అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

25 Feb 2012

కొన్ని ప్రశ్నలు



ఇనుపగోళాల్లోకి ఇముడుతున్న మానవ సమూహాలు
 నీళ్ల పొదుగుల్లోదాహం తీరక ఉక్కిరిబిక్కిరవుతున్న దిక్కులేని కాలం,
 నిరంతరంగాసాగుతున్న పరిణామంలోకి ఇముడుతున్న దృశ్యాలు,
 విరిగిపోతున్నఅనుభవాల సమూహం

ఇక్కడ మనిషిని తూర్పారబడుతున్నదెవరు?
ఈ మనిషి సారంలోంచి విత్తనాల్ని, పొల్లుని వేరుచేస్తున్న
ఈ పెనుగాలు లెక్కడివి?
ఉసిళ్ళగుంపులా కదులుతున్న ఈ సమూహాల మధ్య
మసిబారుతున్న జీవన కాంతుల మధ్య
తుఫానులా విరుచుకుపడుతున్న ఈ ప్రశ్నలెక్కడివి?
ఇక్కడ కాగితప్పూల పరిమళాల్ని సృష్టిస్తున్న సృష్టికర్తలెవరు?

సందేహాల మధ్యనే కరుగుతున్న జీవితాలు
అన్నీ ప్లాస్టిక్ సన్నివేశాల సమాధానాలు
దూరం దూరం
మనిషికీ మనిషికీ మధ్య ఎవరూ అతకలేనిదూరం

షట్టర్లుగా తెరుచుకుంటున్న రోజుల్లోకి దిగుమతవుతున్న మనిషి
బళ్లమీద, టీకొట్టుల మీద, వర్కు షాపుల్లో, రోడ్ల మీద, పొలాల్లో
చారికలు కట్టి ఘనీభవించే చెమట చుక్కల మధ్య మనిషి.. మనిషిని
చీత్కరిస్తున్న ఈ సందిగ్ధకాల మెక్కడిది?

కంప్యూటర్ తెరల మీద దర్శించే జీవితాల్ని
ప్రామాణీకం చేసుకునే సాంకేతిక సంస్కృతిలోకి
తలుపులు తీస్తున్న ఆ మానవులెవరు?

గొంతు స్వేచ్చగా పెగల్చనీయని మతప్రమేయాలు, భూమిని సరిహద్దుల
మధ్య బంధించి మనిషిని కాందీశీకుణ్ణి చేసిన రాజ్యాలు, గాలి
పీల్చినంత సులభంగా చంపగాలిగే క్రౌర్యం.. చుట్టూ అల్లుకుంటున్న
ఈ యంత్రపుగూడు ఎక్కడిది?

ఈ కాలానికి చిరునామా లేదు
ఇది ప్రశ్నల్లోంచి ప్రశ్నల్లోకే పయనిస్తున్నది.

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...