అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

11 Jul 2014

నా బతుకు కథ | యాకూబ్ - వల్ద్ - మొహమ్మద్ మియా

Memoirs


కవిత్వం ~ నన్ను వెంటాడుతున్న నా నీడ !*

[నా రెండవ కవితా సంకలనం 'సరిహద్దు రేఖ'కు రాసుకున్న నా మాటలు]

"... In my poems I could not shut the door to the street, just as I could not shut the door to love, joy, or sadness in my young poet's heart” -Pablo Neruda 'Memoirs'

గడ్డి కోసి రెండు కట్లమోపు మూడుకట్ల మోపు వేయడం తెలుసా? దుగాలమీద కాలు జారకుండా మోపు మోయడం తెలుసా? అరక దున్నడం తెలుసా? గొడ్లు కాయడం తెలుసా? పరిగేరడం తెలుసా? మంచెకావిలి తెలుసా? సందకావిలి తెలుసా? మొరం మోయడం తెలుసా? కూలిచేయడం తెలుసా? అరబస్తా వడ్లు ఆరు కిలోమీటర్లు దించకుండా మోయడం తెలుసా? ఊడుగుమండలు కొట్టడం తెలుసా? ఆ మోపు మోయడం

తెలుసా?

జొన్న కోయడం తెలుసా? మొట్లకెల్లి ఆవులురికితే తిప్పకరావడం తెలుసా? నీళ్లు పెట్టడం తెలుసా? చేపలు పునకడం తెలుసా? జొన్నన్నం తిని అరిగించుకోవడం తెలుసా? గటక తెలుసా? గంజి తెలుసా? ఎర్రకారం తెలుసా? రేగ్గాయలు ముళ్లకంపలోంచి కోయడం తెలుసా? జొన్న ఊసలు తెలుసా? దుగం చెక్కడం తెలుసా? నారు వేయడం తెలుసా? వాగులో దూకి కట్టెలు ఒడ్డు చేర్చడం తెలుసా? కాలివేళ్ళ పొట్టలు పగిలితే ఒంటేలు పోసి తగ్గించుకోవడమంటే తెలుసా? గజ్జికి వేపాకు, బర్రెరొచ్చు రాసుకోవడం తెలుసా? బి.సి. హాస్టల్లో పురుగులన్నం తెలుసా? బువ్వంటే తెలుసా? అరటిపండు తొక్క ఎనక పళ్లతో గీకి ఆకలి తీర్చుకోవడం

తెలుసా?

సారాకొట్టు ఉమ్ములమధ్య బతకడం, కిరాణాకొట్లో గుమాస్తాగిరి, సేటుకొట్టే చెంపదెబ్బలు, ఇళ్లు ఊడ్చి అన్నం అడగడం తెలుసా? సిన్నప్పుడు భుజమ్మీద ఐస్‌క్రేట్ డబ్బా మోస్తూ ఎర్రటెండలో ఐదు రూపాయలు సంపాయించిన వాడి గురించి, ప్రేమనెట్టా తెలియబర్చాలో తెలియని అమ్మానాన్నల కరుకుమాటలు, తిట్లూ, బూతుల మధ్య ప్రేమను ఎతుక్కోవడం, బతికున్నడో లేదోనన్నంత.. కాళ్ళతో, రాళ్ళతో, తాళ్ళతో, ముంతపొగల్తో దండించే వారి కసిలోని అజ్ఞానం గురించి తెలుసా? అరల్లో పేర్చుకున్న పుస్తకాల్ని చూసి అమ్మి డబ్బులివ్వమని అడిగే అమాయకపు అమ్మల గురించి తెలుసా? కోళ్ళగంపతోనో, చింతచిగురుతోనో, బుడంకాయలతోనో అమ్మ సంతకెలుతుంటే ఎనక తట్టలు మోస్తూ సంతంతా అదిరిపోయేట్లు అరిచే పిల్లాడి 'చవుక చవుక’ అరుపులు

తెలుసా?

ఏ కులమో, ఏ మతమో తెలియని అమాయకత్వపు పెంపకం గురించి తెలుసా? ఈద్గాల దగ్గర తప్పిపోయి కౌడుపడ్డ గరీబు కుర్రాడి చిల్లర పైసల శోధన గురించి తెలుసా? సదువు కోసం పదిహేనేళ్లకే ఇల్లువిడిచి పల్లెవిడిచిన వాడి గురించి తెలుసా? పేపర్‌బాయ్‌గా ఇంటింటికి తిరుగుతూ 'ఎవరైనా పిలిచి ఇంత చాయ్ పొయ్యరా?' అని ఆశగా చూసే పిల్లాడి గురించి

తెలుసా?

ఫీజులు తగ్గించమని అర్ధరాత్రులు గోడలకు పోస్టర్లంటించిన వాడి గురించి తెలుసా? పోలీసుల దెబ్బలు తెలుసా? హాస్టల్ సీటు కోసం కాళ్ళా వేళ్ళా పడ్డవాడి గురించి తెలుసా? విద్యార్థి ఉద్యమాల గొడవల మధ్య రక్తమోడడం తెలుసా? ఫీజుల డబ్బుల కోసం గోదావరిఖని రామగుండం రోడ్లమీద మండే ఎండల్లో చల్లని 'తాజ్ ఐస్‌క్రీం'లు అమ్ముతున్న పిల్లాడు

తెలుసా?

‘ఒరే ఫ్రెండూ ! అప్పివ్వమని, ఓ స్నేహితుడా! ఒక చొక్కా యివ్వమని' అడుక్కుంటూ తిరిగినవాడి గురించి తెలుసా? పాటలవరసలతో కంజీర దరువులతో గొంతెత్తిన ఉద్యమగాయకుడి గురించి తెలుసా? సింగరేణీ యూనియన్ ఆఫీసులో అర్ధరాత్రులు ఒంటరిగా భయం భయంగా గడిపిన ఆఫీసుబాయ్ గురించి తెలుసా? ఆదరించి డిగ్రీలు చదివించిన అమృతమూర్తుల ఆదరం గురించి తెలుసా? పాటలు విని అన్నంపెట్టి కడుపు నింపిన అమ్మల గురించి

తెలుసా?

ఉద్యోగంలో కుదురుకోవడానికి ముప్ఫై ఆరేళ్ళు పైగా పట్టిన ఒక అనామకుడి గురించి చిన్న ఆధారాన్నైనా వదలుకుండా సైబరుకాలంలో గిద్దె, అరసోలెడు, సోలెడు, తవ్వెడు, మానిక, కుంచం అని ఇంకా వేళ్ళూ లెక్కపెట్టుకుంటున్న వాడి ఊరిదనం గురించి తెలుసా? కళ్ళిప్పగానే పేడరొచ్చు, బీదవాసన కంటపడినవాడి గురించిఒళ్ళొంచి పని చేస్తూ బాధ్యతలు మోస్తున్నవాడి గురించి

తెలుసా?


తీరిక లేనిదంతా జీవితమేమిగిలిన ప్రతిసగం కోర్కెలోఅసలైన జీవితం మనలో తెలియకుండానే లోపలే మిగిలి ఉంటుందేమోఆ సగమే సెగకవిత్వం ఆ సెగలోంచే శిరసెత్తిమాట్లాడుతూ ఉంటుందేమో!!

తెలుసా?

** * 

Memoirs :నా బతుకు కథ : 'యాకూబ్ /వల్ద్ మొహమ్మద్ మియా ' 

నేను అనే వాడిని ఏ తారీఖున పుట్టానో ఖచ్చితంగా చెప్పలేను .నేను చదువుకున్న చిన్నబడి దోస్తులేమో 64 లోనో,63 లోనో పుట్టమంటారు.నేను మాత్రం 62లో పుట్టానని మావూరి బడి రికార్డు. నేను పుట్టిందెప్పుడో తనకు తానే ఊహించుకుని ,అనామతుగా రాసేశాడు మా కోటయ్య సార్ !పుట్టింది రొట్టమాకురేవు. డోర్నకల్ నుంచి కొత్తగూడెం వైపు వెళ్ళే రైలుకట్టకు దగ్గరిలో కారేపల్లి కి వెళ్ళే దారిలో ఉంది. పట్టుమని యాభై ఇళ్ళు కూడా వుండవు.మా ఊరంతా కోయవాళ్ళే! కోయోళ్ళు,అని దొరసొట్టపోళ్ళు అనే చిన్నప్పట్నుంచి వింటున్నది.ఆ వూరికి నేను పుట్టడానికి ఐదేళ్ళ ముందు అమ్మానాన్న ,వాళ్ళు మోయగలిగినంత సామాన్లతో వచ్చారంట-మా అన్నను చంకనెత్తుకుని. ఆ తర్వాత ఖాజా అని నాకంటే ముందు పుట్టి,కొన్ని రోజులకు చనిపోయిండు.ఆ వూరు నాన్నవాళ్ళు రావడానికి బొర్ర రామక్క కారణమంట.!ఆవూరు వాళ్ళు కూలీనాలీ చేసుకోవడానికి చుట్టుపక్కల ఊళ్లు -కారేపల్లి [ఇంకో పేరు సింగరేణి -రెవెన్యూ రికార్డుల్లో ఇదే ఉంది],పేరేపల్లి,గేట్ కారేపల్లి,ఇంకాస్త దూరంగా పదిహేడు కిలో మీటర్ల దూరంలో ఇల్లందు [సింగరేణి కాలరీస్/బొగ్గుట్ట]వెళ్తుండేవాళ్ళు.అలా కూలికి వెళ్ళిన బొర్రరామక్క మా నాయినను ఆ రోజుల్లో చేస్తున్న తాపీ పని దగ్గర చూసి, 'ఓ సాయిబూ ! ఓ తమ్ముడా ! ఇన్ని కష్టాలు ఏడబడతావుకానీ ,మావూళ్ళ చిల్లర కొట్టు పెట్టుకొమ్మని'సలహా చెప్పిందట.ఆ విధంగా మకాం రొట్టమాకురేవుకు మారింది.ఉండటమెట్లా? కుంజ రామయ్య గొడ్లకొట్టం లోని ఒక పంచన మాబీర పొరకతోటి దడి కట్టుకుని ఉండమన్నాడు.

*మా నాన్న [మేం 'అబ్బా' అని పిలుస్తాం] పుట్టింది మానుకోట దగ్గర చినగూడూరు,వరంగల్ జిల్లా. ఐదుగురు అన్నదమ్ములు,ఒక అక్క -అందర్లో చిన్నోడు. అక్క బిడ్డతోనే మొదట పెళ్లి విడాకులు గూడ అయినయి. మా నాన్న చిన్నప్పట్నుంచి జీతం చేసేటోడు. ఆయన మాటల్లో విన్నది ఎక్కువగా జీతం చేసింది మడికొండ వెంకయ్య దగ్గర అని. కొంత వయసొచ్చినంక చింతపండు,మిరపకాయలు నెత్తినబెట్టుకుని ఊరూరా తిరిగి అమ్మడం ,అలా కారేపల్లి ఒకసారి రావడం మా తాత కరీం సాబ్ ను కలవడం, అలా మా అమ్మతో పెళ్లి [ఆమెకు కూడా మొదట పెళ్లై, ఆతర్వాత విడిపోవడం అయిపొయింది]జరగడం ,మళ్ళీ కొత్తగా జీవితం మొదలు పెట్టడం అదో పెద్ద కత.*రోట్టమాకురేవుల దుకణం. ఎట్లా మొదలెట్టాలే అని కారేపల్లిల ఎర్ర పుల్లయ్య కిరాణా దుకా ణానికి వెళ్లి అప్పుపెట్టమని అడిగిండంట-ఆయనేమో ఒప్పుకోలేదు ముందుగాల -మా అమ్మ తరుపోళ్ళు కూడా జమానతు ఉండమంటే ఉండలేదంట. అప్పుడు తన వెండి దండకడియం ఆయన దగ్గరే కుదువ బెట్టి -బీడీ కట్టలు,బెల్లం,మసాలాలు,పుట్నాలు,బొంగుపేలాలు ,పువ్వాకు -ఇట్లా చెడ్దరమడ్డర సామాన్లు కొనుక్కొచ్చి ,దాన్లో కొంత మా అమ్మ దగ్గర అమ్మడానికి బాధ్యతపెట్టి, మిగిలినవి గంపల వేసుకుని ఆ వూరు చుట్టుమట్ల ఉన్న -చీమలోరి గూడెం,అనంతారం,రేగుల గూడెం,పూసంవోళ్ళ గుంపు ,ముత్రాసి గూడెం-రోజులో ముప్పై కిలోమీటర్లు తిరిగి అమ్ముకొచ్చేటోడు.మధ్య మధ్యలో నాట్లకు, జొన్న చేలు,కందిచేలు కోతలకు వెళ్ళేటోడు.మా అమ్మా వెళ్ళేది.కొన్నాళ్ళకు నెత్తిమీది గంప కిందికి దించి ,కావిడి భుజానికి ఎత్తుకున్నాడు.రోజురోజుకి యాపారం పెంచిండు.కావిడికి ఒకవైపు కిరాణా సరుకులు,మరో వైపు తినేటివి- మిర్చి బజ్జీలు,అరిసెలు, కారపుసుట్లు,పకోడీ,-నింపుకుని పొద్దున్న చీకట్లో వెళ్లినోడు,రాత్రి చీకటిపడ్డంక వచ్చేటోడు.ఆ రోజుల్లోనే నేను పుట్టాను.

[ఇంకా ఉంది]* 

Memoirs - 2

తొలి జ్ఞాపకం ~

మా అమ్మ కాన్పు చేసిన మంత్రసాని ఇరుప[బొడ్రాయి] అచ్చయ్య భార్య -ఈమె కుంజ రామయ్య అక్క- రాత్రంతా నెప్పుల్తో మా అమ్మ ఏడుస్తుంటే ,"ఏం వదినో! మొగుడితో ......కున్నప్పుడు ఆలోచించుకోవాలె,ఇప్పుడేడిస్తే ఏ లాభం'' అని మోటుసరసం ఆడుకుంటా ,మంచం పక్కనే చుట్ట కాల్చుకుంటూ ,బొడ్డుకోసే లిక్కిని పదును పెట్టుకుంటూ ఉందంట.తెల్లారగట్ల ఎప్పుడో పుట్టానంట.అన్ని నొప్పులు బరించిన మా అమ్మ -ఇప్పటికీ సందు దొరికినప్పుడల్లా దెప్పుతుంది-'నిన్ను కనడానికి సచ్చి బతికానని'.కనడం పూర్తయ్యాక అమ్మకు మా వూళ్ళో కాసే ఇప్పసారా కొద్దిగా పట్టించి , స్నానం వావిలాకు వేసి కాచిన నీళ్ళతో చేయించి మా ఊళ్ళో వాళ్లకి నన్ను చూపించిన్రంట.వాడే వీడు !'యాకూబ్ /వల్ద్ మొహమ్మద్ మియా ' వల్ద్ అంటే s/o అని అర్థం.

కళ్లిప్పగానే నేను చూసిన మొదటి దృశ్యం ,బహుశా కుంజ రామయ్య గొడ్లకొట్టంలోని పేడరొచ్చు, బొంయ్ మనే ఈగల గుంపు,చుట్టుముట్టే దోమలు,చుట్టూతా కట్టిన తడికె అయ్యుండొచ్చు.లేదా కిరసనాయిలు సీసాలో పోసి ,గుడ్డ వొత్తితో వెలిగించిన గాలికి రెపరెపలాడే బుడ్డి దీపపు తిర్రు కావొచ్చు.తడికకు తగిలించిన పాత గొనె సంచి అయినా అయ్యుండొచ్చు.

విన్న మొదటి శబ్దం - దోమలవల్ల గొడ్లు విసురుకుంటున్న తోకల చప్పుడో, చింతచెట్ల మీది పిట్టల కూతలో, దూరంగా రైలుపట్టాల మీది గూడ్స్బండి చప్పుడో, పక్కనున్న గుడిసెల్లో మొగుడూ పెళ్ళాల తగువుల్లో గుభిక్ గుభిక్ మనే తన్నులాటల,తిట్ల పురాణమో అయి ఉండవచ్చు.లేదా మా అమ్మానాన్నల భీకరమైన తగువులాట తర్వాత పొంతపొయ్యి దగ్గర అమ్మ ఎడతెగని సుదీర్ఘ ఏడుపు అయినా అయ్యుంటుంది.

చాలామందికి మల్లే,శుభ్రంగా అమర్చిన పుస్తకాల అలమరాలో,నిత్యం వచ్చిపోయే సాహితీమిత్రుల సందడో,ముచ్చటించే తల్లిదండ్రుల సాహిత్య సందోహమో ;లేదా అమ్మమ్మ తాతయ్యల,నానమ్మ తాతయ్యల ఒళ్లో కూచుని వినే గాధల కోలాహాలమో-కంసేకం..వేలుపట్టుకుని నడిపించే ఒక్కటైనా ఆసరా చేయికూడా లేని వాతావరణం.

బురద.బురద..కాలు తీసి కాలు వేస్తే అంటుకునే బురద.గాబు దగ్గర నీళ్ళు చేరి వాకిలంతా బురద. గొడ్లకొట్టం రొచ్చు బురద.బురదలో జననం.నామీద నేనే జోక్ వేసుకునే మాట - ఎక్కడ పుట్టావు అంటే 'బురద'లో అని.'పంకజాన్ని' అని.

*ఊహ తెలుస్తున్నకొద్దీ అమ్మానాన్నల రెక్కలు ముక్కలు అవుతుండటం అర్థమవుతూనే ఉంది. వాళ్ళుపడే కష్టంలోంచి ఎగదన్నుకొచ్చే అసహనం వల్ల నిరంతరం ఇద్దరిమధ్య గొడవలు. తన్నులాటలు,గుద్దులాటలు,తిట్లు,బూతులు,చిరాకులు,చీకాకులు,ఏడ్పులు,పెడబొబ్బలు,ఉరుకులు,గుంజులాటలు,గింజుకోవడాలు -ప్రతిరోజూ రమారమిగా ఇలానే ఉండేది.అయినా వాళ్ళిద్దరిని కలిపిఉంచిన ఏకసూత్రత ఏమిటో ఇప్పటికీ చెప్పడం కష్టమే !

24.9.2013[ఇంకా ఉంది]* 

Memoirs - 3 

మా ఊరిపక్కనే బుగ్గవాగు పారుతుంది. దాని గురించి కొంత చెప్పాలి.ఇల్లందు వైపునుంచి ,అటువైపు ఉన్న అడవుల్లోంచి వస్తుందది. ఎండాకాలం మాత్రం పారదు. మడుగులు మడుగులుగా అక్కడక్కడా నిలిచి ఉంటుంది. దాన్ని చూడాలంటే వర్షాకాలమే చూడాలి. బుగ్గొచ్చిందంటే ఒకటే సందడి. కట్టెలు కొట్టుకొస్తుంటాయి. వాటిని తీయడానికి ఊళ్ళోని చిన్నోళ్ళు,పెద్దోళ్ళు వాగులోకి దూకడం-మొద్దులు,దూలాలు,పొయ్యిల కట్టెలు -ఒడ్డుకి లాక్కురావడం ,ఒక దగ్గర అద్దలు పెట్టడం.ఇదే పని.! అపుడపుడూ గొడ్లు,బర్రెలు,మేకలు చచ్చిపోయినవి కూడా కొట్టుకుపోతూ కన్పించేవి.

చాయ్ లాగా ముదురు ఎరుపులో ఉండేవి నీళ్ళు.అక్కడక్కడ సుడ్లు తిరుగుతూ ఒడ్లను వొరుసుకుంటూ పారేది బుగ్గవాగు. చూస్త చూస్తనే పెరిగేది. ఊళ్లదాక వచ్చేవి నీళ్ళు.నీళ్ళలో కొట్టుకుపోతున్న పాముల ముట్టెలు పైకి కన్పించేవి. వాగులోకి బయటినుంచి ఉన్న ఒర్రెలు,వాగు నిండిన రోజుల్లో నీళ్ళు ఒర్రెలవైపుకు ఎదురు తన్నేవి. ఈ రోజుల్లోనే కొత్త నీళ్ళకు చేపలు ఎదురెక్కేవి. వాగు గుంజినాక ,తరవాత వాగును చూస్తే అక్కడక్కడా కట్టెలు చెట్ల పొదలకు చిక్కుకుని ఉండేవి. ఊళ్ళో జనమంతా బుగ్గ వాగు వెంబడే తిరుక్కుంట ,కట్టెపుల్లల్ని ఏరుకుంటూ తిరుగుతుండే వాళ్ళు. ఎన్ని కట్టెలు దొరికితే ఆ సంవత్సరానికి పొయ్యిలకట్టెలు అన్ని జమ అయినట్లు.ఇంకొందరేమో ,ఒర్రెలల్ల 'మావులు' పెట్టేటోళ్ళు. మా ఊరిల 'మావు'లు ఆరెం ముత్తయ్య, ఊడుగు పగిడయ్య దగ్గర ఉండేవి. మిగతా వాళ్ళేమో పంచెలు,చీరెలనే రెండు చేతులతో చెరో వైపు పట్టుకుని నీళ్ళలో దొన్నెలాగా వేసి, పట్టుకునే వాళ్ళు. పైనుంచి ఒక మనిషి నీళ్ళలో దిగి చప్పుడు చేసుకుంట,నీళ్ళను కల్లి కొంటుకుంటూ ఈ దొన్నేలవైపు చేపల్ని మళ్ళించేటోడు. అలా ఒక్కసారే ఆ దొన్నెను పైకెత్తితే ,అందులో అప్పుడు చూడాలి- ఎగురుకుంటూ కొర్ర మట్టలు,చందమామ చేపలు,ఉల్లేసులు,బుడ్డ పరకలు,పాము చేపలు,బొమ్మిడీలు,రొయ్యలు,ఎండ్రకాయలు-ఇలా ఒకటేమిటి! చేపల ప్రపంచం అంతా అక్కడే కన్పించేది. ఎప్పుడో గాని పెద్ద పెద్ద చేపలు పడేవి కావు . అన్నీ ఒక మోస్తరు చేపలే !

ఆ రోజంతా పొద్దు దిగేదాకా వాగులో,ఒర్రెల్లో తిరిగి చేపలు పట్టుకుని ఇళ్ళకు చేరుకున్నాక,కొందరేమో తెచ్చిన చేపల్ని బండలమీద తోమి,ఎండేసుకునేవాళ్ళు. కొందరేమో ఆ రోజుకే చేపల పులుసు పొయ్యిల మీద ఎక్కించుకునేటోళ్ళు. ఆరోజు మా చిల్లరకొట్టు దగ్గర చింతపండు కోసం,మంచినూనె కోసం,ధనియాల కోసం సందడిగా ఉండేది. చేపల ముచ్చట్లే ఆ రోజంతా.! ఊరంతా పుల్ల పుల్లని ఆవిర్లతో చేపల పులుసు కమ్మని వాసన.చేపల పులుసు, జొన్నన్నం లేదా జొన్న గటక, + ఇప్పసారా ;ఇదీ మావూరి ఫేవరేట్ వంట.విందు.

వాగు వచ్చిందంటే ,కేవలం రావడం,పోవడం మాత్రమే కాదు. అది ఊళ్లోకి చేపల పండుగను తెచ్చేది.మా అమ్మ రాత్రి చాలా పొద్దు పోయ్యేదాక పొయ్యిమీదినుంచి చేపల కూర దించేది కాదు,పిల్లలం చూసి చూసి నిద్రపోయేటోల్లం. మేల్కొని ఉన్నోళ్ళు ఆ రాత్రికి తిన్నా ,పొద్దున్నే జొన్నన్నంలో ఇంత పులుసు, రెండో మూడో చిన్ని చేపలు వేసి పెట్టేది అమ్మ. రాత్రి వొండిన చేపల కూర పోద్దుటికే బాగుంటుందని మా అమ్మ థియరీ. నిజమే ,పొద్దున్న చేపల కూర అంత బాగుండేది.ఆ బుగ్గవాగు, చేపల వేట,కట్టెల కోసం వెతుకులాట- అదొక పదచిత్రంగా ఎప్పుడూ మనసులో మెదులుతూ ఉంటుంది.

25.9.2013[ఇంకా ఉంది ]* 

Memoirs - 4

మా ఊరు ,బుగ్గవాగు ఈ రెండూ ఒకదానినొకటి పెనవేసుకుపోయాయి. రెంటినీ విడదీసి చూడలేం. వాగులోంచే కావిడ్లతో ,మట్టి కుండలతో ఇంటి వాడకానికి నీళ్ళు రోజూ తెచ్చుకునేది. ఇసుకల చెలిమలు తీసి ,కుండల మూతికి గుడ్డకట్టి కొబ్బరి చిప్పలతో నీళ్ళు చేది ,బుంగలు నింపుకుని తెచ్చుకునేటోళ్ళం. బట్టలు ఉతకడం,తానాలు చెయ్యడం-అన్నీ వాగులోనే !

వాగులో ఇసుకమేటలు,వాగులో గంతులేసే కప్పలు,చేపలు,వాగుతొర్రల్లో కాళ్ళు బయటపెట్టే ఎండ్రకాయలు[ఎండ్రకిచ్చలు],మధ్యమధ్యలో బండలు ,ముళ్ళ చెట్లు,తుంగ గుబురులు -ఒడ్డుమీదనుంచి వాగులోకి వొంగిన చెట్లు,చెట్లకు అల్లుకునే తీగెలు,వేలాడే పిట్టలగూళ్ళు,అక్కడక్కడా పుట్టలు,అటు ఇటు తిరిగే పాములు,తేళ్ళు,ముంగిసలు,ఉడుములు,ఎగిరే పిట్టలు-పుల్ల కోళ్ళు,కోయిలలు,గువ్వలు,పురేడు పిట్టలు,కంజులు,గుంపులుగా ఊరపిచుకలు,తెల్ల కొంగలు - వాగులో ఈతలు,పెద్దబండ మడుగులో బండమీంచి నీళ్ళలోకి దూకడం ;ఎండాకాలం మడుగుల్లోకి దూకి కింద ఉన్న చల్లటి మట్టిబురదలోకి దూరడం, నీళ్ళలో మునిగి ఊపిరినిలిచినంతసేపు ఉండటం - జ్ఞాపకంలోని నలగని నెమలీక.

ఎండాకాలంలో పగళ్ళు ఇసుక ,నీళ్ళు కాలుతూ ఉండేవి.ఒకవైపున బర్రెలు,మరోవైపు పిల్లలు ,పెద్దలు చెట్ల నీడపడుతున్న మడుగులదగ్గర ఉండేవాళ్ళం. రాత్రయ్యాక వాగు దగ్గర అదేమిటో కమ్మని నెయ్యివాసనలా వచ్చేది.అలా ఎందుకో ఇప్పటికీ అంతుపట్టదు. రాత్రి వాగుమీద నుంచి చల్లనిగాలి. ఊళ్ళో వాకిట్ల పడుకుంటే ,చలికాలం చలిలా ఉండేది.పైన ఏదో ఒకటి కప్పుకునేదాకా ఆ చలిగాలి ఊరుకునేది కాదు.

ఒకసారి వాగు వచ్చినప్పుడు ,నేను గూడ నా దోస్తు ఇరప రాములుతో కలిసి వాగుల కట్టెలు తీయడానికి పోయిన.ఊళ్ళో వాళ్ళు అక్కడక్కడ ఉన్నరు. కట్టెలకోసం దుమికి ఒడ్డుకు తెస్తున్నరు.అద్దలు పెడుతున్నరు. రాములు ,నేను దూరంగా కొట్టుకొస్తున్న పెద్ద దూలాన్ని చూసినం. మేమిద్దరం దాన్ని ఎట్లైనా తీయాలని వాగు ఎగువకు ఉరికి,దూకినం.మాకప్పుడు 12 ఏండ్లే ! తోలెమోళ్ళ మామిడి చెట్ల దగ్గర దూకినంక ,దూలాన్ని పట్టుకున్నం. నీళ్ళ తాకిడి ఎక్కువగ ఉంది.పెద్దబండ దగ్గర రాములు కట్టె వదిలిపెట్టి,నీళ్ళు మింగిండు. ఎట్లనో ఒడ్డుకు చేరిండు. నేనేమో చినచిన్నగ దాన్ని ఒడ్డువైపుకు తోస్తున్న. నీళ్ళ ఒత్తిడికి అలిమికాలె. అసలు ఒడ్డు చేరాల్సింది పెద్దబండ దగ్గర్నే. అది దాటింది. ఇంకొంచెం ముందుకు పోయిన.అక్కడ ఒడ్డుకు చేరడం కష్టం.అది కూడా దాటింది.

ఒడ్డునున్న వాళ్ళు చూడనే చూసిన్రు. ఒకటే అరుపులు'యాకూబ్ కొట్టుకుపోతున్నడని. ఆ సందడికి ఊళ్ళో వాళ్ళంతా వాగు ఒడ్డుకి జమైండ్రు. వొడ్డుమీద ఉరుకులు.అరుపులు.మా అమ్మ ఏడుపు.నేనేమో నీళ్ళలో ముందుకే పోతున్నా. నల్లవాగు మడుగు దాటిన. రైలు కట్ట బ్రిడ్జి మడుగు దాటిపోయిన. ఇరప వెంకటి, ఆరెం రాగోలు ఆడ వాగుల దున్కిన్రు. ఆడ తర్వాత వాగు వొంపు తిరుగుద్ది. ఆ వొంపుకాడ వొడ్డుకు చేరడానికి అలిమి ఆయ్యిద్ది. నీళ్ళల్ల ఎంత బలమున్నోడు కాని, కొద్దిసేపయినంక ఒంట్ల సత్తువ కరిగిపోద్ది. ఎట్లనో ఆ వొంపుల వొడ్డుకు దూలాన్ని చేర్చిన. చెట్టు వేరును ఒక చేత్తోపట్టుకున్న, దూలాన్ని కాళ్ళ మధ్యన ఒడిసిపట్టుకున్న. ఇంతల ఇరప వెంకటి, ఆరెం రాగోలు అందుకున్నరు. ముగ్గురం కలిసి వొడ్డుకు చేర్చినం.వాగు తగ్గినంక ఆ దూలాన్ని ఇంటికి తేవడానికి ఎడ్లబండి అవసరమొచ్చింది. దానిమీదికి ఎక్కించడానికి ఎనిమిదిమంది అవసరమైన్రు. అంత పెద్ద దూలం మరి !

వొడ్డుకు చేరినంక మా అమ్మ ఒకటే ఏడుపు, శోకాలు. మా ఊరోల్లంత ఒకవైపు తిట్టుకుంటనే,మరోపక్క మెచ్చుకునుడు. 'ఎట్ల తీసినవ్ రా యాకూబ్ 'అని. కట్టెలు తీయడం సరదా అట్లా తీరింది. ఇప్పటికీ మా సోపతిగాల్లు ఆ ముచ్చట అపుడపుడు గుర్తుచేస్తరు.ఆ తర్వాత మా అబ్బా ఆ దూలాన్ని వడ్లోల్ల దగ్గరికి రేగులగూడెం తీసుక పోయి, ఒక మంచం,ద్వారబంధం చేయించిండు. ఇప్పటికీ ఊళ్ళో అయి ఉన్నయి నాకు ఆనాటి రోజును గుర్తుచేసుకుంట.!

27.9.2013* 

నా బతుకు కథ : Memoirs -5


మా ఇంట్ల ఒక చిన్న అర్రల కొట్టు/దుకనం. రాత్రంతా మా అమ్మ జాగారం చేసి ,పొయ్యి కాడకూచుని తయారుచేసిన కారపుచుట్లు,మిర్చీలు,బొంగుండలు,పకోడీలు,అరిశెలు-అన్నీ తినేటివి కావిడి తట్టలో ఒకవైపు, మరోవైపు తట్టల చిల్లర సామాను వేసుకుని -అటు ఇటు కలిపి 70,80 కిలోలైనా బరువు ఉండేది- బేరానికి పోయేటోడు. అమ్మ చేసే ఆ పిండివంటల్లో విరిగిపోయిన అరిసెలు, మిగిలిపోయిన చూర తినడం కోసం మా పిల్లలవి. !


ఇంకా ఏమన్నా ఎక్కువ సామాను ఉంటే మా అన్నో,నేనో,లేకపోతే ఇంట్ల చిన్నపిల్లల్ని ఎత్తుకోవడానికని మా అమ్మ పిలిపించుకుంటే వచ్చే మా పేరేపల్లి అమీనా పెద్దమ్మ కూతురు మా చాంద్ బీ అక్కో ఆయనెంబడి తలమీద ఎత్తుకుని పోయేటోళ్ళం. మా అబ్బా నడక జింకలాంటి నడక. ఆయనెనక ఎవుడైనా ఉరుక్కుంట నడవాల్సిందే. పొలాల దుగాల మీద, కందిచేన్ల గట్ల మధ్యన ,జొన్నచేల చీరుకుపోయే కొమ్మల మధ్య రాసుకుంటూ, చిన్న దారెంబడి కాళ్ళకు గుచ్చుకునే రేగుముళ్ళు,గడ్డిముళ్ళు,పల్లేరుగాయలు -కాళ్ళు చేతులూ నెత్తుర్లు కారాల్సిందే !


చలికాలం సూసుకో నా సామిరంగా ! చలి.గడ్డకట్టించే చలి. చేలు దాటేలోపు మంచుకు ముద్దముద్దయి పోవాల్సిందే ! అట్టా మా అబ్బా ఎంబడి మేం అనంతారం దాటి,రేగుల గూడెం ఊళ్లకు పోయేదనక ఎవళ్ళు కూడా లేవకపోదురు. లేసుడేంది, అపుడే కోళ్ళు కూస్తుండేవి. అక్కడక్కడ 'ఇగ లేవరాదురా- సాయిబు రానే వచ్చిండు' అని విన్పిస్తుండేది. ఊళ్లల్ల తలో రకంగా పిలిసేటోళ్ళు. తురక సాయిబు అని, కావిడి సాయిబు అని, తురకాయన అని, ఒకరిద్దరు మాత్రం 'మొమ్మదో' అని పిలిసేటిది.


రేగులగూడెం పోయినంక కావిడి దింపుకునేది చుంచ ఈశ్వరమ్మ ఇంట్ల. ఆమె మొగుడేమో మావూరు చుంచ ముత్తయ్య కొడుకు.చుంచ లక్ష్మయ్య . ఇల్లరికం పోయి అత్తింట్లనే ఉన్నడు. ఆడికిపోయినంక కట్టెల పొయ్యి రాజేసుకుని, రాతెండి గిన్నెల బెల్లం,చాయ్ పత్తా[ఆ రోజుల్ల చిన్న పొట్లం ల ఉండేది] ఏసి, మరగనిచ్చి,మరగనిచ్చి ముత్రాసోల్ల ఇంట్ల వాడిక పట్టిన మేకపాలు పోసి చాయ్ కాగింతర్వాతనే బేరం షురూ.ఊళ్లల్ల డబ్బులేమో తక్కువ. జొన్నలు,వడ్లు, కందులు,పెసలు, అలిసెందలు, సజ్జలు,వేరు సెనక్కాయలు,నువ్వులు బుట్టల్ల తీస్కొచ్చి గిద్దెడు,అరసోలెడు ,సోలెడు,తవ్వెడు,మానెడు - కొలతకు సొల,తవ్వ,మానిక,[రేకుతో చేసినవి పాత్రలు] ఉండెడివి - ఏం వస్తువులు కావాలనో దానికి సరిపడ గింజలు కొలిచి ఇచ్చి తీసుకునేటోళ్ళు. తునికాకు సీజన్లో పైసలు ఉండెడివి ఊళ్లల్ల. అవి గూడ కొత్త కొత్త పైసలు.మెరుస్తుండేవి.అప్పటిదంక చేతులల్ల మురికిగానివన్నమాట !


అట్ల, పొద్దెక్కేసరికి ఐదూర్లు తిరిగొచ్చేవాళ్ళం.వేరు వేరు సంచుల్లో ఒక్కో రకం గింజలు. చిన్న చిన్న మూటలల్ల కట్టి, తట్లల్ల సర్ది,మిగిలితే మా నెత్తిమీద మోసి తెచ్చి,చుంచ ఈశ్వరమ్మ ఇంట్ల గదిల వేసేటోళ్ళం. పదిరోజులయ్యాక గింజల్నిబస్తాల్లో నింపి ,ఎడ్లబండిల కారేపల్లి ఎర్ర పుల్లయ్య కొట్టుకి ఏసుకుపోయి, మళ్ళీ సామాన్లు కొనుక్కొచ్చుకోవడం .అది మా అబ్బ బేపారం ముచ్చట.



7.10.2013[ఇంకా ఉంది.]

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...