చేతుల్ని చాచి ఊడుగు పండ్లని కోస్తున్నప్పుడు
గీసుకుపోయే ఊడుగుముళ్ళ కొచ్చెటి గీతలపనితనం పద్యం.
బర్రెంకపండ్ల తీపి ఒగరు రుచుల్లోంచి
నాలుక చివర్లలో తచ్చట్లాడే ఉమ్మితడిలాంటి అనుభవం పద్యం.
వర్షాకాలపు వాగులో చేరిన ఎర్రెర్రని ఒండ్రునీటి కొంగ్రొత్త మట్టిరుచిలాంటి వాసన పద్యం.
ములుగర్ర పొడిస్తే ,నెప్పిని ఓరుస్తూ సాళ్ళుతప్పక నడిచే ఎద్దు అనుభవంలా
కెర్లిపడే ,మెలిపెట్టే బతుకును వడబోసి వొంపి అక్షరాల్లోకి ఎత్తడమే పద్యం.
నీలోకే ఇంకుతూ , ఎగుస్తూ
మాటల్లో,ఊహల్లో ఉక్కిరిబిక్కిరవుతూ ఒకలాంటి కోర్కెతో వేడెక్కినట్లు
ఒళ్ళంతా సెగగా మారినట్లుండే అనుభవం పద్యం.
ఎక్కడో దూరాన్నే ఉండి, చేరువగా ఉన్నట్లు అన్పించే
ఊరు,వాగు,కొండ,డొంక,దుఃఖం,సంతోష
గొంతులో ఏదో ఉండచుట్టుకుపోతూ బయటికీ రాలేక
లోపలే ఉండిపోలేక నిన్ను నీకే కొత్తగా అనుభవంలోకి వొంపే బొక్కెన పద్యం.
నీ కొనవేళ్ళ మీంచి రాలుతూ ,నిన్ను నీకే
సరికొత్తగా పరిచయంచేస్తూ అక్షరాలా నీ తలపుల బొమ్మల్లాగే
అచ్చంగా రూపుకట్టే అచ్చెరువు పద్యం.
కళ్ళు మూసి తెరిస్తే నువ్వో పద్యం.
కదిలితే,మెదిలితే,కన్నీళ్లు పెడితే,ఉద్వేగపడితే,గాద్గద్యమైత
కలిస్తే,చరిస్తే ,వెక్కిపడితే,వెక్కిరింతలుపొతే పద్యం.
పద్యం ఒలకడం అంటే మరేమో కాదేమో, జీవితం ఒలకడమే !
(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)
No comments:
Post a Comment