అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

27 Jun 2012

ఈ రాత్రిని కొలవాలి

------------
ఈ రాత్రిని కొలవాలి
ముసురుపట్టిన  ఈ రాత్రిలో
ఇంకిన వర్షపుచినుకుల్లో తడిచి వణుకుతున్న
రాత్రిదేహాన్ని కొలవాలి.
1
దుఃఖపుజీర అంటిన కాలపుచెక్కిలి మీద
స్ఫోటకం మచ్చలా నిద్రిస్తున్న రాత్రి;

పగలంతా అలిసి ,ఇల్లంతా తిరిగి తిరిగి విసిరేయబడ్డ
మసిగుడ్డలాంటి రాత్రి;
2
=మరలాంటి రాత్రి ,కాలి ఆరిపోయిన కొరకాసులాంటి రాత్రి=

కొలవగా కొలవగా మిగిలిపొయిన రాత్రిని
కల లో ప లి ర హా స్యా ల లోంచి  కొలవాలి .





23 Jun 2012

ఆత్మకథ

 
ఉగ్గంపల్లి పీరీల కొట్టం,జయ్యారం ఏటిపాట,చినగూడురు గడీల మగ్గిన బతుకులు,
సాయిబులో దూదేకులో తేడాతెలియని అమాయక జ్ఞానం,మాట్లాడితే పీరీలు ఊరేగిన గాధలు,అర్ధరూపాయికోసం ఆరుమైళ్ళు నడిచిన సిత్రాలు,బండమీద తాటిదూలాలతో కట్టుకున్న ఒంటిదూలం గుడిసె కతలు,పొవ్వాకు చుట్టను చుట్టుకునే నేర్పులు,గుక్కతిప్పుకోకుండా ఊపిరితీసుకోకుండా బీడీలు తాగిన వైనాలు,ఐదుగురన్నదమ్ముల ఆరాటాలు,అందరి పొత్తునా పుట్టిన 'అక్కమ్మ 'లాంటి అక్క;
అక్కకోసం అమ్మపంపిన గోష్కీ సాలన్`బుత్తీలు,మీఅమ్మకోసం నువ్వు కొనుక్కొచ్చిన చీరల కధలు,మానుకోటనుండి బెజవాడదాకా రైలుకట్టమీద నడుచుకుంటూ కూలీ కోసం తరలిపోయినకష్టాలు

నాయినా!ఇదంతా నీ కన్నీటి వ్యధ!

మామ్మతో నీ నిఖాముచ్చట్లు,మాతాత కరీంసాబు గొడ్లుకోసి పోగులుపంచిన దృష్టాంతాలు,కావిడి చేతుల కాకలు తీరిన నీ ముచ్చట్లు;ముత్రాసి గూడెం,రేగుల గూడెం,పూసమోళ్ళ గుంపు,అనంతారం 'ఓ సాయిబూ ' అని పిలుచుకున్న దగ్గరితనాలు,వడితిరిగిపోయిన నీ పిక్కల నరాలు,తట్ట మోసిమోసి బోడిగుండైన నీ వంకీల జుట్టు

అబ్బ! ఇదంతా నీ జీవిత గాధ!

ఇరవైగుంటల పొలంలో బంగారం పండించిన వైనాలు,ఏట పెట్టడాలు,ఎగసాయం చేయడాలు,మోట కొట్టడాలు,మోపులెత్తడాలూ,కాసెపోసి పంచెకట్టడాలు,ఎలుగుకట్టడాలు,గిత్త ఒట్టకొట్టడాలు,తాడుపేనడాలు,చిక్కం వేయడాలు,గుమ్మి కట్టడాలు,ఇటుకబట్టి కాల్చడాలు,మునుం పట్టడాలు,రుణంతీర్చుకోవడాలు,పందిరేయడాలు,పగ్గమేయడాలూ

అబ్బా!ఇదంతా నావారసత్వపు కధ!

20 Jun 2012

ఒక సంభాషణ ముగిశాక,మరో సంభాషణ

****

నువ్వెప్పుడైనా నీ సంభాషణలో నువ్వే పరాయిగా మిగలడం
ఆ పిదప
నీ మాటల్లోనే నువ్వు మునిగితేలుతుండటం
గమనించావా?

లేక, నువ్వే నీవి కాని మాటలతో
అప్పటిదాకా గడపటం-అలానే ఇంకా గడిపేస్తుండటం
గమనించావా?

నిన్నటిదాకా నీకు నువ్వే వేసుకున్న దారుల్లో
నీ అడుగుల్నినువ్వే లెక్కించుకుంటూ
ఆ దారుల్లోనే మళ్ళీ మళ్ళీ
నడుస్తూ తడుస్తూ ఆ సంగతులే పదేపదే చెపుతూ
అక్కడే మిగిలిపోయావని గమనించావా?

మనుషుల్నిముడిసరుకులుగా మార్చే
వ్యాపార సంస్క్రుతి లోకి,అంకెలుగా మార్చే వ్యూహాల్లోకి
నువ్వూ, నీ అక్షరమూ చేరిపోతున్నాయని
గమనించావా?

గమనించీ ఎవరూ గమనించడం లేదనే
ధైర్యంతో అలా
ఉండిపోయావా?!

11 Jun 2012

ఒక్కొక్కరోజు-6

ఇప్పుడు నేను మౌనాన్ని
నా నిజమైన వ్యక్తీకరణగా నిర్మించుకున్నాను
నిశ్శబ్దాన్ని నాలోపలి అస్త్రంగా మార్చుకున్నాను

కొన్నేళ్ళనుంచి నాపాదాల కింద నలిగిపోయిన
నేలకు క్షమాపణలు చెప్పి
పాదాక్రాన్తుడిని అవుతున్నాను.
తెరలు తెరలుగా నవ్వే నవ్వుపై
నల్లటి నిషేధపు రంగుల్ని పూస్తున్నాను.

కనపడినంతమేరా
కలిసిమెలిసి తిరిగిన నా ఉత్సాహాన్ని
కుదించు కుంటున్నాను.

కొన్ని మాటలు ,చాలా కొన్ని నవ్వులు
నిర్భయ సందర్భాలు -
లోజేబులో దాచుకుని ఎప్పటికైనా
వాటి అవసరముంటుందని ఎదురు చూస్తాను

రాత్రుల ముందు సాగిలపడి
కొన్ని కలలముందు కూచున్నాను
మంతనాలు సాగుతూనే ఉన్నాయి.
అవి వివరించే ఎన్నో విషయాలను వింటూ
=ఇంకా తేల్చుకోవాల్సినవేవో ,మాన్పుకోవాల్సినవేవో
లోపలి నించి బయటికి తీసి
చూసుకుంటున్నాను.

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...