అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

22 Jul 2013

లోపలి పరుగు

 
...............................

ఏం మర్చిపోయాను ఇంట్లో 

తాళం వేశానా ,లేదా ?, గీజర్ స్విచ్ కట్టేశానా, పాలగిన్నె ఫ్రిజ్ లో పెట్టానా ,ఆ మూడు పిల్లులూ ఏం చేస్తాయో ఏమో
టామీ రానీయకుండా మొరుగుతుందిలే,గేటు దాకా తరిమేస్తుందిలే
అదేమిటో దానిదీ మొద్దునిద్రే !

అవునూ- ల్యాప్టాప్ లో logout అయ్యానో లేదో
facebook అలానే ఉంచేసానా

ఈ ట్రాఫిక్ లో ఇలా చిక్కుకున్నాను,ఇలా రోజూ ఉన్నదే కానీ మళ్ళీ అలానే అనుకోవాలి.అనుకోకపోతే అదో వెలితి.ఇంకో 12 నిమిషాలే మిగిలింది, ఆలోపు ఆఫీసుకు వెళ్ళగలనా ,సంతకం పెట్టగలనా intime లో ,ట్రాఫిక్ సిగ్నల్స్ మీద ఎన్నాళ్ళిలా నన్ను నేనే
ఇలా కోపగించుకోవడం .

*
కవిసమయం మారింది.
కకావికలమైన జీవితం నిండా లోపలి పరుగుల గాయాల గుర్తులు. రాత్రంతా కురుస్తున్న వర్షం కోసిన రోడ్లమీద పారుతున్నవరదలో ఎక్కడో నావి కొన్ని రక్తపుచారికలు. బిగుసుకున్న రోజుల్లో కీల్లనోప్పుల్లాంటి బాధ.
మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్.మాటలన్నీ జమాఖర్చు లెక్కల చిట్టాలే. ఒకటవతేదీ నుండి ముప్పై ఒకటి వరకు మాత్రమే ఊహించగలిగిన జీవితం. బిల్లులు,చిల్లులూ ,వెరసి తరుగుదల ఖాతా లాంటి బతుకువాణిజ్య శాస్త్రం.
కొన్ని పుస్తకాలూ,కొందరు మనుషులూ మనసుకు తగిలించుకున్న పెయింటింగ్స్ లా అపుడపుడూ మనసుకు రంగులు పూస్తారు .

వారంనిండా ఆదివారం కల.
ట్రాఫిక్ లేని, తాళం కప్పలేని,పరుగులేని మరుపులాంటి ఒక కల.

*
22.7.2013

21 Jul 2013

సన్నటి అలికిడి

 
................................

గుడ్డులా చితుకుతోంది రాత్రి -
చుట్టూతా సొనలు కారుతున్నదేదో బాధ. మూగగా రోదిస్తున్న క్షణాలు ఆచ్చాదనల్ని ఒక్కొక్కటిగా ఒలుచుకుంటూ మీది మీదికి ఒస్తున్నట్లుగా ఉంది.

దూరంగా ఏదో వస్తున్నట్టు 
రైలుపట్టాల్లాంటి ఈ మనసు మీద సన్నటి అలికిడి.

ఎక్కడో కొన్ని వందల మైళ్ళకు అవతల
నాకోసం పక్కలో తడుముకుంటూ చిన్నప్పుడు నాకు
తినిపించకుండా
మిగిలిపోయిన అన్నం ముద్దల్ని తలుచుకుంటూ
" నా బిడ్డ-తిన్నడో లేదో, ఏం బాధలు పడ్తున్నడో"అని
దిండుగా చేసుకున్న తన చేతిని ఈ రాత్రి
కన్నీళ్ళతో తడుపుతుందేమో ?!

తప్పిపోయానని శోకాలు పెట్టి
మాఊరు వాగు మడుగుల్లో ఉబ్బిన శవామైనా దొరుకుతుందని
రోజంతా నాకోసం దేవులాడిన మా అమ్మకు
దొరక్కుండా
పిలిస్తే పలక్కుండా
ఇంత దూరంగా దాక్కున్నాననే కదూ -నేను కలిసినప్పుడల్లా
తన కొడుకుని నాలో కాక నా కొడుకులో వెతుక్కుంటుంది.!

నిజమే
మనం మనలో కాక
ఇతరుల్లోనే ఎక్కువగా దొరికిపోతాం కదూ !!!

# 11.7.2013

అనువాద కవిత

 
టి.పి.రాజీవన్ [మలయాళ కవి]
...................................

ఇసుకరేణువులకు విశేషత ఉంది -

సూర్యోదయం ముందు, సూర్యాస్తమయం తర్వాత 
అవి మనుషుల్లా మారి పోతాయి 
ఏడుస్తాయ్, పోట్లాడుకుంటాయ్, నవ్వుతాయ్,
కౌగలించుకుని ముద్దు పెట్టుకుంటాయి

చీకటి ముసిరినా , వెలుతురు వచ్చినా
మళ్ళీ ఇసుకరేణువుల్లా మారిపోతుంటాయి
నీలాగా, నాలాగా
కలుసుకునేముందు, విడిపోయే ముందులా !

*ప్రణయ శతకం నుండి.

నల్లవాగు

 
........................

చెరువు అలుగు పారకముందు ఎండిన కట్టేలా తనలోకి తానే
ముడుచుకుని గొణుక్కుంటూ నీళ్ళను కలగంటుంది

అక్కడక్కడా మడుగుల్లో మిగిలిన బురద నీళ్ళలో 
తనే ఒక జ్ఞాపకమై 
కలవరిస్తుంది 

ఎండాకాలం
మడుగులచుట్టూ బురదలో
పశువుల గిట్టల గుర్తుల్లో మిగిలిన నీటితడిలో
ప్రవాహాన్ని కలగంటున్న వాగు

వానజల్లుల తర్వాత
వాగుముఖంలో నీటినవ్వు.

అలక తీరిన అలుగు పారి
కాళ్ళకు తొడుక్కున్న చక్రాలతో
నల్లవాగును రహదారిగా మార్చేస్తుంది.

ఊరిముందటి రేవులో వడివడిగా నడుస్తూ
మట్టిబుంగల్లోంచి ఊళ్లో గాబుల్లో చేరే నల్లవాగు
రాత్రి చంద్రుడిని తనలోకి వొంపుకుంటుంది.

తుమ్మముళ్ళ కొనలమీంచి, బర్రెంక చెట్ల మీంచి,ఊడుగుపొదల మీంచి
జిల్లేడుఆకుల మీంచి, మాబీర రొట్టమీంచి, బురద రొచ్చు మీంచి,
పరుగులు పెట్టే నల్లవాగు నీళ్ళకు
వైద్యం కోసం నానపెట్టిన ఔషధరసాయనంలాంటి కమ్మదనం.

-చవచవ్వగా,ఉప్పఉప్పగా మా వూరు గొంతు తడిపే నల్లవాగు
న్నిజంగానే
మాకు ఒక గోదావరి,ఒక కృష్ణా,ఒక ప్రాణహిత.!


*మా వూరి కవిత -సీరీస్ 1
15.7.2013

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...