురించి

తెలుసా?

ఉద్యోగంలో కుదురుకోవడానికి ముప్ఫై ఆరేళ్ళు పైగా పట్టిన ఒక అనామకుడి గురించి చిన్న ఆధారాన్నైనా వదలుకుండా సైబరుకాలంలో గిద్దె, అరసోలెడు, సోలెడు, తవ్వెడు, మానిక, కుంచం అని ఇంకా వేళ్ళూ 
లెక్కపెట్టుకుంటున్న వాడి ఊరిదనం గురించి తెలుసా? కళ్ళిప్పగానే పేడరొచ్చు, బీదవాసన కంటపడినవాడి గురించి
ఒళ్ళొంచి పని చేస్తూ బాధ్యతలు మోస్తున్నవాడి గురించి

తెలుసా?
 

తీరిక లేనిదంతా జీవితమే
మిగిలిన ప్రతిసగం కోర్కెలో
అసలైన జీవితం మనలో తెలియకుండానే లోపలే మిగిలి ఉంటుందేమో
ఆ సగమే సెగ
కవిత్వం ఆ సెగలోంచే శిరసెత్తి
మాట్లాడుతూ ఉంటుందేమో!!

తెలుసా?

 


#*#

6 Sept 2011

వర్షంలో ఇద్దరం

ఎవరిదో మాట
కళ్ళలోంచి గుండెలోకి తొంగిచూస్తుంది
స్వరాలు మారుతుంటాయి 
                    కాలం వెంబడిస్తున్నకొద్దీ 


ముఖాలు బహుశా తొడుగుల కింద 
నవ్వుల్ని ధరిస్తుంటాయి ,కాకపోతే దుక్కాన్ని 

ఒళ్లంతా నిక్కపొడుచుకొని 
నిలబడుతుంది ఆలోచనల మీద 
ద్వారం మీద ఒక పంజరం 
ఊగుతూనే వుంటుంది సదా-


వర్షంలో తడుస్తూ ఎవరో వచ్చారు 
నా లోపలికి  వర్షాన్ని మోసుకొని -
రాత్రంతా 
జల్లు పడుతూనే వుంది నామీద 
మాట తడుస్తూనే వుంది నాతోపాటు..!

*
ప్రవహించే జ్ఞాపకం 

1 Sept 2011

అజంతా

' అంతా ఒక చిత్కళ ' గా భావించిన 
అతడిముందు మోకరిల్లాను.

జీవితమే కవిత్వంగా జీవించిన
అతడిముందు మోకరిల్లాను.

అతడు  సృష్టించిన
స్వప్నలిపి 'ముందు మోకరిల్లాను.

మహా కవివృక్షం ముందు
తలవంచి స్మరిస్తున్నాను
నీ
" అక్షరం నిండా అన్నీ అద్భుతాలే " అని ...!!


***

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...