అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

26 Mar 2012

అనాధ దేశం కళ్లు



కిటికీని ధరించిన మూడు జతల కళ్లు
రోజూ పొద్దుట్నించి రాత్రిదాకా తలుపు మీదనే అతుక్కుని ఉంటాయి
తలుపు మీదా,
 నా తలపు మీదానూ


తలుపు ధరించిన ఆ లేత కళ్లు ఆకలినే నింపుకున్నవని తెలుసు
అవి ఈ దేశపు మూడు రంగుల జెండాను దీనంగా తలపిస్తాయి
ఆ లేత చూపులు సోకిన కిటికీ
రంధ్రాలుగా, చిల్లులుగా
హృదయమై స్రవిస్తున్నది నా హృదయంలోకి..!

ఈ కిటికీ ఈ అనాధ దేశంలాంటిది.
ఎన్ని సానుభూతులు ప్రకటించినా
ఆ శోకం , దారిద్ర్యం ,
జీవన విషాదం మాత్రం ఎపట్లాగే!


 
నేనేమో ఆ కళ్లను కవిత్వం చేస్తాను
చిత్రకారుడు బొమ్మగా గీస్తాడు
అమ్మేమో..
తన పిల్లల్ని తలుచుకుని దీనంగా లోకాన్ని తిడుతుంది.


నాయకులే బోలు మాటల్లో తేల్చివేస్తారు
ఓట్లకు ముందూ వెనకా వాళ్లకేం చేయాలో బొత్తిగా తెలియదు..

17 Mar 2012

మిలీనియం కానుక

   
గాయమైన కాలమూ, మానుతున్న కాలమూ ఒకటే.

కొత్తకొత్త గాయాల సంఖ్య పెరిగి
సమీక్షించుకునే తీరికా లేక
రక్తసిక్తంగ మారుతున్న కాలంలాంటి దేహమూ
మూసిపెట్టిన బాధలా 'మూసి'
నల్లటి రక్తనాళంలా నగరం నిండా పరుచుకుంది.

కళ్లముందే నేనూ, నా దేశమూ నల్లగా మారిపోతూ
అవసరమైన చోటల్లా నిరసనలు, ధర్నాలు,
నిరసన సంతకాలు మాత్రం చేస్తూ పోతున్నాం.

నేనో సరిహద్దును-
అందుకని నా ఈ ప్రభుత్వాలకు నేనొక క్రీడ!
రెచ్చగొట్టి, కాల్పులు విరమించి, మొదలుపెట్టి
నానావిధ గాధల్ని దేశంనిండా  విసిరేసి
నన్నో మాననిగాయంగా ఎల్లప్పుడూ ఉంచి
దేశాన్ని నిస్సహాయంగా మార్చేందుకు నేనొక ఆటవస్తువును..!!!

ఊపిరి తీయడం మానుకున్నాను
నా ఊపిరిలోని ప్రేమను చంపేస్తారని భయం..!
కలల్ని ఉరితీశాను, కలల సాకుతో కాల్చేస్తారని భయం..!
హాయిగా నవ్వడం మానుకున్నాను--
ఎగతాళిగా భావించి 
నా దేశంలోనే నన్ను ఒంటరివాడిని చేస్తారని భయం
చీకటిలో కూర్చున్నాను, వెలుగు నన్ను దహిస్తుందని భయం.

ఇన్ని భయాల మధ్యన జీవితం... ఈ మిలీనియం కానుక
***

9 Mar 2012

కాలనాళిక


ఇక ఇక్కడనుంచి ఒక నమ్మకంతో
ప్రయాణం మొదలెడతాను
ఒక విశ్వాసాన్ని కవచ వస్త్రంగా ధరించి
అన్ని కాలాల కలతల వెతల ఒడిదుడుకుల్నుంచి
రక్షించుకుంటాను..

ప్రతి వీధిలోనూ నాకు నేనే కన్పిస్తాను
నా ముఖాన్ని ప్రతి గుమ్మం ముందూ చూసి
ఉలిక్కిపడి ఆగి పోతుంటాను.
ప్రతీసారీ కన్నీళ్ళు పెట్టబోతాను
నన్ను గమ్యం నిలదీస్తుంది.
నేనే వేనవేల ముఖాలుగా పరివర్తనం చెంది
ఒక విశ్వాసప్రపంచంగా నిదురలేస్తాను
అచేతనాల అవిశ్వాసాల అశాంతుల లోకంలోంచి
మళ్లీ ఒక కొత్త ఆకాశం కిందకు వలసపోతాను

1.
నన్నెవరూ దొంగలించకుండా
నన్నెవరూ దొంగచాటుగా కూల్చేయకుండా
నా దారిలో నా అడుగుల్ని నా నుంచి  వేరుచేయకుండా
నా నిరంతర తపనను ఎవరూ అవహేళన చేయకుండా
ఇక కాలాన్నే కాపలా ఉంచుతాను

నా కాలం ముందు నేనొక పనిముట్టునైపోతాను
నా అనుభవాల ముందు చిన్న పిల్లాడినైపోతాను.

2.
ఆకలి నాకు పరోక్ష గురువు.

ఏకలవ్యుడినై ఒక్కడినే కాలపరీక్షల్ని తట్టుకుంటాను
ఇక ఎవరికోసమో నా భవిష్యత్తు వేలు తెగ్గొట్టుకోలేను
నేను ఇక బలహీనుణ్ణి కాదు
నా ముందు ఏ ప్రశ్నా మనలేదు. అన్ని సమాధానాలు నేనే.
నేనొక కొత్త జీవశక్తిని రూపొందించాను.
చీకటిని శోధించి వెలుగును పట్టుకున్నవాణ్ణి.
కాలాన్ని అర్ధం చేసుకున్నవాణ్ణి
చరిత్ర పాఠాలు పదిలపరిచిన
కాలనాళికను నేను..

3.
శతాబ్దాలు నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయాక
అందరిముందు మనిషిగా ప్రత్యక్షమవుతాను
స్వేచ్చను శ్వాసిస్తున్న వాణ్ణి
ఎవరు నన్ను బంధించినా స్వేచ్చాగీతాన్నే పాడతాను
విస్మృత మార్గాల గుండా మనిషి అడుగుల్ని ఆవిష్కరించి
కొత్త లోకాన్ని ఆవిష్కరిస్తాను

ఈ మట్టిని 'కన్నతల్లి' అని గొంతెత్తి పిలిచినవాణ్ణి
నా జీవన పుష్పానికి ఈ మట్టి రేణువుల్నే
పుప్పొడిగా అద్దిన వాణ్ణి
పొర్లాడి, పొర్లాడి నా గుండెలోకి
ఈ మట్టిని ఒంపుకున్నవాణ్ణి.

ఈ మట్టి నాకు దూరమైపోతున్నపుడల్లా
ప్రతి గుండె మీద మట్టిలా పుష్పిస్తాను.

2 Mar 2012

పాటదండు



ఊళ్ళను నిద్రలేపే గొంగళి కప్పుకున్న పాట
కొండకోనల్ని, జనపదాల్ని
రేల పాటలతో హోరెత్తించే అడవిపాట.

ఎడ్లమెడల గంటలు
చెట్లు ఒరుసుకుని మండే మంటలు
కీచురాళ్లు శృతిచేసిన చీకటి పాటలు
కోకిల గొంతుల్ని అనుకరించే పిల్లల సహజస్వరాలు
డప్పుమోతలు, ఏల పాటలు, వాగు ఉరవడులు
కలిసి 
కరిగి 
ఎదిగిన
 జానపదుడి గజ్జెల పాట.

1.
నీ పాట
నిప్పుసెగ ; ప్రతిజ్ఞ ; రణం ; తిరుగుబాటు;
స్వేచ్చా నినాదం,  
నిపురవ్వలా దూసుకొచ్చే గొంతు, ;
అమ్మలాలన
 మృత్యువుతో ముఖాముఖి,
 సంఘీభావం,
 ఉబ్బిన రక్తనాళం.!


నీ పాట
పసిరిక పట్టిన పొలం దుగం !!

దుగం మీద నడిచే కాళ్లకు
అంటుకునే చలికాలపు మెత్తటి మంచు..
మంచుతో కలిసి  అంటుకునే గడ్డిపువ్వు..!!!
గోరింక గొంతులో నల్లగా ఉరిమే చల్లటి వెన్నెల-
రాత్రంతా మనసును అంటిపెట్టుకునే
                               ఆకులాంటి కల.

2
.
వాగ్గేయకారుడా!
నీ పాటలు మా కలలకు రూపాన్నిస్తాయి.
మొరం మేటవేసిన భూమిలాంటి మమ్మల్ని
పంటలు పండే నల్ల రేగడి భూముల్లా మార్చేస్తాయి.
నిన్ను కన్న అవ్వ
పేరు మార్చుకొని నాకు జన్మనిచ్చిన నా తల్లి

నీ పాట 
గొంగళీ కప్పుకున్న నిలువెత్తు ప్రశ్న?

నీ వెన్నుకు మొలిచిన తూటా
కొత్త రుతువుల్ని వాగ్ధానం చేస్తుంది..
ఇక గొంగళ్లు చుట్టుకున్న చెట్లు
            పాటలతో, గజ్జెలతో
గాలిదరువులతో కలసి పాటలు పాడుతాయి

అన్నా! 
నీ పాట అట్టడుగువాడి శతాబ్దాల దుఖం-
కళ్ళు మూసి నువ్వు పాడే పాట
యుద్ధ శిబిరంలో ఒంటరి సైనికుడు చేసుకునే ఆత్మావలోకనం.
ప్రపంచపు బాధ ఎంచుకుని పంపిన రాయబారి నీ పాట!

(గద్దర్‌కి)

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...