అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

25 Feb 2012

కొన్ని ప్రశ్నలు



ఇనుపగోళాల్లోకి ఇముడుతున్న మానవ సమూహాలు
 నీళ్ల పొదుగుల్లోదాహం తీరక ఉక్కిరిబిక్కిరవుతున్న దిక్కులేని కాలం,
 నిరంతరంగాసాగుతున్న పరిణామంలోకి ఇముడుతున్న దృశ్యాలు,
 విరిగిపోతున్నఅనుభవాల సమూహం

ఇక్కడ మనిషిని తూర్పారబడుతున్నదెవరు?
ఈ మనిషి సారంలోంచి విత్తనాల్ని, పొల్లుని వేరుచేస్తున్న
ఈ పెనుగాలు లెక్కడివి?
ఉసిళ్ళగుంపులా కదులుతున్న ఈ సమూహాల మధ్య
మసిబారుతున్న జీవన కాంతుల మధ్య
తుఫానులా విరుచుకుపడుతున్న ఈ ప్రశ్నలెక్కడివి?
ఇక్కడ కాగితప్పూల పరిమళాల్ని సృష్టిస్తున్న సృష్టికర్తలెవరు?

సందేహాల మధ్యనే కరుగుతున్న జీవితాలు
అన్నీ ప్లాస్టిక్ సన్నివేశాల సమాధానాలు
దూరం దూరం
మనిషికీ మనిషికీ మధ్య ఎవరూ అతకలేనిదూరం

షట్టర్లుగా తెరుచుకుంటున్న రోజుల్లోకి దిగుమతవుతున్న మనిషి
బళ్లమీద, టీకొట్టుల మీద, వర్కు షాపుల్లో, రోడ్ల మీద, పొలాల్లో
చారికలు కట్టి ఘనీభవించే చెమట చుక్కల మధ్య మనిషి.. మనిషిని
చీత్కరిస్తున్న ఈ సందిగ్ధకాల మెక్కడిది?

కంప్యూటర్ తెరల మీద దర్శించే జీవితాల్ని
ప్రామాణీకం చేసుకునే సాంకేతిక సంస్కృతిలోకి
తలుపులు తీస్తున్న ఆ మానవులెవరు?

గొంతు స్వేచ్చగా పెగల్చనీయని మతప్రమేయాలు, భూమిని సరిహద్దుల
మధ్య బంధించి మనిషిని కాందీశీకుణ్ణి చేసిన రాజ్యాలు, గాలి
పీల్చినంత సులభంగా చంపగాలిగే క్రౌర్యం.. చుట్టూ అల్లుకుంటున్న
ఈ యంత్రపుగూడు ఎక్కడిది?

ఈ కాలానికి చిరునామా లేదు
ఇది ప్రశ్నల్లోంచి ప్రశ్నల్లోకే పయనిస్తున్నది.

8 Jan 2012

'In and out' అను అంతరంగం



నీ రక్తం పంచుకు పుట్టనివాడిని
నీ పిల్లాడిలానే ప్రేమించగలవా?

       ప్రేమించడం ఒక సాహసం : క్రీడ : అనుభవం.

సాహసం చేసే డింభకుల మాటల్ని
ధైర్యం చేసి వినగలవా?

       సాహసం ఒక విలువ : వెలుగు : కొత్త చూపు

అయిష్టమైన ముఖాల్ని తొలగించి
మనుషుల్ని అక్కున చేర్చుకోగలవా?

సుఖాల బారిన పడకుండా
కటిక దుఖం వైపునకు మళ్ళగలవా?   
నాలుక చాచి దాహంగా పరుచుకున్న దేహాన్ని
విసర్జించగలవా ఏ మోహమూ లేకుండా..

మోహం ఒక బల్లి: ఒళ్ళంతా గీతలు పెట్టే మంచపు నులక: చిరుచలి

నీ ప్రేమను తుంచేసిన చోటునే
మళ్లీ జీవించగలవా నిర్భయంగా
భారాల దూరాల సంకుచితత్వాల సావాసాల్లో
చెదిరిన అంతరంగం వెక్కిరింతల మధ్య ఉండగలవా?

నీకోసం మిగిలిన శీలాన్ని మానాన్ని సహనంగా స్వీకరించగలవా?

జీవితం ఒక కిటికీ రెక్క
ఎప్పటికీ తెరుచుకునే ఉంటుంది
నిస్సిగ్గుగా అరిచే గొంతుకలా...

1 Jan 2012

కొత్త రూపం కోసం



నాకో కొత్త ప్రపంచం అనుభూతమవుతోంది
నాలోకి కొత్త భావాలేవో ప్రవేశిస్తున్నాయి

మళ్లీ నా ఎదురుగానే
నా కలలన్నీ ఆకారం దాలుస్తున్నట్లు అనిపిస్తోంది
ఉబ్బెత్తుగా ఎదిగిన బొజ్జమీద చేయివేసినప్పుడూ
ఆల్చిప్ప లోపల ముత్యం కదిలినట్లు
అదో చిత్రమైన కదలిక

ఆ రహస్య గర్భ ఉమ్మనీటి సరస్సులో
బుడబుడామంటూ ఈదులాడుతున్న చేపపిల్లలా
ఆ నెత్తుటి మొగ్గ

చెవుల్ని  పొట్టకి ఆన్చి
కొత్తలోక రహస్యాల్ని కనిపెట్టే శాస్త్రజ్ఞుణ్ణి నేను.
ఒక్కోసారి నా చేతులకు నేనే తగుల్తున్నట్టు
మళ్ళీ నేనే ఈ జీవితంతో విసిగి
మరో జీవితంగా రూపుదిద్దుకున్నట్టు అనిపిస్తుంది.
నేనూ తనూ కలిసి తనువుల రాయబారాలు నడిపి
విత్తిన విత్తనాన్ని విస్ఫార హృదయంతో గమనిస్తుంటాం
రోజూ కబుర్ల ప్రేమల నీళ్లు పోసి
తొలి కదలికల్ని చిగురుటాకుల మల్లే నిమురుతుంటాం.

ఆ క్షణాలూ ముచ్చట్లూ వేరు.
పులకరింతను దాటి, తృప్తిని దాటి
సంతోషాన్ని మించిన వింత అనుభూతి దొంతర.
మేమిద్దరం సృష్టికర్తలం. తొలి ప్రేక్షకులం, శ్రోతలం.

ఆమె శరీరమే ఒక కర్మారాగారం
ఆమె ఊహల ఉలితో రూపాన్ని చెక్కుతుంది
అర్ధరాత్రివేళ రహస్యాల్ని విప్పుతున్న కవిలా
తన నిమిషాల్ని సమాయత్తం చేస్తుంటాడు గుహలో
మాయసంచిని రక్షణ కవచం చేసుకుని
తన వెలుగుకోసం చీకటితో యుద్ధం చేస్తుంటాడు.
ఆ యుద్ధాన్నే నేను ప్రేమగా చూస్తున్నాను
ప్రతీ రోజూ నేనొక కొత్త ప్రపంచాన్ని కనిపెడుతున్నాను.

తొమ్మిదినెలల కలల సౌధం ఎవరూ నిర్మించకుండానే
చిత్రంగా దేహమై కదులుతుంటుంది
దేహసీమకూ భూమికీ మధ్య
ఏదో విడదీయని సంబంధం పెరుగుతూ వుంటుంది.
లోకానికో కొత్తభాషను ప్రసాదించడం కోసం
మేమిద్దరం ఒక కొత్త పదసంచయాన్ని నిర్మిస్తుంటాం
అన్ని భాషా రూపాలు కొత్త రూపం కోసం ఎదురుచూస్తుంటాయి.

కాకపోతే
ఆమెకూ నాకూ ఒకటే తేడా.
ఆమె తన దేహాన్ని తానే అనుభూతిస్తుంది
నేను మాత్రం అనువదించుకుంటాను.

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...