అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

20 Dec 2011

అనాధ దేశం కళ్లు



కిటికీని ధరించిన మూడు జతల కళ్లు
రోజూ పొద్దుట్నించి రాత్రిదాకా తలుపు మీదనే అతుక్కుని ఉంటాయి
తలుపు మీదా, నా తలపు మీదానూ


తలుపు ధరించిన ఆ లేత కళ్లు ఆకలినే నింపుకున్నవని తెలుసు
అవి ఆ దేశపు మూడు రంగుల జెండాను దీనంగా తలపిస్తాయి
ఆ లేత చూపులు సోకిన కిటికీ
రంధ్రాలుగా, చిల్లులుగా
హృదయమై స్రవిస్తున్నది నా హృదయంలోకి
ఈ కిటికీ ఈ అనాధ దేశంలాంటిది.
ఎన్ని సానుభూతులు ప్రకటించినా
ఆ శోకం మాత్రం, దారిద్ర్యం మాత్రం,
జీవన విషాదం మాత్రం ఎపట్లాగే!




నేనేమో ఆ కళ్లను కవిత్వం చేస్తాను
చిత్రకారుడు బొమ్మగా గీస్తాడు
అమ్మేమో..
తన పిల్లల్ని తలుచుకుని దీనంగా లోకాన్ని తిడుతుంది.


నాయకులే బోలు మాటల్లో తేల్చివేస్తారు
ఓట్లకు ముందూ వెనకా వాళ్లకేం చేయాలో బొత్తిగా తెలియదు..

16 Dec 2011

బహుత్ ఖూబ్ యాకూబ్ -సభ ఫోటోలు

ఈ నెల 13 మంగళవారంనాడు బహుత్ ఖూబ్ యాకూబ్ పుస్తకావిష్కరణ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. సౌభాగ్య ఈ పుస్తకం రాశారు.కవి,సినిమా దర్శకుడు జనార్దన మహర్షికి అంకితం ఇచ్చారు.  ఈ సభ యొక్క ఫోటోలు, వీడియో మీకోసం..








ఈ  వీడియో  eTelangana . org  వారి సౌజన్యంతో....





15 Dec 2011

14 Dec 2011

తడి



పువ్వుల లోపల నిద్రిస్తున్నవాడికి
ఇంద్రధనుస్సుల అవసరమే రాదు

ఆకుల పచ్చదనాన్ని నింపుకున్నందుకు
చిగురింతల తక్షణత` ఉండదు

మేఘహృదయంతో చెమ్మగిల్లేవాడికి
మళ్లీ మెరుపులా మెరిసే అవసరమే రాదు

స్వచ్చమైన నదిలా ప్రవహించేవాడికి
రాళ్ల అడ్డంకుల్ని నీటిలా దాటడం తెలుసు

నెత్తుటి స్వరమై ఉప్పొంగే వాడికి
బతుకు తడి పరిచయం అనవసరం.

ప్రేమనే నిర్వచించినవాడికి
మళ్లీ గాయాల చరిత్ర గురించి తెలపడం అనవసరం
#*#

9 Dec 2011

సరిహద్దు రేఖ



కలిసి బ్రతకడమూ నేరమే
కాక ప్రతి కదలికకి చేష్టకూ నడుమ తెలియని గీతలు

1.
తెలియకుండానే చెరగని గీతలమధ్య
సరికొత్తగా మొదలుపెట్టిన జీవితమూ ప్రశ్నలా మొదలవుతుంది

'దాదా వాళ్ళు, అల్లావాళ్ళు
అమ్మమ్మ,.. తాతయ్య వాళ్లు దేవుడు వాళ్ళ'ని
పలుకుతున్నఇదేళ్ల సాహిర్
మళ్లీ ఈ ప్రశ్నతోనే జీవితం
మొదలుపెడుతున్నాడు.

ఈ చిన్నారి జీవితమూ
బిగిసిన మతాల చట్రాన్ని దాటడం కష్టమే

వాడి ఆటపాటల్లో, కదలికల్లో, ప్రవర్తనలో
నవడికలో మతాల సరిహద్దులు
అమ్మమ్మ వాళ్ళిల్లు, దాదాదాదీల ఇళ్లు
రెండు విభిన్న సరిహద్దులు

3.
ప్రేమించడం నేరం కాదు
బొట్టు ఉండటం, పొలిమేరల్లో బొట్టు చెరిపేసుకోవడం నేరంకాదు
అలవాట్లు, ఆచరణలు కొట్టవచ్చిన జీవిత కొలమానాల్లా
'సరస్వతీ నమస్తుభ్యం'
'అల్లాహో అక్బర్'
జీవితాల మధ్య దాంపత్య అచరణ దూరాలు
కవ్విస్తున్న మతాలమధ్య పేర్లనుంచి
పెరుగుతున్న ఆంక్షల వేర్లనుంచి
ఆమె మందిరం, నేను మసీదుగానే మిగిలిపోతుంటాం
ఇక
మా దాంపత్యపు గుర్తుగా చిన్నోడికి
ఏ త్రిశంకు మందిరాన్ని నిర్ణయించహలో??

3.
మతమే లేని దశలోకి
చేరుకుంటామో లేదో తాత్వికులూ తెలపరూ
నాస్తికులు బొట్టుల్ని గాజుల్ని పసుపుతనాల్ని వీడరు
హేతువాదులూ కాఫిర్లూ మత చిహ్నాల్నీ వదులుకోరు
మతం కూడా
రక్తంలా శరీరంపై హక్కును సాధించుకుందేమో?

4.
దేహానికి దేశానికి మధ్య సరిహద్దురేఖ
దేహానికి మతానికి మధ్య
దేహానికి అనుబంధానికి మధ్య
దేహానికి ప్రేమకూ మధ్య
మెలికలు మెలికలు
పో
తు
న్న
సరిహద్దురేఖ.!

'బహుత్ ఖూబ్ యాకూబ్' సభ

i

ఇటీవల ప్రచురించిన  సౌభాగ్య రచన "బహుత్ ఖూబ్ యాకూబ్' 13 (మంగళ వారం) డిసెంబర్ ,2011 న విడుదల సభ హైదరాబాద్ లో జరుగుతోంది.

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...