అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

1 Sept 2011

అజంతా

' అంతా ఒక చిత్కళ ' గా భావించిన 
అతడిముందు మోకరిల్లాను.

జీవితమే కవిత్వంగా జీవించిన
అతడిముందు మోకరిల్లాను.

అతడు  సృష్టించిన
స్వప్నలిపి 'ముందు మోకరిల్లాను.

మహా కవివృక్షం ముందు
తలవంచి స్మరిస్తున్నాను
నీ
" అక్షరం నిండా అన్నీ అద్భుతాలే " అని ...!!


***

25 Aug 2011

అసలు అర్ధాలేవో...

నేను నేనేనని తెలిసేట్లు 
నాలోపలితనమేదో ఎరుక కలిగించేట్లు 
నా అల్పత్వాల అనలతల్పాల మీదుగా 
సాగిపోతుంది ఆమె.

నా క్షణాలన్నీ ఆమెకోసం దాచి ఉంచుతాను.
సాయంత్రాలని ముడుపుకట్టి 
పావురాల రాయబారం నెరుపుతాను.
ఆత్మనంత ఒక చోటికిచేర్చి ఒంపుతాను 

మౌనాన్ని, దూరాన్ని తన అస్త్రంగా చేసుకుంటుంది.
మిషల్ని ఆలంబనగా వాడుకుంటుంది.
చిరునవ్వుల్ని ముభావపు జవాబులుగా విసురుతుంది.
***
వింతలెన్నో , చింతలెన్నో కలగలిసిన 
ఈ జీవితమే ఒక "డిస్కవరీ ఛానల్'.
సందర్భాలే అర్ధాలు బోధపడని అంతుపట్టని చిక్కుముడులు.
మనసుల్ని చేదించే డిస్కవరీ బహుశా ఇంకా తెలియదు.

తెలిస్తే-- ఇన్ని ముభావాలకు,
ఇన్నిచిరునవ్వులకు వెనుక దాగిన 
అసలు అర్ధాలేవో ఖచ్చితంగా భోదపడేవి ఎప్పుడో..!




**8


20 Aug 2011

మాయ

వణికే పెదాలు 
మొలిచే మోహాలూ- శిలల్లాగే దేహాలూ పుట్టాయి.

1
చుంబనాలు , కౌగిలింతలు 
తనువు ఒక స్వరంగా రూపొందేక్రమం 

జీవితంగుండా ప్రయాణించిన 
నఖక్షతాల్లోంచే 
దేహం తరంగితమై పోతుంది.
మదిమాటున రేకెత్తే క్షణాల్ని స్వరపరిచే సజీవాసక్తి

నాడుల స్థావరం దేహం
మోహమే నాడుల్ని సవరించి 
శ్రుతిచేసి ఉంచుతుంది కాబోలు.

ప్రతిసారి కళ్ళల్లోనే దేహం నిద్రిస్తుంది,సుఖిస్తుంది 
మోహరూపాల్ని దర్శించిన వారికోసం 
రాత్రుళ్ళు గుమ్మంలో నిరీక్షిస్తుంది 

స్వరాలు నేర్చుకున్న దేహసంగీతం కోసం 
ఉదయం ఎదురుచూస్తూనే ఉంటుంది 


దేహాన్ని పూజించడం ఒక సృజన 

ఆమె నదిని తన దేహంగా ధరించింది 
అతడు-ఆకాశమై ఆమెలో దాక్కున్నాడు 
ఇద్దరి చుట్టూతా పరిభ్రమించే మోహం


వనం పచ్చదనాన్ని అరువిచ్చింది 
నది ప్రవాహాన్ని జతకలిపింది 

అనుభవాలన్నీ స్వచ్చంగా సుఖించాయి 
......................................................!!!



(మీరానాయర్ 'కామసూత్ర' చూసాక ...1996)

18 Aug 2011

యథాతధం

మిగతా అంతా యథాతధం 
నిన్ను నీవు వెతుక్కోవడమే ఇక మిగిలింది 

నువ్వో అంకెగా మారకముందే -లేదా 
మారాక నువ్వెక్కడున్నావో తెలుసుకోవడం 
                                      చేయాల్సిన పని.
చిక్కుకున్నది 'సునామి'లోనో ,
తప్పిపోయింది ఏ మృత సిద్ధాంతంలోనో,
తొట్రుపడుతూ తిరుగాడుతున్నది ఏ ప్రియురాలి 
అభద్రపు ప్రేమలోనో,
అసలు నువ్వు ఎక్కడున్నావో నిన్నునీవు వెతుక్కో!

సమస్యంతా వెతుక్కోవడం గురించే-

వెతికి వెతికి చిట్టచివరన 
ఏది చేతికి తగులుతుందో -ఆ స్పర్శ 
అదే నువ్వు!-
ఇక చుట్టూతా పేరుకుపోయింది ఇప్పటిదాకా 
వెంటేసుకు తిరుగుతున్న అబద్దం.
***
మిగతా అంతా యధాతదం
కొంత నిజం,చాలా అబద్దం ; కొంచెం నీవు, చాలా నీవే కాని నువ్వు!




ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...